11వ పాఠం
మేము సమావేశాలకు ఎందుకు హాజరౌతాం?
మెక్సికో
జర్మనీ
బోట్సువానా
నికరాగ్వా
ఇటలీ
ఇక్కడున్న వాళ్లు ఎందుకంత సంతోషంగా ఉన్నారు? ఎందుకంటే వాళ్లు మా సమావేశాల్లో ఒకదానికి వచ్చారు. సంవత్సరానికి మూడుసార్లు సమావేశమవ్వాలని దేవుడు ప్రాచీనకాలంలోని తన సేవకులకు ఆజ్ఞాపించాడు, వాళ్లలాగే మేము కూడా పెద్ద గుంపుగా సమావేశమవ్వడానికి ఎదురుచూస్తాం. (ద్వితీయోపదేశకాండం 16:16) ప్రతీ సంవత్సరం మాకు మూడు సమావేశాలు ఉంటాయి: రెండు ప్రాంతీయ సమావేశాలు, ఒక ప్రాదేశిక సమావేశం. ప్రాంతీయ సమావేశం ఒకరోజు పాటు జరుగుతుంది, ప్రాదేశిక సమావేశం మూడురోజుల పాటు జరుగుతుంది. వాటికి వెళ్లడం వల్ల మేము ఎలా ప్రయోజనం పొందుతాం?
మా క్రైస్తవ సహోదరసహోదరీలకు దగ్గరౌతాం. ఇశ్రాయేలీయులు “సమావేశంలో” ఆనందంగా యెహోవాను స్తుతించినట్టే, మేము కూడా ఈ ప్రత్యేక సందర్భాల్లో కలిసి ఆనందంగా ఆయన్ని ఆరాధిస్తాం. (కీర్తన 26:12; 111:1) సమావేశాల్లో, వేరే సంఘాల లేదా దేశాల సాక్షులతో సమయం గడిపే అవకాశం మాకు దొరుకుతుంది. మధ్యాహ్నం మేము సమావేశ స్థలం దగ్గరే భోజనం చేస్తాం, దానివల్ల కొత్త స్నేహాలు ఏర్పర్చుకోగలుగుతాం. (అపొస్తలుల కార్యాలు 2:42) “ప్రపంచవ్యాప్త సహోదర బృందాన్ని” ఐక్యం చేసే ప్రేమను మేము ఈ సమావేశాల్లో రుచిచూస్తాం.—1 పేతురు 2:17.
ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించగలుగుతాం. సమావేశాల్లో, ఇశ్రాయేలీయులు లేఖనాల నుండి ‘వివరించబడిన విషయాలు అర్థం చేసుకుని’ ప్రయోజనం పొందారు. (నెహెమ్యా 8:8, 12) అదేవిధంగా, మా సమావేశాల్లో ఇచ్చే బైబిలు ఉపదేశం మాకెంతో విలువైనది. ప్రతీ సమావేశ కార్యక్రమాన్ని ఒక లేఖనం ఆధారంగా తయారుచేస్తారు. ఆసక్తికరమైన ప్రసంగాలు, పునర్నటనలు మా జీవితంలో దేవుని ఇష్టాన్ని ఎలా చేయాలో నేర్పిస్తాయి. ఈ కష్టకాలాల్లో, క్రైస్తవ జీవితంలోని సవాళ్లను చక్కగా అధిగమిస్తున్న తోటివాళ్ల అనుభవాలు మాకు బలాన్నిస్తాయి. ప్రాదేశిక సమావేశాల్లో చూపించే వీడియో డ్రామాలు బైబిలు వృత్తాంతాల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి, మంచి పాఠాలు నేర్పిస్తాయి. దేవునికి సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవాలని అనుకునేవాళ్లకు సమావేశాల్లో బాప్తిస్మం ఇస్తారు.
సమావేశాలు సంతోషాన్నిచ్చే సందర్భాలని ఎందుకు చెప్పవచ్చు?
సమావేశానికి రావడం వల్ల మీరెలా ప్రయోజనం పొందవచ్చు?