భాగం 15
బంధీగావున్న ఓ ప్రవక్త భవిష్యత్తులో జరగబోయేవాటిని చూశాడు
దేవుని రాజ్యం గురించి, మెస్సీయ రాక గురించి దానియేలు ప్రవచించాడు. బబులోను నాశనం అయ్యింది
యెరూషలేము నాశనానికి ముందు బబులోనీయులు కొంతమంది యూదుల్ని బంధీలుగా తీసుకెళ్లారు. వాళ్ళలో దైవభక్తిగల యువకుడైన దానియేలు కూడా ఉన్నాడు. అయితే, బబులోనీయులు దానియేలుకు, ఇంకొంతమంది యువకులకు కొంత స్వేచ్ఛనిచ్చారు. దానియేలు బబులోనులో ఉన్నంతకాలం దేవుడు ఆయన్ని ఎంతో ఆశీర్వదించాడు. ఒకసారి ఆయన్ని సింహాల గుహలో పడేసినా ప్రాణాలతో బయటికి వచ్చాడు. దేవుడు ఆయనకు భవిష్యత్తులో జరగబోయేవాటిని దర్శనాల్లో చూపించాడు. దానియేలు రాసిన ప్రవచనాల్లో ముఖ్యమైనవి మెస్సీయ, ఆయన పరిపాలన గురించినవి.
మెస్సీయ ఎప్పుడు వస్తాడో దానియేలుకు తెలిసింది. యెరూషలేము గోడలు మళ్లీ కట్టించవచ్చనే ఆజ్ఞ ఇవ్వబడిన 69 వారాల తర్వాత “అభిషిక్తుడగు అధిపతి” లేదా మెస్సీయ వస్తాడని దానియేలుకు తెలియజేయబడింది. ఆ ఆజ్ఞ దానియేలు చనిపోయిన చాలా కాలానికి అంటే సా.శ.పూ. 455లో జారీ అయింది. సాధారణంగా వారానికి ఏడు రోజులుంటాయి. ఒక రోజును ఒక సంవత్సరంగా తీసుకుంటే ఒక వారం ఏడు సంవత్సరాలతో సమానం. ఆ లెక్కన, 69 “వారాలు” (69 x 7) 483 సంవత్సరాలతో సమానం. అంటే ఆ కాలం సా.శ.పూ. 455లో మొదలై సా.శ. 29వ సంవత్సరంలో ముగిసింది. ఆ సంవత్సరంలో ఏమి జరిగిందో దీని తర్వాతి అధ్యాయం వివరిస్తుంది. మనుషుల పాపాలకు ప్రాయశ్చిత్తం కలగడానికి భవిష్యత్తులో మెస్సీయ “నిర్మూలము చేయబడును” లేదా చంపబడతాడు అని కూడా దానియేలుకు దర్శనంలో తెలిసింది.—దానియేలు 9:24-26.
మెస్సీయ పరలోకంలో రాజవుతాడు. దానియేలు పరలోకానికి సంబంధించిన ఓ మహిమాన్విత దర్శనంలో, ‘మనుష్యకుమారుని పోలిన ఒకరు’ అంటే మెస్సీయ యెహోవా సింహాసనం దగ్గరకు వెళ్లడం చూశాడు. యెహోవా ఆయనకు “రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును” ఇవ్వడాన్ని చూశాడు. ఆ రాజ్యం ఎప్పటికీ నిలుస్తుంది. దానియేలు మెస్సీయ రాజ్యం గురించి ఆశ్చర్యకరమైన మరో విషయాన్ని తెలుసుకున్నాడు. అదేమిటంటే, “మహోన్నతుని పరిశుద్ధులు” అనే ఒక గుంపుకు చెందినవాళ్లు కూడా మెస్సీయ రాజుతోపాటు పరిపాలన చేస్తారు.—దానియేలు 7:13, 14, 27.
మెస్సీయ రాజ్యం ఈ లోక ప్రభుత్వాలను నాశనం చేస్తుంది. బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. కలవరపర్చిన ఆ కల భావాన్ని చెప్పే సామర్థ్యాన్ని దేవుడు దానియేలుకు ఇచ్చాడు. రాజు తన కలలో ఒక పెద్ద ప్రతిమను చూశాడు. దాని తల బంగారుది, దాని రొమ్ము, భుజాలు వెండివి. దాని ఉదరము, తొడలు ఇత్తడివి. దాని మోకాళ్లు ఇనుపవి. దాని పాదాల్లో ఇనుము, మట్టి కలిసి ఉన్నాయి. పర్వతం నుండి తీయబడిన ఒక రాయి దాని బలహీనమైన పాదాలమీద పడి ఆ ప్రతిమను పొడి చేసింది. ఆ ప్రతిమలోని ఒక్కో భాగం ప్రపంచాన్ని ఏలే ఒక్కో సామ్రాజ్యమని దానియేలు వివరించాడు. ఆ ప్రతిమ బంగారు తల మొదటి ప్రపంచాధిపత్యమైన బబులోను అని కూడా ఆయన చెప్పాడు. పాదాలకు సూచనగావున్న చివరి ప్రపంచాధిపత్యం ఈ దుష్టలోకాన్ని ఏలుతున్న కాలంలో దేవుని రాజ్యం అనే రాయి చర్య తీసుకుంటుందని కూడా దానియేలుకు దర్శనంలో తెలియజేయబడింది. దేవుని రాజ్యం ఈ లోక ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేసి, అదే శాశ్వతంగా పరిపాలిస్తుంది.—దానియేలు 2వ అధ్యాయం.
వృద్ధుడైన దానియేలు బ్రతికి ఉన్నప్పుడే బబులోను నాశనమైంది. ప్రవక్తలు చెప్పినట్టే, కోరెషు రాజు బబులోనును జయించాడు. ప్రవచించబడినట్టే యూదా 70 సంవత్సరాలపాటు నిర్జనంగా ఉన్న తర్వాత యూదులు విడుదల పొంది తిరిగి వెళ్లారు. నమ్మకస్థులైన అధిపతుల, యాజకుల, ప్రవక్తల నడిపింపుతో యూదులు చివరకు యెరూషలేమును, యెహోవా ఆలయాన్ని తిరిగి కట్టారు. అయితే, ఆ 483 సంవత్సరాలు పూర్తయ్యాక ఏమి జరుగుతుంది?
—దానియేలు గ్రంథము.