1వ అధ్యాయం
దేవుని నుండి వచ్చిన రెండు సందేశాలు
బాప్తిస్మమిచ్చే యోహాను పుడతాడని గబ్రియేలు దూత చెప్పాడు
యేసు పుడతాడని గబ్రియేలు దూత మరియకు చెప్పాడు
ఒక విధంగా, బైబిలంతా దేవుని నుండి వచ్చిన సందేశమే. మనకు ఉపదేశం ఇవ్వడానికి మన పరలోక తండ్రి దాన్ని ఇచ్చాడు. అయితే 2,000 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం వచ్చిన రెండు ప్రత్యేక సందేశాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. ఆ సందేశాల్ని, “దేవుని సన్నిధిలో సేవ చేసే” గబ్రియేలు అనే దేవదూత తీసుకొచ్చాడు. (లూకా 1:19) గబ్రియేలు ఆ ముఖ్యమైన సందేశాల్ని తీసుకొచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి?
యేసు పుట్టడానికి దాదాపు ఒక సంవత్సరం ముందు గబ్రియేలు దూత మొదటి సందేశం చెప్పాడు. యూదయ పర్వత ప్రాంతంలో, యెహోవా దేవుని యాజకునిగా సేవచేస్తున్న జెకర్యా నివసిస్తున్నాడు. ఆ ప్రాంతం బహుశా యెరూషలేముకు దగ్గర్లోనే ఉండివుంటుంది. అతను, అతని భార్య ఎలీసబెతు ముసలివాళ్లు. వాళ్లకు పిల్లలు లేరు. జెకర్యా తన వంతు వచ్చినప్పుడు యెరూషలేములోని ఆలయంలో యాజకునిగా సేవ చేయడానికి వెళ్లాడు. అతను ఆలయంలో ఉన్నప్పుడు, ఉన్నట్టుండి ధూపవేదిక దగ్గర గబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యాడు.
అది చూసి జెకర్యా భయపడ్డాడు. అయితే గబ్రియేలు దూత అతని భయాన్ని పోగొడుతూ, “జెకర్యా, భయపడకు. దేవుడు నీ అభ్యర్థనను విన్నాడు. నీ భార్య ఎలీసబెతు ఒక కుమారుణ్ణి కంటుంది. నువ్వు అతనికి యోహాను అని పేరు పెట్టాలి” అన్నాడు. అంతేకాదు, “అతను యెహోవా దృష్టిలో గొప్పవాడిగా ఉంటాడు,” “యెహోవా కోసం ప్రజల్ని సిద్ధం చేస్తాడు” అని కూడా ఆ దూత చెప్పాడు.—లూకా 1:13-17.
అప్పటికే జెకర్యా, ఎలీసబెతు ముసలివాళ్లు కాబట్టి జెకర్యా ఆ మాట నమ్మలేకపోయాడు. అప్పుడు గబ్రియేలు అతనితో, “నువ్వు నా మాటలు నమ్మలేదు కాబట్టి ఇవి జరిగే రోజు వరకు నువ్వు మూగవాడిగా ఉంటావు” అన్నాడు.—లూకా 1:20.
బయట ఉన్న ప్రజలు, జెకర్యా ఎందుకు అంతసేపు లోపల ఉన్నాడా అని అనుకుంటున్నారు. చివరికి అతను బయటికి వచ్చాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు, చేతితో సైగలు మాత్రమే చేస్తున్నాడు. అతను ఆలయంలో ఏదో దర్శనం చూసివుంటాడని వాళ్లు అనుకున్నారు.
ఆలయంలో తాను సేవచేయాల్సిన రోజులు పూర్తయిన తర్వాత జెకర్యా ఇంటికి వచ్చాడు. కొన్నిరోజులకు ఎలీసబెతు గర్భవతి అయింది! ఆమె ఇతరులకు కనిపించకుండా ఐదు నెలలపాటు ఇంట్లోనే ఉండి, బిడ్డ పుట్టే సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది.
ఆ తర్వాత గబ్రియేలు రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. ఈసారి అతను మరియ అనే పెళ్లికాని యువతి దగ్గరికి వచ్చాడు. ఆమె యెరూషలేముకు ఉత్తరాన గలిలయ ప్రాంతంలోని నజరేతు నగరంలో ఉండేది. గబ్రియేలు దూత ఆమెకు ఏం చెప్పాడు? అతను ఆమెతో, “నువ్వు దేవుని దయ పొందావు. ఇదిగో! నువ్వు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడని పిలవబడతాడు. . . . ఆయన యాకోబు వంశస్థుల్ని ఎప్పటికీ రాజుగా పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు.—లూకా 1:30-33.
ఈ రెండు సందేశాల్ని చెప్పే అవకాశం దొరికినందుకు గబ్రియేలు ఎంతో సంతోషించివుంటాడు. యోహాను గురించి, యేసు గురించి చదివేకొద్దీ, దేవుని నుండి వచ్చిన ఈ సందేశాలు ఎందుకంత ముఖ్యమైనవో మనకు అర్థమౌతుంది.