భాగం 5
దేవుడు అబ్రాహామును, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాడు
అబ్రాహాము వంశం వృద్ధి అయ్యింది. దేవుడు యోసేపును ఐగుప్తులో కాపాడాడు
తన ప్రియాతి ప్రియమైన కుమారుడు బాధలు అనుభవించి చనిపోతాడని యెహోవాకు తెలుసు. ఆ విషయమే ఆదికాండము 3:15లోని ప్రవచనంలో సూచనప్రాయంగా తెలియజేయబడింది. తన కుమారుడు మరణిస్తే తనకెంత బాధ కలుగుతుందో దేవుడెప్పుడైనా మనకు చెప్పాడా? అబ్రాహాము ఆయన కుమారుని గురించి బైబిల్లో చదివితే మనకది తెలుస్తుంది. దేవుడు, అబ్రాహాముకెంతో ఇష్టమైన ఇస్సాకును బలి ఇవ్వమని అడిగాడు.
అబ్రాహాముకు ఎంతో విశ్వాసముంది. ప్రవచించబడిన విమోచకుడు లేదా సంతానం ఇస్సాకు వంశంలో పుడతాడని దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడని గుర్తుచేసుకోండి. తను చేసిన వాగ్దానం నెరవేర్చడానికి అవసరమైతే దేవుడు ఇస్సాకును పునరుత్థానం చేస్తాడని అంటే మళ్ళీ బ్రతికిస్తాడన్న నమ్మకంతో, అబ్రాహాము దేవుడు చెప్పినట్టు చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ సరిగ్గా సమయానికి దేవుని దూత వచ్చి అబ్రాహామును ఆపాడు. అబ్రాహాము తన ప్రియాతి ప్రియమైన కుమారున్ని బలి ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు కాబట్టి దేవుడు ఆయన్ని మెచ్చుకుని అంతటి విశ్వాసం చూపించిన ఆయనకి తన వాగ్దానాలను మళ్ళీ గుర్తుచేశాడు.
ఆ తర్వాత ఇస్సాకుకు ఏశావు, యాకోబు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. యాకోబు ఏశావులా కాకుండా ఆధ్యాత్మిక విషయాలను ఎంతో విలువైనవిగా ఎంచాడు. దానికి ఆయన ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు. దేవుడు ఆయన పేరు మార్చి ఇశ్రాయేలు అనే పేరు పెట్టాడు. ఆయనకు పుట్టిన 12 మంది కుమారులే ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులయ్యారు. అయితే ఆయన కుటుంబం ఎలా ఒక పెద్ద జనాంగమయ్యింది?
ఆ కుమారుల్లో చాలామంది తమ తమ్ముడైన యోసేపును చూసి అసూయపడడంతో కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాళ్ళు ఆయనను వర్తకులకు బానిసగా అమ్మేశారు. ఆ వర్తకులు ఆయనను ఐగుప్తుకు తీసుకెళ్ళారు. కానీ విశ్వాసం, ధైర్యంగల ఆ యువకున్ని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ యోసేపుకు ఎన్నో కష్టాలు వచ్చాయి. అయితే చివరకు ఐగుప్తు పరిపాలకుడైన ఫరో యోసేపుకు ఒక పెద్ద పదవినిచ్చాడు. అది ఆయనకు సరైన సమయానికే దొరికింది. ఎందుకంటే కరువు రావడంతో యాకోబు తన కుమారుల్లో కొంతమందిని ఆహారాన్ని కొనుక్కురావడానికి ఐగుప్తుకు పంపించాడు. అప్పుడక్కడ యోసేపే ఆహార పంపిణీకి సంబంధించిన విషయాలను చూసుకుంటున్నాడు. అలా అనుకోకుండా తన సహోదరులను చూసిన యోసేపు ఎంతో ఆశ్చర్యపోయాడు. పశ్చాత్తాపపడుతున్న వాళ్లను క్షమించి, కుటుంబమంతా ఐగుప్తుకు వచ్చే ఏర్పాటు చేశాడు. వాళ్లుండడానికి ఫరో వాళ్ళకు ఎంతో మంచి ప్రాంతాన్ని ఇచ్చాడు. అక్కడ వాళ్ళ జనాంగం పెరిగి, వర్ధిల్లారు. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడానికే పరిస్థితులను అలా మలుపుతిప్పాడని యోసేపు అర్థంచేసుకున్నాడు.
పెరుగుతున్న తన కుటుంబాన్ని చూస్తూ వృద్ధుడైన యాకోబు తన శేష జీవితాన్ని అక్కడే గడిపాడు. ఆయన చనిపోయేముందు, దేవుడు వాగ్దానం చేసిన సంతానం లేదా విమోచకుడు శక్తివంతమైన పరిపాలకుడవుతాడనీ, ఆయన యూదా వంశంలో పుడతాడనీ చెప్పాడు. ఆ తర్వాత చాలా కాలానికి యోసేపు చనిపోయాడు. కానీ చనిపోయే ముందు దేవుడు ఏదోకరోజు యాకోబు కుటుంబాన్నంతా ఐగుప్తు నుంచి తీసుకెళ్తాడని చెప్పాడు.