అధ్యాయం 4
“చదువుకోని సామాన్యులు”
అపొస్తలులు ధైర్యం చూపించారు, యెహోవా వాళ్లను దీవించాడు
అపొస్తలుల కార్యాలు 3:1–5:11 ఆధారంగా
1, 2. ఆలయ ద్వారం దగ్గర పేతురు, యోహాను ఏ అద్భుతం చేశారు?
సూర్యుడు అస్తమించడానికి మెల్లమెల్లగా పడమర దిక్కుకు వెళ్తున్నాడు. దైవభక్తి గల యూదులు, క్రీస్తు శిష్యులు ఆలయ ప్రాంగణంలోకి గుంపులుగా తరలి వస్తున్నారు. “ప్రార్థన సమయం” దగ్గర పడుతోంది.a (అపొ. 2:46; 3:1) ఆ గుంపులో పేతురు, యోహాను కూడా ఉన్నారు. వాళ్లు ఆలయంలో “సౌందర్యం” అనే ద్వారం దగ్గరికి వచ్చారు. ప్రజల మాటలతో, అడుగుల చప్పుడుతో అక్కడంతా సందడిగా ఉంది. 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న ఒకతను ఆ ద్వారం దగ్గర అడుక్కుంటున్నాడు. అతను పుట్టుకతోనే కుంటివాడు.—అపొ. 3:2; 4:22.
2 పేతురు యోహానులు వెళ్తున్నప్పుడు, ఆ అడుక్కునేవాడు వాళ్లను డబ్బులు అడిగాడు. అప్పుడు అపొస్తలులు ఆగారు, వాళ్లు ఏమైనా ఇస్తారేమో అనే ఆశతో అతను వాళ్ల వంక చూశాడు. అయితే పేతురు, “వెండిబంగారాలు నా దగ్గర లేవు కానీ నా దగ్గర ఏది ఉందో అదే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు పేరున చెప్తున్నాను, లేచి నడువు!” అన్నాడు. పేతురు అతని చెయ్యి పట్టుకుని పైకి లేపగానే, అతను తన జీవితంలో మొట్టమొదటిసారి లేచి నిలబడ్డాడు! అప్పుడు జనం ఎంత ఆశ్చర్యపోయి ఉంటారో ఊహించుకోండి. (అపొ. 3:6, 7) ఆ వ్యక్తి బాగైన తన కాళ్లను చూసుకుంటూ మెల్లమెల్లగా అడుగులు వేయడం మనం ఊహించుకోవచ్చు. అతను ఆనందంగా గెంతుతూ, దేవుణ్ణి బిగ్గరగా స్తుతించడం మొదలుపెట్టాడు!
3. పేతురు జనానికి, బాగైన వ్యక్తికి ఏ విలువైన బహుమతిని ఇస్తున్నాడు?
3 ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయిన జనం, సొలొమోను మంటపం దగ్గరున్న పేతురు యోహానుల వైపు పరుగులు తీశారు. ఒకప్పుడు యేసు ఇక్కడే నిలబడి ప్రజలకు బోధించాడు. (యోహా. 10:23) ఇప్పుడు పేతురు అదేచోట నిలబడి, ఈ అద్భుతం ఎలా సాధ్యమైందో చెప్తున్నాడు. పేతురు ఆ జనానికి, బాగైన వ్యక్తికి వెండిబంగారాల కన్నా విలువైన బహుమతిని ఇస్తున్నాడు. ఆ బహుమతి, స్వస్థత పొందడం కన్నా చాలా గొప్పది. అదేంటంటే పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ పొంది, “జీవాన్ని ఇవ్వడానికి నియమించబడిన ముఖ్య ప్రతినిధి” అయిన యేసుక్రీస్తుకు అనుచరులయ్యే అవకాశం.—అపొ. 3:15.
4. (ఎ) కుంటివాడు బాగైన తర్వాత, అపొస్తలులు ఎవర్ని ఎదుర్కోవాల్సి వస్తుంది? (బి) మనం ఏ రెండు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?
4 అది నిజంగా మరపురాని రోజు! ఒక కుంటివాడు బాగయ్యి, ఇప్పుడు నడవగలుగుతున్నాడు. వేలమందికేమో, ఆధ్యాత్మికంగా బాగయ్యి, ‘యెహోవాకు తగినట్టు నడుచుకునే’ అవకాశం దొరికింది. (కొలొ. 1:9, 10) అయితే ఆ రోజు జరిగిన సంఘటనల వల్ల, క్రీస్తు నమ్మకమైన అనుచరులు శక్తివంతమైన యూదా నాయకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజ్య సందేశాన్ని ప్రకటించమని యేసు ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా ఆ నాయకులు వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. (అపొ. 1:8) ఆ నాయకుల దృష్టిలో పేతురు, యోహాను “చదువుకోని సామాన్యులు.”b (అపొ. 4:13) అయితే పేతురు, యోహాను ప్రజలకు సాక్ష్యం ఇచ్చిన విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? వ్యతిరేకత వచ్చినప్పుడు పేతురు యోహానుల్లా, అలాగే ఇతర శిష్యుల్లా మనం కూడా ఏం చేయవచ్చు?
“మా సొంత శక్తితో” కాదు (అపొ. 3:11-26)
5. పేతురు మాట్లాడిన విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
5 పేతురు యోహానులు జనం ముందు నిలబడి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ జనంలో, కొన్ని వారాల క్రితం యేసును చంపమని అడిగినవాళ్లు కూడా ఉండి ఉంటారని వాళ్లకు తెలుసు. (మార్కు 15:8-15; అపొ. 3:13-15) అయినా పేతురు ఏ మాత్రం భయపడకుండా, ఆ బాగైన వ్యక్తి యేసు పేరునే బాగయ్యాడని చాలా ధైర్యంగా చెప్పాడు. పేతురు నిజాన్ని నీరుగార్చాలని అనుకోలేదు, క్రీస్తు చావుకు కొంతవరకు ఆ జనం కూడా ఎలా బాధ్యులో ఆయన సూటిగా చెప్పాడు. అలాగని పేతురుకు వాళ్లమీద కోపమేం లేదు, ఎందుకంటే వాళ్లు “తెలియకే అలా చేశారని” ఆయన అన్నాడు. (అపొ. 3:17) ఆయన వాళ్లను, “సహోదరులారా” అని పిలిచాడు. అంతేకాదు, రాజ్య సందేశంలోని మంచి విషయాల గురించే ముఖ్యంగా మాట్లాడాడు. ఒకవేళ వాళ్లు పశ్చాత్తాపపడి క్రీస్తు మీద విశ్వాసం ఉంచితే, ‘యెహోవా వాళ్లకు సేదదీర్పును ఇస్తాడు’ అని ఆయన చెప్పాడు. (అపొ. 3:19) పేతురులాగే మనం కూడా దేవుని తీర్పుల్ని ప్రకటిస్తున్నప్పుడు ధైర్యంగా, సూటిగా మాట్లాడాలి. అదే సమయంలో కఠినంగా, తీర్పుతీర్చే విధంగా మాట్లాడకూడదు. బదులుగా, మనం ఎవరికైతే ప్రకటిస్తున్నామో ఆ ప్రజల్ని కాబోయే సహోదరుల్లా చూడాలి. అంతేకాదు, పేతురులాగే మనం కూడా రాజ్య సందేశంలోని మంచి విషయాల గురించే ముఖ్యంగా మాట్లాడాలి.
6. పేతురు యోహానులు వినయం, అణకువ ఎలా చూపించారు?
6 ఆ అపొస్తలులు వినయం, అణకువ చూపించారు. వాళ్లు తమ సొంత శక్తితో అద్భుతం చేసినట్టు గొప్పలు చెప్పుకోలేదు. పేతురు ప్రజలతో ఇలా అన్నాడు: “మేమేదో మా సొంత శక్తితోనో, దైవభక్తితోనో అతన్ని నడిచేలా చేసినట్టు ఎందుకు మా వైపు ఇలా కళ్లార్పకుండా చూస్తున్నారు?” (అపొ. 3:12) పరిచర్యలో ఏం సాధించినా, అది సొంత శక్తితో కాదుగానీ దేవుని శక్తి వల్లే అని పేతురుకు, ఇతర అపొస్తలులకు తెలుసు. అందుకే ఘనతంతా యెహోవాకు, యేసుకే చెందాలని కోరుకుంటూ వాళ్లు అణకువ చూపించారు.
7, 8. (ఎ) మనం ప్రజలకు ఏ బహుమతి ఇవ్వవచ్చు? (బి) “అన్నిటినీ చక్కదిద్దే సమయాలు” వస్తాయని పేతురు చెప్పిన మాట ఇప్పుడు ఎలా నెరవేరుతోంది?
7 మనం కూడా రాజ్యం గురించి ప్రకటిస్తున్నప్పుడు అలాంటి అణకువనే చూపించాలి. నిజమే, మొదటి శతాబ్దం నాటి క్రైస్తవుల్లా మనం పవిత్రశక్తి సహాయంతో అద్భుతాలు చేయలేం. కానీ ప్రజలు దేవుని మీద, క్రీస్తు మీద విశ్వాసం పెంచుకునేలా మనం సహాయం చేయవచ్చు. అంతేకాదు, పేతురు ఇచ్చిన బహుమతినే మనం కూడా ఇవ్వవచ్చు. అంటే పాపక్షమాపణను, యెహోవా ఇచ్చే సేదదీర్పును పొందే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వవచ్చు. ప్రతీ సంవత్సరం, లక్షలమంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ బాప్తిస్మం తీసుకుని, క్రీస్తు శిష్యులు అవుతున్నారు.
8 “అన్నిటినీ చక్కదిద్దే సమయాలు” వస్తాయని పేతురు చెప్పాడు. ఇప్పుడు మనం ఆ సమయంలోనే జీవిస్తున్నాం. దేవుడు “గతంలో తన పవిత్ర ప్రవక్తల ద్వారా” చెప్పినట్టే, దేవుని రాజ్యం 1914లో పరలోకంలో స్థాపించబడింది. (అపొ. 3:21; కీర్త. 110:1-3; దాని. 4:16, 17) క్రీస్తు రాజైన వెంటనే, సత్యారాధనను చక్కదిద్దే పనిని చూసుకోవడం మొదలుపెట్టాడు. దానివల్ల లక్షలమంది ఆధ్యాత్మిక పరదైసులోకి వస్తున్నారు, దేవుని రాజ్యానికి పౌరులు అవుతున్నారు. వాళ్లు దిగజారిపోయిన పాత వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టి, “దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకుంటున్నారు. (ఎఫె. 4:22-24) ఆ కుంటివాడు పవిత్రశక్తి వల్ల బాగైనట్టే, ఇప్పుడు ప్రజలు కూడా మనుషుల శక్తి వల్ల కాదుగానీ పవిత్రశక్తి వల్లే తమ వ్యక్తిత్వాన్ని మార్చుకుని దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు. పేతురులాగే మనం కూడా ప్రజలకు బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ధైర్యంగా, సమర్థవంతంగా ఉపయోగించాలి. క్రీస్తు శిష్యులయ్యేలా ప్రజలకు సహాయం చేయడంలో మనం ఏం సాధించినా, అది మన సొంత శక్తి వల్ల కాదుగానీ దేవుని శక్తి వల్లే అని గుర్తుంచుకోవాలి.
“మేమైతే . . . మాట్లాడకుండా ఉండలేం” (అపొ. 4:1-22)
9-11. (ఎ) పేతురు యోహానులు ఆలయంలో బోధించినప్పుడు, యూదా నాయకులు ఏం చేశారు? (బి) అపొస్తలులు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు?
9 పేతురు జనంతో మాట్లాడడం వల్ల, బాగైన వ్యక్తి గెంతుతూ అరుస్తూ ఉండడం వల్ల అక్కడ కాస్త గోలగోలగా ఉంది. అదేంటో చూద్దామని ఆలయ ప్రాంతంలో కాపలాను పర్యవేక్షించే ఆలయ పర్యవేక్షకుడు, అలాగే ముఖ్య యాజకులు గబగబా అక్కడికి వచ్చారు. వీళ్లు బహుశా సద్దూకయ్యులు అయ్యుంటారు. రోమన్లతో మంచి సంబంధాలు ఉండేలా చూసుకునే ఈ సద్దూకయ్యులకు చాలా డబ్బు, పలుకుబడి ఉండేది. పరిసయ్యులు ఎంతో ఇష్టపడే యూదుల సంప్రదాయాల్ని, నియమాల్ని సద్దూకయ్యులు అస్సలు ఇష్టపడేవాళ్లు కాదు. సద్దూకయ్యులు పునరుత్థానాన్ని కూడా నమ్మేవాళ్లు కాదు.c అలాంటిది పేతురు, యోహాను ఏకంగా ఆలయంలోనే నిలబడి యేసు పునరుత్థానం అయ్యాడని ధైర్యంగా బోధిస్తుంటే, వాళ్లకు ఎంత కోపమొచ్చి ఉంటుందో ఊహించండి!
10 కోపంతో ఉన్న ఆ వ్యతిరేకులు పేతురును, యోహానును జైల్లో వేసి తర్వాతి రోజు యూదుల ఉన్నత న్యాయస్థానమైన మహాసభ ముందు నిలబెట్టారు. ఆ మహాసభ నాయకులు తమ గురించి తాము గొప్పగా ఊహించుకునేవాళ్లు. పేతురు యోహానులు “చదువుకోని సామాన్యులని,” ఆలయంలో బోధించే హక్కు వాళ్లకు లేదని ఆ నాయకులకు అనిపించింది. పేతురు యోహానులు రబ్బీల పాఠశాలల్లో చదువుకోకపోయినా ధైర్యంగా, గట్టి నమ్మకంతో బోధించేసరికి మహాసభ ఆశ్చర్యపోయింది. ఇంతకీ వాళ్లు అంత బాగా ఎలా మాట్లాడగలిగారు? ఒక కారణం ఏంటంటే, వాళ్లు “యేసుతోపాటు ఉండేవాళ్లు.” (అపొ. 4:13) శాస్త్రుల్లా కాకుండా అధికారం గల వ్యక్తిలా ఎలా మాట్లాడాలో వాళ్ల బోధకుడు వాళ్లకు నేర్పించాడు.—మత్త. 7:28, 29.
11 ప్రకటించడం ఆపేయమని మహాసభ ఆ అపొస్తలులకు గట్టిగా చెప్పింది. ఆ రోజుల్లో మహాసభ ఏం చెప్తే, అదే శాసనం. కొన్ని వారాల క్రితం ఇదే మహాసభ, యేసు “మరణశిక్షకు అర్హుడు” అని తీర్పు ఇచ్చింది. (మత్త. 26:59-66) అయినా పేతురు యోహానులు ఏమాత్రం భయపడలేదు. వాళ్లు డబ్బు, చదువు, పలుకుబడి ఉన్న ఆ నాయకుల ముందు నిలబడి ధైర్యంగా, గౌరవపూర్వకంగా ఇలా అన్నారు: “దేవుని మాట కాకుండా మీ మాట వినడం దేవుని దృష్టిలో సరైనదేనా? మీరే ఆలోచించండి. మేమైతే చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం.”—అపొ. 4:19, 20.
12. ఇంకా ధైర్యంగా, గట్టి నమ్మకంతో బోధించడానికి మనం ఏం చేయవచ్చు?
12 మీరు కూడా అలాంటి ధైర్యం చూపించగలరా? మీ ప్రాంతంలో డబ్బు, చదువు, లేదా పలుకుబడి ఉన్నవాళ్లకు ప్రకటించే అవకాశం దొరికినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఇంట్లో, స్కూల్లో, ఉద్యోగం చేసే చోట ఎవరైనా మీ నమ్మకాల్ని ఎగతాళి చేస్తున్నారా? అప్పుడు మీకు భయం వేస్తుందా? ఆ భయాన్ని మీరు తీసేసుకోవచ్చు. భూమ్మీద ఉన్నప్పుడు యేసు తన అపొస్తలులకు, వాళ్ల నమ్మకాల్ని ధైర్యంగా, గౌరవంగా ఎలా చెప్పాలో నేర్పించాడు. (మత్త. 10:11-18) యేసు చనిపోయి లేచిన తర్వాత, “ఈ వ్యవస్థ ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను” అని శిష్యులకు మాటిచ్చాడు. (మత్త. 28:20) నేడు యేసు నిర్దేశం కింద “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” మన నమ్మకాల్ని ఇతరులకు ఎలా వివరించవచ్చో నేర్పిస్తున్నాడు. (మత్త. 24:45-47; 1 పేతు. 3:15) మన క్రైస్తవ జీవితం, పరిచర్య లాంటి మీటింగ్స్ ద్వారా; బైబిలు ప్రచురణల ద్వారా; jw.org వెబ్‌సైట్‌లో “బైబిలు ప్రశ్నలకు జవాబులు” అనే ఆర్టికల్స్ ద్వారా అలా నేర్పిస్తున్నాడు. మీరు వీటిని చక్కగా ఉపయోగించుకుంటున్నారా? అలాగైతే మీరు ఇంకా ధైర్యంగా, గట్టి నమ్మకంతో బోధించగలుగుతారు. అంతేకాదు ఏ ఆటంకం వచ్చినా, అపొస్తలుల్లాగే మీరు కూడా మీరు చూసిన, విన్న అద్భుతమైన సత్యాల్ని చెప్పడం ఆపేయరు.
మీరు నేర్చుకున్న అద్భుతమైన సత్యాల్ని చెప్పడం దేనివల్లా ఆపేయకండి
‘వాళ్లంతా కలిసి దేవునికి ప్రార్థించారు’ (అపొ. 4:23-31)
13, 14. వ్యతిరేకత వస్తే మనం ఏం చేయాలి? ఎందుకు?
13 జైలు నుండి విడుదలైన వెంటనే పేతురు, యోహాను సంఘంలోని మిగతావాళ్లను కలుసుకున్నారు. ప్రకటిస్తూ ఉండడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వమని ‘వాళ్లంతా కలిసి దేవునికి ప్రార్థించారు.’ (అపొ. 4:24) దేవుని ఇష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని మనం నమ్ముకోవడం ఎంత ప్రమాదమో పేతురుకు బాగా తెలుసు. ఎందుకంటే, కొన్ని వారాల క్రితమే ఆయన మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఇలా అన్నాడు: “అందరూ నిన్ను వదిలి వెళ్లిపోయినా నేను మాత్రం నిన్ను ఎన్నడూ వదిలి వెళ్లను.” కానీ యేసు ముందే చెప్పినట్టు, కాసేపటికే పేతురు మనుషుల భయానికి లొంగిపోయి, యేసు ఎవరో తెలీదని అబద్ధం చెప్పాడు. కానీ ఆ తర్వాత పేతురు తన తప్పు తెలుసుకున్నాడు; తన స్నేహితుడు, బోధకుడు అయిన యేసు గురించి అలా అబద్ధం చెప్పినందుకు చాలా బాధపడ్డాడు.—మత్త. 26:33, 34, 69-75.
14 మీరు క్రీస్తు అప్పగించిన పని చేయాలంటే, బలమైన కోరిక ఒక్కటే సరిపోదు. ఎందుకంటే, వ్యతిరేకులు మీ విశ్వాసాన్ని పాడుచేయడానికి ప్రయత్నించవచ్చు లేదా ప్రకటించకుండా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించవచ్చు. అలాంటప్పుడు మీరు పేతురు, యోహాను చేసినట్టే చేయండి. బలం కోసం యెహోవాకు ప్రార్థించండి. సంఘంలో ఉన్నవాళ్ల సహాయం తీసుకోండి. మీకు ఎలాంటి కష్టాలు ఎదురౌతున్నాయో సంఘపెద్దలకు, పరిణతి గల ఇతర క్రైస్తవులకు చెప్పండి. వేరేవాళ్లు మన కోసం చేసే ప్రార్థనలు నిజంగా బలాన్నిస్తాయి.—ఎఫె. 6:18; యాకో. 5:16.
15. కొంతకాలం పాటు ప్రకటించడం ఆపేసినవాళ్లు ఎందుకు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు?
15 ఒకప్పుడు మీరు ఒత్తిడికి లొంగిపోయి, కొంతకాలం పాటు ప్రకటించడం ఆపేశారా? అయితే, నిరుత్సాహపడకండి. యేసు చనిపోయినప్పుడు అపొస్తలులందరూ కొంతకాలం పాటు ప్రకటించడం ఆపేశారని, కానీ వాళ్లు మళ్లీ వెంటనే చురుగ్గా దాన్ని కొనసాగించారని గుర్తుంచుకోండి. (మత్త. 26:56; 28:10, 16-20) గతంలో చేసిన తప్పుల్ని తలచుకొని బాధపడే బదులు ఆ అనుభవాన్ని, అలాగే మీరు నేర్చుకున్న పాఠాల్ని ఉపయోగించి వేరేవాళ్లను బలపర్చండి.
16, 17. యెరూషలేములో శిష్యులు చేసిన ప్రార్థన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
16 అధికారంలో ఉన్నవాళ్లు ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే, ఏమని ప్రార్థించాలి? శిష్యులు తమకు కష్టాలు రాకుండా కాపాడమని ప్రార్థించలేదు అని గమనించండి. ఎందుకంటే, వాళ్లకు యేసు అన్న ఈ మాటలు బాగా గుర్తున్నాయి: “వాళ్లు నన్ను హింసించారంటే మిమ్మల్ని కూడా హింసిస్తారు.” (యోహా. 15:20) కాబట్టి, శత్రువుల ‘బెదిరింపుల్ని వినమని’ ఈ నమ్మకమైన శిష్యులు యెహోవాకు ప్రార్థించారు. (అపొ. 4:29) దేవుని ఇష్టం జరగడం అన్నిటికన్నా ముఖ్యమని, ఈ హింసలన్నీ నిజానికి ప్రవచన నెరవేర్పులో భాగమని వాళ్లు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. యేసు వాళ్లకు నేర్పించిన ప్రార్థనలో చెప్పినట్టుగానే, మానవ పరిపాలకులు ఏమన్నా సరే దేవుని ఇష్టం ‘భూమ్మీద నెరవేరుతుంది’ అని వాళ్లకు తెలుసు.—మత్త. 6:9, 10.
17 దేవుని ఇష్టం చేయాలన్న కోరికతో శిష్యులు యెహోవాకు ఇలా ప్రార్థించారు: “నీ దాసులు నీ వాక్యాన్ని పూర్తి ధైర్యంతో ప్రకటిస్తూ ఉండేలా సహాయం చేయి.” వాళ్ల ప్రార్థనకు యెహోవా వెంటనే ఎలా జవాబిచ్చాడు? “వాళ్లు సమావేశమైన స్థలం కంపించింది; వాళ్లలో ప్రతీ ఒక్కరు పవిత్రశక్తితో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు.” (అపొ. 4:29-31) దేవుని ఇష్టం నెరవేరకుండా ఏదీ అడ్డుకోలేదు. (యెష. 55:11) ఆటంకం ఎంత పెద్దదైనా, శత్రువు ఎంత బలవంతుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ ఉండడానికి కావాల్సిన బలాన్ని దేవుడు ఇస్తాడని మనం నమ్మకంతో ఉండవచ్చు.
‘మనుషులకు కాదు దేవునికి’ లెక్క అప్పజెప్పాలి (అపొ. 4:32–5:11)
18. యెరూషలేము సంఘంలోని వాళ్లు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకున్నారు?
18 యెరూషలేములో క్రైస్తవ సంఘం ఏర్పడిన కొన్ని రోజులకే, శిష్యుల సంఖ్య 5,000 దాటిపోయింది.d వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చినప్పటికీ, “వాళ్లందరికీ ఒకే అభిప్రాయం ఉంది.” వాళ్లంతా “ఒకే మనసుతో, ఒకే ఆలోచనాతీరుతో” ఐక్యంగా ఉన్నారు. (అపొ. 4:32; 1 కొరిం. 1:10) శిష్యులు తమ పనిని దీవించమని యెహోవాకు కేవలం ప్రార్థన చేయడమే కాదు, ఒకరికొకరు ఆధ్యాత్మికంగా, అలాగే అవసరమైనప్పుడు వస్తుపరంగా కూడా సహాయం చేసుకున్నారు. (1 యోహా. 3:16-18) ఉదాహరణకు, శిష్యుడైన యోసేపు (అపొస్తలులు ఆయనకు బర్నబా అని పేరు పెట్టారు) తన పొలాన్ని అమ్మి, వచ్చిన డబ్బంతా ఇష్టపూర్వకంగా విరాళం ఇచ్చాడు. వేర్వేరు దేశాల నుండి వచ్చినవాళ్లు, తమ కొత్త విశ్వాసం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి యెరూషలేములోనే ఉండిపోయారు. వాళ్లకు సహాయం చేయడం కోసం ఆయన ఆ విరాళం ఇచ్చాడు.
19. యెహోవా అననీయను, సప్పీరాను ఎందుకు శిక్షించాడు?
19 అననీయ, సప్పీరా అనే జంట కూడా వాళ్ల పొలం అమ్మి విరాళం ఇచ్చారు. అయితే వచ్చిన దానిలో “కొంత డబ్బును రహస్యంగా” వాళ్ల దగ్గరే పెట్టుకుని, మొత్తం ఇస్తున్నట్టుగా నటించారు. (అపొ. 5:2) యెహోవా వాళ్లను శిక్షించి, చనిపోయేలా చేశాడు. వాళ్లు తక్కువ విరాళం ఇచ్చినందుకు కాదుగానీ వాళ్లు చెడ్డ ఉద్దేశాలతో ఇచ్చినందుకు, మోసం చేసినందుకు యెహోవా వాళ్లను శిక్షించాడు. వాళ్లు “మనుషులతో కాదు, దేవునితోనే” అబద్ధమాడారు. (అపొ. 5:4) యేసు ఖండించిన వేషధారుల్లాగే అననీయ, సప్పీరా దేవుని మెప్పు పొందడం కన్నా, మనుషుల మెప్పు పొందడానికే తహతహలాడారు.—మత్త. 6:1-3.
20. యెహోవాకు ఏదైనా ఇచ్చే విషయంలో మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
20 మొదటి శతాబ్దం నాటి యెరూషలేములోని శిష్యులు ఇష్టపూర్వకంగా విరాళాలు ఇచ్చినట్టే, ఇప్పుడు కూడా లక్షలమంది సాక్షులు ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి ఇష్టపూర్వకంగా విరాళాలు ఇస్తున్నారు. వాళ్ల డబ్బును, సమయాన్ని ఇవ్వమని ఎవ్వరూ వాళ్లను బలవంతపెట్టరు. నిజానికి, మనం “అయిష్టంగానో బలవంతంగానో” తనను సేవించాలని యెహోవా కోరుకోవడం లేదు. (2 కొరిం. 9:7) మనం ఏదైనా ఇచ్చినప్పుడు, ఎంత ఇచ్చాం అని కాకుండా ఏ ఉద్దేశంతో ఇచ్చాం అన్నదే యెహోవా చూస్తాడు. (మార్కు 12:41-44) మనం ఎప్పుడూ అననీయ సప్పీరాల్లా స్వార్థం కోసమో, మనుషుల మెప్పు కోసమో దేవుణ్ణి సేవించకూడదు. బదులుగా పేతురు, యోహాను, బర్నబాల్లా దేవుని మీద, సాటిమనిషి మీద ఉన్న నిజమైన ప్రేమతోనే యెహోవాను సేవించాలి.—మత్త. 22:37-40.
a ఆలయంలో ఉదయం, సాయంత్రం అర్పణలు అర్పించే సమయంలో ప్రార్థనలు జరిగేవి. సాయంకాల అర్పణ, “దాదాపు మధ్యాహ్నం మూడింటికి” అర్పించేవాళ్లు.
b “చేపలు పట్టే పేతురు, ఉత్సాహవంతుడైన అపొస్తలుడు అయ్యాడు”; “యోహాను—యేసు ప్రేమించిన శిష్యుడు” అనే బాక్సులు చూడండి.
c “ప్రధాన యాజకుడు, ముఖ్య యాజకులు” అనే బాక్సు చూడండి.
d క్రీస్తు శకం 33లో, యెరూషలేములో దాదాపు 6,000 మంది పరిసయ్యులే ఉండి ఉంటారు. సద్దూకయ్యులైతే అంతకంటే తక్కువ ఉండి ఉంటారు. శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉండేసరికి, తమ అధికారం ఎక్కడ తగ్గిపోతుందో అని ఈ రెండు గుంపుల వాళ్లు భయపడ్డారు. యేసు గురించి బోధించకుండా వాళ్లు అపొస్తలుల్ని అడ్డుకోవడానికి బహుశా ఇది కూడా ఒక కారణం అయ్యుంటుంది.