6వ భాగం
పిల్లలు పుట్టాక వైవాహిక బంధంలో వచ్చే మార్పులతో ఎలా వ్యవహరించాలి?
‘కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం.’ —కీర్తన 127:3.
ఓ పండంటి బిడ్డ పుడితే ఆలుమగల ఆనందానికి అవధులు ఉండవు. అయితే మనసులో ఒకింత ఆందోళన కూడా మొదలౌతుంది. రోజులు గడుస్తుండగా కొత్తగా తల్లిదండ్రులైన మీకు మీ సమయం, శక్తి చాలావరకు బిడ్డ ఆలనాపాలనకే పోతున్నాయని తెలుసుకొని ఆశ్చర్యం కలగవచ్చు. నిద్రలేమి, భావోద్వేగపరమైన మార్పులు మీ ఇద్దరి బంధం మీద ప్రభావం చూపిస్తాయి. అయితే బిడ్డను చూసుకోవడానికి, మీ ఇద్దరి బంధాన్ని కాపాడుకోవడానికి మీరిద్దరూ కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త సవాళ్లతో వ్యవహరించడానికి బైబిలు సలహాలు మీకు ఎలా సహాయం చేయగలవు?
1 బిడ్డ వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో అర్థంచేసుకోండి
బైబిలు ఏమి చెబుతోందంటే . . . “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును.” అంతేకాదు, ప్రేమ “స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు.” (1 కొరింథీయులు 13:4, 5) కొత్తగా తల్లి అయిన మీరు బిడ్డను చూసుకోవడంలో మునిగిపోతారు, అది సహజం. అయితే, మీ భర్త మాత్రం మీరు తనను పట్టించుకోవడం లేదని అనుకోవడం మొదలుపెట్టవచ్చు. కాబట్టి మీరు భర్తను కూడా పట్టించుకోవాలనే విషయం మర్చిపోకండి. మీ భర్తను మీరు పట్టించుకుంటున్నారని, బిడ్డను చూసుకోవడంలో తన సహకారం కూడా తీసుకుంటున్నారని తనకు అనిపించేలా ఓపిగ్గా, నెమ్మదిగా మీ భర్తకు సహాయం చేయవచ్చు.
‘పురుషులారా, జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి.’ (1 పేతురు 3:7) మీ భార్య దాదాపు తన శక్తినంతా బిడ్డను చూసుకోవడానికే ధారపోస్తుందని అర్థంచేసుకోండి. ఆమె మీద ఇప్పుడు కొత్త బాధ్యతలు వచ్చి పడ్డాయి. దానివల్ల ఆమెకు పని ఒత్తిడి పెరుగుతుంది, అలసిపోతుంది లేదా మానసికంగా కృంగిపోతుంది కూడా. కొన్నిసార్లు మీ భార్య మీమీద చిర్రుబుర్రులాడే అవకాశం కూడా ఉంది. అప్పుడు మీరు శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే, “పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు.” (సామెతలు 16:32) వివేచనతో మెలగండి. తనకు అవసరమైన సహకారాన్ని అందించండి. —సామెతలు 14:29.
మీరు ఏమి చేయవచ్చంటే . . .
తండ్రులు: బిడ్డను చూసుకునే విషయంలో మీ భార్యకు సాయం చేయండి, రాత్రిపూట కూడా చేయండి. వేరే పనులమీద మీరు గడిపే సమయాన్ని తగ్గించుకోండి. అప్పుడు మీరు భార్యాబిడ్డలతో ఎక్కువ సమయం గడపగలుగుతారు.
తల్లులు: బిడ్డను చూసుకునే విషయంలో సాయం చేస్తానని భర్త ముందుకు వస్తే తన సాయం తీసుకోండి. తను సరిగ్గా చేయకపోతే విసుక్కోకండి. ఎలా చేయాలో మెల్లగా చూపించండి.
2 మీ బంధాన్ని బలపర్చుకోండి
బైబిలు ఏమి చెబుతోందంటే . . . “వారు ఏక శరీరమైయుందురు.” (ఆదికాండము 2:24) బిడ్డ పుట్టుకతో కుటుంబంలో ఓ కొత్త వ్యక్తి తోడైనా సరే, ఇప్పటికీ మీరిద్దరు ‘ఏకశరీరం’ అని గుర్తుంచుకోండి. మీ బంధాన్ని పటిష్ఠంగా ఉంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నించండి.
భార్యలారా, మీ భర్త అందించే సహాయసహకారాలకు కృతజ్ఞత చూపించండి. మీరు మెచ్చుకోలుగా మాట్లాడే మాటలు ‘ఆరోగ్యదాయకంగా’ ఉండగలవు. (సామెతలు 12:18) భర్తలారా, మీరు మీ భార్యను ఎంత ప్రేమిస్తున్నారో, మీ దృష్టిలో తను ఎంత విలువైనదో తనకు చెప్పండి. కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నందుకు ఆమెను మెచ్చుకోండి.—సామెతలు 31:10, 28.
“ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.” (1 కొరింథీయులు 10:24) మీ జీవిత భాగస్వామికి ఏది మంచో అదే చేయండి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, ఒకరినొకరు మెచ్చుకోవడానికి, ఒకరిదొకరు వినడానికి సమయం తీసుకోండి. మీ లైంగిక సంబంధం మాటకొస్తే, ఆ విషయంలో నిస్వార్థంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి అవసరాల గురించి ఆలోచించండి. బైబిలు ఇలా చెబుతోంది: “ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి.” (1 కొరింథీయులు 7:3-5) కాబట్టి ఈ విషయం గురించి ఇద్దరూ నిర్మొహమాటంగా చర్చించుకోండి. మీరు ఓపిక చూపిస్తూ, ఒకరినొకరు అర్థంచేసుకుంటే మీ బంధం పటిష్ఠమౌతుంది.
మీరు ఏమి చేయవచ్చంటే . . .
మీరిద్దరు కలిసి సమయం గడపడం మర్చిపోవద్దు
మీ జీవిత భాగస్వామికి మీ ప్రేమను తెలిపే చిన్నచిన్న పనులు చేయండి. ఉదాహరణకు, ఓ మెసేజ్ పెట్టడమో, ఓ చిన్న కానుక ఇవ్వడమో చేయవచ్చు
3 బిడ్డకు శిక్షణనివ్వండి
బైబిలు ఏమి చెబుతోందంటే . . . “రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు.” (2 తిమోతి 3:14, 15) మీ బిడ్డకు నేర్పించడానికి మీరు ఏమి చేస్తారనే దాని గురించి ప్రణాళిక వేసుకోండి. బిడ్డకు నేర్చుకునే సామర్థ్యం అమోఘంగా ఉంటుంది, అది పుట్టకముందు నుంచే ఉంటుంది. బిడ్డ కడుపులో ఉండగానే మీ స్వరాన్ని గుర్తుపట్టగలదు, మీ భావావేశాలకు స్పందించగలదు. పసివయసు నుండే బిడ్డకు చదివి వినిపించండి. మీరు చదివే విషయాలు ఇప్పుడు బిడ్డకు అర్థంకాకపోయినా, రేపు పెద్దయ్యాక వాడికి చదవడం మీద మక్కువ ఏర్పడుతుంది.
దేవుని గురించి మీరు మాట్లాడితే వినడానికి బిడ్డకు ఇంత వయసు ఉండాలనే నియమమేమీ లేదు. బిడ్డ వినేలా మీరు యెహోవాకు ప్రార్థించండి. (ద్వితీయోపదేశకాండము 11:19) పిల్లాడితో కలిసి ఆడుకుంటున్నప్పుడు కూడా దేవుడు చేసిన వాటి గురించి మాట్లాడండి. (కీర్తన 78:3, 4) మీ చిన్నారి ఎదిగేకొద్దీ యెహోవామీద మీకున్న ప్రేమను గ్రహిస్తాడు, యెహోవాను ప్రేమించడం వాడు కూడా నేర్చుకుంటాడు.
మీరు ఏమి చేయవచ్చంటే . . .
మీ బిడ్డకు శిక్షణనివ్వడానికి జ్ఞానాన్ని ఇవ్వమని ప్రత్యేకంగా ప్రార్థించండి
బిడ్డ తొలిదశ నుండే నేర్చుకోవడం మొదలుపెట్టేందుకు వీలుగా మీరు ముఖ్యమైన పదాలను, విషయాలను మళ్లీమళ్లీ చెబుతూ ఉండండి