29వ అధ్యాయం
విశ్రాంతి రోజున మంచి పనులు చేయవచ్చా?
యేసు యూదయలో ప్రకటించాడు
కోనేరు దగ్గర ఒక వ్యక్తిని బాగుచేశాడు
యేసు గలిలయలో విస్తృతంగా చేసిన పరిచర్యకు మంచి ఫలితాలు వచ్చాయి. అయితే, “నేను మిగతా నగరాల్లో కూడా దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి” అన్నప్పుడు యేసు మనసులో గలిలయ మాత్రమే లేదు. అందుకే ఆయన “యూదయలో ఉన్న సమాజమందిరాల్లో” ప్రకటించడానికి వెళ్లాడు. (లూకా 4:43, 44) అది సా.శ. 31 వసంత కాలం, యెరూషలేములో పండుగ దగ్గరపడుతోంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్లడానికి ఇది మంచి సమయం.
సువార్త పుస్తకాలు యేసు గలిలయలో చేసిన పరిచర్య గురించి చెప్పినంత ఎక్కువగా, యూదయలో చేసిన పరిచర్య గురించి చెప్పట్లేదు. అయితే, యూదయలో ప్రజలు అంతగా స్పందించకపోయినా యేసు ఉత్సాహంగా ప్రకటిస్తూనే ఉన్నాడు, మంచి పనులు చేస్తూనే ఉన్నాడు.
యేసు పస్కా పండుగ కోసం యూదయ ముఖ్య నగరమైన యెరూషలేముకు బయల్దేరాడు. గొర్రెల ద్వారం దగ్గర రద్దీగా ఉండే ప్రాంతంలో, చుట్టూ మంటపాలు ఉన్న ఒక పెద్ద కోనేరు ఉంది. దాని పేరు బేతెస్ద. చాలామంది రోగులు, గుడ్డివాళ్లు, కుంటివాళ్లు అక్కడికి వచ్చేవాళ్లు. ఎందుకంటే, ఆ కోనేటి నీళ్లు కదిలినప్పుడు ఆ నీళ్లలోకి దిగితే రోగాలు నయం అవుతాయని వాళ్ల నమ్మకం.
అది విశ్రాంతి రోజు. 38 ఏళ్లుగా అనారోగ్యంతో ఉన్న ఒకతన్ని యేసు ఆ కోనేరు దగ్గర చూశాడు. యేసు అతన్ని, “నీకు బాగవ్వాలని ఉందా?” అని అడిగాడు. అందుకు అతను, “అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించేవాళ్లు ఎవరూ లేరు, నేను వెళ్లేలోపు నాకన్నా ముందే ఎవరో ఒకరు అందులోకి దిగుతున్నారు” అన్నాడు.—యోహాను 5:6, 7.
అప్పుడు యేసు అతనితో, “లేచి, నీ పరుపు తీసుకొని నడువు” అన్నాడు. అది అతనికే కాదు, ఆ మాట విన్న ప్రతీఒక్కరికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. (యోహాను 5:8) అతను యేసు చెప్పినట్టే చేశాడు. వెంటనే అతను బాగై, తన పరుపు తీసుకొని నడవడం మొదలుపెట్టాడు!
యూదులు ఆ అద్భుతాన్ని బట్టి సంతోషించాల్సిందిపోయి, “ఇవాళ విశ్రాంతి రోజు, నువ్వు పరుపు మోయడం తప్పు” అంటూ అతన్ని విమర్శించారు. అప్పుడతను ఇలా అన్నాడు: “నన్ను బాగుచేసిన వ్యక్తే, ‘నీ పరుపు తీసుకొని నడువు’ అని నాతో చెప్పాడు.” (యోహాను 5:10, 11) నిజానికి వాళ్లు విశ్రాంతి రోజున అద్భుతాలు చేస్తున్న వ్యక్తిని విమర్శిస్తున్నారు!
వాళ్లు ఇలా అడిగారు: “‘దీన్ని తీసుకొని నడువు’ అని నీతో చెప్పింది ఎవరు?” కానీ అతనికి యేసు పేరు తెలీదు. పైగా, యేసు అక్కడి నుండి వెళ్లిపోయి “గుంపులో కలిసిపోయాడు.” (యోహాను 5:12, 13) తర్వాత ఆలయంలో యేసు కనిపించినప్పుడు, కోనేరు దగ్గర తనను బాగుచేసిన వ్యక్తి యేసు అని అతనికి తెలిసింది.
అప్పుడతను, తనను ప్రశ్నించిన యూదుల దగ్గరికి వెళ్లి తనను బాగుచేసింది యేసని చెప్పాడు. అది తెలిసిన వెంటనే వాళ్లు యేసు దగ్గరికి బయల్దేరారు. ఎందుకు? ఆయన అలాంటి అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడో తెలుసుకోవడానికా? కాదు. విశ్రాంతి రోజున మంచి పనులు చేస్తున్నందుకు యేసును తప్పుపట్టడానికి వెళ్లారు. ఆఖరికి, వాళ్లు ఆయన్ని హింసించడం కూడా మొదలుపెట్టారు!