భాగం 11
మనకు బోధించడానికి, మనల్ని ఓదార్చడానికి దేవుడు రాయించిన కీర్తనలు
దావీదు, మరికొందరు దేవునికి స్తుతి గీతాలను కూర్చారు. వాటిలో 150 గీతాలు కీర్తనల గ్రంథములో ఉన్నాయి
బైబిల్లోని అతి పెద్ద పుస్తకమైన కీర్తనల గ్రంథంలో మొత్తం పాటలే ఉన్నాయి. వీటిని రాయడానికి దాదాపు 1000 సంవత్సరాలు పట్టింది. వీటిని రాసినవాళ్లు ఆ పాటల్లో తమ విశ్వాసాన్ని అద్భుతంగా, మనస్సులను కదిలించేలా వ్యక్తం చేశారు. అలాంటి కీర్తనలను ఇప్పటివరకు ఎవ్వరూ రాయలేదు. సంతోషం, కృతజ్ఞత, బాధ, దుఃఖం, పశ్చాత్తాపం వంటి విభిన్న మనోభావాలు ఈ స్తుతి గీతాల్లో కనిపిస్తాయి. కీర్తనలు రాసినవాళ్లకు దేవునిపై నమ్మకం, ఆయనతో దగ్గరి సంబంధం ఉన్నాయని తెలుస్తోంది. ఈ పాటల్లో కనిపించే కొన్ని అంశాలను చూద్దాం.
యెహోవాకు మాత్రమే విశ్వాన్ని పరిపాలించే హక్కు ఉంది. మనం ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి. “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు” అని కీర్తన 83:18లో ఉంది. కీర్తనలు రాసినవాళ్లు చాలా పాటల్లో నక్షత్రాలతో నిండిన ఆకాశం, భూమ్మీది అద్భుతమైన జీవకోటి, అద్భుతమైన మానవ శరీరం వంటివాటిని సృష్టించినందుకు యెహోవాను స్తుతించారు. (కీర్తన 8, 19, 139, 148) యెహోవా తన నమ్మకమైన సేవకులను రక్షించి కాపాడే దేవుడని మహిమపరుస్తూ కొన్ని కీర్తనలు రాశారు. (కీర్తన 18, 97, 138) అణచివేయబడిన వాళ్లకు ఉపశమనాన్నిచ్చి దుష్టులను శిక్షించే న్యాయవంతుడైన దేవుడని ఆయనను ఘనపరుస్తూ ఇంకొన్ని కీర్తనలు రాశారు.—కీర్తన 11, 68, 146.
యెహోవా తనను ప్రేమించే వాళ్లకు సహాయం చేస్తాడు, ఓదార్పునిస్తాడు. 23వ కీర్తన బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో, యెహోవా ఒక ప్రేమగల కాపరిలా తన గొర్రెలను నడిపిస్తాడని, వాటిని కాపాడతాడని, శ్రద్ధగా చూసుకుంటాడని దావీదు వర్ణించాడు. యెహోవా “ప్రార్థన ఆలకించువాడు” అని కీర్తన 65:2 ఆయన ఆరాధకులకు గుర్తుచేస్తోంది. కీర్తన 39, 51 అధ్యాయాల్లో దావీదు తాను చేసిన ఘోరమైన తప్పులకు పశ్చాత్తాపాన్ని, యెహోవా తనను క్షమిస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఘోరమైన తప్పులు చేసిన చాలామంది ఆ కీర్తనల నుండి ఎంతో ఓదార్పును పొందారు. యెహోవా మీద నమ్మకం ఉంచమని, జీవిత భారాలన్నీ యెహోవాపై మోపమని కీర్తన 55:22 మనల్ని ప్రోత్సహిస్తోంది.
మెస్సీయ రాజ్యం ద్వారా యెహోవా దేవుడు ప్రపంచాన్ని మార్చేస్తాడు. కీర్తనల్లోని అనేక భాగాలు ప్రవచించబడిన మెస్సీయ రాజు గురించి చెప్తున్నాయి. ఈ రాజు తనను వ్యతిరేకించే దుష్ట రాజ్యాలను నాశనం చేస్తాడని 2వ కీర్తన చెప్తోంది. ఈ రాజు పరిపాలనలో ఆకలి, అన్యాయం, అణచివేత ఇక ఉండవని 72వ కీర్తన చెప్తోంది. దేవుడు మెస్సీయ రాజ్యం ద్వారా యుద్ధాలు ఉండకుండా చేసి, యుద్ధాయుధాల్ని ధ్వంసం చేస్తాడని కీర్తన 46:9 చెప్తోంది. కీడు చేసేవాళ్లు ఉండరనీ నీతిమంతులు మాత్రం శాంతిసామరస్యాలతో ఎప్పటికీ ఈ భూమ్మీదే జీవిస్తారనీ 37వ కీర్తన చెప్తోంది.
—కీర్తనల గ్రంథము.