లెసన్ 102
యోహానుకు వచ్చిన దర్శనాలు
అపొస్తలుడైన యోహాను పత్మాసు ద్వీపంలో ఖైదీగా ఉన్నప్పుడు, యేసు ఆయనకు భవిష్యత్తు గురించి వరుసగా 16 దర్శనాలు లేదా బొమ్మలు చూపించాడు. ఈ దర్శనాలు యెహోవా పేరు ఎలా పవిత్రపర్చబడుతుందో, ఆయన రాజ్యం ఎలా వస్తుందో, ఆయన ఇష్టం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమ్మీద ఎలా నెరవేరుతుందో చూపించాయి.
యోహాను ఒక దర్శనంలో, పరలోకంలో తన మహిమగల సింహాసనంపై కూర్చున్న యెహోవాను చూస్తాడు. అతని చుట్టూ 24 మంది పెద్దలు తెల్ల బట్టలు వేసుకుని ఉన్నారు, వాళ్ల తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. సింహాసనం నుండి పెద్దపెద్ద మెరుపులు, గొప్ప ఉరుముల శబ్దాలు వస్తున్నాయి. 24 మంది పెద్దలు యెహోవా ముందు సాగిలపడి ఆయనను ఆరాధించారు. ఇంకో దర్శనంలో, యెహోవాను ఆరాధించే ఒక గొప్ప జనాన్ని యోహాను చూస్తాడు. వాళ్లు అన్ని దేశాలు, ప్రజలు, భాషల నుండి వచ్చినవాళ్లు. గొర్రెపిల్ల అంటే యేసు వాళ్లను కాస్తూ, జీవాన్ని ఇచ్చే నీళ్ల దగ్గరికి తీసుకెళ్తాడు. తర్వాత ఇంకో దర్శనంలో యేసు 24 మంది పెద్దలతో పరలోకంలో రాజుగా పరిపాలించడం మొదలుపెడతాడు. ఆ తర్వాత వచ్చిన దర్శనంలో యేసు మహాసర్పమైన సాతానుతో, అతనితో ఉన్న చెడ్డదూతలతో పోరాడుతున్నట్లు యోహాను చూశాడు. యేసు వాళ్లను పరలోకం నుండి బయటికి భూమి మీదకు పడేస్తాడు.
అప్పుడు గొర్రెపిల్ల, 1,44,000 మంది సీయోను కొండ మీద నిలబడి ఉన్న అందమైన దృశ్యాన్ని యోహాను చూశాడు. భూమి చుట్టూ ఒక దేవదూత ఎగురుతూ దేవునికి భయపడమని, ఆయనను మహిమపర్చమని చెప్పడం కూడా యోహాను చూశాడు.
తర్వాత దర్శనంలో, హార్‌మెగిద్దోన్ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో, యేసు ఆయన సైన్యం సాతాను దుష్ట లోకాన్ని ఓడిస్తారు. చివరి దర్శనంలో యోహాను పరలోకంలో, భూమ్మీద గొప్ప శాంతి ఉన్నట్లు చూస్తాడు. సాతాను, అతని అనుచరులు పూర్తిగా నాశనం అయిపోయారు. పరలోకంలో, భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరూ యెహోవా పేరును గౌరవిస్తూ ఆయనను మాత్రమే ఆరాధిస్తారు.
“నేను నీకూ స్త్రీకీ, నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం పెడతాను. ఆయన నీ తలను చితగ్గొడతాడు, నువ్వు ఆయన మడిమె మీద కొడతావు.”—ఆదికాండం 3:15