6వ అధ్యాయం
ఆమె ప్రార్థనలో దేవుని ముందు తన హృదయాన్ని కుమ్మరించింది
1, 2. (ఎ) ప్రయాణానికి సిద్ధమౌతున్నప్పుడు హన్నా ఎందుకు బాధగా ఉంది? (బి) హన్నా అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
హన్నా తన బాధను మర్చిపోవడానికని ప్రయాణ ఏర్పాట్లలో లీనమైపోయింది. అది ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయం. ఆమె భర్త ఎల్కానా, యెహోవాను ఆరాధించడానికి ప్రతీ ఏట కుటుంబాన్నంతా షిలోహులోని గుడారానికి తీసుకువెళ్లేవాడు. అలాంటి సందర్భాల్లో సంతోషంగా ఉండాలని యెహోవా చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 16:15 చదవండి.) హన్నా చిన్నప్పటినుండి అలాంటి పండుగలప్పుడు ఎంతో సంతోషంగా గడిపివుంటుంది. కానీ తర్వాత్తర్వాత ఆమె పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
2 హన్నాకు ప్రాణంగా ప్రేమించే భర్త దొరికాడు. అయితే ఎల్కానాకు మరో భార్య కూడా ఉంది. ఆమె పేరు పెనిన్నా. హన్నాకు మనశ్శాంతి లేకుండా చేయాలని ఆమె కంకణం కట్టుకుందని తెలుస్తోంది. ప్రతీ ఏడు వచ్చే ఇలాంటి పండుగ సందర్భాల్లో, హన్నాను మానసికంగా చిత్రవధ చేయడానికి ఒక మార్గాన్ని ఎంచుకుంది. ఇంతకీ ఏమిటది? అంతకంటే ముఖ్యంగా, తట్టుకోవడం సాధ్యం కాదనిపించే పరిస్థితుల్లో కూడా ఓపికగా మసలుకోవడానికి యెహోవామీద ఉన్న విశ్వాసం హన్నాకు ఎలా సహాయం చేసింది? జీవితంలో సంతోషాన్ని హరించివేసే పరిస్థితులు మీకు ఎదురౌతుంటే, హన్నా అనుభవం మీకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది.
‘నీకు మనోవిచారం ఎందుకు కలిగింది?’
3, 4. హన్నాకున్న రెండు పెద్ద సమస్యలు ఏమిటి? అవి రెండూ చాలా కష్టమైనవని ఎందుకు చెప్పవచ్చు?
3 హన్నా జీవితంలోని రెండు పెద్ద సమస్యల గురించి బైబిలు తెలియజేస్తోంది. ఆ రెండిటి విషయంలోనూ ఆమెది ఏమీ చేయలేని పరిస్థితి. మొదటి సమస్య ఏమిటంటే, ఆమె భర్త మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ వచ్చినామె హన్నాను ఎంతో ద్వేషించేది. రెండవ సమస్య ఏమిటంటే, హన్నాకు పిల్లలు లేరు. పిల్లల కోసం తపించే ఏ స్త్రీకైనా అదెంతో దుఃఖం కలిగించే విషయం. అయితే హన్నా కాలంలో, ఆ సంస్కృతిలో అలాంటి స్త్రీ తీవ్రమైన మనోవేదనకు గురయ్యేది. ప్రతీ కుటుంబం తమ ఇంటిపేరు నిలబెట్టే వారసుడి కోసం కలలు కనేది. పిల్లలు లేకపోవడం ఘోరమైన అవమానంగా భావించేవాళ్లు.
4 పెనిన్నా లేకపోయుంటే తన పరిస్థితిని తట్టుకోవడం హన్నాకు చాలా సులువైవుండేది. అప్పట్లో, ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకున్నవాళ్లు సమస్యల వలయంలో చిక్కుకునేవాళ్లు. అలాంటి కుటుంబాల్లో పోటీతత్వం, గొడవలు, మనోవేదన వంటివి సర్వసాధారణంగా ఉండేవి. ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడం, ఒక భర్తకు ఒకే భార్య ఉండాలని ఏదెను తోటలో దేవుడు పెట్టిన ప్రమాణానికి పూర్తి విరుద్ధం. (ఆది. 2:24) దాన్ని బైబిలు ప్రోత్సహించడం లేదు. ఎక్కువమందిని పెళ్లిచేసుకోవడం మంచిదికాదని అనడానికి ఎల్కానా కుటుంబంలోని పరిస్థితే ఒక ఉదాహరణ.
5. హన్నాను బాధపెట్టాలని పెనిన్నా ఎందుకు అనుకుంది? అందుకు ఏమి చేసింది?
5 హన్నా అంటే ఎల్కానాకు చాలా ఇష్టం. ఆయన హన్నాను పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకు పెనిన్నాను పెళ్లి చేసుకున్నాడని యూదుల అభిప్రాయం. హన్నా అంటే పెనిన్నాకు ఎంతో అసూయ, అందుకే ఆమెను నానా రకాలుగా వేధించేది. హన్నాకు పిల్లలు పుట్టలేదు, కానీ పెనిన్నాకు పుట్టారు. పెనిన్నా దాన్ని అవకాశంగా తీసుకుని హన్నాను మాటలతో గుచ్చేది. పిల్లలు పుట్టేకొద్దీ పెనిన్నా తన గురించి తాను గొప్పగా అనుకోవడం మొదలుపెట్టింది. హన్నాను చూసి జాలిపడి ఆమెను ఓదార్చే బదులు, పెనిన్నా ఆమెకున్న లోటును ఆసరాగా తీసుకుని ఇంకా దెప్పిపొడిచేది. హన్నాకు ‘కోపం పుట్టించాలనే’ ఉద్దేశంతో పెనిన్నా ఆమెను ఎంతో విసిగించిందని బైబిలు చెబుతోంది. (1 సమూ. 1:6) పెనిన్నా కావాలనే అలా చేసింది. ఆమె హన్నాను బాధ పెట్టాలనుకుంది, బాధపెట్టింది.
అసలే పిల్లలు లేరని బాధపడుతున్న హన్నాను ఇంకా ఏడిపించడానికి పెనిన్నా శతవిధాలా ప్రయత్నించింది
6, 7. (ఎ) ఎల్కానా హన్నాను ఊరడిస్తున్నప్పుడు, జరిగినదంతా ఆయనకు చెప్పడానికి ఆమె ఎందుకు ఇష్టపడివుండకపోవచ్చు? (బి) హన్నాకు పిల్లలు లేకపోవడానికి కారణం, యెహోవాకు ఆమె అంటే ఇష్టం లేకపోవడమా? వివరించండి. (అధస్సూచి చూడండి.)
6 ఎప్పటిలాగే ఎల్కానా కుటుంబం షిలోహుకు వెళ్లింది. హన్నాను బాధపెట్టడానికి అదో మంచి అవకాశమని పెనిన్నా అనుకునివుంటుంది. యెహోవాకు అర్పించిన బలి నుండి, పెనిన్నా ‘కుమారులకు, కుమార్తెలకు’ అందరికీ ఎల్కానా పాళ్లు ఇచ్చాడు. అయితే, ప్రియమైన హన్నాకు ఒక ప్రత్యేకమైన పాలు దొరికింది. అసూయతో నిండిన పెనిన్నా, హన్నా గొడ్రాలనే విషయాన్ని ఎత్తిచూపిస్తూ ఆమెను ఎంతగా క్షోభపెట్టిందంటే, హన్నా దుఃఖం కట్టలుతెంచుకుంది. ఆమె ఆకలి కూడా చచ్చిపోయింది. తన ప్రియాతిప్రియమైన భార్య మనోవేదనతో తిండీతిప్పలు మానేసిందని గమనించిన ఎల్కానా ఆమెను ఊరడించడానికి ప్రయత్నించాడు. ఆమెతో ఇలా అన్నాడు: ‘హన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? భోజనం మానడం దేనికి? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? పదిమంది కుమారుల కంటే నేను నీకు విశేషమైనవాడిని కానా?’—1 సమూ. 1:4-8.
7 హన్నా వేదనకు కారణం పిల్లలు లేకపోవడమేనని ఎల్కానాకు అర్థమైంది. ప్రేమతో ఆయన అన్న మాటలు ఆమెకు ఎంతో ఊరటనిచ్చివుంటాయి.a పెనిన్నా ద్వేషం గురించి ఎల్కానా ఎత్తలేదు. హన్నా కూడా ఆయనకు ఆ విషయం చెప్పినట్లు బైబిల్లో లేదు. పెనిన్నా దుష్టబుద్ధిని బయటపెడితే తన పరిస్థితి ఇంకా దారుణంగా తయారౌతుందని బహుశా ఆమెకు అనిపించివుంటుంది. ఎల్కానా, పరిస్థితిలో నిజంగా మార్పు ఏమైనా తీసుకురాగలడా? లేకపోతే, పెనిన్నా ద్వేషం ఇంకా ఎక్కువౌతుందా? ఆమె పిల్లలు, సేవకులు కూడా హన్నా మీద ద్వేషం పెంచుకొని ఆమె పరిస్థితిని మరింత దుర్భరం చేస్తారా? అదే గనుక జరిగితే హన్నాకు, సొంత ఇంట్లోనే పరాయి మనిషిలా బ్రతికే దుస్థితి ఏర్పడుతుంది.
ఇంట్లోవాళ్లు వేధించినప్పుడు హన్నా యెహోవా మీద ఆధారపడింది
8. మీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, యెహోవా న్యాయవంతుడని గుర్తుంచుకోవడం ఎందుకు ఊరటనిస్తుంది?
8 పెనిన్నా ద్వేషం గురించి ఎల్కానాకు పూర్తిగా తెలుసో లేదో కానీ యెహోవా దేవునికి మాత్రం తెలుసు. ఆయన అంతా చూశాడని బైబిలు చెబుతోంది. చిన్నచిన్న విషయాల్లో అయినా సరే అసూయాద్వేషాలు చూపిస్తూ ఆనందించేవాళ్లకు అదో గట్టి హెచ్చరిక. అయితే దేవుడు తాను అనుకున్న సమయంలో, తనదైన పద్ధతిలో పరిస్థితులను సరిదిద్దుతాడని తెలుసుకోవడం హన్నాలాంటి నిర్దోషులకు, శాంతికాముకులకు ఊరటనిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 32:4 చదవండి.) హన్నాకు ఈ విషయం తెలిసేవుంటుంది, అందుకే సహాయం కోసం ఆమె యెహోవాను ఆశ్రయించింది.
‘దుఃఖించడం మానేసింది’
9. పెనిన్నా పోరు తప్పదని తెలిసినా హన్నా ప్రయాణానికి సిద్ధమవడం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?
9 ఆ రోజు తెల్లవారుజామునే ఇల్లంతా సందడిసందడిగా ఉంది. పిల్లలు పెద్దలు అందరూ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ పెద్ద కుటుంబం షిలోహుకు చేరుకోవాలంటే, కొండలు, గుట్టలు ఉన్న ఎఫ్రాయిములో 30 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలి.b కాలినడకన వెళ్తే ఒకట్రెండు రోజుల ప్రయాణం. అక్కడ పెనిన్నా పోరు తనకు తప్పదని హన్నాకు తెలుసు. అలాగని, ఆమె ఇంటి దగ్గరే ఉండిపోలేదు. ఈనాటికీ దేవుని ఆరాధకులకు ఆమె ఆదర్శప్రాయంగా ఉంది. ఇతరుల చెడు ప్రవర్తనను చూసి, దేవుని ఆరాధనను మానడం తెలివైన పని కానేకాదు. ఒకవేళ మనం అదే చేస్తే, ఆ పరిస్థితిని సహించడానికి కావాల్సిన బలాన్నిచ్చే ఆశీర్వాదాలను చేజేతులా జారవిడుచుకుంటాం.
10, 11. (ఎ) హన్నా యెహోవా గుడారానికి వీలైనంత త్వరగా ఎందుకు వెళ్లింది? (బి) ప్రార్థనలో హన్నా తన పరలోక తండ్రి ముందు హృదయాన్ని ఎలా కుమ్మరించింది?
10 వంపులు తిరిగిన కొండమార్గంలో రోజంతా ప్రయాణం చేసి ఈ పెద్ద కుటుంబం కొండ మీదున్న షిలోహుకు చేరుకుంది. ఆ కొండ చుట్టూరా పెద్దపెద్ద కొండలున్నాయి. షిలోహు దగ్గరపడుతుండగా, ప్రార్థనలో యెహోవాకు ఏమి చెప్పాలనేదాని గురించి హన్నా ఎంతో ఆలోచించివుంటుంది. వాళ్లు అక్కడికి చేరుకున్నాక అందరూ కలిసి భోంచేశారు. హన్నా వీలైనంత త్వరగా అక్కడనుండి బయటపడి యెహోవా గుడారానికి వెళ్లింది. అక్కడ స్తంభం దగ్గర ప్రధానయాజకుడు ఏలీ కూర్చొనివున్నాడు. హన్నా మనసంతా తన దేవునిపైనే ఉంది. గుడారంలోనైతే దేవుడు తన ప్రార్థన వింటాడని ఆమె నమ్మకం. ఆమె బాధను ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా, పరలోకంలోవున్న ఆమె తండ్రి అర్థంచేసుకోగలడు. ఆమె దుఃఖం పట్టలేక ఏడ్చేసింది.
11 హన్నా వెక్కివెక్కి ఏడుస్తుంటే ఆమె ఒళ్లంతా వణికిపోయింది. ఆమె మనసులోనే యెహోవాతో మాట్లాడడం మొదలుపెట్టింది. తన గోడు చెప్పుకోవడానికి మనసులోని మాటలను కూడగట్టుకుంటున్నప్పుడు ఆమె పెదవులు కదిలాయి. ఆమె తన తండ్రి ముందు హృదయాన్ని కుమ్మరిస్తూ చాలాసేపు ప్రార్థించింది. సంతానం కావాలనే కోరికను మాత్రమే హన్నా వెలిబుచ్చలేదు. దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఆమె ఎంత కోరుకుందో, ఆయనకు తాను ఇవ్వగలిగింది ఇవ్వాలని కూడా అంతే కోరుకుంది. అందుకే, తనకు మగపిల్లవాడు పుడితే, వాణ్ణి యెహోవా సేవకు అంకితం చేస్తానని మొక్కుబడి చేసుకుంది.—1 సమూ. 1:9-11.
12. ప్రార్థిస్తున్నప్పుడు ఏ విషయాన్ని మనసులో ఉంచుకోవాలని హన్నా ఉదాహరణ చూపిస్తోంది?
12 అలా హన్నా, ప్రార్థన విషయంలో దేవుని సేవకులందరికీ ఆదర్శాన్ని ఉంచింది. ప్రేమగల తల్లిదండ్రుల మీద నమ్మకంతో ఒక పిల్లవాడు తన సమస్యల గురించి చెప్పుకున్నట్లే, అన్ని విషయాలూ తనతో నిస్సంకోచంగా చెప్పుకోమని యెహోవా మనల్ని ప్రేమతో ప్రోత్సహిస్తున్నాడు. (కీర్తన 62:8; 1 థెస్సలొనీకయులు 5:15 చదవండి.) ప్రార్థించే విషయంలో, అపొస్తలుడైన పేతురు దైవప్రేరణతో రాసిన ఈ మాటలు మనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి: “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”—1 పేతు. 5:7.
13, 14. (ఎ) హన్నా విషయంలో ఏలీ ఏమని పొరపడ్డాడు? (బి) అప్పుడు హన్నా స్పందించిన తీరును బట్టి, విశ్వాసం విషయంలో ఆమె మనకు చక్కని ఆదర్శమని ఎలా తెలుస్తోంది?
13 అయితే, యెహోవా అర్థంచేసుకున్నంతగా మనుషులు అర్థంచేసుకోలేరు, ఆయనంత సహానుభూతి చూపించలేరు. ఏడుస్తూ ప్రార్థిస్తున్న హన్నా ఒక స్వరం విని ఉలికిపడింది. ఆ స్వరం, ఆమెను గమనిస్తున్న ప్రధానయాజకుడు ఏలీది. ఆయన ఆమెతో ఇలా అన్నాడు: ‘ఎంతవరకు నువ్వు మత్తురాలిగా ఉంటావు? ద్రాక్షారసాన్ని నీ దగ్గర నుండి తీసివేయి.’ హన్నా పెదవులు కదలడం, ఆమె వెక్కివెక్కి ఏడ్వడం ఆయన చూశాడు. ఆమె మానసిక స్థితిని కూడా గమనించాడు. విషయం తెలుసుకోకుండానే, ఆమె మత్తులో ఉందనే నిర్ణయానికి వచ్చేశాడు.—1 సమూ. 1:12-14.
14 అంత ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి అన్యాయంగా తనను నిందించడం, అప్పటికే బాధతో కుమిలిపోతున్న హన్నాను ఇంకెంత బాధపెట్టివుంటుందో! అయినాసరే ఆమె అచంచల విశ్వాసం చూపించి మనకు ఆదర్శంగా నిలిచింది. ఒక వ్యక్తి అపరిపూర్ణత, యెహోవాను ఆరాధించకుండా ఆమెను ఆపలేకపోయింది. ఆమె తన పరిస్థితి గురించి గౌరవపూర్వకంగా ఏలీకి వివరించింది. తన పొరపాటు గ్రహించిన ఏలీ కాస్త మృదు స్వరంతో ఇలా అన్నాడు: ‘నువ్వు క్షేమంగా వెళ్లు; ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక.’—1 సమూ. 1:15-17.
15, 16. (ఎ) ప్రార్థనలో హన్నా తన హృదయాన్ని కుమ్మరించినందుకు, గుడారంలో యెహోవాను ఆరాధించినందుకు ఏమి జరిగింది? (బి) బాధతో కృంగిపోయినప్పుడు, హన్నాలా మనమేమి చేయవచ్చు?
15 ప్రార్థనలో హన్నా యెహోవా ముందు తన హృదయాన్ని కుమ్మరించినందుకు, ఆయన గుడారంలో ఆయనను ఆరాధించినందుకు ఏమి జరిగింది? బైబిలు ఇలా చెబుతోంది: ‘ఆ స్త్రీ తన దారిన వెళ్లిపోయి భోజనం చేస్తూ ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండడం మానేసింది.’ (1 సమూ. 1:18) హన్నా మనసు ఎంతో కుదుటపడింది. ఒక రకంగా, తన మనోభారాన్నంతా తనకన్నా ఎంతో బలవంతుడైన తన పరలోక తండ్రి భుజాలమీద పెట్టేసింది. (కీర్తన 55:22 చదవండి.) ఆయన పరిష్కరించలేని సమస్య అంటూ ఏదైనా ఉందా? లేనేలేదు. ఎప్పటికీ ఉండబోదు కూడా!
16 బాధతో కృంగిపోయినప్పుడు, హన్నాలాగే మనం కూడా ‘ప్రార్థన ఆలకించువాడైన’ దేవుని ముందు మన హృదయాన్ని కుమ్మరించడం మంచిది. (కీర్త. 65:2) అలా చేస్తే మన బాధంతా మటుమాయమౌతుంది. ‘సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం’ మన మనసుకు దొరుకుతుంది.—ఫిలి. 4:6, 7.
‘మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదీ లేదు’
17, 18. (ఎ) హన్నా మొక్కుబడికి ఎల్కానా ఎలా మద్దతిచ్చాడు? (బి) పెనిన్నా ఏమి తెలుసుకుంది?
17 మర్నాడు ఉదయం ఎల్కానాతోపాటు హన్నా మళ్లీ గుడారానికి వచ్చింది. దేవునికి చేసుకున్న విన్నపం గురించి, మొక్కుబడి గురించి భర్తకు చెప్పివుంటుంది. ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం, తన అనుమతి లేకుండా భార్య చేసుకున్న మొక్కుబడిని రద్దు చేసే అధికారం భర్తకు ఉండేది. (సంఖ్యా. 30:10-15) కానీ, నమ్మకస్థుడైన ఎల్కానా తన భార్య మొక్కుబడిని రద్దు చేయలేదు. పైగా, ఇంటికి బయలుదేరేముందు ఇద్దరూ కలిసి గుడారంలో యెహోవాను ఆరాధించారు.
18 హన్నాను వేధించడం ఇక కుదరదని పెనిన్నా ఎప్పుడు గ్రహించింది? బైబిలు చెప్పడం లేదు. కానీ హన్నా, ‘దుఃఖముఖిగా ఉండడం మానేసింది’ అనే మాటల్ని చూస్తే, ఆ తర్వాతి నుండి ఆమె దుఃఖించడం మానేసి సంతోషంగా ఉందని తెలుస్తోంది. ఏదేమైనా, హన్నా జోలికి వెళ్లడం వల్ల లాభమేమీ లేదని పెనిన్నా త్వరలోనే తెలుసుకుంది. బైబిల్లో ఆమె ప్రస్తావన ఆ తర్వాత ఇక కనిపించదు.
19. హన్నా ఏ ఆశీర్వాదం పొందింది? ఆ ఆశీర్వాదం ఎక్కడనుండి వచ్చిందో తను గుర్తించిందని ఆమె ఎలా చూపించింది?
19 కొన్ని నెలలు గడిచిపోయాయి. ప్రశాంతంగా ఉన్న హన్నా మనసు ఒక్కసారిగా పట్టలేనంత సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆమె గర్భవతి అయ్యింది! అంత సంతోషంలో కూడా, తనను ఆశీర్వదించింది ఎవరనే విషయాన్ని హన్నా ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. పిల్లవాడు పుట్టినప్పుడు, వాడికి సమూయేలు (“దేవుని పేరు” అని అర్థం) అని పేరు పెట్టింది. హన్నా చేసినట్లే, యెహోవా పేరున ప్రార్థించడాన్ని అది సూచిస్తుండవచ్చు. ఆ సంవత్సరం ఆమె కుటుంబంతో కలిసి షిలోహుకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయింది. మూడేళ్లపాటు, అంటే పిల్లవాడు పాలు తాగడం మానేసే వరకు అలాగే చేసింది. తన ముద్దుల కుమారుణ్ణి విడిచిపెట్టే రోజు కోసం కావాల్సిన ధైర్యం కూడగట్టుకుంది.
20. యెహోవాతో చేసుకున్న మొక్కుబడిని హన్నా, ఎల్కానా ఎలా చెల్లించారు?
20 కుమారుణ్ణి విడిచిపెట్టడం ఆ తల్లికి ఎంత కష్టంగా ఉండివుంటుందో కదా! గుడారంలో సేవ చేసే కొందరు స్త్రీలు సమూయేలును బాగా చూసుకుంటారని హన్నాకు తెలుసు. అయితే సమూయేలు ఇంకా పసివాడే, కన్నబిడ్డకు దూరంగా ఉండాలని ఏ తల్లి మాత్రం కోరుకుంటుంది? అయినా ఆ తల్లిదండ్రులు సణుగుకోకుండా, యెహోవా మీద కృతజ్ఞతతో పిల్లవాణ్ణి అక్కడకు తీసుకువెళ్లారు. గుడారంలో బలులు అర్పించారు. కొన్నేళ్ల క్రితం హన్నా చేసుకున్న మొక్కుబడిని ఏలీకి గుర్తుచేసి, సమూయేలును ఆయన చేతుల్లో పెట్టారు.
హన్నా ఒక మంచి తల్లిగా నిరూపించుకుంది
21. యెహోవా మీద హన్నాకు ఎంత గొప్ప విశ్వాసం ఉందో ఆమె ప్రార్థన ఎలా చూపిస్తుంది? (“రెండు విశేషమైన ప్రార్థనలు” అనే బాక్సు కూడా చూడండి.)
21 ఆ తర్వాత హన్నా చేసిన ప్రార్థన, తన వాక్యంలో భద్రపర్చడానికి తగినదని యెహోవాకు అనిపించింది. 1 సమూయేలు 2:1-10 లో ఆ ప్రార్థన ఉంది. ఆమె మాట్లాడిన ఒక్కో మాటలో ఆమెకెంత గొప్ప విశ్వాసం ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. యెహోవా తన శక్తిని అద్భుతరీతిలో ఉపయోగించాడని ఆయనను స్తుతించింది. అంటే గర్విష్ఠుల్ని అణచివేయడంలో, అణచివేతకు గురైన వాళ్లను ఆశీర్వదించడంలో, తన ప్రజలను కాపాడడంలో, దుష్టులను నాశనం చేయడంలో ఆయనకున్న సాటిలేని సామర్థ్యాన్ని ఘనపర్చింది. తన తండ్రి అత్యంత పరిశుద్ధుడని, న్యాయవంతుడని, నమ్మదగినవాడని అంటూ ఆయనను కొనియాడింది. ‘మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదీ లేదు’ అని హన్నా మంచి కారణంతోనే అనగలిగింది. యెహోవా ఎంతో నమ్మదగినవాడు, మార్పులేనివాడు. సహాయం కోసం తనను ఆశ్రయించే వాళ్లందరికీ, అణచివేతకు గురైన వాళ్లందరికీ ఆయన ఆశ్రయంగా ఉంటాడు.
22, 23. (ఎ) తల్లిదండ్రులు తనను ప్రేమిస్తున్నారనే నమ్మకంతో సమూయేలు పెరిగివుంటాడని మనం ఎలా చెప్పవచ్చు? (బి) యెహోవా హన్నాను ఇంకా ఎలా ఆశీర్వదించాడు?
22 యెహోవా మీద అంత విశ్వాసమున్న తల్లికి బిడ్డగా పుట్టడం చిన్నారి సమూయేలుకు దొరికిన వరం. ఎదుగుతున్న సమూయేలుకు, తల్లి తన దగ్గర ఉంటే బాగుండునని అప్పుడప్పుడు తప్పక అనిపించివుంటుంది. అయినా తల్లిదండ్రులు తనను పట్టించుకోవడం లేదని సమూయేలుకు ఎప్పుడూ అనిపించివుండదు. హన్నా ప్రతీ ఏడు షిలోహుకు వచ్చినప్పుడల్లా తన ముద్దుల బాబుకు ప్రేమతో చిన్న అంగీ ఒకటి కుట్టి తెచ్చేది. గుడారంలో సేవ చేసేటప్పుడు సమూయేలు దాన్ని వేసుకునేవాడు. (1 సమూయేలు 2:19 చదవండి.) హన్నా తాను తెచ్చిన అంగీని బిడ్డకు తొడిగి, దాన్ని సర్దుతూ వాణ్ణి మురిపెంగా చూసుకొనివుంటుంది. ఆప్యాయంగా మాట్లాడుతూ కుమారుణ్ణి ప్రోత్సహించివుంటుంది. అలాంటి తల్లి ఉండడం సమూయేలుకు నిజంగా ఒక ఆశీర్వాదమే. ఆయన పెద్దవాడైనప్పుడు తన తల్లిదండ్రులకు, ఇశ్రాయేలీయులందరికి ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు.
23 యెహోవా కూడా హన్నాను మర్చిపోలేదు. ఆయన ఆశీర్వాదంతో, ఆమెకు ఆ తర్వాత ఐదుగురు పిల్లలు పుట్టారు. (1 సమూ. 2:21) బహుశా హన్నా పొందిన అతిగొప్ప ఆశీర్వాదం, తన తండ్రి యెహోవాతో ఆమెకున్న బంధమే అయ్యుంటుంది. సంవత్సరాలు గడిచేకొద్దీ ఆ బంధం అంతకంతకూ బలపడుతూ వచ్చింది. మీరూ హన్నాలా విశ్వాసం చూపిస్తే మీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది.
a యెహోవా ‘హన్నాకు సంతానం లేకుండా చేశాడు’ అని బైబిల్లో ఉంది. అంతమాత్రాన ఎంతో వినయస్థురాలు, నమ్మకస్థురాలు అయిన హన్నాను దేవుడు ఇష్టపడివుండడని అనడానికి ఏ ఆధారం లేదు. (1 సమూ. 1:5) దేవుడు కొంతకాలంపాటు అనుమతించిన సంఘటనలకు కారణం ఆయనే అన్నట్లు బైబిలు కొన్నిసార్లు మాట్లాడుతోంది.
b ఎల్కానా సొంత పట్టణమైన రామా, యేసు కాలంలో అరిమత్తయియ అనే పేరున్న స్థలం ఒకటే అయివుండవచ్చు. దాని ఆధారంగానే ఈ దూరాన్ని లెక్కించారు.