కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • bhs అధ్యా. 17 పేజీలు 174-184
  • ప్రార్థన అనే వరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రార్థన అనే వరం
  • బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • బైబిలు బోధిస్తోందిలో చదవండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాకు ఎందుకు ప్రార్థించాలి?
  • దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనమేమి చేయాలి?
  • ప్రార్థన గురించి సాధారణంగా వచ్చే ప్రశ్నలు
  • దేవుడు మన ప్రార్థనలకు ఎలా జవాబు ఇస్తాడు?
  • దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ప్రార్థనలో దేవునికి చేరువ కావడం
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
  • ప్రార్థనను అమూల్యమైన వరంలా చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • యేసు ప్రార్థన చేయడం నేర్పించాడు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
మరిన్ని
బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
bhs అధ్యా. 17 పేజీలు 174-184

17వ అధ్యాయం

ప్రార్థన అనే వరం

ఒక స్త్రీ నక్షత్రాలతో నిండిన ఆకాశం క్రింద నిలబడి ప్రార్థన చేస్తుంది

“భూమ్యాకాశాల్ని తయారుచేసిన” యెహోవా మన ప్రార్థనలు వినాలని అనుకుంటున్నాడు.—కీర్తన 115:15

1, 2. ప్రార్థన ఒక ప్రత్యేకమైన బహుమానం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దాని గురించి బైబిలు ఏమి నేర్పిస్తుందో తెలుసుకోవడం ఎందుకు అవసరం?

ఈ విశ్వంతో పోలిస్తే భూమి చాలా చిన్నది. యెహోవా భూమిని చూసినప్పుడు, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలందరూ ఆయనకు ఒక బకెట్‌ నుండి జారిపడే చిన్న నీటి చుక్కలా కనిపిస్తారు. (కీర్తన 115:15; యెషయా 40:15) విశ్వంతో పోలిస్తే మనం చాలా చిన్నవాళ్లమైనా, కీర్తన 145:18, 19 ఇలా చెప్తుంది: “తనకు మొరపెట్టే వాళ్లందరికీ, నిజాయితీతో తనకు మొరపెట్టే వాళ్లందరికీ యెహోవా దగ్గరగా ఉన్నాడు. తనకు భయపడేవాళ్ల కోరికను ఆయన తీరుస్తాడు; సహాయం కోసం వాళ్లు పెట్టే మొరలు విని వాళ్లను రక్షిస్తాడు.” మనకు ఎంత గొప్ప వరం ఉంది! సర్వశక్తిగల సృష్టికర్తయైన యెహోవా మనకు దగ్గరవ్వాలని అనుకుంటున్నాడు, ఆయన మన ప్రార్థనలు వినాలని కోరుకుంటున్నాడు. అవును, ప్రార్థన ఒక గొప్ప వరం, మనలో ప్రతి ఒక్కరికి యెహోవా ఇచ్చిన ప్రత్యేకమైన బహుమానం.

2 కానీ యెహోవా అంగీకరించే విధంగా ఆయనతో మాట్లాడినప్పుడు మాత్రమే ఆయన మన ప్రార్థన వింటాడు. మనం అలా ఎలా ప్రార్థించవచ్చు? ప్రార్థన గురించి బైబిలు ఏమి చెప్తుందో చూద్దాం.

యెహోవాకు ఎందుకు ప్రార్థించాలి?

3. మీరు యెహోవాకు ఎందుకు ప్రార్థన చేయాలి?

3 మీరు ఆయనకు ప్రార్థించాలని లేదా ఆయనతో మాట్లాడాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఆ విషయం మనకు ఎలా తెలుసు? దయచేసి ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి. దయతో ఇచ్చిన ఆ ఆహ్వానం గురించి ఆలోచించండి. ఈ విశ్వ పరిపాలకుడికి మీ మీద ఎంతో ఆసక్తి ఉంది, మీకు ఎలా అనిపిస్తుందో, మీ సమస్యలు ఏమిటో మీరు ఆయనకు చెప్పుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు.

4. క్రమంగా ప్రార్థన చేస్తే, యెహోవాతో మీ స్నేహం ఎలా బలపడుతుంది?

4 ప్రార్థన వల్ల మనం యెహోవాకు దగ్గరి స్నేహితులం అవుతాం. స్నేహితులు వాళ్ల ఆలోచనల గురించి, ఇష్టాయిష్టాల గురించి, భావాల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ల స్నేహం ఇంకా బలపడుతుంది. యెహోవాకు ప్రార్థన చేయడం కూడా అలాంటిదే. బైబిలు ద్వారా ఆయన తన ఆలోచనలను, ఇష్టాయిష్టాలను మీకు చెప్పాడు, అంతేకాదు భవిష్యత్తులో ఆయన ఏమి చేస్తాడో కూడా మీకు చెప్తున్నాడు. క్రమంగా ప్రార్థన చేయడం ద్వారా మీ హృదయంలో ఉన్న లోతైన భావాలను కూడా ఆయనకు చెప్పవచ్చు. మీరు అలా చేస్తుండగా, యెహోవాతో మీ స్నేహం ఇంకా బలపడుతుంది.—యాకోబు 4:8.

దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనమేమి చేయాలి?

5. యెహోవా కొన్ని ప్రార్థనలు వినడని మనకు ఎలా తెలుసు?

5 యెహోవా అన్ని ప్రార్థనలు వింటాడా? లేదు, వినడు. యెషయా ప్రవక్త కాలంలో, యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “మీరు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నా, నేను వినట్లేదు; మీ చేతుల నిండా రక్తమే.” (యెషయా 1:15) కాబట్టి మనం జాగ్రత్తగా లేకపోతే, యెహోవా నుండి దూరమయ్యే పనులు చేసే అవకాశం ఉంది, అప్పుడు ఆయన మన ప్రార్థనలను పట్టించుకోడు.

6. విశ్వాసం ఎందుకు చాలా ముఖ్యం? మీకు విశ్వాసం ఉందని మీరెలా చూపిస్తారు?

6 యెహోవా మన ప్రార్థనలు వినాలంటే, మనకు ఆయన మీద విశ్వాసం ఉండాలి. (మార్కు 11:24) అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. దేవుని దగ్గరికి వచ్చేవాళ్లు ఆయన ఉన్నాడని, తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్లకు ఆయన ప్రతిఫలం ఇస్తాడని తప్పకుండా నమ్మాలి.” (హెబ్రీయులు 11:6) కానీ మనకు విశ్వాసం ఉందని చెప్తే సరిపోదు. ప్రతిరోజు యెహోవాకు లోబడడం ద్వారా మన విశ్వాసాన్ని స్పష్టంగా చూపించాలి.—యాకోబు 2:26 చదవండి.

7. (ఎ) మనం యెహోవాకు ప్రార్థన చేస్తున్నప్పుడు గౌరవాన్ని, వినయాన్ని ఎందుకు చూపించాలి? (బి) మనం యథార్థంగా ప్రార్థిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

7 మనం యెహోవాకు ప్రార్థన చేస్తున్నప్పుడు వినయంగా, గౌరవంగా ఉండాలి. ఎందుకు? మనం రాజుతో గానీ, అధ్యక్షునితో గానీ మాట్లాడాల్సివస్తే, ఎంతో గౌరవంగా మాట్లాడతాం. యెహోవా సర్వశక్తిగల దేవుడు, కాబట్టి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఎక్కువ గౌరవాన్ని, వినయాన్ని చూపించాలో కదా! (ఆదికాండం 17:1; కీర్తన 138:6) మనం యథార్థంగా, హృదయపూర్వకంగా యెహోవాకు ప్రార్థించాలి, అంతేగానీ అవే పదాలను మళ్లీమళ్లీ ఉచ్ఛరించకూడదు.—మత్తయి 6:7, 8.

8. ఒక విషయం గురించి ప్రార్థించిన తర్వాత, మనమింకా ఏమి చేయాల్సి ఉంటుంది?

8 చివరిగా, మనం దేని గురించైనా ప్రార్థన చేసినప్పుడు, దాని కోసం మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయాలి. ఉదాహరణకు, మన రోజువారీ అవసరాల గురించి యెహోవాకు ప్రార్థించినప్పుడు, మనం కష్టపడి పనిచేసే అవకాశం ఉన్నా బద్దకంగా ఉండి, యెహోవా మనకు అన్నీ ఇస్తాడని ఎదురు చూడకూడదు. మనం కష్టపడి పనిచేయాలి, మనం చేయగలిగే ఏ పని దొరికినా చేయాలి. (మత్తయి 6:11; 2 థెస్సలొనీకయులు 3:10) లేదా ఒకవేళ మనం ఏదైనా తప్పు చేయకుండా మానుకోవాలని దేవుని సహాయం కోసం ప్రార్థిస్తే, అలాంటి ప్రలోభాలకు లోనయ్యే పరిస్థితులకు దూరంగా ఉండాలి. (కొలొస్సయులు 3:5) ప్రార్థన గురించి మనకు సాధారణంగా వచ్చే కొన్ని ప్రశ్నలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ప్రార్థన గురించి సాధారణంగా వచ్చే ప్రశ్నలు

9. మనం ఎవరికి ప్రార్థన చేయాలి? యోహాను 14:6 ప్రార్థన గురించి మనకు ఏమి నేర్పిస్తుంది?

9 మనం ఎవరికి ప్రార్థన చేయాలి? పరలోకంలో ఉన్న మన తండ్రికి ప్రార్థన చేయమని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్తయి 6:9) ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.” (యోహాను 14:6) కాబట్టి మనం యేసు ద్వారా యెహోవాకు మాత్రమే ప్రార్థన చేయాలి. యేసు ద్వారా ప్రార్థించడం అంటే ఏంటి? యెహోవా మన ప్రార్థనలు వినాలంటే, యెహోవా యేసుకు ఇచ్చిన ప్రత్యేకమైన స్థానం పట్ల గౌరవం చూపించాలి. మనం నేర్చుకున్నట్లుగా మనల్ని పాపమరణాల నుండి రక్షించడానికి యేసు భూమ్మీదకు వచ్చాడు. (యోహాను 3:16; రోమీయులు 5:12) యెహోవా యేసును ప్రధానయాజకుడిగా, న్యాయాధిపతిగా కూడా నియమించాడు.—యోహాను 5:22; హెబ్రీయులు 6:20.

వేర్వేరు సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నారు

మీరు ఎప్పుడైనా ప్రార్థించవచ్చు

10. మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రత్యేక భంగిమలో చేయాలా? వివరించండి.

10 మనం ఒక ప్రత్యేకమైన భంగిమలో ప్రార్థన చేయడం అవసరమా? లేదు, యెహోవా మనల్ని మోకరించి, కూర్చుని లేదా నిలబడి ప్రార్థించమని చెప్పడం లేదు. గౌరవంగా ఉండే ఎలాంటి భంగిమలోనైనా మనం యెహోవాతో మాట్లాడవచ్చని బైబిలు చెప్తుంది. (1 దినవృత్తాంతాలు 17:16; నెహెమ్యా 8:6; దానియేలు 6:10; మార్కు 11:25) మనం ఎలాంటి భంగిమలో ఉండి ప్రార్థన చేస్తున్నామనేది యెహోవాకు ముఖ్యం కాదు. కానీ గౌరవంగా, మనసు విప్పి ఆయనతో మాట్లాడడం ముఖ్యం. మనం ఎక్కడ ఉన్నా, పగలూ రాత్రీ ఏ సమయంలోనైనా, గట్టిగా అయినా, నిశ్శబ్దంగా అయినా ప్రార్థన చేయవచ్చు. మనం యెహోవాకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎవ్వరూ వినకపోయినా యెహోవా వింటాడనే నమ్మకంతో ఉండవచ్చు.—నెహెమ్యా 2:1-6.

11. మనం యెహోవాతో మాట్లాడగలిగిన కొన్ని విషయాలు ఏంటి?

11 మనం వేటికోసం ప్రార్థన చేయవచ్చు? యెహోవా అంగీకరించేలా ఉండే దేనికోసమైనా మనం ప్రార్థించవచ్చు. బైబిలు ఇలా చెప్తుంది: “మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు.” (1 యోహాను 5:14) మన సొంత విషయాల గురించి మనం ప్రార్థన చేయవచ్చా? చేయవచ్చు. యెహోవాకు ప్రార్థించడం అంటే దగ్గరి స్నేహితునితో మాట్లాడినట్లు ఉండాలి. మన మనసులో, హృదయంలో ఉన్న దేని గురించైనా మనం యెహోవాకు చెప్పవచ్చు. (కీర్తన 62:8) సరైనది చేసేలా తన శక్తివంతమైన పవిత్ర శక్తిని ఇవ్వమని మనం యెహోవాను అడగవచ్చు. (లూకా 11:13) మంచి నిర్ణయాలు తీసుకునేలా తెలివిని ఇవ్వమని మనం యెహోవాను అడగవచ్చు, కష్టాల్ని తట్టుకునేందుకు బలాన్ని ఇవ్వమని కూడా ఆయనకు ప్రార్థన చేయవచ్చు. (యాకోబు 1:5) మన పాపాలను క్షమించమని మనం యెహోవాను అడగాలి. (ఎఫెసీయులు 1:3, 7) మనం ఇతరుల గురించి కూడా ప్రార్థించాలి, మన కుటుంబ సభ్యుల గురించి, సంఘంలో సహోదరసహోదరీల గురించి ప్రార్థించాలి.—అపొస్తలుల కార్యాలు 12:5; కొలొస్సయులు 4:12.

12. మన ప్రార్థనలో అన్నిటికన్నా ముఖ్యంగా ఏ విషయాలు ఉండాలి?

12 మనం ప్రార్థించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి? యెహోవా, ఆయన ఇష్టం గురించి ప్రార్థించాలి. మన కోసం ఆయన చేసిన ప్రతీదాని గురించి మనం ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి. (1 దినవృత్తాంతాలు 29:10-13) యేసు భూమ్మీద ఉన్నప్పుడు తన శిష్యులకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు కాబట్టి మనకు ఈ విషయం తెలుసు. (మత్తయి 6:9-13 చదవండి.) వాళ్లు మొదట, దేవుని పేరు పవిత్రపర్చబడాలని అంటే దేవుని పేరు పరిశుద్ధం అవ్వాలని యేసు ప్రార్థించమన్నాడు. తర్వాత దేవుని రాజ్యం రావాలని, భూమంతా యెహోవా ఇష్టం జరిగేలా ప్రార్థించమని యేసు చెప్పాడు. మనం ఆ ప్రాముఖ్యమైన వాటి గురించి ప్రార్థించిన తర్వాత మాత్రమే మన సొంత విషయాల గురించి ప్రార్థించాలని యేసు చెప్పాడు. మన ప్రార్థనలో యెహోవాను, ఆయన ఇష్టాన్ని ముందు పెట్టినప్పుడు అవి మనకు ఎంత ముఖ్యమో చూపిస్తాం.

13. మనం ఎంతసేపు ప్రార్థించాలి?

13 మనం ఎంతసేపు ప్రార్థించాలి? దీని గురించి బైబిలు చెప్పడం లేదు. పరిస్థితిని బట్టి మన ప్రార్థనలు ఎక్కువసేపు ఉండవచ్చు లేదా తక్కువసేపు ఉండవచ్చు. ఉదాహరణకు, భోజనం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకోవచ్చు, కానీ యెహోవాకు కృతజ్ఞతలు చెప్పేటప్పుడు లేదా మన సమస్యల గురించి చెప్పుకుంటున్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థించవచ్చు. (1 సమూయేలు 1:12, 15) యేసు కాలంలో కొంతమందిలా మనం ఇతరులను ఆకట్టుకోవాలని ఎక్కువసేపు ప్రార్థన చేయం. (లూకా 20:46, 47) అలాంటి ప్రార్థనల వల్ల యెహోవా సంతోషించడు. మనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నామా లేదా అనేదే యెహోవాకు ముఖ్యం.

14. మనం ఎంత ఎక్కువగా ప్రార్థించాలి? ఇది యెహోవా గురించి మనకు ఏమి బోధిస్తుంది?

14 మనం ఎంత ఎక్కువగా ప్రార్థించాలి? మనం ఆయనతో క్రమంగా మాట్లాడాలని యెహోవా ఆహ్వానిస్తున్నాడు. “ప్రార్థన చేస్తూ ఉండండి,” “పట్టుదలగా ప్రార్థిస్తూ ఉండండి,” “ఎప్పుడూ ప్రార్థించండి” అని బైబిలు చెప్తుంది. (మత్తయి 26:41; రోమీయులు 12:12; 1 థెస్సలొనీకయులు 5:17) మనం చెప్పేది వినడానికి యెహోవా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన మీద చూపిస్తున్న ప్రేమ, ఉదారత బట్టి మనం ఆయనకు రోజూ కృతజ్ఞతలు చెప్పవచ్చు. నిర్దేశాన్ని, బలాన్ని, ఊరటను ఇవ్వమని కూడా మనం ఆయనను అడగవచ్చు. ప్రార్థన అనే వరాన్ని మనం నిజంగా విలువైనదిగా చూస్తే, మనం యెహోవాకు తప్పకుండా ప్రార్థిస్తాం, ఆయనతో మాట్లాడడానికున్న ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం.

15. ప్రార్థన చివర్లో “ఆమేన్‌” అని ఎందుకు చెప్పాలి?

15 మనం ప్రార్థన చివర్లో “ఆమేన్‌” అని ఎందుకు చెప్పాలి? “ఆమేన్‌” అనే మాటకు “నిశ్చయంగా” లేదా “అలాగే జరగాలి” అని అర్థం. ఆమేన్‌ చెప్పడం ద్వారా మనం ప్రార్థనలో చెప్పిన వాటిని నిజంగా కోరుకుంటున్నామని, నిజాయితీగా అడుగుతున్నామని చూపిస్తాం. (కీర్తన 41:13) బహిరంగ ప్రార్థనలో చెప్పిన విషయాల్ని మనం ఒప్పుకుంటున్నామని చూపించడానికి “ఆమేన్‌” అని నిశ్శబ్దంగా లేదా బయటకు చెప్పడం మంచిదని బైబిలు నేర్పిస్తుంది.—1 దినవృత్తాంతాలు 16:36; 1 కొరింథీయులు 14:16.

దేవుడు మన ప్రార్థనలకు ఎలా జవాబు ఇస్తాడు?

16. యెహోవా నిజంగా మన ప్రార్థనలు వింటాడా? వివరించండి.

16 యెహోవా నిజంగా మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడా? అవును, ఇస్తాడు. బైబిలు ఆయనను “ప్రార్థనలు వినే దేవా” అని పిలుస్తుంది. (కీర్తన 65:2) లక్షలమంది నిజాయితీగా చేసే ప్రార్థనలను దేవుడు వింటాడు, వాటికి వేర్వేరు విధాలుగా జవాబు ఇస్తాడు.

17. మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి యెహోవా దేవదూతలను, భూమ్మీద ఉన్న తన సేవకులను ఎలా ఉపయోగించుకుంటాడు?

17 యెహోవా దేవదూతలను, భూమ్మీద ఉన్న తన సేవకులను ఉపయోగించుకుని మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. (హెబ్రీయులు 1:13, 14) బైబిల్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థించిన కొంత సమయంలోనే యెహోవాసాక్షులు వెళ్లి కలిసిన అనుభవాలు చాలా ఉన్నాయి. భూమి అంతటా “సువార్త” ప్రకటించే పనిలో దేవదూతలు ఉన్నారని బైబిలు చెప్తుంది. (ప్రకటన 14:6 చదవండి.) అంతేకాదు, మనలో చాలామందిమి మనకున్న ఏదైనా ఒక సమస్య గురించి లేదా అవసరం గురించి యెహోవాకు ప్రార్థన చేసిన తర్వాత మనకు కావాల్సిన సహాయాన్ని ఒక క్రైస్తవ సహోదరుడు లేదా సహోదరీ ద్వారా పొందాం.—సామెతలు 12:25; యాకోబు 2:16.

క్రైస్తవ దంపతులు అంగవైకల్యంతో ఉన్న ఒక వృద్ధ స్నేహితురాలికి సహాయం చేస్తున్నారు

తోటి క్రైస్తవుల ద్వారా యెహోవా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలడు

18. యెహోవా తన పవిత్రశక్తి ద్వారా, బైబిలు ద్వారా మన ప్రార్థనలకు ఎలా జవాబు ఇస్తాడు?

18 మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి యెహోవా తన పవిత్రశక్తిని ఉపయోగిస్తాడు. మనం ఒక సమస్యను తట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు, ఆయన తన పవిత్రశక్తిని ఉపయోగించి మనకు నిర్దేశాన్ని, బలాన్ని ఇవ్వవచ్చు. (2 కొరింథీయులు 4:7) మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి, మనం తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి యెహోవా బైబిలు ద్వారా కూడా మనకు సహాయం చేస్తాడు. మనం బైబిలును చదివినప్పుడు, మనకు సహాయం చేసే లేఖనాలు మనకు దొరకవచ్చు. మీటింగ్‌లో ఎవరైనా మనకు కావాల్సిన విషయం గురించి వ్యాఖ్యానించేలా యెహోవా వాళ్లను పురికొల్పవచ్చు లేదా ఒక సంఘ పెద్ద బైబిల్లో ఒక విషయాన్ని మనకు చెప్పవచ్చు.—గలతీయులు 6:1.

19. మన ప్రార్థనలకు యెహోవా జవాబు ఇవ్వడం లేదని కొన్నిసార్లు ఎందుకు అనిపిస్తుంది?

19 ‘యెహోవా నా ప్రార్థనలకు ఇంకా ఎందుకు జవాబు ఇవ్వడం లేదు’ అని కొన్నిసార్లు మనం అనుకోవచ్చు. కానీ మన ప్రార్థనలకు ఎప్పుడు, ఎలా జవాబు ఇవ్వాలో ఆయనకు తెలుసు అని గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సింది ఏమిటో ఆయనకు తెలుసు. మనం అడిగే విషయాలు నిజంగా మనకు కావాలని చూపించడానికి, దేవుని మీద మనకు నిజంగా నమ్మకం ఉందని చూపించడానికి కూడా మనం కొన్నిసార్లు ఎక్కువకాలం ప్రార్థించాల్సి రావచ్చు. (లూకా 11:5-10) కొన్నిసార్లు మనం ఊహించని విధంగా యెహోవా మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. ఉదాహరణకు, మనల్ని బాగా బాధించే ఒక సమస్య గురించి మనం ప్రార్థించవచ్చు, కానీ ఆ సమస్యను తీసేసే బదులు, ఆ సమస్యను తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని ఆయన మనకు ఇవ్వవచ్చు.—ఫిలిప్పీయులు 4:13 చదవండి.

20. మనం యెహోవాకు ఎందుకు ఎక్కువగా ప్రార్థన చేయాలి?

20 యెహోవాకు ప్రార్థించడం ఎంత అద్భుతమైన వరమో కదా! ఆయన మన ప్రార్థనలు వింటాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. (కీర్తన 145:18) మనం హృదయపూర్వకంగా ఎంత ఎక్కువగా ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయనతో మన స్నేహం అంత ఎక్కువగా బలపడుతుంది.

వీటిని గుర్తుపెట్టుకుందాం

1వ సత్యం: యెహోవాకు మన ప్రార్థనలు వినడం ఇష్టం

“తనకు మొరపెట్టే వాళ్లందరికీ, నిజాయితీతో తనకు మొరపెట్టే వాళ్లందరికీ యెహోవా దగ్గరగా ఉన్నాడు.”—కీర్తన 145:18

యెహోవా మన ప్రార్థనలు వినాలంటే మనం ఏమి చేయాలి?

  • హెబ్రీయులు 11:6

    మనకు విశ్వాసం ఉండాలి.

  • కీర్తన 138:6

    మనం వినయంతో, గౌరవంతో ఉండాలి.

  • యాకోబు 2:26

    మన ప్రవర్తన మన ప్రార్థనలకు తగ్గట్లు ఉండాలి.

  • మత్తయి 6:7, 8

    మనం ప్రార్థన చేసేటప్పుడు నిజాయితీగా, యథార్థంగా ఉండాలి. మనం ప్రార్థనల్లో ఒకే పదాలను మళ్లీమళ్లీ ఉపయోగించకూడదు.

  • యెషయా 1:15

    మనం దేవుని ఇష్టప్రకారం జీవించాలి.

2వ సత్యం: ప్రార్థన గురించి సాధారణంగా వచ్చే ప్రశ్నలు

  • మనం ఎవరికి ప్రార్థించాలి?

    మత్తయి 6:9; యోహాను 14:6

  • ప్రార్థించేటప్పుడు ఒక ప్రత్యేక భంగిమలో ఉండాలా?

    1 దినవృత్తాంతాలు 17:16; నెహెమ్యా 8:5, 6; దానియేలు 6:10; మార్కు 11:25

  • మనం నిశ్శబ్దంగా చేసుకునే ప్రార్థనలు యెహోవా వింటాడా?

    నెహెమ్యా 2:1-6

  • మనం ఎంతసేపు ప్రార్థించాలి?

    1 సమూయేలు 1:12, 15; లూకా 20:46, 47

  • మనం ఎంత ఎక్కువగా ప్రార్థించాలి?

    రోమీయులు 12:12; 1 థెస్సలొనీకయులు 5:17

  • మనం ప్రార్థన చివర్లో “ఆమేన్‌” అని ఎందుకు అంటాం?

    1 దినవృత్తాంతాలు 16:36; 1 కొరింథీయులు 14:16

3వ సత్యం: మనం దేని గురించి ప్రార్థించవచ్చు?

“మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు.”—1 యోహాను 5:14

మనం ప్రార్థించాల్సిన కొన్ని విషయాలు ఏంటి?

  • మత్తయి 6:9, 10

    యెహోవా ఇష్టం జరగాలని ప్రార్థించాలి.

  • 1 దినవృత్తాంతాలు 29:10-13

    కృతజ్ఞతలు చెప్పడానికి ప్రార్థించాలి.

  • మత్తయి 6:11-13

    మన వ్యక్తిగత అవసరాల గురించి, సమస్యల గురించి ప్రార్థించాలి.

  • లూకా 11:13

    పవిత్రశక్తి కోసం ప్రార్థించాలి.

  • యాకోబు 1:5

    మంచి నిర్ణయాలు తీసుకోవడానికి తెలివిని ఇవ్వమని ప్రార్థించాలి.

  • ఫిలిప్పీయులు 4:13

    సహించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వమని ప్రార్థించాలి.

  • ఎఫెసీయులు 1:3, 7

    మన పాపాలను క్షమించమని ప్రార్థించాలి.

  • అపొస్తలుల కార్యాలు 12:5

    ఇతరుల కోసం ప్రార్థించాలి.

4వ సత్యం: యెహోవా మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు

“ప్రార్థనలు వినే దేవా, అన్నిరకాల ప్రజలు నీ దగ్గరికి వస్తారు.”—కీర్తన 65:2

యెహోవా మన ప్రార్థనలకు ఎలా జవాబు ఇస్తాడు?

  • సామెతలు 12:25; ప్రకటన 14:6

    యెహోవా దేవదూతల ద్వారా లేదా మనుషుల ద్వారా మనకు సహాయం చేస్తాడు.

  • 2 కొరింథీయులు 4:7

    ఆయన పవిత్రశక్తి మనకు కావాల్సిన సహాయాన్ని ఇస్తుంది.

  • ఫిలిప్పీయులు 4:6, 7, 13

    సహించడానికి కావాల్సిన శక్తిని, మనశ్శాంతిని ఆయన మనకు ఇస్తాడు.

  • గలతీయులు 6:1; 2 తిమోతి 3:16, 17

    బైబిలు ద్వారా, సంఘం ద్వారా ఆయన మనకు తెలివిని ఇస్తాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి