వాగ్ధానదేశమునుండి దృశ్యములు
తాబోరు నుండి విజయము!
ఒక గోపురము మీదనుండి చరిత్రను సృష్టించిన మార్గములు కలియుచోటును క్రిందికి చూచుచుండుటను ఊహించుము. నిజముగా చరిత్ర జరుగుతున్నట్లే నీవు చూడగలవు.
బహుశ బైబిలు ప్రాంతమైన మెగెద్దో చాలా బాగుగా ఆ వర్ణనకు సరిపోవచ్చును. ఎందుకనగా ప్రాముఖ్యమైన వ్యాపార మరియు సైనిక మార్గములకు ప్రక్కగా అది వున్నది. అయినను, యెజ్రెయేలు లోయకు ప్రక్కగానున్న తాబోరు పర్వతమునుండి కూడా సారవంతమైన చంద్రాకార భూమియందలి పట్టణములకు నడుపు ప్రఖ్యాత మార్గమైన వయా మారిస్‌ను చూడగలము.a
ఆ ప్రాంతములోని ఏవైపునుండియైనను నీవు తాబోరువైపు చూచినట్లయిన, ఎంతో ముగ్ధుడవైదువు. (యిర్మీయా 46:18ని పోల్చుము.) తాబోరు మహత్తరమైన రీతిలో దానిచుట్టు ఉన్నవాటన్నిటికి ప్రత్యేకముగా ఎదిగియున్నది. దాని శంఖు ఆకారమును అన్ని దిశలనుండి గుర్తించవచ్చును. దానికి ముందు దక్షిణముగా సారవంతమైన యెజ్రెయేలు లోయ వ్యాపించియున్నది. ఇది తీరప్రాంతమును యోర్దాను లోయతో కలుపుచున్నది.
అందముగా కనిపించు తాబోరు పర్వత శిఖరమునుండి దక్షిణముగా నీవు యెజ్రెయేలు పట్టణమును చూడగలవు. ఇది అహాబు రాజనివాసముయొద్దకు యెహూ ఆగ్రహముతో వెళ్లుటను, అవమానకరమగురీతిలో యెజెబేలును నాశనముచేయుటను గుర్తుచేయవచ్చును. (1 రాజులు 21:1; 2 రాజులు 9:16-33) దానికి సమీపములో మెగిద్దో ఉన్నది. పడమటివైపు ఏలియా అగ్నితో పరీక్షజరిపిన కర్మెలు పర్వతమును నీవు చూడవచ్చును. (1 రాజులు 18వ అధ్యాయము) ఇంకను తాబోరునుండి కీషోను నది సముద్రమువైపు వెళ్లుటను, దానికి పశ్చిమముగా వాయవ్యదిశలో గలిలయ కొండల క్రింది భాగమందు నజరేతును కూడా చూడగలవు.
అయితే తాబోరు పర్వతమును ప్రస్తావించినపుడు ఏ బైబిలు వృత్తాంతము నీ మదిలోకి వచ్చును? బహుశా, దెబోరా మరియు బారాకుదై యుండవచ్చును. వారి కాలములో హోసోరులో ఏలు యాబీనురాజు క్రింద కనానీయులు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను బాధించిరి. అప్పుడు ప్రవక్తియైన దెబోరా బారాకును కార్యమునకై పురికొల్పెను. అప్పుడు ఆయన ముఖ్యముగా నఫ్తాలి మరియు గలిలయలోని జెబూలూనీయుల గోత్రములోనుండి పదివేలమంది ఇశ్రాయేలీయులను పిలిపించుకొని తాబోరు కొండమీద సమకూడెను. వారు ఎక్కువగా ఆయుధములను లేనివారైయుండిరి. ఎందుకనగా ఒక కేడెముగాని యీటెయేగాని ఇశ్రాయేలీయులలో కనపడలేదు.—న్యాయాధిపతులు 5:7-17.
భీతినిగొల్పునట్టి సైనిక బలము వారికి వ్యతిరేకముగా నిలువబడెను. యాబీను సైన్యాధిపతియైన సీసెరా పూర్తిగా ఆయుధములను ధరించిన కనాను శూరులను తీసుకొచ్చాడు. వారు ప్రక్కపేజీలో కుడివైపు పైభాగమున ఐగుప్తు చెక్కడముపై చిత్రీకరించబడిన ఆయుధములు ధరించిన మనుష్యులను పోలియుండవచ్చును. కనాను వారు ఉపయోగించిన యుద్ధసామాగ్రిపై ఐగుప్తు ప్రభావము చూపెను. సీసెరా అతి భయంకరమైన ఆయుధములలో 900 యుద్ధ రథములును చేరియుండెను!
కనానీయుల రథములు నిజముగా కదలుతూ నిప్పును వెదజిమ్మునట్టి వేదికలుగా ఉన్నవి. దానిని నడుపువాడు చేతులతో స్వేచ్ఛగా ఆయుధములను ఉపయోగించునట్లు కళ్లెములను నడుముకు కట్టుకొనియుండవచ్చును. లేక తాను రథమును తోలుతూ వుంటే తనప్రక్కన మరొకడు ఆయుధముల నుపయోగించుటకు వుండవచ్చును. అవి యిరుసులనుండి ఇనుప మొనలు పొడుచుకువచ్చిన చక్రములుగల రథములైయుండెను. తాబోరునుండి క్రిందికి చూచు బారాకు మనుష్యులకు గుమికూడియున్న రథములు భయంకరముగా, ఆపబడజాలనివిగా, జయించబడనేరవిగా కనిపించియుండవచ్చును.
అయినను, యెహోవా బారాకుతో యిట్లు వాగ్ధానముచేసెను: “నేను నీ దగ్గరకు. . .సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటియొద్దకు కూర్చి అప్పగించెదను.” సరైన సమయములో శూరులైన ఇశ్రాయేలీయులు తాబోరునుండి దిగివచ్చిరి.—న్యాయాధిపతులు 4:1-14.
ఇచ్చట ఆశ్చర్యపడుటకన్న గొప్పనైన విషయమేమిటనగా పరలోకమందున్న తమ బలవంతుడైన దేవునియొద్దనుండి ఇశ్రాయేలీయులు పొందిన సహాయము. తరువాత దెబోరా యిలా పాడెను: “నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను. నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో యుద్ధముచేసెను. కీషోను వాగువెంబడి. . . వారు కొట్టుకొనిపోయిరి. నా ప్రాణమా నీవు బలము పూని సాగుము.” (న్యాయాధిపతులు 5:20, 21) ఔను, బహుతక్కువగా ఆయుధములు ధరించిన, ధైర్యశాలులైన ఇశ్రాయేలీయులు సాయుధులైన కనానీయులను తరిమివేసినను దానిని నిర్ణయించినవాడు దేవుడు. ఆరియున్న నదిని ఆకస్మాత్తుగా పొర్లిపారునట్లు చేసెను. భయముచెందిన రథములు కదలలేకపోయెను.
క్రింద మీరు కీషోను నది భాగాన్ని చూస్తారు. వర్షాకాలములో దాని ఒడ్డులనిండా పొర్లిపారుతూ ఆ ప్రాంతమునంతటిని బురదగాచేయును. అటువంటి బురదలోనుండి కనానీయుల యుద్ధరథములు తప్పించుకొని పారిపోజూచుటను చిత్రీకరించుకొనుము. పారిపోతున్న సైనికులను, రథములను లేక రెండింటిని భీకరంగా వస్తున్న ప్రవాహము కొట్టుకొనిపొయెను. ఇశ్రాయేలీయులు విజయముతో సైన్యాధిపతియైన సీసెరాను పట్టుకొనుటకు నడిపించగా, అతను తన రథమును విడిచిపెట్టి కాలినడకను తాను యుద్ధభూమినుండి పారిపోయెను. చివరకు అతను యాయేలు అను ఒక స్త్రీ గుడారమును ఆశ్రయించెను. ఆమె తగిన సమయము చూచి తన శత్రువును చంపివేసెను.—న్యాయాధిపతులు 4:17-22.
ఆ విధముగా దెబోరా యెదుట మరియు తాబోరునుండి చూచుచున్నవారియెదుట ఇశ్రాయేలీయుల చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన మరియు విజయవంతమైన అధ్యాయము విప్పబడినది. (w90 5/1)
[అధస్సూచీలు]
a తాబోరుయొక్క పటమును, పెద్దనైన స్పష్టమైన ఫోటోగ్రాఫ్‌ను 1990 యెహోవాసాక్షుల కేలండరులో చూడుము.
[22వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[23వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
Pictorial Archive (Near Eastern History) Est.
Pictorial Archive (Near Eastern History) Est.