64వ అధ్యాయం
క్షమించడం ఎంత ప్రాముఖ్యమో నేర్పించాడు
ఏడుసార్లు మాత్రమే క్షమించాలా?
కరుణలేని దాసుడి ఉదాహరణ
ఇద్దరు సహోదరుల మధ్య సమస్య వస్తే, వాళ్లిద్దరు మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని యేసు చెప్పడం పేతురు విన్నాడు. అయితే, అలా పరిష్కరించుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించాలో పేతురు తెలుసుకోవాలనుకున్నాడు.
పేతురు ఇలా అడిగాడు: “ప్రభువా, నా సహోదరుడు నా విషయంలో పాపం చేస్తే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి? ఏడుసార్లా?” ఒక వ్యక్తిని మూడుసార్లు మాత్రమే క్షమించాలని కొంతమంది మతనాయకులు చెప్పేవాళ్లు. కాబట్టి తన సహోదరుణ్ణి “ఏడుసార్లు” క్షమిస్తే చాలా ఎక్కువసార్లు క్షమించినట్లని పేతురు అనుకొని ఉండవచ్చు.—మత్తయి 18:21.
అలా ఎదుటి వ్యక్తి ఎన్నిసార్లు తప్పు చేశాడో లెక్క పెట్టుకోవడం యేసు బోధలకు వ్యతిరేకం. కాబట్టి యేసు పేతురును ఇలా సరిదిద్దాడు: “నేను నీతో చెప్తున్నాను ఏడుసార్లు కాదు, 77 సార్లు.” (మత్తయి 18:22) మరో మాటలో చెప్పాలంటే, పేతురు తన సహోదరుణ్ణి ఎన్నిసార్లయినా క్షమిస్తూనే ఉండాలి.
ఆ తర్వాత, క్షమించడం ఎందుకు తప్పనిసరో యేసు పేతురుకు, మిగతావాళ్లకు వివరించాడు. తన యజమానిలా కరుణ చూపించని ఒక దాసుని ఉదాహరణను యేసు చెప్పాడు. ఆ యజమాని లేదా రాజు తనకు ఎవరెవరు ఎంత అప్పు ఉన్నారో లెక్క చూస్తున్నాడు. అప్పుడు, చాలా పెద్ద మొత్తం అంటే 10,000 తలాంతులు [6 కోట్ల దేనారాలు] అప్పుపడ్డ ఒక దాసుణ్ణి యజమాని దగ్గరికి తీసుకొచ్చారు. అతను ఆ అప్పు తీర్చడం అసాధ్యం కాబట్టి అతన్ని, అతని భార్యాపిల్లల్ని అమ్మి డబ్బు చెల్లించాలని యజమాని ఆజ్ఞాపించాడు. ఆ దాసుడు తన యజమాని ముందు మోకాళ్లూని, “నాకు కాస్త సమయం ఇవ్వు, అప్పంతా తీర్చేస్తాను” అని వేడుకున్నాడు.—మత్తయి 18:26.
యజమాని జాలిపడి, కరుణతో ఆ దాసుని అప్పంతా రద్దుచేశాడు. తర్వాత ఆ దాసుడు బయటికి వెళ్లి, తనకు 100 దేనారాలు అప్పుపడ్డ తోటి దాసుణ్ణి చూశాడు. ఆ దాసుణ్ణి పట్టుకొని అతని గొంతు పిసుకుతూ, “నా అప్పు తీర్చేయి” అన్నాడు. కానీ ఆ తోటి దాసుడు అతని ముందు మోకాళ్లూని, “నాకు కాస్త సమయం ఇవ్వు, నీ అప్పు తీర్చేస్తాను” అని బ్రతిమాలాడు. (మత్తయి 18:28, 29) అయితే అతను తన యజమానిలా కరుణ చూపించకుండా, తనకు కొంత మొత్తమే అప్పుపడ్డ ఆ తోటి దాసుణ్ణి అప్పు తీర్చేంతవరకు చెరసాలలో వేయించాడు.
ఇదంతా చూసిన వేరే దాసులు జరిగినదాని గురించి యజమానికి చెప్పారు. అప్పుడు యజమాని కోపంతో ఆ దాసుణ్ణి తన దగ్గరికి పిలిపించి, “చెడ్డ దాసుడా, నువ్వు నన్ను బ్రతిమాలినప్పుడు నేను నీ అప్పంతా రద్దు చేశాను. నేను నీమీద కరుణ చూపించినట్టే, నువ్వు కూడా నీ తోటి దాసుడి మీద కరుణ చూపించాలి కదా?” అన్నాడు. అంతేకాదు కరుణ చూపించని ఆ దాసుణ్ణి అప్పంతా తీర్చేంతవరకు చెరసాలలో వేయించాడు. చివర్లో యేసు ఇలా అన్నాడు: “మీలో ప్రతీ ఒక్కరు మీ సహోదరుణ్ణి మనస్ఫూర్తిగా క్షమించకపోతే నా పరలోక తండ్రి కూడా మీ విషయంలో అలాగే చేస్తాడు.”—మత్తయి 18:32-35.
క్షమించే విషయంలో అది ఎంత చక్కని పాఠమో కదా! దేవుడు మన విషయంలో పాపమనే పెద్ద అప్పును రద్దు చేశాడు. దానితో పోలిస్తే, తోటి సహోదరులు మనపట్ల చేసే ఏ తప్పయినా చాలా చిన్నది. యెహోవా మనల్ని ఒక్కసారి కాదు కొన్ని వేలసార్లు క్షమిస్తాడు. కాబట్టి తోటి సహోదరుడు మనపట్ల ఎన్నిసార్లు తప్పు చేసినా మనం క్షమించాలి. కొండమీది ప్రసంగంలో యేసు చెప్పిన విధంగా, మనకు ‘అప్పుపడిన వాళ్లను మనం క్షమించినట్టే,’ దేవుడు కూడా మన అప్పులు క్షమిస్తాడు.—మత్తయి 6:12.