46వ పాఠం
సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
మీరు యెహోవాను మాత్రమే ఆరాధిస్తారని, ఆయన ఇష్టం చేయడానికే మీ జీవితంలో మొదటి స్థానం ఇస్తారని ప్రార్థనలో మాట ఇవ్వడం ద్వారా మీరు ఆయనకు సమర్పించుకుంటారు. (కీర్తన 40:8) తర్వాత, మీరు బాప్తిస్మం తీసుకుంటారు. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మీరు సమర్పించుకున్నారని అందరికీ చూపిస్తారు. మనల్ని మనం యెహోవాకు సమర్పించుకోవడం అనేది, మనం తీసుకునే అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. మీ జీవితాన్ని మార్చేసే ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకునేలా మిమ్మల్ని ఏది కదిలిస్తుంది?
1. దేవునికి సమర్పించుకునేలా మనల్ని ఏది కదిలిస్తుంది?
యెహోవాకు సమర్పించుకునేలా ప్రేమ మనల్ని కదిలిస్తుంది. (1 యోహాను 4:10, 19) బైబిలు ఇలా ప్రోత్సహిస్తుంది: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో, నీ పూర్తి బలంతో ప్రేమించాలి.” (మార్కు 12:30) మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మాటల్లోనే కాదు, మన పనుల్లో కూడా చూపిస్తాం. ఒకరి మీద ఒకరికి నిజమైన ప్రేమ ఉన్న అమ్మాయి, అబ్బాయి ఎలాగైతే పెళ్లి చేసుకుంటారో, అలాగే యెహోవా మీద మనకున్న ప్రేమ ఆయనకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకునేలా మనల్ని కదిలిస్తుంది.
2. బాప్తిస్మం తీసుకున్న తన సాక్షులకు యెహోవా ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు?
మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, సంతోషకరమైన యెహోవా కుటుంబంలో ఒకరౌతారు. అప్పుడు ఆయన ప్రేమను మీరు ఎన్నో విధాలుగా రుచి చూస్తారు. అంతేకాదు, మీరు ఆయనకు ఇప్పటికన్నా ఇంకా ఎక్కువ దగ్గరౌతారు. (మలాకీ 3:16-18 చదవండి.) యెహోవా మీకు తండ్రిగా ఉంటాడు. యెహోవాను, మిమ్మల్ని ప్రేమించే ప్రపంచవ్యాప్త సహోదర సహోదరీల కుటుంబం కూడా మీకు ఉంటుంది. (మార్కు 10:29, 30 చదవండి.) అయితే, మీరు బాప్తిస్మం తీసుకునే ముందు కొన్ని పనులు చేయాలి. మీరు యెహోవా గురించి నేర్చుకోవాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన కుమారుడి మీద విశ్వాసం ఉంచాలి. చివరిగా, మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. ఇలా మీరు ఒక్కో అడుగు వేస్తూ బాప్తిస్మం అనే లక్ష్యాన్ని చేరుకుంటే, శాశ్వత జీవితానికి నడిపించే దారిలో ఉన్నట్టే. బైబిలు ఇలా చెప్తుంది: “బాప్తిస్మం . . . మిమ్మల్ని ఇప్పుడు రక్షిస్తోంది.”—1 పేతురు 3:21.
ఎక్కువ తెలుసుకోండి
మీరు యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో పరిశీలించండి.
3. ఎవర్ని ఆరాధించాలో మనం నిర్ణయించుకోవాలి
పూర్వం ఇశ్రాయేలీయుల్లో కొంతమంది, యెహోవాను ఆరాధిస్తూనే అబద్ధ దేవుడైన బయలును కూడా ఆరాధించవచ్చని అనుకున్నారు. కానీ యెహోవా ఏలీయా ప్రవక్తను పంపించి, వాళ్ల తప్పుడు ఆలోచనను సరిచేశాడు. 1 రాజులు 18:21 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
ఇశ్రాయేలీయులు ఏ నిర్ణయం తీసుకోవాలి?
ఇశ్రాయేలీయుల్లాగే మనం కూడా ఎవర్ని ఆరాధించాలో నిర్ణయించుకోవాలి. లూకా 16:13 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
ఒకవైపు యెహోవాను ఆరాధిస్తూనే, మరోవైపు వేరేవాళ్లను లేదా వేరేవాటిని ఎందుకు ఆరాధించలేం?
మనం యెహోవాను ఆరాధించాలని నిర్ణయించుకున్నట్టు ఎలా చూపిస్తాం?
4. యెహోవాకు మీ మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి
యెహోవా మనకు ఎన్నో విలువైన బహుమతులు ఇచ్చాడు. మనం తిరిగి ఆయనకు ఏం ఇవ్వవచ్చు? వీడియో చూడండి.
యెహోవా మీ మీద ఏయే విధాలుగా ప్రేమ చూపించాడు? కీర్తన 104:14, 15; 1 యోహాను 4:9, 10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
యెహోవా మీకు ఇచ్చిన బహుమతుల్లో, ముఖ్యంగా వేటిని బట్టి మీరు కృతజ్ఞతతో ఉన్నారు?
ఆ బహుమతులు ఇచ్చినందుకు ఆయన గురించి మీకేం అనిపిస్తుంది?
మనకు ఏదైనా బహుమతి బాగా నచ్చినప్పుడు, దాన్ని ఇచ్చినవాళ్ల మీద కృతజ్ఞత చూపించాలనుకుంటాం. ద్వితీయోపదేశకాండం 16:17 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
యెహోవా మీకోసం చేసిన వాటన్నిటి గురించి ఆలోచించినప్పుడు, తిరిగి ఆయనకు ఏం ఇవ్వాలని మీకు అనిపిస్తుంది?
5. సమర్పించుకుంటే ఎన్నో దీవెనలు వస్తాయి
గొప్ప పేరు, మంచి ఉద్యోగం, డబ్బు ఉంటే సంతోషంగా ఉంటామని చాలామంది అంటారు. అది నిజమేనా? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.
వీడియోలో ఉన్న అతనికి ఫుట్‌బాల్ ఆడడం అంటే చాలా ఇష్టం, అయినా అతను ఆ కెరీర్‌ని ఎందుకు వదిలేశాడు?
అతను తన జీవితాన్ని ఫుట్‌బాల్‌కు కాదుగానీ, యెహోవాకు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తీసుకున్నది సరైన నిర్ణయమే అని మీకు అనిపిస్తుందా? ఎందుకు?
అపొస్తలుడైన పౌలు క్రైస్తవుడిగా మారకముందు, పేరున్న బోధకుడి దగ్గర యూదా మత చట్టాల్లో శిక్షణ పొందాడు. అదే కొనసాగించి ఉంటే, ఆయన యూదా మతంలో గొప్ప స్థాయికి ఎదిగి ఉండేవాడు. కానీ, ఒక క్రైస్తవుడిగా అవ్వడం కోసం ఆయన దాన్ని వదిలేశాడు. అలా వదులుకున్నందుకు పౌలు ఎప్పుడైనా బాధపడ్డాడా? ఫిలిప్పీయులు 3:8 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
పౌలు తాను వదులుకున్న వాటిని “చెత్తతో సమానం” అని ఎందుకు అన్నాడు?
దానికి బదులు ఆయన ఏం పొందాడు?
మీ జీవితం యెహోవా సేవ కోసం ఉపయోగించినప్పుడు బాగుంటుందా, లేక వేరేవాటి కోసం ఉపయోగించినప్పుడు బాగుంటుందా?
పౌలు క్రైస్తవుడిగా మారిన తర్వాత, తాను వదులుకున్న దానికన్నా ఎక్కువే పొందాడు
కొంతమంది ఇలా అంటారు: “దేవునికి సమర్పించుకోకపోయినా ఆయన్ని ఆరాధించవచ్చు కదా.”
యెహోవాకు సమర్పించుకోవడం ప్రాముఖ్యం అని మీకు అనిపిస్తుందా? ఎందుకు?
ఒక్కమాటలో
యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేలా ప్రేమ మనల్ని కదిలిస్తుంది.
మీరేం నేర్చుకున్నారు?
మన ప్రేమను, ఆరాధనను పూర్తిగా పొందడానికి యెహోవా ఎందుకు అర్హుడు?
బాప్తిస్మం తీసుకున్న తన సాక్షులకు యెహోవా ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు?
మీరు యెహోవాకు సమర్పించుకోవాలని అనుకుంటున్నారా?
ఇవి కూడా చూడండి
సంగీతంలో, ఆటల్లో మంచి స్థాయికి వెళ్లిన ఇద్దరు యెహోవాకు సమర్పించుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారో చూడండి.
యువత అడిగే ప్రశ్నలు—జీవితంలో నేను ఏం చేయాలనుకుంటున్నాను?—గతంలో తీసుకున్న నిర్ణయాలు (6:54)
సమర్పించుకోవడానికి ఇంకొన్ని కారణాలు తెలుసుకోండి.
“మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి?” (కావలికోట, జనవరి 15, 2010)
యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకుంటున్న వాళ్లు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ పాటలో చూడండి.
జీవితంలో ఏది ముఖ్యమైనదో ఆలోచించుకునేలా ఒకామెను ఏది కదిలించిందో తెలుసుకోవడానికి, “‘మనం ఎందుకు పుట్టాం?’ అని ఎన్నో ఏళ్లు ఆలోచించాను” అనే అనుభవం చదవండి.