భాగం 4
దేవుడు అబ్రాహాముతో ఒక నిబంధన చేశాడు
అబ్రాహాము విశ్వాసంతో దేవుని మాట విన్నాడు. యెహోవా ఆయనను ఆశీర్వదిస్తానని, ఆయన సంతానాన్ని వృద్ధి చేస్తానని వాగ్దానం చేశాడు
నోవహు కాలంలో జలప్రళయం వచ్చిన దాదాపు 350 సంవత్సరాల తర్వాత ఏమి జరిగిందో చూద్దాం. అబ్రాహాము ఊరు అనే వర్ధిల్లుతున్న పట్టణంలో నివసించేవాడు. ప్రస్తుతం ఇరాక్ అని పిలువబడుతున్న దేశంలో ఆ పట్టణం ఉండేది. అబ్రాహాము దేవుని మీద గొప్ప విశ్వాసమున్న వ్యక్తి. అయితే, ఆయన విశ్వాసానికి ఓ పరీక్ష ఎదురైంది.
యెహోవా అబ్రాహాముతో స్వస్థలాన్ని విడిచిపెట్టి పరాయి దేశమైన కనానుకు వెళ్లమని చెప్పాడు. ఆయన ఏ మాత్రం సంకోచించకుండా యెహోవా చెప్పినట్లు చేశాడు. ఆయన తన భార్య శారా, తన అన్న కొడుకు లోతుతోసహా తన కుటుంబాన్నంతటినీ తీసుకొని బయల్దేరాడు. చాలా దూరం ప్రయాణించి కనాను చేరుకున్న తర్వాత అక్కడ గుడారం వేసుకొని నివసించాడు. యెహోవా అబ్రాహాముతో చేసిన ఒక నిబంధనలో ఆయనను ఒక గొప్ప జనాంగంగా చేస్తానని, ఆయన ద్వారా లోకంలోని కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయని, ఆయన పిల్లలు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని వాగ్దానం చేశాడు.
అబ్రాహాము, లోతులు అక్కడ ఇంకా వర్ధిల్లారు. వాళ్ల గొర్రెలు, పాడిపశువులు పెరిగాయి. దానివల్ల ఇద్దరి కాపరుల మధ్య గొడవ రావడంతో వాళ్లు విడిపోవాల్సి వచ్చింది. అప్పుడు అబ్రాహాము నిస్వార్థంగా లోతుతో ఆయనకు నచ్చిన ప్రాంతాన్ని చూసుకొని వెళ్లమన్నాడు. లోతు యోర్దాను నది పక్కనున్న సొదొమ నగరం దగ్గర్లో ఒక పచ్చని ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ స్థిరపడ్డాడు. అయితే, సొదొమ ప్రజలు ఎంతో చెడ్డవాళ్లు, యెహోవా దృష్టిలో ఘోరమైన పాపాలు చేసేవాళ్లు.
ఆ తర్వాత, అబ్రాహాము పిల్లలు ఆకాశంలో నక్షత్రాల్లా లెక్కించలేనంతమంది అవుతారని యెహోవా ఆయనకు రెండోసారి అభయమిచ్చాడు. అబ్రాహాము ఆ వాగ్దానాన్ని పూర్తిగా నమ్మాడు. అయినా, ఆయన ప్రియమైన భార్య శారాకు పిల్లలు పుట్టలేదు. ఆయనకు 99 ఏళ్లు, శారాకు దాదాపు 90 ఏళ్లు ఉన్నప్పుడు వాళ్లకు ఒక కుమారుడు పుడతాడని దేవుడు చెప్పాడు. ఈసారి, దేవుడు చెప్పినట్లుగానే శారాకు ఇస్సాకు పుట్టాడు. అబ్రాహముకు ఇంకా పిల్లలు కలిగారు గానీ ఏదెనులో తను వాగ్దానం చేసిన విమోచకుడు ఇస్సాకు వంశంలోనే పుడతాడని దేవుడు చెప్పాడు.
నీతిమంతుడైన లోతు విషయానికొస్తే ఆయన, ఆయన కుటుంబం సొదొమ పట్టణంలో ఉన్నా అక్కడున్న చెడ్డవారిలా తయారుకాలేదు. యెహోవా సొదొమను నాశనం చేయాలనుకున్నప్పుడు, దాని గురించి లోతును హెచ్చరించడానికి దూతలను పంపించాడు. లోతు, ఆయన కుటుంబం వెనక్కి తిరిగి చూడకుండా సొదొమ నుండి పారిపోవాలని దేవదూతలు చెప్పారు. యెహోవా సొదొమపై, దాని దగ్గర్లోవున్న దుష్ట పట్టణమైన గొమొఱ్ఱాపై అగ్నిగంధకాలను కురిపించి అక్కడున్న ప్రజలనందరినీ నాశనం చేశాడు. లోతు ఆయన ఇద్దరు కూతుళ్లు తప్పించుకున్నారు. అయితే, లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూసింది. బహుశా ఆస్తిమీద ఆశతో ఆమె అలా చూసివుంటుంది. చెప్పిన మాట విననందుకు ఆమె ప్రాణాల్నే పోగొట్టుకోవాల్సి వచ్చింది.