125వ అధ్యాయం
యేసును అన్న దగ్గరికి, తర్వాత కయప దగ్గరికి తీసుకెళ్లారు
మత్తయి 26:57-68 మార్కు 14:53-65 లూకా 22:54, 63-65 యోహాను 18:13, 14, 19-24
యేసును అన్న దగ్గరికి తీసుకెళ్లారు
మహాసభ చట్టవిరుద్ధంగా విచారణ చేసింది
యేసును ఒక నేరస్తునిలా బంధించిన తర్వాత ఆయన్ని అన్న దగ్గరికి తీసుకెళ్లారు. చిన్నప్పుడు యేసు ఆలయంలో బోధకుల్ని ఆశ్చర్యపర్చేలా మాట్లాడినప్పుడు ప్రధానయాజకునిగా ఉన్నది అతనే. (లూకా 2:42, 47) తర్వాత అతని కుమారుల్లో కొంతమంది ప్రధానయాజకునిగా సేవచేశారు. ప్రస్తుతం అతని అల్లుడైన కయప ప్రధానయాజకునిగా ఉన్నాడు.
యేసును అన్న ఇంటికి తీసుకెళ్లడం వల్ల, మహాసభను సమావేశపర్చడానికి కయపకు సమయం దొరికింది. మహాసభలో ప్రధానయాజకుడు, మరితరులు కలిపి మొత్తం 71 మంది సభ్యులు ఉంటారు.
అన్న యేసును “ఆయన శిష్యుల గురించి, ఆయన బోధ గురించి” ప్రశ్నించాడు. యేసు సూటిగా ఇలా జవాబిచ్చాడు: “నేను ప్రజలందరి ముందు మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులందరూ వచ్చే సమాజమందిరాల్లో, ఆలయంలో బోధించాను. రహస్యంగా ఏదీ మాట్లాడలేదు. మీరు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? నేను వాళ్లకు ఏమి చెప్పానో విన్నవాళ్లనే అడగండి.”—యోహాను 18:19-21.
అక్కడ నిలబడివున్న ఒక అధికారి యేసును చెంపమీద కొట్టి, “ముఖ్య యాజకుడితో ఇలాగేనా మాట్లాడేది?” అని గద్దించాడు. కానీ యేసు ఏ తప్పూ చేయలేదు కాబట్టి ఇలా అన్నాడు: “నేను ఏదైనా తప్పు మాట్లాడివుంటే, ఆ తప్పేంటో చెప్పు. కానీ నేను మాట్లాడింది సరిగ్గా ఉంటే నన్ను ఎందుకు కొడుతున్నావు?” (యోహాను 18:22, 23) తర్వాత, అన్న యేసును తన అల్లుడైన కయప దగ్గరికి పంపించాడు.
అప్పటికే మహాసభ మొత్తం, అంటే ప్రస్తుత ప్రధానయాజకుడు, ప్రజల పెద్దలు, శాస్త్రులు కయప ఇంట్లో సమావేశమై ఉన్నారు. పస్కా రోజు రాత్రి అలాంటి విచారణ జరపడం చట్టవిరుద్ధం. అయినాసరే, తమ దుష్ట పన్నాగాన్ని అమలుచేయడానికి వాళ్లు ఏమాత్రం వెనకాడలేదు.
ఆ మహాసభలోని చాలామంది యేసుకు వ్యతిరేకంగానే ఉన్నారు. లాజరును పునరుత్థానం చేసినప్పుడే ఆయన్ని చంపాలని మహాసభలోని వాళ్లు తీర్మానించుకున్నారు. (యోహాను 11:47-53) అంతేకాదు, కొన్ని రోజుల క్రితం మతనాయకులు యేసును పట్టుకొని చంపాలని కుట్రపన్నారు. (మత్తయి 26:3, 4) అవును, ఇంకా విచారణ మొదలుపెట్టకముందే ఆయనకు మరణశిక్ష విధించాలని నిర్ణయించేశారు!
చట్టవిరుద్ధంగా విచారణ జరపడమే కాకుండా ముఖ్య యాజకులు, ఇతర మహాసభ సభ్యులు యేసు మీద నేరం ఆరోపించడానికి అబద్ధ సాక్షుల కోసం వెదికారు. వాళ్లు చాలామంది సాక్షుల్ని తీసుకొచ్చారు కానీ ఆ సాక్షులు చెప్పినవాటికి పొంతన కుదరలేదు. చివరికి ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చి ఇలా చెప్పారు: “‘చేతులతో కట్టిన ఈ ఆలయాన్ని నేను పడగొట్టి, చేతులతో కట్టని ఇంకో ఆలయాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తాను’ అని ఇతను అనడం మేము విన్నాం.” (మార్కు 14:58) కానీ వాళ్లు చెప్పిన సాక్ష్యం కూడా సరిపోలేదు.
కయప యేసును ఇలా అడిగాడు: “నువ్వేమీ మాట్లాడవా? నీకు వ్యతిరేకంగా వీళ్లు చెప్తున్న సాక్ష్యాల గురించి నువ్వు ఏమంటావు?” (మార్కు 14:60) అబద్ధ సాక్షులు రకరకాల కథలు అల్లుతూ తనమీద నేరం మోపుతున్నా యేసు ఏమీ మాట్లాడలేదు. అందుకే ప్రధానయాజకుడైన కయప ఇప్పుడు ఇంకో పథకం వేశాడు.
దేవుని కుమారుణ్ణని ఎవరైనా చెప్పుకుంటే, యూదులు దాన్ని పెద్ద నేరంలా చూస్తారని కయపకు తెలుసు. అంతకుముందు యేసు, దేవుణ్ణి తండ్రి అని పిలిచినందుకు, “దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని” యూదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు. (యోహాను 5:17, 18; 10:31-39) అవన్నీ తెలిసే, కయప యుక్తిగా యేసుతో ఇలా అన్నాడు: “జీవంగల దేవుని ముందు ఒట్టేసి చెప్పు, నువ్వు దేవుని కుమారుడివైన క్రీస్తువా?” (మత్తయి 26:63) నిజమే, తాను దేవుని కుమారుణ్ణని యేసు అంతకుముందు చెప్పాడు. (యోహాను 3:18; 5:25; 11:4) ఒకవేళ ఇప్పుడు అలా చెప్పకపోతే, తాను దేవుని కుమారుడు కాదని, క్రీస్తు కాదని ఒప్పుకున్నట్లు అవుతుంది. అందుకే యేసు ఇలా అన్నాడు: “అవును, నేను క్రీస్తునే; మానవ కుమారుడు శక్తిమంతుడైన దేవుని కుడిచెయ్యి దగ్గర కూర్చొనివుండడం, ఆకాశ మేఘాలతో రావడం మీరు చూస్తారు.”—మార్కు 14:62.
వెంటనే కయప చాలాగొప్పగా నటిస్తూ తన బట్టలు చింపుకుని ఇలా అన్నాడు: “ఇతను దైవదూషణ చేశాడు! ఇక మనకు సాక్షులతో పనేంటి? ఆ దైవదూషణను మీరే విన్నారు కదా. మీరేమంటారు?” అప్పుడు మహాసభ, “ఇతను మరణశిక్షకు అర్హుడు” అని అన్యాయంగా తీర్పు ఇచ్చింది.—మత్తయి 26:65, 66.
అప్పుడు వాళ్లు యేసును ఎగతాళి చేస్తూ పిడికిళ్లతో గుద్దడం మొదలుపెట్టారు. కొంతమందైతే ఆయన చెంపమీద కొట్టి ఉమ్మేశారు. తర్వాత ఆయన ముఖానికి ముసుగు వేసి ఆయన్ని కొట్టి, “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు!” అని వ్యంగ్యంగా అన్నారు. (లూకా 22:64) రాత్రివేళ చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఆ విచారణలో, దేవుని కుమారుణ్ణి ఎంత ఘోరంగా అవమానిస్తున్నారో కదా!