భాగం 12
దేవుడిచ్చే జ్ఞానం జీవితంలో మనకు నిర్దేశాన్నిస్తుంది
రోజువారీ జీవితంలో కావాల్సిన నిర్దేశాన్నిచ్చే దేవుని ఉపదేశాలు సామెతల పుస్తకంలో ఉన్నాయి. ఈ సామెతల్లో చాలావాటిని సొలొమోను రాశాడు
యెహోవా జ్ఞానంగల పరిపాలకుడేనా? ఆయనిచ్చిన ఉపదేశాన్ని పరిశీలిస్తే ఈ ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ ఉపదేశం జీవితంలో నిజంగా ఉపయోగపడుతుందా? దాన్ని పాటిస్తే జీవితం మెరుగవుతుందా? జీవితం సార్థకమవుతుందా? జ్ఞానియైన సొలొమోను రాజు వందలాది సామెతలు రాశాడు. సామెతల పుస్తకంలో జీవితంలోని ప్రతీ అంశానికి సంబంధించిన సామెతలున్నాయి. కొన్ని ఉదాహరణలను చూడండి.
మనం దేవునిపై నమ్మకం ఉంచాలి. దేవునితో మంచి సంబంధం కలిగివుండాలంటే మనం ఆయనమీద నమ్మకం ఉంచడం చాలా అవసరం. సొలొమోను ఇలా రాశాడు: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామెతలు 3:5, 6) దేవుని మీద నమ్మకముంచి, ఆయనిచ్చిన ఉపదేశాన్ని పాటిస్తూ ఆయనకు లోబడితే జీవితం సార్థకమౌతుంది. మనమలా జీవిస్తే యెహోవాను సంతోషపెట్టగలుగుతాం, అప్పుడు ఆయన తన శత్రువైన సాతాను వేసిన నిందలు తప్పని రుజువు చేయగలుగుతాడు.—సామెతలు 27:11.
ఇతరులతో జ్ఞానయుక్తంగా మెలగండి. మనకాలంలో భర్తలకు, భార్యలకు, పిల్లలకు దేవుని ఉపదేశం మరెంతో అవసరం. “నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము” అంటే భర్త తన భార్యకు నమ్మకంగా కట్టుబడి ఉండాలి అని దేవుడు భర్తలకు ఉపదేశించాడు. (సామెతలు 5:18-20) భర్త, పిల్లల మెప్పును చూరగొనే సమర్థురాలైన భార్య గురించి ఆ పుస్తకం చాలా చక్కగా వర్ణించింది. (సామెతలు 31వ అధ్యాయం) పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడాలని ఆ పుస్తకం ఉపదేశిస్తోంది. (సామెతలు 6:20) ఎవ్వరితో కలవకుండా వేరుగా ఉంటే స్వార్థం పెరుగుతుంది కాబట్టి ఇతరులతో స్నేహం చేయడం అవసరమని కూడా ఈ పుస్తకం వివరిస్తోంది. (సామెతలు 18:1) స్నేహితులు మనం మంచి బాటలో నడవడానికి సహాయం చేయవచ్చు లేదా మనల్ని పెడత్రోవ పట్టించవచ్చు కాబట్టి స్నేహితులను జ్ఞానయుక్తంగా ఎంచుకోవాలని కూడా చెప్తోంది.—సామెతలు 13:20; 17:17.
మీ జీవితంలో జ్ఞానయుక్తంగా ప్రవర్తించండి. సామెతల పుస్తకంలో వెలకట్టలేని మంచి ఉపదేశం ఉంది. మద్యం అతిగా తాగకూడదని, చెడు లక్షణాలను వదిలేయడానికి కృషిచేస్తూ మంచి లక్షణాలను అలవర్చుకోమని, కష్టపడి పనిచేయమని అది ప్రోత్సహిస్తోంది. (సామెతలు 6:6; 14:30; 20:1) దేవుని ఉపదేశాన్ని పక్కనపెట్టి, సొంత తెలివితేటలమీద ఆధారపడితే జీవితం నాశనమవుతుందని ఈ పుస్తకం హెచ్చరిస్తోంది. (సామెతలు 14:12) “హృదయములోనుండి జీవధారలు బయలుదేరును” కాబట్టి చెడు ప్రభావాలకు లోనవకుండా మన హృదయాన్ని కాపాడుకోమని అది ప్రోత్సహిస్తోంది.—సామెతలు 4:23.
సామెతల పుస్తకంలోని ఉపదేశాన్ని పాటించడంవల్ల తమ జీవితాలు మెరుగయ్యాయని ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందికి అనిపించింది. అందుకే వాళ్లు యెహోవా దేవుణ్ణి తమ పరిపాలకుడిగా అంగీకరించారు.
—సామెతల పుస్తకం.