ప్రియమైన వారిని మరణము తీసికొనిపోయినప్పుడు
“1981లో నా తల్లి క్యాన్సర్తో చనిపోయింది. ఆమె నా పెంపుడు తల్లి. ఆమె మరణము నాకు, నా పెంపుడు తమ్ముడికి చాలా కష్టముగా తోచినది. నేనప్పుడు 17 సంవత్సరాల దానిని, నా తమ్ముడు 11 సంవత్సరాల వాడు. తల్లిలేని లోటును నేనెంతో అనుభవించాను. నేను ఒక కాథోలిక్గా పెంచబడ్డాను, మరియు ఆమె పరలోకంలో ఉందని బోధించబడినందున, నేనుకూడా ఆమెతో ఉండడానికి నా జీవితాన్ని అంతం చేసికోవాలనుకున్నాను. ఆమె నా ఉత్తమ స్నేహితురాలై యుండెను.”—రాబర్టా, 25 సంవత్సరాల వయస్సు.
నీవు అటువంటి అనుభవాన్ని పొందావా? ఆలాగైతే ప్రియమైన వారు చనిపోయినప్పుడు కలుగు లోటు మరియు బాధను నీవు వ్యక్తిగతంగా ఎరుగుదువు. నీవు ప్రేమించిన వారిని మరణము తీసికొనిపోగల శక్తినికలిగి ఉందంటే అది అన్యాయముగా కనిపిస్తుంది. మరియు అది జరిగినప్పుడు, మనము ప్రేమించిన వారితో మాట్లాడలేము, కలిసి నవ్వలేము మరియు వారిని పట్టుకొనలేము అను ఆలోచనయే భరించలేనిదిగా ఉండును. మరియు రాబర్టా మాటలు చూపించునట్లుగా, మనము ప్రేమించినవారు పరలోకంలో ఉన్నారు అని చెప్పబడుట బాధను తీసివేయదు.
పరలోకంలో కాదుగాని, సమాధానకరమైన, నీతియుక్తమైన పరిస్థితులుండు ఈ భూమిపైనే నీవు చనిపోయిన నీ ప్రియమైన వారితో రానున్న భవిష్యత్తులో తిరిగి కలిసికొనుట సాధ్యమని తెలిస్తే నీవెట్లు భావిస్తావు? మరియు ఆ సమయములో మనుష్యులు పరిపూర్ణ ఆరోగ్యమును అనుభవించు ఉత్తరాపేక్ష కలిగియుండి ఇక ఎప్పుడును చనిపోరని నీవు తెలిసికుంటే ఏమి? ‘నిశ్చయముగా అది కోరుకోగల లోకం’ అని నీవు అనవచ్చు.
అయినను, సా.శ. మొదటి శతాబ్దములో యేసు ధైర్యముతో ఇట్లనెను: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును.” (యోహాను 11:25) చనిపోయిన వారు తిరిగి జీవిస్తారని అది ఒక వాగ్దానము—నిశ్చయముగా అది పులకరింపజేయు ఉత్తరాపేక్ష!
అయితే, బహుశ నీవిట్లు ఆలోచించుచుండవచ్చును, ‘ఆ వాగ్దానమును నమ్ముటకు మంచి ఆధారమున్నదా? అది కేవలం కోరుకోగలిగిన లోకం మాత్రమే కాదని నేనెట్లు నిశ్చయత కలిగియుండగలను? మరియు అది నమ్ముటకు ఆధారమున్నట్లయితే, ఈ వాగ్దానము నెరవేరుట నాకు మరియు నేను ప్రేమించిన వారికి ఏ అర్థమునిచ్చును?’ దీని తర్వాతి శీర్షిక వీటిని మరియు ఇతర ప్రశ్నలను చర్చించును. (w90 5/1)