28వ పాఠం
యెహోవా, యేసు మీకోసం చేసినదానికి కృతజ్ఞత చూపించండి
మీ స్నేహితులు ఎవరైనా మీకు మంచి బహుమతి ఇచ్చారనుకోండి, మీకెలా అనిపిస్తుంది? బహుశా మీకు చాలా సంతోషంగా ఉంటుంది, ఆ బహుమతి ఇచ్చినందుకు కృతజ్ఞత చూపించాలని అనిపిస్తుంది. యెహోవా, యేసు మనకు అత్యంత గొప్ప బహుమతిని ఇచ్చారు. అదే విమోచన క్రయధనం. దానిమీద మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?
1. యెహోవా, యేసు మన కోసం చేసినదానికి కృతజ్ఞత చూపించే ఒక మార్గం ఏంటి?
యేసు మీద ‘విశ్వాసం ఉంచే ప్రతీ ఒక్కరు’ శాశ్వత కాలం జీవించే అవకాశం పొందుతారని బైబిలు మాటిస్తుంది. (యోహాను 3:16) యేసు మీద విశ్వాసం ఉంచడం అంటే అర్థమేంటి? దానర్థం, కేవలం మనసులో యేసును నమ్మడమే కాదు. మన నిర్ణయాల్లో, పనుల్లో మనం ఆయన్ని నమ్ముతున్నామని చూపించాలి. (యాకోబు 2:17) అలా మన మాటల్లో, పనుల్లో విశ్వాసాన్ని చూపించినప్పుడు యేసుకు, ఆయన తండ్రైన యెహోవాకు ఇంకా దగ్గరౌతాం.—యోహాను 14:21 చదవండి.
2. యెహోవా, యేసు మన కోసం చేసినదానికి ఇంకా ఎలా కృతజ్ఞత చూపించవచ్చు?
మనం ఇంకా ఎలా కృతజ్ఞత చూపించవచ్చో యేసు తాను చనిపోవడానికి ముందు రోజు రాత్రి తన శిష్యులకు చెప్పాడు. ఆయన ఒక ప్రత్యేకమైన ఆచరణను మొదలుపెట్టాడు. బైబిలు దాన్ని “ప్రభువు రాత్రి భోజనం” అని పిలుస్తుంది, దాన్నే క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ అని కూడా అంటారు. (1 కొరింథీయులు 11:20) తన అపొస్తలులు, ఆ తర్వాత నిజ క్రైస్తవులందరూ యేసు తమ కోసం చనిపోయాడు అనే విషయాన్ని గుర్తుచేసుకోవాలని ఆయన ఆ ఆచరణ మొదలుపెట్టాడు. దాని గురించి యేసు ఇలా ఆజ్ఞాపించాడు: “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.” (లూకా 22:19) మీరు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడం ద్వారా యెహోవా, యేసు మీమీద చూపించిన గొప్ప ప్రేమకు కృతజ్ఞత చూపిస్తారు.
ఎక్కువ తెలుసుకోండి
యెహోవా, యేసు చూపించిన గొప్ప ప్రేమకు ఇంకా ఎలా కృతజ్ఞత చూపించవచ్చో, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ ఎంత ముఖ్యమైనదో తెలుసుకోండి.
3. మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?
మీరు నీళ్లలో మునిగిపోతున్నప్పుడు ఎవరైనా చేయి అందించి పైకి లాగారనుకోండి. మీ ప్రాణాలు కాపాడిన ఆ వ్యక్తిని మర్చిపోతారా? లేక అతను చేసిన సహాయానికి కృతజ్ఞత చూపిస్తారా?
ఎల్లప్పుడూ జీవించే అవకాశం ఇస్తున్నందుకు మనం యెహోవాకు ఎంతో రుణపడి ఉన్నాం. 1 యోహాను 4:8-10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
యేసు బలి ఒక ప్రత్యేకమైన బహుమతి అని ఎందుకు చెప్పవచ్చు?
యెహోవా, యేసు మీకోసం చేసినదాని గురించి మీకేం అనిపిస్తుంది?
యెహోవా, యేసు మన కోసం చేసినదానికి మనం ఎలా కృతజ్ఞత చూపించవచ్చు? 2 కొరింథీయులు 5:15; 1 యోహాను 4:11; 5:3 చదవండి. ప్రతీ వచనాన్ని చదివిన తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
ఈ వచనం ప్రకారం, కృతజ్ఞత చూపించడానికి మనం ఏం చేయవచ్చు?
4. యేసు అడుగుజాడల్లో నడవండి
మనం యేసు అడుగుజాడల్లో నడవడం ద్వారా కూడా కృతజ్ఞత చూపించవచ్చు. 1 పేతురు 2:21 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
మీరు ఎలా యేసు అడుగుజాడల్లో నడవవచ్చు?
యేసు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు, మంచివార్త ప్రకటించాడు, వేరేవాళ్లకు సహాయం చేశాడు
5. క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవండి
మొదటి ప్రభువు రాత్రి భోజనం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి, లూకా 22:14, 19, 20 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
ప్రభువు రాత్రి భోజనం ఎలా జరిగింది?
రొట్టె, ద్రాక్షారసం వేటికి గుర్తుగా ఉన్నాయి?—19, 20 వచనాలు చూడండి.
తన శిష్యులు సంవత్సరానికి ఒకసారి, తాను చనిపోయిన తేదీన ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరించాలని యేసు కోరుకున్నాడు. అందుకే, యెహోవాసాక్షులు క్రీస్తు ఆజ్ఞాపించినట్టే ఆయన మరణాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రతీ సంవత్సరం కలుసుకుంటారు. ఈ ముఖ్యమైన ఆచరణ గురించి తెలుసుకోవడానికి, వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.
జ్ఞాపకార్థ ఆచరణ ఎలా జరుగుతుంది?
రొట్టె, యేసు మన కోసం అర్పించిన పరిపూర్ణ మానవ శరీరానికి గుర్తు. ద్రాక్షారసం, ఆయన చిందించిన రక్తానికి గుర్తు
కొంతమంది ఇలా అంటారు: “రక్షణ పొందాలంటే యేసును నమ్ముకుంటే చాలు.”
నమ్మడం ఒక్కటే సరిపోదని చెప్పడానికి మీరు యోహాను 3:16; యాకోబు 2:17 ఉపయోగించి వాళ్లతో ఎలా మాట్లాడతారు?
ఒక్కమాటలో
యేసు మీద విశ్వాసం ఉంచడం ద్వారా, జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడం ద్వారా యేసు మన కోసం చేసినదానికి కృతజ్ఞత చూపిస్తాం.
మీరేం నేర్చుకున్నారు?
యేసు మీద విశ్వాసం ఉంచడం అంటే ఏంటి?
యెహోవా, యేసు మీకోసం చేసినదానికి మీరు ఎలా కృతజ్ఞత చూపించాలని అనుకుంటున్నారు?
క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడం ఎందుకంత ముఖ్యం?
ఇవి కూడా చూడండి
క్రీస్తు మరణం మనల్ని ఏం చేసేలా కదిలిస్తుంది?
విశ్వాసం గురించి, దాన్ని ఎలా చూపించవచ్చు అనేదాని గురించి ఎక్కువ తెలుసుకోండి.
“యెహోవా వాగ్దానాలపై విశ్వాసం ఉంచండి” (కావలికోట, అక్టోబరు 2016)
క్రీస్తు బలి గురించి నేర్చుకోవడం వల్ల ఒకామె ఎలాంటి మార్పులు చేసుకుందో తెలుసుకోండి. “నేను సంతోషంగా, పవిత్రంగా ఉన్నాను” అనే జీవిత కథ చదవండి.
జ్ఞాపకార్థ ఆచరణలో కొంతమందే రొట్టె, ద్రాక్షారసాన్ని ఎందుకు తీసుకుంటారో తెలుసుకోండి.