కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 130 పేజీ 296-పేజీ 297 పేరా 2
  • యేసుకు మరణశిక్ష విధించి తీసుకెళ్లారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసుకు మరణశిక్ష విధించి తీసుకెళ్లారు
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • అప్పగింపబడి తీసికొనిపోబడును
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • పొంతి పిలాతు ఎవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • పిలాతుకు, హేరోదుకు యేసులో ఏ తప్పూ కనిపించలేదు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • పిలాతు దగ్గరనుండి హేరోదు నొద్దకు మరలా వెనుకకు
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 130 పేజీ 296-పేజీ 297 పేరా 2
యేసు బరువైన హింసాకొయ్యను మోయడానికి ప్రయాసపడుతున్నాడు, ఆ హింసాకొయ్యను మోయమని ఒక సైనికుడు కురేనేకు చెందిన సీమోనును ఆజ్ఞాపిస్తున్నాడు

130వ అధ్యాయం

యేసుకు మరణశిక్ష విధించి తీసుకెళ్లారు

మత్తయి 27:31, 32 మార్కు 15:20, 21 లూకా 23:24-31 యోహాను 19:6-17

  • యేసును విడుదల చేయడానికి పిలాతు ప్రయత్నించాడు

  • యేసుకు మరణశిక్ష విధించి, చంపడానికి తీసుకెళ్లారు

యేసును క్రూరంగా హింసించి ఎగతాళి చేసినా, ఆయన్ని విడుదల చేయడానికి పిలాతు ఎంత ప్రయత్నించినా ముఖ్య యాజకులు, వాళ్ల సహచరులు మనసు మార్చుకోలేదు. వాళ్లకు కావాల్సిందల్లా యేసును చంపించడమే. “అతనికి కొయ్యపై శిక్ష వేయండి! అతనికి కొయ్యపై శిక్ష వేయండి!” అని వాళ్లు అరుస్తూనే ఉన్నారు. పిలాతు వాళ్లతో, “మీరే ఇతన్ని తీసుకెళ్లి మరణశిక్ష వేయండి, నాకైతే ఇతనిలో ఏ తప్పూ కనిపించట్లేదు” అన్నాడు.—యోహాను 19:6.

యూదులు యేసుమీద రాజకీయపరమైన ఆరోపణ చేసినప్పటికీ, ఆయనకు మరణశిక్ష వేసేలా పిలాతును ఒప్పించలేకపోయారు. అందుకే ఏదైనా మతపరమైన ఆరోపణ చేయాలని అనుకుని, అంతకుముందు మహాసభలో చేసిన ఆరోపణే మళ్లీ చేశారు. ఆయన దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ వాళ్లు పిలాతుతో ఇలా అన్నారు: “మాకో చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం అతను చనిపోవాలి, ఎందుకంటే అతను దేవుని కుమారుణ్ణని చెప్పుకున్నాడు.” (యోహాను 19:7) పిలాతుకు ఈ ఆరోపణ కొత్తది.

పిలాతు తన భవనంలోకి తిరిగెళ్లి, యేసును విడుదల చేసే అవకాశం కోసం చూశాడు. ఎందుకంటే, యేసు క్రూరమైన హింసను కూడా తట్టుకుని నిలబడడం పిలాతు గమనించాడు. అంతేకాదు, అతని భార్యకు కూడా యేసు గురించి ఒక కల వచ్చింది. (మత్తయి 27:19) మరి, తాను “దేవుని కుమారుణ్ణని” యేసు చెప్పుకున్నాడని యూదులు చేస్తున్న కొత్త ఆరోపణ మాటేమిటి? యేసు గలిలయ నుండి వచ్చాడని పిలాతుకు తెలుసు. (లూకా 23:5-7) అయినా అతను యేసును ఇలా అడిగాడు: “నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?” (యోహాను 19:9) యేసు అంతకుముందు పరలోకంలో ఉండివుంటాడని, ఆయన ఒక దేవుడని పిలాతు అనుకుని ఉండవచ్చు.

తాను రాజునని, తన రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదని స్వయంగా యేసే పిలాతుకు చెప్పాడు. దాని గురించి ఇంకా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి యేసు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆయన ఏమీ మాట్లాడకపోవడంతో పిలాతు అహం దెబ్బతిని, కోపంతో ఇలా అన్నాడు: “నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేసే అధికారం, నీకు మరణశిక్ష వేసే అధికారం నాకు ఉందని నీకు తెలీదా?”—యోహాను 19:10.

యేసు ఇలా అన్నాడు: “పైనుండి ఇవ్వబడివుంటే తప్ప నా మీద నీకు అసలు ఎలాంటి అధికారమూ ఉండదు. అందుకే నన్ను నీకు అప్పగించిన మనిషి మీద ఇంకా ఎక్కువ పాపం ఉంది.” (యోహాను 19:11) యేసు ఒక్క వ్యక్తిని ఉద్దేశించి కాదుగానీ కయపను, అతని సహచరులను, ఇస్కరియోతు యూదాను ఉద్దేశించి ఆ మాట అన్నాడు. పిలాతు మీద కన్నా వాళ్ల మీదే ఎక్కువ పాపం ఉంటుందని ఆయన చెప్తున్నాడు.

యేసు మాటతీరుకు, ప్రవర్తనకు పిలాతు ముగ్ధుడయ్యాడు. పైగా యేసు ఒక దేవుడు అయ్యుంటాడేమో అనే భయం అతనిలో అంతకంతకు పెరుగుతోంది. కాబట్టి అతను యేసును విడుదల చేయడానికి మళ్లీ ప్రయత్నించాడు. కానీ, యూదులు పిలాతులో మరో భయాన్ని రేపారు. “అతన్ని విడుదల చేస్తే నువ్వు కైసరుకు స్నేహితుడివి కావు. తాను రాజునని చెప్పుకునే ప్రతీ వ్యక్తి కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే” అని వాళ్లు భయపెట్టారు.—యోహాను 19:12.

పిలాతు యేసును మళ్లీ బయటికి తీసుకొచ్చి, న్యాయపీఠం మీద కూర్చుని, “ఇదిగో! మీ రాజు!” అన్నాడు. అయినా వాళ్లు మొండిగా, “అతన్ని చంపేయండి! అతన్ని చంపేయండి! అతనికి కొయ్యపై శిక్ష వేయండి!” అని అరిచారు. అప్పుడు పిలాతు, “నేను మీ రాజుకు మరణశిక్ష వేయాలా?” అన్నాడు. ముఖ్య యాజకులు ఏమాత్రం తడుముకోకుండా, “కైసరు ఒక్కడే మా రాజు” అని చెప్పారు. నిజానికి, యూదులు ఎప్పటినుండో రోమా పరిపాలనను వ్యతిరేకిస్తూ ఉన్నారు.—యోహాను 19:14, 15.

యూదులు నిర్దాక్షిణ్యంగా చేస్తున్న అలాంటి ఆరోపణలకు పిలాతు పిరికితనంతో తలొగ్గి, యేసును మరణశిక్షకు అప్పగించాడు. సైనికులు యేసుకు వేసిన ఊదారంగు వస్త్రాన్ని తీసేసి, ఆయన పైవస్త్రాల్ని ఆయనకు తొడిగారు. తర్వాత, ఆయన హింసాకొయ్యను ఆయన చేత మోయిస్తూ, మరణశిక్ష వేసే చోటుకు తీసుకెళ్లారు.

అది నీసాను 14, శుక్రవారం. మధ్యాహ్నం కావస్తోంది. గురువారం తెల్లవారుజాము నుండి యేసు మెలకువగానే ఉన్నాడు, ఒకదాని తర్వాత ఒకటి వేదనలు అనుభవిస్తూనే ఉన్నాడు. బరువైన హింసాకొయ్యను మోస్తుండగా ఆయన శక్తి ఆవిరైపోతోంది. ఆ దారిన సీమోను అనే వ్యక్తి వెళ్తున్నాడు. అతను ఆఫ్రికాలోని కురేనేకు చెందినవాడు. సైనికులు అతన్ని ఆపి, మరణశిక్ష వేసే చోటు వరకు ఆ కొయ్యను మోసుకురమ్మని బలవంతం చేశారు. చాలామంది ప్రజలు యేసు వెనకే వెళ్తూ ఉన్నారు, కొంతమంది ఆయన పరిస్థితిని చూసి గుండెలు బాదుకుంటూ గట్టిగా ఏడుస్తున్నారు.

దుఃఖిస్తున్న స్త్రీలతో యేసు ఇలా అన్నాడు: “యెరూషలేము కూతుళ్లారా, నా కోసం ఏడ్వకండి. మీ కోసం, మీ పిల్లల కోసం ఏడ్వండి. ఎందుకంటే, ఇదిగో! ‘గొడ్రాళ్లు, పిల్లల్ని కనని వాళ్లు, పాలివ్వని వాళ్లు సంతోషంగా ఉంటారు!’ అని ప్రజలు చెప్పే రోజులు రాబోతున్నాయి. అప్పుడు ప్రజలు పర్వతాలతో, ‘మా మీద పడండి!’ అనీ కొండలతో, ‘మమ్మల్ని కప్పేయండి!’ అనీ అనడం మొదలుపెడతారు. చెట్టు పచ్చగా ఉన్నప్పుడే వాళ్లు ఇలా చేస్తే, అది ఎండిపోయినప్పుడు ఇక పరిస్థితి ఎలా ఉంటుంది?”—లూకా 23:28-31.

యేసు యూదా జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. అది ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టులా ఉన్నప్పటికీ, దానిలో కాస్త పచ్చదనం ఇంకా మిగిలి ఉంది. అంటే యేసు, అలాగే ఆయన మీద విశ్వాసం ఉంచుతున్న యూదులు ఇంకా యూదా జనాంగంలో ఉన్నారు. కానీ యేసు చనిపోయి, ఆయన శిష్యులు యూదా మతాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ జనాంగం ఆధ్యాత్మికంగా ఎండిపోతుంది, అంటే ఎండిపోయిన చెట్టులా అవుతుంది. అయితే దేవుడు రోమా సైన్యాన్ని ఉపయోగించుకుని ఆ జనాంగం మీదికి నాశనం తీసుకొచ్చినప్పుడు, వాళ్లు ఇంకా ఎక్కువగా ఏడ్వాల్సి వస్తుంది.

  • మతనాయకులు యేసు మీద ఏ ఆరోపణ చేశారు?

  • పిలాతు ఎందుకు మరింత భయపడ్డాడు?

  • యేసుకు మరణశిక్ష వేసేలా ముఖ్య యాజకులు పిలాతును ఎలా ఒత్తిడిచేశారు?

  • ‘చెట్టు పచ్చగా ఉండడం,’ తర్వాత ‘ఎండిపోవడం’ గురించి యేసు చెప్పిన మాటలకు అర్థం ఏంటి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి