కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • rj భాగం 5 పేజీలు 12-15
  • “మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన” దేవుని దగ్గరకు తిరిగి రండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన” దేవుని దగ్గరకు తిరిగి రండి
  • యెహోవా దగ్గరకు తిరిగి రండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • “నా దగ్గరికి తిరిగిరండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ఆయనే నిన్ను బలపరుస్తాడు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • వీలైనంత త్వరగా తిరిగివచ్చేందుకు వారికి సహాయం చేయండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
యెహోవా దగ్గరకు తిరిగి రండి
rj భాగం 5 పేజీలు 12-15

5

“మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన” దేవుని దగ్గరకు తిరిగి రండి

ఈ బ్రోషుర్‌లో చర్చించిన కొన్ని సమస్యలను మీరూ ఎదుర్కొన్నారా? అయితే మీలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. బైబిలు కాలాల్లో ఉన్న దేవుని సేవకులు, మన కాలంలోని దేవుని సేవకులు చాలామంది అలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నారు. యెహోవా ఆ సమస్యల నుండి బయటపడడానికి వాళ్లకు సహాయం చేసినట్లే మీకూ సహాయం చేస్తాడు.

మీరు ఆయన దగ్గరకు తిరిగి వస్తున్నప్పుడు, యెహోవా మీకోసం ఎదురుచూస్తూ ఉంటాడని గుర్తుంచుకోండి

యెహోవా దగ్గరకు తిరిగి రావడానికి మీరు చేసే ప్రతీ ప్రయత్నంలో ఆయన మీకు తోడుంటాడనే ధైర్యంతో ఉండండి. ఆందోళనను తట్టుకోవడానికి, మనసుకు తగిలిన గాయాలు చెరిపేయడానికి, స్వచ్ఛమైన మనస్సాక్షి వల్ల వచ్చే మనశ్శాంతిని సంపాదించుకోవడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు. అప్పుడు తోటి ఆరాధకులతో కలిసి మళ్లీ యెహోవాను సేవించాలనే ప్రేరణను మీరు పొందుతారు. మీ పరిస్థితి మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల పరిస్థితిలాగే ఉంది, వాళ్లకు అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “మీరు గొఱ్ఱెలవలె దారితప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయనవైపునకు మళ్లియున్నారు.”—1 పేతురు 2:25.

యెహోవా దగ్గరకు తిరిగి రావడమే మీరు చేయగల అత్యంత మంచి పని. ఎందుకంటే, అలా చేయడం వల్ల మీరు యెహోవా హృదయాన్ని సంతోషపెడతారు. (సామెతలు 27:11) యెహోవాకు మనలాంటి భావాలే ఉన్నాయనే విషయం మీకు తెలుసు, మనం చేసే పనులను బట్టి ఆయన నొచ్చుకుంటాడు లేదా సంతోషిస్తాడు. యెహోవా తనను ప్రేమించమని, సేవించమని మనల్ని బలవంతం చేయడు. (ద్వితీయోపదేశకాండము 30:19, 20) ఒక బైబిలు విద్వాంసుడు ఇలా అంటున్నాడు: “మీ హృదయాన్ని ఎవ్వరూ తెరవలేరు దాన్ని కేవలం మీరే తెరవగలరు.” ప్రేమతో నిండిన హృదయంతో యెహోవాను ఆరాధిస్తే మనం మన హృదయాన్ని తెరవవచ్చు. అలా చేస్తే మనం దేవునికి యథార్థత అనే అత్యంత గొప్ప బహుమానాన్ని ఇస్తాం, ఆయన హృదయాన్ని ఎంతగానో సంతోషపెడతాం. యెహోవాకు చెందాల్సిన ఆరాధనను ఆయనకు ఇచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని దేనితోనూ పోల్చలేం.—అపొస్తలుల కార్యములు 20:35; ప్రకటన 4:10, 11.

సంఘంతో సహవసించడం మానేసి, మళ్లీ కూటాలకు వచ్చిన సహోదరిని ఆప్యాయంగా హత్తుకుంటున్నారు

అంతేకాదు, మీరు మళ్లీ దేవున్ని ఆరాధించడం మొదలుపెడితే మీ ఆధ్యాత్మిక అవసరాలు తీరుతాయి. (మత్తయి 5:3) ఎలా? మన చుట్టూ ఉన్న ప్రజలు, ‘మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం?’ అనేది తెలియక తికమకపడుతున్నారు. జీవిత సంకల్పానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు తెలియక సతమతమౌతున్నారు. ఎందుకంటే, యెహోవా మనల్ని సృష్టించినప్పుడే అలాంటి ఆలోచనలను మనలో పెట్టాడు. మనం ఆయనను సేవించడంలో పూర్తి ఆనందాన్ని పొందేలా మనల్ని తయారు చేశాడు. యెహోవాను ప్రేమతో సేవించడం వల్ల కలిగే ఆనందం దేనికీ సాటిరాదు.—కీర్తన 63:1-5.

మీరు తన దగ్గరకు తిరిగి రావాలని యెహోవా కోరుకుంటున్నాడని తెలుసుకోండి. మీరు దాన్నెలా నమ్మవచ్చు? మేము ఈ బ్రోషుర్‌ని చాలా జాగ్రత్తగా ఎంతో ప్రార్థించిన తర్వాత తయారుచేశాం. ఈ బ్రోషుర్‌ని మీకు బహుశా ఒక సంఘపెద్ద లేదా తోటి విశ్వాసి ఇచ్చివుంటారు. తర్వాత మీరు దీన్ని చదివి చలించిపోయారు. ఇదంతా యెహోవా మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదనడానికి రుజువు కాదా? యెహోవా ప్రేమగా మిమ్మల్ని తన దగ్గరకు తెచ్చుకోవాలనుకుంటున్నాడు.—యోహాను 6:44.

తనను విడిచి వెళ్లిన సేవకులను యెహోవా ఎన్నడూ మర్చిపోడని తెలుసుకోవడం మీకు ఓదార్పుగా ఉండవచ్చు. డొన్న అనే సహోదరి ఆ విషయాన్ని అర్థంచేసుకుని ఇలా అంది: “నేను మెల్లమెల్లగా సత్యం నుండి తప్పిపోయాను, కానీ నేను తరచూ కీర్తన 139:23, 24 వచనాలను గుర్తుచేసుకునేదాన్ని, అక్కడ ఇలా ఉంది: ‘దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.’ నేను ఈ లోకానికి చెందినదాన్ని కాదు, ఈ లోకంలో ఇమడలేను, నేను ఎప్పటికైనా వెళ్లాల్సింది యెహోవా సంస్థ దగ్గరకే అని నాకు తెలుసు. యెహోవా నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదని, నేను ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లాలని అర్థంచేసుకున్నాను. ఆయన దగ్గరకు వచ్చినందుకు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది!”

“యెహోవా నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదని, నేను ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లాలని అర్థంచేసుకున్నాను”

మీరు కూడా మళ్లీ ‘యెహోవాయందు ఆనందించాలని’ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. (నెహెమ్యా 8:10) యెహోవా దగ్గరకు తిరిగి వచ్చినందుకు మీరు ఎన్నడూ బాధపడరు.

యెహోవా దగ్గరకు తిరిగి రావడానికి సంబంధించిన ప్రశ్నలు-జవాబులు

తిరిగి రావడం ఎలా మొదలుపెట్టాలి?

సంఘంతో సహవసించడం మానేసిన సహోదరి బైబిలు చదువుతుంది

అనారోగ్యం నుండి కోలుకుంటున్న వ్యక్తి మళ్లీ తన పనులను మెల్లమెల్లగా మొదలుపెడతాడు. అలాగే, క్రైస్తవునిగా మీరు కూడా మీ ఆధ్యాత్మిక బలాన్ని పొందడానికి ప్రతీరోజు కొంత ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవడం మొదలుపెట్టవచ్చు. అన్నీ ఒకేసారి చేయడానికి ప్రయత్నించకండి. కొద్దిసేపు బైబిల్ని, మన ప్రచురణల్ని చదవండి. jw.org వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని గానీ, అందులోని ఏదైనా బ్రాడ్‌కాస్టింగ్‌ కార్యక్రమాన్ని గానీ చూడండి. అలాగే, వీలైనంత త్వరగా సంఘ కూటాలకు హాజరవడానికి ప్రయత్నించండి. అన్నిటికన్నా ముఖ్యంగా సహాయం కోసం యెహోవాకు ప్రార్థించండి. యెహోవా “మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”—1 పేతురు 5:7.

“ఆరాధన విషయంలో పూర్తిగా వెనకబడడంతో, ప్రార్థించడానికి కూడా నాకు సిగ్గుగా అనిపించింది. నేను ధైర్యం తెచ్చుకుని యెహోవాకు ప్రార్థించాను. ఆ తర్వాత కొంతకాలానికే నన్ను ఒక సంఘపెద్ద కలిశాడు. యెహోవా నన్ను విడిచిపెట్టలేదని అర్థం చేసుకోవడానికి ఆయన నాకు సహాయం చేశాడు. ప్రతీరోజు బైబిలు చదవడం మొదలుపెట్టమని ఆయన నాకు సలహా ఇచ్చాడు. అలా చదివినప్పుడు, కూటాలకు తిరిగి రావడానికి కావాల్సిన ధైర్యాన్ని పొందాను. కొంతకాలానికి, నేను మళ్లీ పరిచర్యలో పాల్గొన్నాను. యెహోవా నన్ను ఎన్నడూ విడిచిపెట్టనందుకు నాకెంతో సంతోషంగా ఉంది.”—ఈవా.

సంఘం నన్ను ఆహ్వానిస్తుందా?

సంఘమంతా మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తుందనే నమ్మకంతో మీరుండవచ్చు. వాళ్లు మిమ్మల్ని విమర్శించడమో, మీకు తీర్పు తీర్చడమో చేయరు కానీ మిమ్మల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చేయగలిగిందంతా చేస్తారు.—హెబ్రీయులు 10:24, 25.

“రాజ్యమందిరానికి తిరిగి రావాలంటే నాకు చాలా సిగ్గుగా అనిపించింది. నా స్నేహితులు ఏమంటారో, నాతో ఎలా ఉంటారో అని దిగులుపడ్డాను. 30 ఏళ్లుగా సంఘంలో ఉంటున్న ఒక వృద్ధ సహోదరి నాతో ఇలా అంది, ‘నువ్వు మళ్లీ ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది బాబూ!’ ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి. నేను నిజంగా నా ఇంటికి వచ్చేశాను.”—కావ్యెర్‌.

“రాజ్యమందిరానికి వెళ్లి, ఎవరూ నన్ను గుర్తుపట్టకూడదని చివరి వరసలో కూర్చున్నాను. అయినా, ‘నువ్వు చిన్నప్పుడు రాజ్యమందిరానికి వచ్చేవాడివి కదూ!’ అంటూ నన్ను చాలామంది గుర్తుపట్టారు. వాళ్లు నన్ను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు, నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది. నేను నా సొంత ఇంటికి తిరిగి వచ్చినట్టు అనిపించింది.”—మార్కో.

పెద్దలు నాకెలా సహాయం చేస్తారు?

పెద్దలు మీతో దయగా మాట్లాడతారు. ‘మొదట మీకున్న ప్రేమను’ తిరిగి సంపాదించుకోడానికి ప్రయత్నిస్తున్నందుకు మిమ్మల్ని మెచ్చుకుంటారు. (ప్రకటన 2:4) “సాత్వికమైన మనస్సుతో” చాలా దయగా, మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి సహాయం చేస్తారు. (గలతీయులు 6:1; సామెతలు 28:13) ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! లేదా యెహోవాకు సన్నిహితమవండి పుస్తకాల్లో ఒకదాన్ని ఉపయోగిస్తూ ఎవరైనా మీతో అధ్యయనం చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. మీరు చేసే ప్రతీ ప్రయత్నంలో పెద్దలు మిమ్మల్ని ఓదారుస్తూ, బలపరుస్తారనే నమ్మకంతో ఉండండి.—యెషయా 32:1, 2.

“సంఘానికి దూరంగా ఉన్న 8 సంవత్సరాలు, సంఘపెద్దలు నన్ను కలుస్తూనే ఉన్నారు. ఒక రోజు ఒక సంఘపెద్ద మేము తీసుకున్న ఫోటోలు చూపించాడు. నేను సంతోషంగా గడిపిన ఎన్నో తీపి జ్ఞాపకాలను అవి నాకు గుర్తుచేశాయి, యెహోవాను సేవించినప్పుడు పొందిన సంతోషాన్ని మళ్లీ సొంతం చేసుకోవాలనే కోరిక నాలో పుట్టింది. సంఘపెద్దలు ఎంతో ప్రేమగా నేను మళ్లీ ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండడానికి కావాల్సిన సహాయం చేశారు.”—విక్టర్‌.

“ఆయనే నిన్ను బలపరుస్తాడు”

మీటింగ్‌లో ఇద్దరు సహోదరీలు కలిసి ఒకే పాటల పుస్తకం చూస్తూ పాడుతున్నారు

మనకు ఓదార్పును, ప్రోత్సాహాన్ని ఇచ్చి మనల్ని ఆధ్యాత్మికంగా మళ్లీ చురుగ్గా చేసే ఎన్నో అద్భుతమైన పాటలు సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి అనే పాటల పుస్తకంలో ఉన్నాయి. ఉదాహరణకు 38వ పాటలోని మాటల్ని పరిశీలించండి. 1 పేతురు 5:10 ఆధారంగా రచించిన ఈ పాట అంశం, ‘ఆయనే నిన్ను బలపరుస్తాడు.’

  1. సరైనది చేయాలనే ఆ కోరిక

    చూశాడు నాడే నీలో దేవుడు.

    చీకటిలో నుండి వెలుగువైపుకు

    నడిపించాడు ప్రేమతో నిన్ను.

    నీ చిత్తం చేస్తానని మాటిచ్చావ్‌;

    విడువడు నీ చేయి ఎన్నడూ.

  2. తన కుమారుణ్ణి అర్పించడానికి

    సంకోచించనే లేదు ఏమాత్రం.

    ప్రియ కుమారుణ్ణి ఇచ్చిన దేవుడే,

    ఇస్తాడు నీకు బలాన్ని కూడా.

    సంరక్షిస్తాడు తన పిల్లల్ని;

    మరువడు విశ్వాస ప్రేమల్ని.

    (పల్లవి)

    క్రీస్తు రక్తంతో నిన్ను కొన్నాడు కాబట్టి,

    తానే స్థిరపర్చి, బలపరుస్తాడు.

    ఇస్తాడు నిర్దేశాన్ని కాపాడుతూ నిన్ను;

    తానే స్థిరపర్చి, బలపరుస్తాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి