126వ అధ్యాయం
యేసు ఎవరో తెలీదని పేతురు అన్నాడు
మత్తయి 26:69-75 మార్కు 14:66-72 లూకా 22:54-62 యోహాను 18:15-18, 25-27
యేసు తెలీదని పేతురు అన్నాడు
గెత్సేమనే తోటలో యేసును బంధించగానే అపొస్తలులు భయంతో ఆయన్ని విడిచి పారిపోయారు. అయితే పేతురు, “ఇంకో శిష్యుడు” అంటే అపొస్తలుడైన యోహాను మాత్రం పారిపోతూ మధ్యలో ఆగారు. (యోహాను 18:15; 19:35; 21:24) యేసును అన్న ఇంటికి తీసుకెళ్లినప్పుడు వాళ్లిద్దరు అక్కడికి చేరుకుని ఉంటారు. తర్వాత అన్న యేసును ప్రధానయాజకుడైన కయప దగ్గరికి పంపిస్తున్నప్పుడు వాళ్లు కాస్త దూరంలో ఉండి వెంబడించారు. ఒకవైపు ప్రాణాలు పోతాయేమో అనే భయం, మరోవైపు తమ ప్రభువును ఏం చేస్తారో అనే ఆందోళన. ఆ రెండిటి మధ్య వాళ్లు నలిగిపోయివుంటారు.
యోహాను ప్రధానయాజకుడైన కయపకు తెలుసు కాబట్టి ఆ ఇంటి ప్రాంగణంలోకి వెళ్లగలిగాడు. కానీ పేతురు ద్వారం దగ్గరే ఆగిపోయాడు. యోహాను అక్కడ కాపలా కాస్తున్న ఒక పనమ్మాయితో మాట్లాడినప్పుడు, ఆమె పేతురును లోపలికి రానిచ్చింది.
ఆ రాత్రి చలిగా ఉండడంతో, ప్రాంగణంలో ఉన్నవాళ్లు చలిమంట కాచుకుంటూ ఉన్నారు. పేతురు వాళ్లతో కూర్చుని చలి కాచుకుంటూ, యేసుకు “ఏమి జరుగుతుందో” గమనిస్తూ ఉన్నాడు. (మత్తయి 26:58) అయితే పేతురును లోపలికి రానిచ్చిన పనమ్మాయి, ఆ మంట వెలుగులో అతని ముఖాన్ని పరిశీలనగా చూసి, “నువ్వూ ఈయన శిష్యుల్లో ఒకడివి కాదు కదా?” అంది. (యోహాను 18:17) అక్కడున్న మిగతావాళ్లు కూడా పేతురును గుర్తుపట్టి, అతను యేసుతోపాటు ఉండేవాళ్లలో ఒకడని అన్నారు.—మత్తయి 26:69, 71-73; మార్కు 14:70.
పేతురుకు చాలా భయమేసింది. తనను ఎవరూ గుర్తుపట్టకూడదని, వాళ్ల నుండి దూరంగా ద్వారం వైపుకు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. తాను యేసుతోపాటు ఉండేవాళ్లలో ఒకణ్ణి కాదని చెప్తూ ఇలా అన్నాడు: “ఆయన ఎవరో నాకు తెలీదు, నువ్వేం మాట్లాడుతున్నావో కూడా నాకు అర్థంకావట్లేదు.” (మార్కు 14:67, 68) అంతేకాదు, తన మాటలు నిజమని “ఒట్టుపెట్టుకుంటూ,” ఒకవేళ అవి నిజం కాకపోతే తనకు కీడు జరగాలని ‘శపించుకోవడం’ మొదలుపెట్టాడు.—మత్తయి 26:74.
ఈలోపు, యేసు మీద విచారణ కొనసాగుతూ ఉంది. అది బహుశా కయప ఇంటి ప్రాంగణం పైన ఒక గదిలో జరుగుతుండవచ్చు. మహాసభ తెచ్చిన సాక్షులు వస్తూపోతూ ఉండడాన్ని పేతురు, కింద వేచివున్న మరితరులు గమనిస్తున్నారు.
పేతురు మాట్లాడే గలిలయ యాసను బట్టి అతను అబద్ధం చెప్తున్నాడని తెలిసిపోతుంది. పైగా, పేతురు ఎవరి చెవి నరికాడో ఆ వ్యక్తి బంధువు, అంటే మల్కు బంధువు కూడా అక్కడ ఉన్నాడు. అతను పేతురుతో, “నువ్వు ఆయనతోపాటు తోటలో ఉండడం నేను చూడలేదా?” అన్నాడు. పేతురు మళ్లీ మూడోసారి కాదన్నాడు. యేసు ముందే చెప్పినట్లు, వెంటనే కోడి కూసింది.—యోహాను 13:38; 18:26, 27.
ఆ సమయంలో యేసు బహుశా పైనున్న వసారాలో నుండి కింద ప్రాంగణంలోకి చూస్తున్నాడు. ఆయన పేతురు కళ్లల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపులు పేతురు గుండెలోకి బాణాల్లా దూసుకుపోయాయి. కొన్ని గంటల క్రితం యేసు మేడగదిలో చెప్పిన మాట అతనికి గుర్తొచ్చింది. తాను చేసిన తప్పు తెలుసుకున్నప్పుడు పేతురుకు ఎలా అనిపించివుంటుందో ఒక్కసారి ఆలోచించండి! అతను బయటికి వెళ్లి కుమిలికుమిలి ఏడ్చాడు.—లూకా 22:61, 62.
ఇది ఎలా జరిగింది? నమ్మకంగా, స్థిరంగా ఉంటానని బలంగా చెప్పిన పేతురు తన ప్రభువు గురించి అలా ఎలా అనగలిగాడు? మహాసభ సభ్యులు వాస్తవాల్ని తారుమారు చేసి యేసును ఒక నీచమైన నేరస్తునిలా చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో, పేతురు నిర్దోషియైన యేసుకు అండగా ఉండాల్సింది పోయి, “శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు” గల దేవుని కుమారునికే వెన్ను చూపాడు.—యోహాను 6:68.
ఎంత విశ్వాసం, భక్తి ఉన్న వాళ్లయినా సరే రాబోయే కష్టాలకు లేదా ప్రలోభాలకు సరిగ్గా సిద్ధపడకపోతే తడబడే అవకాశం ఉందని పేతురు అనుభవం చూపిస్తుంది. అతని అనుభవం దేవుని సేవకులందరికీ ఒక హెచ్చరికగా ఉండాలి!