11
రాజు తన ప్రజల్ని నైతికంగా శుద్ధీకరించాడు—దేవుని పవిత్ర ప్రమాణాలను పాటించడం
యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలోని బయటి ఆవరణలోకి ప్రవేశిస్తున్నట్లు ఊహించుకోండి
1. యెహెజ్కేలు ఒక దర్శనంలో ఏమి చూశాడు?
దాదాపు 2,500 సంవత్సరాల క్రితం యెహెజ్కేలు ప్రవక్తకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నట్లు ఊహించుకోండి. మీరు ఒక పెద్ద, మహిమాన్విత ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఆ గొప్ప ఆలయాన్ని చూపించడానికి బలాఢ్యుడైన ఒక దూత నిలబడివున్నాడు! అక్కడ మూడు పెద్దపెద్ద ద్వారాలు ఉన్నాయి. వాటిని చేరుకోవడానికి మీరు ఏడు మెట్లు ఎక్కారు. ఆ ద్వారాలు దాదాపు 100 అడుగుల ఎత్తు ఉండి, భీతిగొల్పే విధంగా ఉన్నాయి. వాటిలో ఒక ద్వారం గుండా వెళ్తున్నప్పుడు, మీకు కావలి గదులు కనిపించాయి. అక్కడున్న స్తంభాల మీద ఖర్జూర చెట్లు అద్భుతంగా చెక్కివున్నాయి.—యెహె. 40:1-4, 10, 14, 16, 22; 41:20.
2. (ఎ) యెహెజ్కేలు దర్శనంలోని ఆలయం దేన్ని సూచిస్తుంది? (అధస్సూచి కూడా చూడండి.) (బి) ఆలయంలోని ద్వారాలు, కావలి గదులు, స్తంభాలు మనకు ఏమి గుర్తుచేస్తున్నాయి?
2 దర్శనంలోని ఆ మహిమాన్విత ఆలయం, ఆధ్యాత్మిక ఆలయం. అది పవిత్ర ఆరాధన కోసం యెహోవా చేసిన ఏర్పాటును సూచిస్తుంది. యెహెజ్కేలు ఆ ఆలయం గురించి ఎంత వివరంగా రాశాడంటే, ఆ వివరాలు యెహెజ్కేలు పుస్తకంలో 40 నుండి 48 అధ్యాయాల వరకు ఉన్నాయి. ఆ ఆలయంలో ఉన్న ప్రతీది, ఈ చివరి రోజుల్లో జీవిస్తున్న మనకు ఓ పాఠం నేర్పిస్తుంది.a దానిలో ఉన్న ఎత్తైన ద్వారాలు ఏ విషయాన్ని తెలియజేస్తున్నాయి? యెహోవాను పవిత్రంగా ఆరాధించాలనుకునే ప్రతీఒక్కరు, ఆయన ఉన్నతమైన నీతి ప్రమాణాలకు కట్టుబడి జీవించాలని తెలియజేస్తున్నాయి. స్తంభాల మీద చెక్కివున్న ఖర్జూర చెట్లు కూడా అదే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. బైబిల్లో, కొన్నిసార్లు ఖర్జూర చెట్లు నీతికి ప్రతీకగా ఉపయోగించబడ్డాయి. (కీర్త. 92:12) మరి కావలి గదుల సంగతేంటి? దేవుని ప్రమాణాలను గౌరవించనివాళ్లకు ఆలయంలో ప్రవేశించే అర్హత లేదని, అంటే పవిత్ర ఆరాధన చేసే అర్హత లేదని అవి చూపిస్తున్నాయి.—యెహె. 44:9.
3. క్రీస్తు తన అనుచరులను ఎందుకు శుద్ధీకరిస్తూనే ఉన్నాడు?
3 యెహెజ్కేలు దర్శనం ఎలా నెరవేరింది? ఈ పుస్తకంలోని 2వ అధ్యాయంలో చూసినట్లుగా, 1914 నుండి 1919 తొలిభాగం వరకు, యెహోవా యేసు ద్వారా తన ప్రజల్ని శుద్ధీకరించాడు. అలా శుద్ధీకరించడం అంతటితో అయిపోయిందా? లేదు! క్రీస్తు గత వంద సంవత్సరాలుగా యెహోవా పవిత్ర ప్రమాణాలను సమర్థిస్తూ, వాటికి తగ్గట్లుగా తన ప్రజల్ని శుద్ధీకరిస్తూనే ఉన్నాడు. ఎందుకు? ఎందుకంటే, క్రీస్తు తన అనుచరులను ఈ అనైతిక లోకం నుండి బయటికి తీసుకొస్తున్నప్పటికీ, సాతాను వాళ్లను మళ్లీ అనైతికత అనే బురదలోకి లాగుతున్నాడు. (2 పేతురు 2:20-22 చదవండి.) నిజ క్రైస్తవులు ఏ మూడు రంగాల్లో శుద్ధీకరించబడ్డారో ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటిది, నైతిక విషయాల్లో శుద్ధీకరించడం; రెండవది, సంఘ పవిత్రతను కాపాడడం; మూడవది, కుటుంబ ఏర్పాటు.
నైతిక విషయాల్లో శుద్ధీకరించడం
4, 5. సాతాను ఎంతోకాలం నుండి ఏ పన్నాగాన్ని ఉపయోగిస్తున్నాడు? ఆ విషయంలో ఎంతమేరకు విజయం సాధించాడు?
4 నైతిక విషయాల్లో పవిత్రంగా ఉంటూ నీతిగా బ్రతకాలని యెహోవా ప్రజలు ఎప్పుడూ కోరుకుంటారు. అందుకే ఆ విషయంలో వచ్చిన స్పష్టమైన నిర్దేశానికి వాళ్లు లోబడ్డారు. దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.
5 లైంగిక పాపాలు. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలు దేవుడిచ్చిన బహుమానం. అవి పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ, యెహోవా ఇచ్చిన ఆ బహుమానాన్నే ఉపయోగించి మనుషులు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసేలా సాతాను ప్రేరేపిస్తున్నాడు. ఆ విధంగా, వాళ్లు దేవుని అనుగ్రహాన్ని కోల్పోవాలన్నది అతని కోరిక. బిలాము జీవించిన రోజుల్లో, సాతాను ఆ పన్నాగాన్నే ఉపయోగించి విజయం సాధించాడు. ఈ చివరి రోజుల్లో, దాన్ని ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు.—సంఖ్యా. 25:1-3, 9; ప్రక. 2:14.
6. వాచ్ టవర్ పత్రిక ఏ తీర్మానాన్ని ప్రచురించింది? ఆ తీర్మానాన్ని ఎక్కడ ఉపయోగించేవాళ్లు? కానీ తర్వాత్తర్వాత అది ఎందుకు వాడుకలో లేకుండా పోయింది? (అధస్సూచి కూడా చూడండి.)
6 సాతాను ప్రయత్నాలను తిప్పికొడుతూ 1908, జూన్ 15 వాచ్ టవర్ పత్రిక ఒక తీర్మానాన్ని ప్రచురించింది. అందులో ఇలా ఉంది: “నేను వ్యతిరేక లింగ వ్యక్తితో నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా ఒకేవిధంగా ప్రవర్తిస్తాను. అన్ని సమయాల్లో, అన్ని చోట్ల అలాగే నడుచుకుంటాను.”b తప్పనిసరి కాకపోయినా, చాలామంది సహోదరసహోదరీలు ఆ తీర్మానాన్ని అంగీకరించి, జాయన్స్ వాచ్ టవర్ పత్రికలో ప్రచురించబడేలా తమ పేర్లను పంపించారు. ఆ తీర్మానం ఎంతో ఉపయోగపడినప్పటికీ, సంవత్సరాలు గడుస్తుండగా అది ఒక ఆచారంగా మారిపోయింది. కాబట్టి దాన్ని ఉపయోగించడం సరికాదని దేవుని ప్రజలు గుర్తించారు. కానీ, దానిలోని ఉన్నత నైతిక ప్రమాణాలను మాత్రం పాటిస్తూనే ఉన్నారు.
7. దేవుని ప్రజల మధ్య ఎక్కువౌతున్న ఏ సమస్య గురించి 1935 కావలికోట ప్రస్తావించింది? అది ఏ విషయాన్ని నొక్కిచెప్పింది?
7 అయినప్పటికీ సాతాను తన దాడుల్ని ఇంకా ముమ్మరం చేశాడు. కొంతమంది సహోదరసహోదరీలు, పరిచర్య చేస్తే యెహోవా నైతిక ప్రమాణాలను పాటించకపోయినా ఫర్వాలేదని అనుకోవడం మొదలుపెట్టారు. ఆ సమస్య గురించి ప్రస్తావించిన తర్వాత, 1935, మార్చి 1 కావలికోట సూటిగా ఇలా చెప్పింది: “ఒక వ్యక్తి కేవలం సాక్ష్యమిచ్చే పనిలో పాల్గొంటేనే సరిపోదు. యెహోవాసాక్షులంటే యెహోవాకు ప్రతినిధులు. కాబట్టి ఆయనకు, ఆయన రాజ్యానికి సరైన విధంగా ప్రాతినిధ్యం వహించడం వాళ్ల బాధ్యత.” వివాహం, లైంగిక సంబంధాలు వంటి విషయాల్లో కూడా ఆ ఆర్టికల్ స్పష్టమైన నిర్దేశాలిచ్చింది. ఆ విధంగా, దేవుని ప్రజలు ‘లైంగిక పాపాలకు దూరంగా పారిపోగలిగారు.’—1 కొరిం. 6:18.
8. పోర్నియా అనే గ్రీకు పదానికి ఉన్న సరైన అర్థం గురించి కావలికోట ఎలా నొక్కిచెప్పింది?
8 ఈ మధ్యకాలంలో, కావలికోట పత్రిక పోర్నియా అనే పదానికి ఉన్న సరైన అర్థాన్ని నొక్కిచెప్పింది. గ్రీకు లేఖనాల్లో పోర్నియా అనే పదాన్ని, లైంగిక పాపాలను సూచించడానికి ఉపయోగించారు. అది కేవలం లైంగిక సంపర్కాన్ని మాత్రమే కాదు గానీ, అన్ని రకాల అనైతిక పనుల్ని, అంటే వేశ్యాగృహంలో జరిగే నీచమైన పనులన్నిటినీ సూచిస్తుందని కావలికోట తెలియజేసింది. ఆ విధంగా, నేటి లోకంలో చాలామందిని పట్టిపీడిస్తున్న అనైతికత అనే మహమ్మారి నుండి క్రీస్తు అనుచరులు కాపాడబడ్డారు.—ఎఫెసీయులు 4:17-19 చదవండి.
9, 10. (ఎ) 1935లో, కావలికోట ఏ విషయం గురించి కూడా ప్రస్తావించింది? (బి) మద్యం తీసుకునే విషయంలో బైబిలు అభిప్రాయం ఏమిటి?
9 మద్యాన్ని దుర్వినియోగం చేయడం. 1935, కావలికోట మార్చి 1 సంచిక మరో అంశం గురించి కూడా ప్రస్తావించింది: “కొంతమంది [మద్యం] సేవించి క్షేత్ర పరిచర్యలో పాల్గొంటున్నారని, మద్యం మత్తులో ఉండి సంస్థకు సంబంధించిన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారని గమనించాం. కానీ మద్యం తీసుకోవడం గురించి లేఖనాలు ఏమి చెప్తున్నాయి? ఒక వ్యక్తి ప్రభువు సంస్థలో తాను చేస్తున్న సేవను ప్రభావితం చేసేంతగా మద్యం తీసుకోవడం సరైనదేనా?”
10 మద్యం తీసుకునే విషయంలో బైబిలు అభిప్రాయం ఏమిటో తెలియజేస్తూ, అదే కావలికోట ఆ ప్రశ్నలకు జవాబిచ్చింది. ద్రాక్షారసం లేదా మద్యం మితంగా తీసుకోవడాన్ని బైబిలు ఖండించట్లేదు గానీ, తాగుబోతుతనాన్ని ఖచ్చితంగా ఖండిస్తుంది. (కీర్త. 104:14, 15; 1 కొరిం. 6:9, 10) మరి మద్యం మత్తులో ఉండి పవిత్ర సేవ చేయడం సంగతేంటి? అహరోను కుమారుల వృత్తాంతం దీనికి జవాబిస్తుంది. వాళ్లు బలిపీఠం మీద దేవునికి అంగీకారంకాని ధూపం వేసినందుకు, దేవుడు వాళ్లకు మరణశిక్ష విధించినట్లు ఆ వృత్తాంతంలో చదువుతాం. వాళ్లు అలా ఎందుకు చేసివుంటారో ఆ తర్వాతి వృత్తాంతం చూస్తే అర్థమౌతుంది. పవిత్ర సేవ చేస్తున్నప్పుడు యాజకులెవరూ మద్యాన్ని తీసుకోకూడదని దేవుడు ఆజ్ఞాపించినట్లు మనం అక్కడ చదవుతాం. కాబట్టి, బహుశా వాళ్లు మద్యం మత్తులో ఉండి ధూపం వేసివుంటారని అర్థమౌతుంది. (లేవీ. 10:1, 2, 8-11) దానిలో ఉన్న సూత్రాన్ని పాటిస్తూ, నేడు క్రీస్తు అనుచరులు కూడా మద్యం మత్తులో పవిత్ర సేవ చేయకుండా జాగ్రత్తపడతారు.
11. తాగుడు ఒక వ్యసనంలా మారడం గురించి కావలికోట హెచ్చరించడం వల్ల, దేవుని ప్రజలు ఎలా ప్రయోజనం పొందారు?
11 ఈ మధ్యకాలంలో, అతిగా తాగుతూ దానికి బానిస అవ్వడం గురించి క్రీస్తు అనుచరులు మరింత అవగాహన పొందారు. సరైన సమయంలో వచ్చిన అవగాహన వల్ల, చాలామంది ఆ వ్యసనం నుండి బయటపడి, తిరిగి మామూలు జీవితాన్ని గడపగలిగారు. మరికొంతమంది, అసలు దాని జోలికి పోకుండా ఉండగలిగారు. తాగుడు వల్ల గౌరవమర్యాదలు పోతాయి, కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది, అన్నిటికంటే ముఖ్యంగా యెహోవాకు పవిత్ర సేవ చేసే గొప్ప అవకాశం పోతుంది. కాబట్టి అలా జరగడానికి ఎన్నడూ అనుమతించకూడదు.
“మన ప్రభువు పొగతాగుతున్నట్టు గానీ, అపవిత్రమైన దేన్నైనా నోట్లో పెట్టుకున్నట్టు గానీ మనం ఎన్నడూ ఊహించలేం.” —సి. టి. రస్సెల్
12. 1914కు ముందే, క్రీస్తు అనుచరులకు పొగతాగడంపై ఎలాంటి అభిప్రాయం ఉండేది?
12 పొగతాగడం. పొగతాగడం తప్పని 1914కు ముందే క్రీస్తు అనుచరులు తెలుసుకున్నారు. ఛార్లెస్ కేపన్ అనే ఒక వృద్ధ సహోదరుడు, 19వ శతాబ్దం చివర్లో, తన 13వ ఏట రస్సెల్‌ను మొదటిసారి కలిసినప్పుడు ఏమి జరిగిందో గుర్తుచేసుకున్నాడు. సహోదరుడు కేపన్, వాళ్ల అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్లు కలిసి పెన్సిల్వేనియాలోని అల్గేనీలో ఉన్న బైబిల్ హౌస్ మెట్ల మీద నిలబడి ఉన్నారు. అప్పుడు రస్సెల్ అటుగా వచ్చి, “నాకు సిగరెట్ వాసన వస్తుంది. మీరుగానీ సిగరెట్ తాగుతున్నారా?” అని అడిగాడు. తాగట్లేదని వాళ్లు జవాబిచ్చారు. పొగతాగే విషయంలో రస్సెల్‌కు ఎలాంటి ఖచ్చితమైన అభిప్రాయం ఉందో వాళ్లకు అర్థమైంది. 1895, ఆగస్టు 1 వాచ్ టవర్ పత్రికలో 2 కొరింథీయులు 7:1 గురించి వివరిస్తూ, సహోదరుడు రస్సెల్ ఇలా చెప్పాడు: “క్రైస్తవులు ఏ విధంగా పొగాకును ఉపయోగించినా, అటు దేవునికీ మహిమ రాదు, ఇటు వాళ్లకూ ఉపయోగం ఉండదు. . . . మన ప్రభువు పొగతాగుతున్నట్టు గానీ, అపవిత్రమైన దేన్నైనా నోట్లో పెట్టుకున్నట్టు గానీ మనం ఎన్నడూ ఊహించలేం.”
13.1973లో ఏ మెరుగైన అవగాహన వచ్చింది?
13 పొగాకు ఒక “హానికరమైన మొక్క” అని, పొగాకు నమిలేవాళ్లు లేదా పొగతాగేవాళ్లు బెతెల్ సభ్యులుగా, పయినీర్లుగా, ప్రయాణ పర్యవేక్షకులుగా కొనసాగలేరని 1935లో కావలికోట పత్రిక తెలియజేసింది. అయితే, 1973లో ఈ విషయంలో మెరుగైన అవగాహన వచ్చింది. ఈ ప్రాణాంతకమైన, అసహ్యమైన, ప్రేమరహితమైన అలవాటు ఉన్నవాళ్లు అసలు యెహోవాసాక్షులుగానే కొనసాగలేరని జూన్ 1, కావలికోట స్పష్టం చేసింది. దాంతో, ఆ అలవాటును మానుకోవడానికి ఇష్టపడనివాళ్లు సంఘం నుండి బహిష్కరించబడ్డారు.c ఆ విధంగా, తన అనుచరులను శుద్ధీకరించే ప్రక్రియలో యేసు మరో అడుగు ముందుకు వేశాడు.
14. రక్తం విషయంలో దేవుని ప్రమాణం ఏమిటి? రక్త మార్పిడులు ఎలా ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమయ్యాయి?
14 రక్తాన్ని దుర్వినియోగం చేయడం. రక్తాన్ని తినకూడదని యెహోవా నోవహు కాలంలో స్పష్టం చేశాడు. ఆ విషయంలో తన అభిప్రాయం ఏమాత్రం మారలేదని సూచిస్తూ, ఇశ్రాయేలీయులకు కూడా అదే నియమాన్ని ఇచ్చాడు. అంతేకాదు, “రక్తానికి దూరంగా ఉండమని” క్రైస్తవ సంఘాన్ని కూడా నిర్దేశించాడు. (అపొ. 15:20, 29; ఆది. 9:4; లేవీ. 7:26) కానీ, దేవుడు ఏర్పాటు చేసిన ఆ ప్రమాణాన్ని అగౌరపర్చడానికి సాతానుకు 19వ శతాబ్దంలో ఒక మార్గం కనిపించింది. ఆ సమయంలో డాక్టర్లు రక్త మార్పిడుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. బ్లడ్ గ్రూప్స్ కనిపెట్టిన తర్వాత, ఆ రక్త మార్పిడులు ఇంకా ఊపు అందుకున్నాయి. తర్వాత 1937లో, రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంక్స్‌లో భద్రపర్చడం మొదలుపెట్టారు. దాంతో, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చాలామందికి రక్తమార్పిడులు చేశారు. అలా కొంతకాలానికే, రక్తమార్పిడులు ప్రపంచమంతటా సర్వసాధారణమైపోయాయి.
15, 16. (ఎ) రక్త మార్పిడుల విషయంలో యెహోవాసాక్షులు తమ అభిప్రాయానికి ఎలా కట్టుబడివున్నారు? (బి) ఈ విషయంలో క్రీస్తు తన అనుచరులకు ఎలా సహాయం చేశాడు? దానికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి?
15 రక్తం ఎక్కించుకోవడం, రక్తం తినడంతో సమానమని 1944లోనే కావలికోట పత్రిక తెలియజేసింది. తర్వాతి సంవత్సరంలో వచ్చిన కావలికోట, ఆ విషయాన్ని మరోసారి నొక్కిచెప్తూ మరింత స్పష్టమైన అవగాహన ఇచ్చింది. 1951లో, రక్త మార్పిడులకు సంబంధించి కొన్ని ప్రశ్నల్ని, వాటి జవాబుల్ని సంస్థ ప్రచురించింది. రక్తం విషయంలో మన అభిప్రాయాన్ని డాక్టర్లకు తెలియజేయడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత, ఎగతాళి, హింస ఎదురైనా క్రీస్తు అనుచరులు ఈ ప్రమాణానికి స్థిరంగా కట్టుబడివున్నారు. వాళ్లకు మరింత చేయూతనివ్వడానికి క్రీస్తు తన సంస్థను ఉపయోగించుకున్నాడు. రక్తానికి సంబంధించిన చాలా వివరాలను, ఎంతో పరిశోధన చేసి కనుగొన్న సమాచారాన్ని బ్రోషుర్లలో, ఎన్నో ఆర్టికల్స్‌లో సంస్థ ప్రచురించింది.
16 1979లో, కొంతమంది పెద్దలు ఆసుపత్రులను సందర్శించి, సాక్షులు ఎందుకు రక్తం ఎక్కించుకోరో, దానికి గల లేఖనాధార కారణాలేమిటో, రక్తానికి ప్రత్యామ్నాయంగా ఏ పద్ధతులు ఉన్నాయో వంటి విషయాలను డాక్టర్లతో మాట్లాడడం మొదలుపెట్టారు. 1980లో, అమెరికాలోని 39 నగరాలకు చెందిన సంఘ పెద్దలు ఈ పనిలో ప్రత్యేక శిక్షణ పొందారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రి అనుసంధాన కమిటీలను ఏర్పాటు చేయడానికి పరిపాలక సభ అనుమతి ఇచ్చింది. మరి, ఈ కృషి అంతటికీ ఏమైనా ఫలితాలు వచ్చాయా? నేడు వేలమంది డాక్టర్లు సాక్షులతో సహకరిస్తూ, రక్తం విషయంలో వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. చాలా ఆసుపత్రులు, రక్తం లేకుండా చికిత్స చేయడానికి ముందుకొస్తున్నాయి. కొంతమంది డాక్టర్లు, రక్తరహిత చికిత్సే అత్యంత శ్రేష్ఠమైన వైద్య చికిత్స అని ఒప్పుకుంటున్నారు. క్రీస్తు అనుచరులను కలుషితం చేయడానికి సాతాను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, యేసు మాత్రం వాళ్లను కాపాడుతూనే ఉన్నాడు. ఇది మనకు ఎంత సంతోషాన్నిస్తుందో కదా!—ఎఫెసీయులు 5:25-27 చదవండి.
చాలా ఆసుపత్రులు, రక్తం లేకుండా చికిత్స చేయడానికి ముందుకొస్తున్నాయి. కొంతమంది డాక్టర్లు, రక్తరహిత చికిత్సే అత్యంత శ్రేష్ఠమైన వైద్య చికిత్స అని ఒప్పుకుంటున్నారు
17. క్రీస్తు మనల్ని శుద్ధీకరిస్తున్నందుకు మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?
17 మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘క్రీస్తు మనల్ని శుద్ధీకరిస్తూ, దేవుని ఉన్నత నైతిక ప్రమాణాలను పాటించేలా మనకు శిక్షణ ఇస్తున్నందుకు కృతజ్ఞత కలిగివున్నామా?’ దేవుని ప్రమాణాల పట్ల మన గౌరవాన్ని నీరుగార్చడానికి, యెహోవా నుండి యేసు నుండి మనల్ని దూరం చేయడానికి సాతాను ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టడానికి, యెహోవా సంస్థ ప్రేమతో ఎప్పటికప్పుడు నిర్దేశాలిస్తూ, ఈ లోకంలోని అనైతిక జాడలకు దూరంగా ఉండమని మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి, అప్రమత్తంగా ఉంటూ ఆ నిర్దేశానికి వెంటనే స్పందించి, దానికి లోబడదాం.—సామె. 19:20.
సంఘ పవిత్రతను కాపాడడం
18. దేవుని ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించే వాళ్ల గురించి యెహెజ్కేలు దర్శనం ఏమి చెప్తుంది?
18 యేసు తన అనుచరులను శుద్ధీకరించడంలో మరో రంగంపై దృష్టి సారించాడు. అదే, సంఘ పవిత్రతను కాపాడడం. విచారకరంగా, కొంతమంది వ్యక్తులు యెహోవా ప్రమాణాలను అంగీకరించి ఆయనకు సమర్పించుకున్నప్పటికీ, కాలం గడిచేకొద్దీ తమ నిర్ణయాన్ని మార్చుకుని ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రమాణాలను ఉల్లంఘించారు. అలాంటివాళ్లను ఏమి చేయాలి? ఆ ప్రశ్నకు జవాబు, యెహెజ్కేలు దర్శనంలో మనకు దొరుకుతుంది. ఆ దర్శనంలోని ఆధ్యాత్మిక ఆలయంలో ఎత్తైన ద్వారాలు ఉన్నాయని, వాటి ప్రవేశ మార్గంలో కావలి గదులు ఉన్నాయని మనం ఈ అధ్యాయం ఆరంభంలో పరిశీలించాం. అక్కడుండే కావలివాళ్లు ‘హృదయమందు సున్నతిలేని’ వ్యక్తులను ఆలయంలోకి రానివ్వకుండా చూసుకునేవాళ్లు. (యెహె. 44:9) అంటే, యెహోవా ప్రమాణాలను పాటించడానికి కృషి చేసేవాళ్లకు మాత్రమే, పవిత్ర ఆరాధన చేసే అవకాశం ఉందని అది చూపిస్తుంది. అదే విధంగా నేడు కూడా, యెహోవా నైతిక ప్రమాణాలను పాటించేవాళ్లకు మాత్రమే తోటి క్రైస్తవులతో కలిసి పవిత్ర ఆరాధన చేసే గొప్ప అవకాశం ఉంది.
19, 20. (ఎ) ఘోరమైన తప్పులు చేసినవాళ్లతో వ్యవహరించే విషయంలో, క్రమక్రమంగా ఎలాంటి అవగాహన వచ్చింది? (బి) పశ్చాత్తాపపడని తప్పిదస్థుల్ని బహిష్కరించడానికి గల కారణాలు ఏమిటి?
19 1892లో, కావలికోట పత్రిక ఇలా చెప్పింది: “ఎవరైనా నేరుగా గానీ మరో విధంగా గానీ, క్రీస్తు ఇచ్చిన విమోచన క్రయధనాన్ని నిరాకరిస్తే, వాళ్లను బహిష్కరించడం (క్రైస్తవులుగా) మన బాధ్యత.” (2 యోహాను 10 చదవండి.) తప్పులు చేస్తూ పోయే వ్యక్తి సంఘ పవిత్రతపై చెడు ప్రభావం చూపిస్తాడని 1904లో నూతన సృష్టి (ఇంగ్లీషు) అనే పుస్తకం తెలియజేసింది. అప్పట్లో, ఘోరమైన తప్పులు చేసినవాళ్లను విచారించడంలో సంఘమంతా భాగం వహించేది. వాటినే “చర్చ్ ట్రైల్స్” అని పిలిచేవాళ్లు. అలాంటివి చాలా అరుదుగా జరిగేవి. అయితే, బాధ్యతగల స్థానాల్లో ఉన్న సహోదరులు మాత్రమే అలాంటి న్యాయవిచారణ చేయాలని 1944లో కావలికోట స్పష్టం చేసింది. న్యాయవిచారణ చేయడానికి కూడా ఒక లేఖనాధార పద్ధతి ఉందని 1952లో కావలికోట పత్రిక తెలియజేసింది. పశ్చాత్తాపపడని తప్పిదస్థుల్ని బహిష్కరించడానికి గల ముఖ్య కారణం, సంఘ పవిత్రతను కాపాడడమే అని కూడా ఆ పత్రిక చెప్పింది.
20 దీనికి సంబంధించి తర్వాతి దశాబ్దాల్లో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. తప్పు చేసిన వ్యక్తితో వ్యవహరిస్తున్నప్పుడు యెహోవాలా న్యాయాన్ని, కనికరాన్ని సమతుల్యంగా ఎలా చూపించాలో క్రైస్తవ పెద్దలు శిక్షణ పొందారు. పశ్చాత్తాపపడని తప్పిదస్థుణ్ణి సంఘం నుండి బహిష్కరించడానికి గల మూడు కారణాలను నేడు మనం స్పష్టంగా తెలుసుకున్నాం. అవి: (1) యెహోవా నామానికి అపకీర్తి రాకుండా ఉండడం, (2) సంఘ పవిత్రతను కాపాడడం, (3) సాధ్యమైతే, తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాపపడేలా సహాయం చేయడం.
21. బహిష్కరించడం అనే ఏర్పాటు దేవుని ప్రజలకు ఒక ఆశీర్వాదం అని ఎందుకు చెప్పవచ్చు?
21 బహిష్కరించడం ఎంత మంచి ఏర్పాటో మీరు గుర్తించారా? ప్రాచీన ఇశ్రాయేలులో ఎవరైనా తప్పు చేస్తే, వాళ్ల చెడు ప్రభావం జనాంగంపై పడేది. ఎంతగా అంటే, యెహోవాను ప్రేమిస్తూ సరైనది చేస్తున్నవాళ్ల సంఖ్య కన్నా, తప్పు చేస్తున్నవాళ్ల సంఖ్యే ఎక్కువయ్యేది. దానివల్ల జనాంగం మొత్తం యెహోవా నామానికి అపకీర్తి తెచ్చి ఆయన అనుగ్రహాన్ని కోల్పోయేది. (యిర్మీ. 7:23-28) నేడు, యెహోవా ఒక జనాంగంతో కాదు గానీ వివిధ వ్యక్తులతో వ్యవహరిస్తున్నాడు. పశ్చాత్తాపపడని తప్పిదస్థుల్ని బహిష్కరించడం వల్ల, సంఘంపై వాళ్ల ప్రభావం పడకుండా ఉంటుంది. లేదంటే సాతాను ఆ తప్పిదస్థుల్ని ఆయుధాలుగా వాడుకుని సంఘానికి, దాని పవిత్రతకు మరింత హాని తలపెట్టే అవకాశం ఉంది. కానీ “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు” అని యెహోవా మాటిచ్చాడు. (యెష. 54:17) కాబట్టి, బహిష్కరించడం అనే ఏర్పాటు వల్ల, మనం ఓ గుంపుగా యెహోవా అనుగ్రహాన్ని కోల్పోకుండా ఉండగలుగుతున్నాం. మరి, న్యాయవిచారణ చేసే గంభీరమైన బాధ్యతను నిర్వర్తిస్తున్న సంఘ పెద్దలకు మనం మద్దతిస్తున్నామా?
కుటుంబాన్ని ఏర్పాటు చేసిన దేవుణ్ణి ఘనపర్చడం
22, 23. తొలినాళ్లలో జీవించిన సహోదరసహోదరీల గురించి చదివినప్పుడు మనం ఎందుకు సంతోషిస్తాం? అప్పట్లో, కుటుంబ జీవితానికి సంబంధించి ఎలాంటి అభిప్రాయం ఉండేది?
22 యేసు తన అనుచరులను శుద్ధీకరించిన మరో రంగం, వివాహానికి, కుటుంబ జీవితానికి సంబంధించినది. సంవత్సరాలు గడుస్తుండగా, కుటుంబ జీవితానికి సంబంధించి మన అవగాహన మరింత మెరుగైంది. ఉదాహరణకు, 20వ శతాబ్దం తొలిభాగంలో జీవించిన దేవుని సేవకుల జీవిత కథలు చదివినప్పుడు, వాళ్లు చేసిన త్యాగాలు చూసి ముగ్ధులమౌతాం, ఆశ్చర్యపోతాం. వాళ్లు తమ జీవితంలో అన్నిటికన్నా పవిత్ర సేవకే ప్రాముఖ్యత ఇచ్చినందుకు మనం సంతోషిస్తాం కూడా. అయితే, వాళ్లు ఒక విషయంలో సమతుల్యత చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఏమిటది?
23 అప్పట్లో సహోదరులు, పరిచర్యకు సంబంధించిన తమ నియామకాల కారణంగా లేదా ప్రయాణ సేవ కారణంగా ఎన్నో నెలలపాటు తమ కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వచ్చేది. అంతేకాదు, మన ప్రచురణలు చాలావరకు పెళ్లి చేసుకోకుండా ఉండడాన్నే ప్రోత్సహించేవి. నిజానికి, లేఖనాలు చెప్పేదాని కన్నా ఎక్కువగా ఆ విషయాన్ని నొక్కిచెప్పేవి. పైగా, కుటుంబ జీవితాన్ని ఎలా సంతోషభరితం చేసుకోవాలో ప్రచురణలు అంతగా చెప్పేవి కావు. మరి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉందా? లేదు!
కుటుంబ బాధ్యతల్ని పణంగా పెట్టి దైవపరిపాలనా నియామకాలు చేపట్టకూడదు
24. వివాహం, కుటుంబ జీవితం వంటి విషయాల్లో దేవుని ప్రజలు సరైన అవగాహనకు వచ్చేలా క్రీస్తు ఎలా సహాయం చేశాడు?
24 కుటుంబ బాధ్యతల్ని పణంగా పెట్టి దైవపరిపాలనా నియామకాలు చేపట్టకూడదని నేడు మనం అర్థం చేసుకున్నాం. (1 తిమోతి 5:8 చదవండి.) అంతేకాదు వివాహానికి, కుటుంబ జీవితానికి సంబంధించిన ఎన్నో బైబిలు సూత్రాలను సంస్థ ప్రచురించేలా క్రీస్తు నిర్దేశించాడు. (ఎఫె. 3:14, 15) 1978లో, నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకం ప్రచురించబడింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత, కుటుంబ సంతోషానికి గల రహస్యం అనే పుస్తకం విడుదలైంది. వీటితోపాటు, వివాహ బంధాన్ని బలపర్చుకోవడానికి సహాయం చేసే ఎన్నో బైబిలు సూత్రాలు కావలికోట ఆర్టికల్స్‌లో ప్రచురించబడ్డాయి.
25-27. సంవత్సరాలు గడుస్తుండగా, పిల్లల అవసరాలపై సంస్థ ఎలా దృష్టి పెట్టింది?
25 మరి పిల్లల సంగతేంటి? సంవత్సరాలు గడుస్తుండగా, యెహోవా సంస్థ పిల్లల అవసరాలపై మరింత దృష్టి పెట్టింది. వేర్వేరు వయసుల పిల్లల కోసం సంస్థ మంచి బహుమతుల్ని అందించింది. అలా, సన్నటిధార ఒక పెద్ద ప్రవాహంలా మారింది. ఉదాహరణకు, 1919 నుండి 1921 వరకు, ద గోల్డెన్ ఏజ్ పత్రికలో “పిల్లల బైబిలు పఠనం” అనే శీర్షిక క్రమంగా ప్రచురించబడేది. తర్వాత, 1920లో ద గోల్డెన్ ఏజ్ ఎ.బి.సి అనే బ్రోషురు, అలాగే 1941లో పిల్లలు (ఇంగ్లీషు) అనే పుస్తకం ప్రచురించబడ్డాయి. 1970లలో గొప్ప బోధకుడు చెప్పేది వినడం (ఇంగ్లీషు), మీ యౌవనం—దాన్ని శ్రేష్ఠంగా అనుభవించడం (ఇంగ్లీషు), నా బైబిలు కథలు పుస్తకాలు విడుదలయ్యాయి. 1982లో తేజరిల్లు! పత్రికలో “యువత ఇలా అడుగుతోంది” అనే శీర్షికతో క్రమంగా ఆర్టికల్స్ వచ్చాయి. వాటి ఆధారంగానే 1989లో యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఇంగ్లీషు) అనే పుస్తకాన్ని రూపొందించారు.
జర్మనీలో ఈ సమావేశంలో బైబిలు పాఠాలు నేర్చుకుందాం బ్రోషురు విడుదలైంది
26 ప్రస్తుతం మనకు యువత అడిగే ప్రశ్నలు (ఇంగ్లీషు) పుస్తకం రెండు తాజా సంపుటులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు, “యువత ఇలా అడుగుతోంది” అనే శీర్షికతో jw.org వెబ్సైట్లో క్రమంగా ఆర్టికల్స్ వస్తున్నాయి. అంతేకాదు, గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి అనే పుస్తకం కూడా అందుబాటులో ఉంది. మన వెబ్సైట్లో పిల్లల కోసం రూపొందించబడిన బైబిలు కార్డులు, చిన్నపిల్లలకు-పెద్దపిల్లలకు ఉపయోగపడే “చదివి కనిపెట్టండి” అనే బాక్సులు, పజిల్స్, వీడియోలు, బొమ్మలతో బైబిలు కథలు, మూడేళ్లు అంతకన్నా తక్కువ వయసున్న పిల్లల కోసం బైబిలు పాఠాలు ఉన్నాయి. మొదటి శతాబ్దంలో, క్రీస్తు చిన్నపిల్లల్ని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన ఏమి మారలేదు, ఇప్పటికీ ఆయనకు పిల్లలమీద అలాంటి ప్రేమే ఉంది. (మార్కు 10:13-16) నేడు కూడా, పిల్లలు తన ప్రేమను గుర్తించాలని, వాళ్లు ఆధ్యాత్మిక ఆహారంతో పోషించబడాలని ఆయన కోరుకుంటున్నాడు.
27 అంతేకాదు, హాని చేసేవాళ్ల నుండి పిల్లల్ని కాపాడాలని కూడా యేసు కోరుకుంటున్నాడు. నైతికంగా దిగజారిపోతున్న ఈ లోకంలో, పిల్లలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అలాంటి అత్యాచారాలకు గురవ్వకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా కాపాడాలో తెలియజేసే స్పష్టమైన, సూటైన నిర్దేశాలను సంస్థ ప్రచురించింది.d
28. (ఎ) ఆధ్యాత్మిక ఆలయంలోకి ప్రవేశించాలంటే ఏమి చేయాలని యెహెజ్కేలు దర్శనం చూపిస్తుంది? (బి) మీరు ఏమి చేయాలని నిశ్చయించుకున్నారు?
28 క్రీస్తు తన అనుచరులను ఎలా శుద్ధీకరిస్తున్నాడో ఇప్పటివరకు పరిశీలించాం. అలాగే, యెహోవా ఉన్నత నైతిక ప్రమాణాలను గౌరవించి, వాటిని పాటించేలా, వాటి నుండి ప్రయోజనం పొందేలా వాళ్లకు ఎలా శిక్షణ ఇస్తున్నాడో కూడా చూశాం. యెహెజ్కేలు దర్శనంలోని ఆలయం గురించి, దాని ఎత్తైన ద్వారాల గురించి మళ్లీ ఒకసారి ఆలోచించండి. నిజమే ఆ ఆలయం అక్షరార్థమైనది కాదు. అయినప్పటికీ దాన్ని మనం వాస్తవమైనదిగా చూస్తున్నామా? రాజ్యమందిరానికి వెళ్లడం, బైబిలు చదవడం, పరిచర్యలో పాల్గొనడం వంటివి చేసినంత మాత్రాన ఆ ఆధ్యాత్మిక ఆలయంలోకి ప్రవేశించలేం. ఎందుకంటే అవన్నీ పైకి కనిపించే పనులు. యెహోవా ఆలయంలో ఎప్పటికీ అడుగుపెట్టలేని వేషధారులు సైతం వాటిని చేయగలరు. అయితే, మనం అవన్నీ చేస్తూనే యెహోవా ఉన్నత నైతిక ప్రమాణాల ప్రకారం జీవించాలి, అలాగే సరైన హృదయంతో వాటిలో భాగం వహించాలి. అలా చేస్తేనే మనం అత్యంత పవిత్రమైన స్థలంలోకి, అంటే ఆధ్యాత్మిక ఆలయంలోకి ప్రవేశించగలం! ఆ అమూల్యమైన అవకాశాన్ని ఎప్పటికీ కాపాడుకుందాం. యెహోవా నీతి ప్రమాణాలను పాటిస్తూ, ఆయన పవిత్రతను ప్రతిబింబించడానికి చేయగలినదంతా చేద్దాం!
a దేవుని ప్రజలు తమ స్వదేశానికి తిరిగి రావడం, పవిత్ర ఆరాధనను తిరిగి స్థాపించడం గురించిన ప్రవచనాలు ఆధునిక కాలంలో ఆధ్యాత్మిక ఇశ్రాయేలు విషయంలో నెరవేరాయని 1932లో విండికేషన్ అనే పుస్తకం, 2వ సంపుటి తెలియజేసింది. యెహెజ్కేలు దర్శనం కూడా అలాంటి ఒక ప్రవచనమేనని, అది ఈ చివరి రోజుల్లో ఆధ్యాత్మిక భావంలో నెరవేరుతోందని 1999, మార్చి 1 కావలికోట చెప్పింది.
b ఆ తీర్మానం ప్రకారం, ఒక గదిలో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఒంటరిగా ఉంటే, వాళ్లు భార్యాభర్తలు లేదా సన్నిహిత కుటుంబ సభ్యులు కానప్పుడు తలుపు పూర్తిగా తెరిచిపెట్టాలి. ఆ తీర్మానాన్ని కొన్ని సంవత్సరాల పాటు, బెతెల్‌లో ఉదయకాల ఆరాధనలో ప్రతీరోజు బిగ్గరగా చదివేవాళ్లు.
c పొగతాగడం మాత్రమే కాదు, పొగాకు నమలడం లేదా దాన్ని పండించడం కూడా తప్పే.
d ఉదాహరణకు, గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి పుస్తకంలో 32వ అధ్యాయం; అలాగే 2007 తేజరిల్లు! (ఇంగ్లీషు) అక్టోబరు సంచికలో 3-11 పేజీలు చూడండి.