మీ కుటుంబ జీవితములో దేవునికి ప్రథమ స్థానమివ్వండి
ముందు శీర్షికలో పరిచయము చేయబడిన వివాహదంపతులగు బాబ్ మరియు జీన్—విడాకులు తీసికోలేదు. బదులుగా, తమ సమస్యలనుగూర్చి ఒక క్రైస్తవ పరిచారకునితో వారు చర్చించారు. వారి సంకటములు ప్రాథమికంగా, పరస్పర విరుద్ధమైన వారి గత చరిత్రల ఫలితంగా కల్గినవని అతడు వెంటనే గ్రహించాడు.
ఉదాహరణకు, బాబ్ శ్రమించి పనిచేసే, వర్తక కుటుంబమునుండి వచ్చి తానే శ్రామికునిగా పనిచేసినందున ఉదయముననే అతనికి కడుపునిండా ఆహారము కావాలి. ఉదయముననే వళ్లునలగని పనులుచేసిన కుటుంబమునుండి వచ్చిన జీన్, అతనికి కేవలం కాఫీ మరియు కాల్చిన రొట్టెముక్కలనిచ్చింది. గనుక ప్రాతఃకాల ఉపాహారముపై తలెత్తిన ఆ వివాదము పెద్ద యుద్ధముగా మారింది!
బాబ్ మరియు జీన్ వారి పరస్పర సంభాషణను వృద్ధిచేసికోవాలి. అయితే వారి కలతలకుగల నిజమైన కారణము మరింత లోతుగా వెళ్లింది. “మీరు ఒకరినొకరు 1 కొరింథీయులు 13:4ను బట్టి దృష్టించుకున్నారా?” అని పరిచారకుడు అడిగెను. ఆ బైబిలు లేఖనము ఇట్లున్నది: “ప్రేమ దీర్ఘకాలము సహించును. దయచూపించును, ప్రేమ మత్సరపడదు; డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు.” తదుపరి వచనము చెప్పునదేమనగా ప్రేమ “అమర్యాదగా ప్రవర్తింపదు, స్వప్రయోజనమును విచారించుకొనదు.” తమ సంబంధమందు ఈ మాటలను అన్వయించుటకు బాబ్, జీన్ యిద్దరు యిష్టపడ్డారు.
ఈ వివాహ దంపతుల సమస్యలకు ప్రాథమికంగా ఆత్మీయ సంబంధమైన పరిష్కారము అవసరమాయెను. దేవునితో మంచి సంబంధమును కలిగియుండుటకు బాబ్, జీన్లు కోరినందున అన్నింటికంటే ఎక్కువగా వారు బైబిలు సూత్రములను అన్వయించి, “యెహోవా యిల్లు కట్టనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమేనని” గుర్తించాలి. (కీర్తన. 127:1) 3 నుండి 5 వచనములు కుటుంబమును కట్టుటనుగూర్చి వివరించుచున్నవి. గృహానందమును వృద్ధిచేయుటయందు గొప్ప విజయము, కుటుంబ జీవితములో దేవునికి ప్రథమ స్థానమిచ్చుటవలన కలుగును.—ఎఫెసీయులు 3:14, 15.
దేవునికి ప్రథమ స్థానమిచ్చుటలో ఏమి ఇమిడియున్నది
మీ కుటుంబ జీవితములో దేవునికి ప్రథమ స్థానమిచ్చుట అంటే “కలిసి ప్రార్థించు కుటుంబము కలిసి ఉండును” అను నానుడికంటే ఎక్కువైయున్నది. “మతము సమమైన, యోగ్యమైన కుటుంబ సంబంధ బాంధవ్యాలు కల్గించి దానిసభ్యుల జీవిత సంతృప్తిని వృద్ధిచేయునని” అనేకులు తలంచుచున్నట్లు ఫ్యామిలీ రిలేషన్స్ అను పత్రిక తెల్పుచున్నది. అయితే కేవలము మతమును ఆచరించడము, దేవునికి ప్రథమస్థాన మిచ్చుటవంటిది కాదు. అనేకులు కేవలం అలవాటుగానో, కుటుంబ సాంప్రదాయకముగానో, లేక సామాజిక ప్రయోజనముల కొరకో మతమును హత్తుకొనియుండవచ్చును. వారి అనుదిన జీవితములో దేవుని ప్రభావమేమియు లేదు. మరి ముఖ్యంగా, మతములన్నియు “మన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తిని” కల్గినవికావు.—యాకోబు 1:27.
మన కుటుంబ జీవితములో దేవునికి ప్రథమ స్థానమిచ్చుటకు మనము, మన ప్రియులును, “సర్వలోకములో మహోన్నతుడైన” యెహోవాను ఆయన కట్టడల ప్రకారము ఆరాధించువారమై యుండాలి. (కీర్తన 83:18) దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యిట్లనెను: “యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది యిప్పుడును వచ్చేయున్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.” (యోహాను 4:23, 24) యెహోవా దేవుని “ఆత్మతో” ఆరాధింపవలెనంటే, మనము ఆయనకు చేయు పవిత్రసేవ, ప్రేమ మరియు విశ్వాసముతో నిండిన హృదయముచే పురికొల్పబడవలెను. (మార్కు 12:28-31; గలతీయులు 2:16) “సత్యముతో” యెహోవాను ఆరాధించవలెననగా, మత సంబంధమైన అబద్ధములన్నింటిని విసర్జించి, బైబిలునందు బయల్పరచబడిన ఆయన చిత్తమునకు పూర్తిగా హత్తుకొనుట అవసరము. మన మతము ఆయన నిబంధనమేరకు సరితూగకపోయిన యెడల మనము యెహోవా దేవుని ప్రథమ స్థానమందుంచలేము.a వాటిలో కొన్ని ఏమిటి? వాటిని అన్వయిస్తే మీ కుటుంబమునకు అవి ఎలా ప్రయోజనము కాగలవు?
భర్తగా దేవునిని ప్రథమ స్థానమందుంచుట
బైబిలు 1 కొరింథీయులు 11:3 నందు ఇట్లనుచున్నది: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు, మీరు తెలిసికొనవలెను.” నీవు భర్తవైతే, మీ కుటుంబములో నిర్ణయములుచేయు ప్రధాన వ్యక్తిగానుండుటకు దేవుడనుగ్రహించిన బాధ్యత నీకున్నది. అయితే అణగద్రొక్కువానిగా లేదా నిరంకుశుడైన భర్తగా నుండుటకిది అనుమతినిచ్చుటలేదు.
తమకు సంబంధించిన నిర్ణయాలు చేయునప్పుడు, భర్తలు తమ భార్యల భావాలను పరిగణలోనికి తీసికోవాలని బైబిలు ప్రోత్సహించుచున్నది. (ఆదికాండము 21:9-14 పోల్చుము.) నిజమే, లేఖనములు మనలనందరిని ‘మన సొంత కార్యములను మాత్రమేకాక యితరుల కార్యములనుకూడ చూడవలెనని’ అర్ధించుచున్నది. (ఫిలిప్పీయులు 2:2-4) బైబిలు సూత్రములు యిమిడియుండని విషయంలో క్రైస్తవ భర్త తరచు తన భార్య ప్రతిపాదనకు లోబడును. ఆమెపై వ్యక్తిగత శ్రద్ధ కలిగినవాడై, ఆమె ఎక్కువ బాధ్యతలతో తలమునకలు కాకుండునట్లు కూడా చూచును. ఉదాహరణకు, మరి ముఖ్యంగా ఆమె ఉద్యోగస్థురాలైతే అతడు ఆమెకు యింటిపనులలో సహాయపడవచ్చును.
అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాసెను: “పురుషులు తమసొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై యున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడుగాని, ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ఆలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.” (ఎఫెసీయులు 5:28, 29) యేసుక్రీస్తు సంఘ సభ్యులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించును.
అపొస్తలుడైన పేతురు సలహాకూడ గమనార్హమైనది: “అటువలె పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానముచొప్పున వారితో కాపురము చేయుడి.” (1 పేతురు 3:7) ప్రేమలేని తనంగా తన భార్యతో వ్యవహరిస్తే భర్త ప్రార్థనలకు ఆటంకము కలుగునని గుర్తెరుగుట యోగ్యమైనది కాదా? అవును, దేవుడు తన ప్రార్థనలను ఆలకించి వాటికి ప్రత్యుత్తరమియ్యవలెనని కోరినట్లయిన పురుషుడు తన భార్య యెడల ప్రేమగా వ్యహరించవలెను.
దేవునికి ప్రథమస్థానమిచ్చుట, తన పిల్లలతో తండ్రికున్న సంబంధముపై కూడ ప్రభావము చూపును. వారి ఆత్మీయ సంక్షేమము యెడల అతడు ప్రగాఢమైన శ్రద్ధను కలిగియుండాలి. అయితే అమెరికాలో జరిపిన ఒక ప్రధాన సర్వేలో కేవలం సగంమంది పురుషులే “లేఖనపఠనము లేదా చర్చాగుంపులలో పాల్గొనుట” ‘తమ కుటుంబ ఆత్మీయాభివృద్ధిలో అత్యంత ప్రాధాన్యత కల్గియున్నదని’ చెప్పారు. మిగిలినవారు “ప్రసారము చేయబడుచున్న మతసంబంధ కార్యక్రమాలను చూడడం లేదా వినడం” లేదా ‘జీవిత పరమార్థమును గూర్చి తలంచడం’ వంటి కార్యములను చేస్తున్నామని పేర్కొన్నారు.
అయితే, తండ్రులకు బైబిలు యిలా చెప్పుచున్నది: “మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు (యెహోవా NW) శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) యెహోవాసాక్షులలో, కుటుంబ ఆరాధనయందు తండ్రులు నడిపింపును తీసికోవాలని కోరబడుచున్నారు. కుటుంబ బైబిలు పఠనములను క్రమంగాచేయుట, క్రైస్తవకూటములకు హాజరగుట, యితర లేఖనావశ్యకతలకు అనుగుణ్యముగా నడచుటనుబట్టి అట్టి పురుషులు తమ కుటుంబములో దేవునికి ప్రథమ స్థానమిచ్చినవారగుదురు.
భార్యగా దేవునిని ప్రథమస్థానమందుంచుట
నీవు భార్యవైతే, కుటుంబ శిరస్సుగా తన పాత్రను కొనసాగించుటలో నీ భర్తకు మద్దతునిచ్చుటద్వారా, నీవు దేవునిని ప్రథమస్థానమందుంచగలవు. బైబిలిట్లనుచున్నది: “భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి, ఇది ప్రభువునుబట్టి యుక్తమైనది.” (కొలొస్సయులు 3:18) ఒకవేళ పురుషుడు సంప్రదించేవాడు కాకపోయిన లేదా కుటుంబ ఆరాధనలో నడిపింపును తీసికొనుటయందు శ్రద్ధలేనివాడైన యెడల ఇది నిజంగా కష్టమే. ఎటువంటి సంఘటనలోనైననూ, అతని లోపాలను అదేపనిగా ఎత్తిచూపుచు, లేదా అంతకన్నా హీనంగా ప్రవర్తించి, ఆయనను తిరస్కరించడంవలన కుటుంబ వ్యాకులము వృద్ధియగును.
సామెతలు 14:1 యిట్లనుచున్నది: “జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును. మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడబెరుకును.” జ్ఞానవంతురాలైన వివాహిత స్త్రీ దేవునిని ప్రథమస్థానమందుంచి ‘తన యిల్లు కట్టుకొను’ ఒక మార్గమేదంటే, తన భర్తకు విధేయురాలై యుండుట. (1 కొరింథీయులు 11:3) ‘తన నాలుకపైగల కృపగల ఉపదేశమును’ బట్టి ఆమె అనవసరముగా తన భర్తను విమర్శించదు. (సామెతలు 31:26 NW) అతని నిర్ణయములు విజయమగు నిమిత్తముకూడ ఆమె కష్టించి పనిచేయును.
కష్టించి పనిచేసే భార్యగానుండుట వివాహిత స్త్రీ దేవునిని ప్రథమస్థానమందుంచు మరొక మార్గము. అయితే, ఒకవేళ ఆమె ఉద్యోగము చేయవలసివస్తే, తాను కోరినవిధంగా యింటిని చక్కదిద్దుటకు అవసరమయ్యే సమయము, శక్తి ఆమెకుండదు. అయినను, ఆమె బైబిలు పేర్కొనుచున్న “సామర్థ్యముగల భార్యగా” ఉండుటకు కృషిచేయును. బైబిలు యిట్లనుచున్నది: “ఆమె తన యింటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.”—సామెతలు 31:10, 27.
అన్నింటికంటే మిన్నగా, భార్య తన జీవితములో దేవుని ఆరాధనకు ప్రథమస్థానమిచ్చు చుండవలెను. యెహోవాసాక్షుల రాజ్యమందిరమును మొదటిసారిగా సందర్శించిన అనేకులు పిల్లలు పరిశుభ్రంగా కన్పించిన దానినిగూర్చి వ్యాఖ్యానించారు. ఈ విషయములో భార్యయొక్క పనితనము విలువకట్టలేనిది. అంతేకాక తన ఆత్మీయతను కాపాడుకొనుటకు ప్రార్థన, పఠనము, మరియు దేవునికి చేయు సేవయెడల ఆమె కృషి సల్పవలసియున్నది.
యౌవనులుగా దేవునిని ప్రథమస్థానమందుంచుట
అడోలెసింట్ కౌన్సిలర్ అను పత్రికలో ఒక శీర్షిక యిట్లనుచున్నది: “తమ తలిదండ్రులను తమ చెప్పుచేతలలో ఉంచుకొనునట్టి దృక్పధములను, తత్వములను వృద్ధిచేసికొనుటకు పిల్లలు మొగ్గుచూపుచున్నారు. . . . తక్షణ సంతృప్తిని, వస్తుసంపదను అధికంగా పేర్కొనుచు, కొనియాడుచున్న సమాజములో ఉన్నందువలన కౌమారులు ‘అది నాకిప్పుడే కావాలి’ అనే స్వభావమును పెంచుకొనుచున్నారు.” నీవు యౌవనుడవైతే, నీ స్వభావము ఆలాగేనున్నదా?
కొలొస్సయులు 3:20 చెప్పునదేమనగా: “పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రులమాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.” అట్టి విధేయత దైవిక అవశ్యకతయని గుర్తించిన యౌవనుడు తన తలిదండ్రులతో సహకరిస్తాడు. ఉదాహరణకు వారు యిష్టపడని పాఠశాల స్నేహితులతో సహవాసముచేస్తూ వారిని రహస్యంగా తిరస్కరించడు; లేదా తన స్వంత పన్నాగముల కొరకు తలిదండ్రులలో ఎవరినీ పావులుగా ఉపయోగించుకొన ప్రయత్నించడు. (సామెతలు 3:32) బదులుగా, దేవునికి ప్రథమస్థానమిచ్చిన ఏ యౌవనుడైనా ప్రేమగల తలిదండ్రుల నడిపింపునకు లోబడియుంటాడు.
దేవునికి ప్రథమస్థానమివ్వండి!
కుటుంబ వలయములో మనము ఏ స్థానమందున్ననూ, మనము దేవునికి ప్రథమస్థానమిచ్చి ఆయనతో సన్నిహిత సంబంధమును పెంపొందించుకొనవలెను. మీరు, మీ కుటుంబము అలా చేయుచున్నారా?
ఈ “అంత్యదినములలో” మనమందరము “అపాయకర కాలములను” ఎదుర్కొందుము. (2 తిమోతి 3:1-5) అయినప్పటికిని, ఆత్మీయంగా పోరాటముసల్పి ఈ విధానాంతమునుండి తప్పించుకొనడం సాధ్యమే. (మత్తయి 24:3-14) సరియైన బైబిలు జ్ఞానమునకు పొందికగా నడచుకొనుట మూలంగా, మీరు, మీ కుటుంబము భూపరదైసులో నిత్యజీవమును పొందు నిరీక్షణను కల్గియుండగలరు. (లూకా 23:43; యోహాను 17:3; ప్రకటన 21:3, 4) అవును, మీ జీవితములో దేవునికి ప్రథమస్థానమిచ్చినయెడల అది మీకు లభించును. (w91 5/15)
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి వారు ప్రచురించిన మీరు పరదైసు భూమిలో నిరంతరము జీవించగలరు అను పుస్తకమునందు 22వ అధ్యాయమును చూడుము.
[5వ పేజీలోని చిత్రాలు]
తగు సామర్థ్యముగల భార్య బహుగా కొనియాడబడును
[7వ పేజీలోని చిత్రాలు]
కుటుంబ ఆరాధనలో భర్తలు నడిపింపును తీసికొనవలెనని బైబిలు ప్రోత్సహించుచున్నది