రాజ్యప్రచారకుల నివేదిక
వ్యతిరేకతవున్నను సైప్రస్‌లో సువార్త వృద్ధిచెందుచున్నది
అపొస్తలుడైన పౌలు సైప్రస్‌లో (కుప్ర) రాజ్యసువార్తను ప్రకటించెను. (అ.కార్యములు 13:4-12) అది సా.శ. 47-48 ప్రాంతములో జరిగింది. నేడు, ఈ అందమైన ద్వీప ప్రాంతములో 1,154 మంది యెహోవాసాక్షులచే సువార్త ప్రకటించబడుచున్నది, 1988 ఏప్రిల్ నెలలో జ్ఞాపకార్థదిన కార్యక్రమమునకు 2,570 హాజరైనారు. కనుక ఈ ద్వీపములో దైవ భయముగల యథార్థహృదయులు అనేకులున్నారని చూపుచున్నది. అయితే యెహోవాసాక్షులు అందించు సమాధానకరమగు బైబిలు వర్తమానమును అనేకులు ఆహ్వానించుచున్నను, యేసుదినములలోనున్న యూదామతనాయకులవలె, గ్రీకు మతనాయకులు ఈ పనిని వ్యతిరేకించుచున్నారు. (యోహాను 15:20) సైప్రస్‌లోని బ్రాంచి కార్యాలయము యిట్లు వ్రాయుచున్నది: “మునుపెన్నడు లేనంతగా గ్రీకు సైద్ధాంతిక మతసంస్థ మన ప్రచారపనిని చెరుపుటకు స్థిరనిశ్చయతతో ఉన్నది.” యింటింటి పరిచర్యలో సహోదరులను మతనాయకులు ఎలా వేదించుచున్నారు, మరియు వాదములలోనికి దింపుటకు వారిని ఎలా రెచ్చగొట్టుచున్నారో ఆ నివేదిక తెల్పుచున్నది. అలా చేసి కలతలు రేపుచున్నారని వారిపై నిందమోపు చున్నారు, కాని సహోదరులు రెచ్చగొట్టబడుటకు నిరాకరించి బయటకు వెళ్లిపోవుచున్నారు.
ఈ క్రింది అనుభవము చూపురీతిగా మతాధికారుల వ్యతిరేకత తరచు వారికే నష్టముగా నిరూపించబడుచున్నది: “కొన్నినెలలక్రితం ఒక స్త్రీ యెహోవా సాక్షులతో పఠనముచేయుట ప్రారంభించినది, యిటీవలనే ఆమె భర్తకూడ ఆమెతోచేరాడు. వారు తమ బైబిలు పఠనమును మానివేస్తారనే ఆశతో మత వేదాంతి ఒకరు ఆ దంపతులను సందర్శించెను. అతడు వారికి త్రిత్వాన్ని వివరించుటకు ప్రయత్నించెను. కొంతసేపు అయిన తరువాత భర్త మధ్యలో కలుగజేసికొని యిట్లనెను: ‘మీరు చెప్పుచున్నట్లు, యేసు యిప్పుడు పరలోకములో భౌతిక శరీరమును కల్గియుండి అదేసమయములో ఆత్మీయ రూపంలోనున్న దేవునితో ఎలా ఏకమైయున్నాడో నేను అర్థము చేసుకోలేక పోవుచున్నాను.’ దానికి ఆ వేదాంతి సమాధానమేమనగా ‘ప్రతిదానిని నీవు అర్థం చేసుకోనవసరంలేదు.’ ఆసక్తిగల ఈ వ్యక్తి యిలా చెప్పాడు: ‘కాని యేసు దేవుని కుమారుడని, అంతేగాని తానుగా దేవుడు కాడని నేను అర్థము చేసుకొన్నాను. త్రిత్వమును గూర్చి నేను ఇక ఏమియు వినదల్చుకోలేదు.’ అప్పుడు ఈ వేదాంతి కోపంతో లేచి: ‘మీరు మీ బైబిలు పఠనముతో అతి తెలివిమంతులయ్యారు. మీరు మారలేరు.’ అని వెళ్లిపోయాడు.
యిప్పుడు ఆ భార్య క్రైస్తవకూటములన్నిటికి హాజరగుచున్నది, మరియు “యెహోవాయందు నమ్మకముంచుము” అను జిల్ల సమావేశములో బాప్తిస్మము తీసుకొనెను. భర్త పఠనమును కొనసాగించుచు కొన్ని కూటములకు హాజరగుచున్నాడు.
“ఆవిధంగా వారు ప్రయత్నాలు చేసినను, మతనాయకులు తమ గురిని సాధించలేక పోవుచున్నారు,” అని సైప్రస్ బ్రాంచి కార్యాలయము నుండి వచ్చిన నివేదిక తెల్పుచున్నది. “బదులుగా మేము గమనించిన దేమనగా మునుపుకంటె ఎక్కువమంది ఆసక్తిగలవారు యిప్పుడు కూటములకు హాజరగుచున్నారు. అదేసమయంలో యథార్థహృదయులకు సువార్తను అందించుటలో సహోదరులు మరింత కృతనిశ్చయతతో ఉన్నారు.” యిర్మీయా 1:19 నందు యెహోవా వాగ్ధానముచేసిన విధంగా తన యథార్థసేవకులను బలపర్చుచున్నాడు: “వారు నీతో యుద్ధము చేతురుగాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీపైని విజయముపొంద జాలరు; ఇదే యెహోవావాక్కు.” (w88 10/1)