53వ పాఠం
యెహోవాను సంతోషపెట్టే వినోదాన్ని ఎంచుకోండి
యెహోవా “సంతోషంగల దేవుడు.” (1 తిమోతి 1:11) మనం కూడా సంతోషించాలని, జీవితాన్ని ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడూ పని చేస్తూనే ఉండకుండా, కాస్త సరదాగా సమయం గడిపితే ఆయన సంతోషిస్తాడు. మన ఖాళీ సమయాన్ని సంతోషంగా, సంతృప్తిగా, యెహోవాను సంతోషపెట్టే విధంగా ఎలా ఉపయోగించవచ్చో ఈ పాఠంలో తెలుసుకుంటాం.
1. వినోదాన్ని ఎంచుకునేటప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి?
మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారు? కొంతమంది ఇంట్లో కూర్చుని ఏదైనా పుస్తకం చదువుతారు, పాటలు వింటారు, సినిమా చూస్తారు, లేదా ఇంటర్నెట్ చూస్తారు. మరికొంతమంది స్నేహితులతో కలిసి సరదాగా బయటికి వెళ్లి ఆటలు ఆడతారు, ఈత కొడతారు. మనం ఏ వినోదం ఎంచుకున్నా, అది ‘ప్రభువుకు ఇష్టమైనదై’ ఉండాలని గుర్తుంచుకోవడం ప్రాముఖ్యం. (ఎఫెసీయులు 5:10) ఎందుకంటే, ఈ రోజుల్లో చాలామంది ఎంచుకునే వినోదం యెహోవా అసహ్యించుకునే వాటితో, అంటే హింస, లైంగిక పాపం, మంత్రతంత్రాలు వంటివాటితో నిండిపోయింది. (కీర్తన 11:5 చదవండి.) మరి, మనం యెహోవాను సంతోషపెట్టే వినోదాన్ని ఎంచుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?
మనం యెహోవాను ప్రేమించే వాళ్లతో స్నేహం చేస్తే మంచిగా ఆలోచించగలుగుతాం, మంచి వినోదాన్ని ఎంచుకోగలుగుతాం. 48వ పాఠంలో నేర్చుకున్నట్టు, “తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు.” అలా కాకుండా దేవుని నియమాల్ని, సూత్రాల్ని ప్రేమించని వాళ్లతో “సహవాసం చేసేవాడు చెడిపోతాడు.”—సామెతలు 13:20.
2. వినోదానికి ఎంత సమయం పెడుతున్నామో చూసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
మనం మంచి వినోదాన్నే ఎంచుకున్నప్పటికీ, దానికి ఎక్కువ సమయం ఇవ్వకుండా చూసుకోవాలి. వినోదానికే ఎక్కువ సమయం పెట్టేస్తే, ముఖ్యమైన పనులకు సమయం ఉండకపోవచ్చు. ‘సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోమని’ బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది.—ఎఫెసీయులు 5:15, 16 చదవండి.
ఎక్కువ తెలుసుకోండి
వినోదం విషయంలో మీరు ఎలా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చో తెలుసుకోండి.
3. చెడు వినోదాన్ని ఎంచుకోకండి
మనం వినోదాన్ని ఎందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.
ప్రాచీన రోములో ఉన్న ఆటలకు, ఇప్పటి వినోదానికి ఎలాంటి పోలికలు ఉన్నాయి?
ఈ వీడియోలో చూపించిన డానీ, వినోదం గురించి ఏం నేర్చుకున్నాడు?
రోమీయులు 12:9 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
మంచి వినోదాన్ని ఎంచుకోవడానికి ఈ వచనం మీకెలా సహాయం చేస్తుంది?
యెహోవా అసహ్యించుకునే కొన్ని విషయాలు ఏంటి? సామెతలు 6:16, 17; గలతీయులు 5:19-21 చదవండి. ప్రతీ లేఖనం చదివిన తర్వాత, ఈ ప్రశ్నను చర్చించండి:
ఈ వచనాల్లో చెప్పిన ఏ విషయాలు ఇప్పటి వినోదంలో కనిపిస్తున్నాయి?
మంచి వినోదాన్ని ఎలా ఎంచుకోవచ్చు?
ఈ ప్రశ్నలు వేసుకోండి:
ఎలాంటి వినోదం? ఇందులో యెహోవా అసహ్యించుకునేవి ఉన్నాయా?
ఎంతసేపు? ఇది ముఖ్యమైన పనులకు అడ్డు వస్తుందా?
ఎవరితో? యెహోవాను ప్రేమించని వాళ్లకు ఇది నన్ను దగ్గర చేస్తుందా?
ప్రమాదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వినోదం విషయంలో కూడా అంతే. ఈ వినోదం మంచిది కాదేమో అని ఏ కాస్త సందేహం వచ్చినా, దానికి దూరంగా ఉండాలి
4. మీ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి
వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.
ఈ వీడియోలో ఉన్న సహోదరుడు చెడు వినోదాన్ని చూడట్లేదు, అయినా ఆయనకు ఏది సమస్యగా మారింది?
ఫిలిప్పీయులు 1:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
వినోదానికి ఎంత సమయం పెట్టాలో నిర్ణయించుకోవడానికి ఈ వచనం ఎలా సహాయం చేస్తుంది?
5. మంచి వినోదాన్ని ఎంచుకోండి
కొన్ని రకాల వినోదం యెహోవాను సంతోషపెట్టకపోయినా, ఆయన్ని సంతోషపెట్టేవి చాలానే ఉన్నాయి. ప్రసంగి 8:15; ఫిలిప్పీయులు 4:8 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
మీకు ఎలాంటి మంచి వినోదం అంటే ఇష్టం?
మీరు రకరకాల మంచి వినోదాన్ని ఆనందించవచ్చు
కొంతమంది ఇలా అంటారు: “హింస, లైంగిక పాపం, మంత్రతంత్రాలు చేస్తే తప్పు గానీ, అలాంటి వినోదం చూస్తే తప్పేముంది.”
మీరేమంటారు?
ఒక్కమాటలో
మనం మంచి వినోదాన్ని ఎంచుకుని, దాన్ని ఆనందించాలని యెహోవా కోరుకుంటున్నాడు.
మీరేం నేర్చుకున్నారు?
క్రైస్తవులు ఎలాంటి వినోదానికి దూరంగా ఉండాలి?
వినోదానికి ఎంత సమయం పెడుతున్నామో చూసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
మీరు యెహోవాను సంతోషపెట్టే వినోదాన్నే ఎంచుకోవాలని అనుకుంటున్నారా? ఎందుకు?
ఇవి కూడా చూడండి
మనం ఏ వినోదాన్ని ఎంచుకోవాలో ఎవరు నిర్ణయిస్తారు?
“యెహోవాసాక్షులు కొన్ని సినిమాలను, పుస్తకాలను, పాటలను నిషేధిస్తారా?” (jw.org ఆర్టికల్)
ఖాళీ సమయంలో చేసే పనుల విషయంలో మీరు ఎలా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చో చూడండి.
“మీరు ఉల్లాసం కోసం చేసేవి ప్రయోజనకరంగా ఉంటున్నాయా?” (కావలికోట, అక్టోబరు 15, 2011)
“నాలో ఉన్న ద్వేషాన్ని కూడా తీసేసుకున్నాను” అనే అనుభవం చదివి, ఒక వ్యక్తి వినోదం విషయంలో ఎందుకు మార్పులు చేసుకున్నాడో చూడండి.
మంత్రతంత్రాలకు సంబంధించిన వినోదం విషయంలో ఒక తల్లి ఎలాంటి మంచి నిర్ణయం తీసుకుందో చూడండి.