అధ్యాయం 8
బోధించడానికి ఉపయోగపడే ఉదాహరణలు
మత్తయి 13:34, 35
ఏమి చేయాలి? ఆసక్తి కలిగించే, ముఖ్యమైన విషయాలు నేర్పించే చిన్నచిన్న ఉదాహరణలతో చక్కగా బోధించండి.
ఎలా చేయాలి?
చిన్నచిన్న ఉదాహరణలు ఎంచుకోండి. యేసులాగే, చిన్న విషయాలతో పెద్ద విషయాలు, సులభమైన విషయాలతో కష్టమైన విషయాలు బోధించండి. ఉదాహరణలో అనవసరమైన వివరాలు చేర్చి వినేవాళ్లను తికమకపెట్టకండి. ఉదాహరణలోని అంశాలు మీరు చెప్తున్న విషయానికి సరిపోవాలి. లేదంటే వాళ్ల మనసు పక్కకు మళ్లుతుంది.
వినేవాళ్లను మనసులో ఉంచుకోండి. వాళ్ల పనులను, ఇష్టాలను గమనించి వాటిమీద ఉదాహరణలు చెప్పండి. వాళ్లను ఇబ్బందిపెట్టే, నొప్పించే ఉదాహరణలు ఎంచుకోకండి.
ముఖ్యాంశాన్ని బోధించండి. చిన్నచిన్న వివరాల మీద కాకుండా ముఖ్యాంశాల మీద ఉదాహరణలు చెప్పండి. వినేవాళ్లు కేవలం ఉదాహరణనే కాకుండా దాంట్లో ఉన్న పాఠాన్ని గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయండి.