అధ్యాయం 2
“మీరు నా గురించి సాక్ష్యమిస్తారు”
ప్రకటనా పనిని ముందుకు తీసుకెళ్లడానికి యేసు తన అపొస్తలుల్ని సిద్ధం చేశాడు
అపొస్తలుల కార్యాలు 1:1-26 ఆధారంగా
1-3. యేసు తన అపొస్తలుల్ని ఎలా విడిచివెళ్లాడో వివరించండి. మనకు ఏ ప్రశ్నలు రావచ్చు?
గత కొన్ని వారాలుగా, అపొస్తలుల సంతోషానికి అంతులేదు! యేసు చనిపోయాడన్న బాధలో కూరుకుపోయిన వాళ్లు, ఇప్పుడు ఆయన తిరిగి బ్రతికే సరికి ఆనందంలో తేలుతున్నారు. గడిచిన 40 రోజుల్లో యేసు వాళ్లకు చాలాసార్లు కనిపించాడు, ఎన్నో విషయాలు చెప్పాడు, ప్రోత్సహించాడు. ఆ సంతోషం ఎప్పటికీ అలాగే ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు. అయితే, యేసు వాళ్లకు కనిపించడం ఇక ఇదే చివరిసారి.
2 ఒలీవల కొండ మీద ఉన్న అపొస్తలులు, యేసు చెప్పే ప్రతీ మాటను చాలా జాగ్రత్తగా వింటున్నారు. యేసు మాట్లాడడం పూర్తవ్వగానే, అప్పుడే అయిపోయిందా అని వాళ్లకు అనిపించింది. యేసు తన చేతులెత్తి వాళ్లను దీవించాడు. తర్వాత, ఆయన నెమ్మదిగా నేల మీద నుండి గాల్లోకి లేస్తూ ఉన్నాడు! యేసు ఆకాశంలోకి వెళ్తుంటే, శిష్యులు ఆయన్నే చూస్తూ ఉన్నారు. ఇంతలో ఒక మేఘం ఆయన్ని కమ్మేసింది, దాంతో వాళ్లు ఆయన్ని చూడలేకపోయారు. ఆయన వెళ్లిపోయినా, వాళ్లు మాత్రం ఆకాశం వైపే కళ్లు అప్పగించి చూస్తున్నారు.—లూకా 24:50; అపొ. 1:9, 10.
3 అది, అపొస్తలుల జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పిన సంఘటన. వాళ్ల ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్లిపోయాడు, మరి ఇప్పుడెలా? కంగారేం లేదు! తను మొదలుపెట్టిన పనిని ముందుకు తీసుకెళ్లడానికి, యేసు వాళ్లను సిద్ధం చేశాడు. ఈ ముఖ్యమైన పని కోసం యేసు వాళ్లను ఎలా సిద్ధం చేశాడు? ఇప్పుడు వాళ్లు ఏం చేస్తారు? దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? అపొస్తలుల కార్యాలు మొదటి అధ్యాయంలో ఆ ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఆ జవాబులు మనలో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపుతాయి.
“ఎన్నో ఒప్పింపజేసే రుజువులు” (అపొ. 1:1-5)
4. అపొస్తలుల కార్యాలు పుస్తకాన్ని లూకా ఎలా మొదలుపెట్టాడు?
4 లూకా, అపొస్తలుల కార్యాలు పుస్తకాన్ని “ఓ థెయొఫిలా” అంటూ మొదలుపెట్టాడు. ఇంతకుముందు లూకా తన సువార్త పుస్తకాన్ని రాసింది కూడా ఆ థెయొఫిలకే.a అంతేకాదు తన సువార్త పుస్తకం చివర్లో చెప్పిన విషయాల్నే, అపొస్తలుల కార్యాలు పుస్తకం మొదట్లో మళ్లీ చెప్పాడు. కాకపోతే ఈసారి కొత్త వివరాలు చేర్చాడు, కొన్ని పదాల్ని మార్చి చెప్పాడు. కాబట్టి ఈ పుస్తకం, లూకా సువార్తలో చెప్పిన విషయాలకు కొనసాగింపు అని అర్థమౌతుంది.
5, 6. (ఎ) విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి శిష్యులకు ఏది సహాయం చేస్తుంది? (బి) ఇప్పుడు మన విశ్వాసం కూడా “ఎన్నో ఒప్పింపజేసే రుజువుల” మీద ఆధారపడి ఉందని ఎందుకు చెప్పవచ్చు?
5 విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి శిష్యులకు ఏది సహాయం చేస్తుంది? అపొస్తలుల కార్యాలు 1:3 లో యేసు గురించి ఇలా ఉంది: “ఆయన . . . తాను బ్రతికి ఉన్నానని ఎన్నో ఒప్పింపజేసే రుజువులతో వాళ్లకు చూపించుకున్నాడు.” బైబిలు మొత్తంలో, “ప్రియమైన వైద్యుడు” అయిన లూకా మాత్రమే “ఒప్పింపజేసే రుజువులు” అనే మాట ఉపయోగించాడు. (కొలొ. 4:14) సాధారణంగా ఈ మాట వైద్య పుస్తకాల్లో కనిపిస్తుంది. స్పష్టమైన, బలమైన ఆధారాల గురించి చెప్పడానికి ఈ మాటను ఉపయోగిస్తారు. యేసు ఇచ్చింది సరిగ్గా అలాంటి ఆధారాలే. ఆయన తన అనుచరులకు చాలాసార్లు కనిపించాడు. కొన్నిసార్లు ఒకరిద్దరికి కనిపించాడు, ఇంకొన్నిసార్లు అపొస్తలులందరికీ కనిపించాడు, ఒకసారైతే ఏకంగా 500 కంటే ఎక్కువమంది శిష్యులకు కనిపించాడు. (1 కొరిం. 15:3-6) నిజంగానే అవి ఒప్పింపజేసే రుజువులు!
6 ఇప్పుడున్న నిజక్రైస్తవుల విశ్వాసం కూడా “ఎన్నో ఒప్పింపజేసే రుజువుల” మీద ఆధారపడి ఉంది. యేసు ఈ భూమ్మీద జీవించాడని, మన పాపాల కోసం చనిపోయాడని, తిరిగి బ్రతికాడని అనడానికి ఏమైనా రుజువులు ఉన్నాయా? కావాల్సినన్ని ఉన్నాయి! ఆ సంఘటనల్ని కళ్లారా చూసినవాళ్ల వివరాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. యెహోవా సహాయం కోసం ప్రార్థించి, వాటిని లోతుగా అధ్యయనం చేసినప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. నిజమైన విశ్వాసానికి, గుడ్డి నమ్మకానికి చాలా తేడా ఉంది. నిజమైన విశ్వాసం, బలమైన రుజువుల మీద ఆధారపడి ఉంటుంది. శాశ్వత జీవితం పొందాలంటే మనకు నిజమైన విశ్వాసం ఉండాలి.—యోహా. 3:16.
7. ప్రకటించడంలో, బోధించడంలో యేసు తన శిష్యులకు ఎలా ఆదర్శం ఉంచాడు?
7 తిరిగి బ్రతికిన తర్వాత, యేసు ఒప్పింపజేసే రుజువులు ఇవ్వడమే కాదు, “దేవుని రాజ్యం గురించి” కూడా శిష్యులతో మాట్లాడాడు. ఉదాహరణకు, మెస్సీయ బాధలుపడి చనిపోవాలి అనే ప్రవచనాల్ని ఆయన విడమర్చి చెప్పాడు. (లూకా 24:13-32, 46, 47) దేవుని రాజ్యానికి రాజైన మెస్సీయ తానే అని యేసు స్పష్టం చేశాడు. అలా ఆయన దేవుని రాజ్యం గురించి నొక్కిచెప్పాడు. యేసు తన పరిచర్యలో ఎప్పుడూ దేవుని రాజ్యం గురించే మాట్లాడేవాడు. ఈ రోజుల్లో కూడా, ఆయన అనుచరులు ప్రకటించేది ఆ రాజ్యం గురించే.—మత్త. 24:14; లూకా 4:43.
“భూమంతటా” (అపొ. 1:6-12)
8, 9. (ఎ) అపొస్తలులు ఏ రెండు విషయాల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు? (బి) మరి యేసు వాళ్లను ఎలా సరిదిద్దాడు? దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
8 అపొస్తలులు యేసును చివరిసారిగా కలుసుకున్నది ఒలీవల కొండ మీదే. అప్పుడు వాళ్లు ఆత్రంగా ఇలా అడిగారు: “ప్రభువా, ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మళ్లీ ఇస్తావా?” (అపొ. 1:6) ఆ ప్రశ్నను గమనిస్తే, అపొస్తలులు రెండు విషయాల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలుస్తుంది. ఒకటి, రాజ్యం ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబడుతుందని వాళ్లు అనుకున్నారు. రెండు, యేసు మాటిచ్చిన రాజ్యం “ఇప్పుడు,” అంటే అప్పటికప్పుడే పరిపాలించడం మొదలుపెడుతుందని వాళ్లు అనుకున్నారు. మరి యేసు వాళ్ల ఆలోచనను ఎలా సరిదిద్దాడు?
9 ఆ రెండిట్లో మొదటిదాన్ని, శిష్యులు కొన్ని రోజుల్లోనే సరిగ్గా అర్థం చేసుకుంటారని బహుశా యేసుకు తెలుసు. శిష్యులు ఇంకో పది రోజుల్లో, ఆధ్యాత్మిక ఇశ్రాయేలు అనే కొత్త జనాంగం పుట్టుకను చూడబోతున్నారు! ఇప్పటివరకు ఇశ్రాయేలు జనాంగం దేవుని ప్రత్యేక ప్రజలుగా ఉన్నారు. కానీ దేవునితో వాళ్లకున్న ఆ ప్రత్యేక బంధం ఇక తెగిపోతుంది. రెండో విషయానికొస్తే, యేసు దయతో వాళ్లను ఇలా సరిదిద్దాడు: “సమయాల్ని, కాలాల్ని తండ్రి తన అధికారం కింద ఉంచుకున్నాడు. వాటిని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.” (అపొ. 1:7) తన ఇష్టం ఎప్పుడు నెరవేరాలో యెహోవాయే నిర్ణయిస్తాడు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు, అంతం వచ్చే ‘రోజు గురించి, గంట గురించి’ తనకు కూడా తెలియదని, “తండ్రికి మాత్రమే” తెలుసని చెప్పాడు. (మత్త. 24:36) నేడు మనం కూడా అంతం ఎప్పుడు వస్తుందా అని అతిగా ఆలోచిస్తున్నామంటే, మన చేతుల్లో లేనిదాని గురించి ఆందోళనపడుతున్నట్టే.
10. అపొస్తలులు చూపించిన ఎలాంటి స్ఫూర్తిని మనం కూడా చూపించాలి? ఎందుకు?
10 అంతమాత్రాన మనం అపొస్తలుల్ని చిన్నచూపు చూడకూడదు. నిజానికి వాళ్ల విశ్వాసం చాలా గొప్పది. యేసు సరిదిద్దినప్పుడు వాళ్లు వినయం చూపించారు. వాళ్లు అడిగిన ప్రశ్న తప్పే గానీ, వాళ్లు చూపించిన స్ఫూర్తి మాత్రం సరైనది. యేసు అంతకుముందు శిష్యులకు పదేపదే ఇలా చెప్పాడు: “అప్రమత్తంగా ఉండండి.” (మత్త. 24:42; 25:13; 26:41) అందుకే వాళ్లు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్నారు, యెహోవా చర్య తీసుకునే సమయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మనం కూడా అలాంటి స్ఫూర్తినే చూపించాలి. నిజం చెప్పాలంటే, అది మనకు ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే మనం “చివరి రోజుల” ముగింపులో జీవిస్తున్నాం.—2 తిమో. 3:1-5.
11, 12. (ఎ) యేసు తన శిష్యులకు ఏ పని అప్పగించాడు? (బి) యేసు ఆ పనిని అప్పగించే ముందు, పవిత్రశక్తిని పంపిస్తానని మాటివ్వడం ఎందుకు సరైనది?
11 అపొస్తలులు దేనిమీద మనసుపెట్టాలో యేసు గుర్తుచేశాడు. ఆయన ఇలా అన్నాడు: “పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు; అప్పుడు యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.” (అపొ. 1:8) వాళ్లు మొదట యేసు ఎక్కడైతే చంపబడ్డాడో ఆ యెరూషలేములోనే, ఆయన తిరిగి బ్రతికాడని ప్రకటిస్తారు. తర్వాత యూదయ అంతటిలో, ఆ తర్వాత సమరయలో, చివరికి దేశదేశాల్లో ఆయన గురించి సాక్ష్యమిస్తారు.
12 యేసు ఆ పనిని అప్పగించే ముందు, పవిత్రశక్తిని పంపిస్తానని మాటివ్వడం ఎంత సరైనదో కదా! “పవిత్రశక్తి” అనే పదం, అపొస్తలుల కార్యాలు పుస్తకంలో 40 కన్నా ఎక్కువసార్లు కనిపిస్తుంది. ఆ విధంగా, పవిత్రశక్తి సహాయం లేకుండా మనం యెహోవా ఇష్టాన్ని చేయలేమని ఈ పుస్తకం పదేపదే గుర్తుచేస్తుంది. కాబట్టి, మనం పవిత్రశక్తి కోసం ప్రతీరోజు ప్రార్థించడం ఎంత ప్రాముఖ్యమో కదా! (లూకా 11:13) ఇంతకుముందుకన్నా ఇప్పుడు మనకు అది చాలా అవసరం.
13. ఇప్పుడు దేవుని ప్రజలు ప్రకటించాల్సిన ప్రాంతం ఎంత పెద్దది? ప్రకటనా పనిలో మనం ఎందుకు బిజీగా ఉండాలి?
13 అపొస్తలులు అప్పట్లో వాళ్లకు తెలిసిన “భూమంతటా” ప్రకటించారు. ఇప్పుడు మనమైతే, ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తున్నాం. మనం మొదటి అధ్యాయంలో చూసినట్లు, యెహోవాసాక్షులు ఈ పనిని మనసుపెట్టి చేస్తున్నారు. ఎందుకంటే, అన్నిరకాల ప్రజలు రాజ్యం గురించిన మంచివార్త వినాలన్నది దేవుని కోరికని వాళ్లు గుర్తించారు. (1 తిమో. 2:3, 4) ప్రాణాల్ని కాపాడే ఆ పనిలో మీరు బిజీగా ఉన్నారా? ఇంతకన్నా గొప్ప సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చే పని ఇంకొకటి లేదు. ఆ పని చేయడానికి కావాల్సిన శక్తిని యెహోవాయే మీకు ఇస్తాడు. ఆ పనిని చక్కగా చేయాలంటే మనం ఏ పద్ధతులు ఉపయోగించాలో, ఎలాంటి స్ఫూర్తి చూపించాలో అపొస్తలుల కార్యాలు పుస్తకం చెప్తుంది.
14, 15. (ఎ) యేసు తిరిగి రావడం గురించి దేవదూతలు ఏం చెప్పారు? వాళ్ల మాటలకు అర్థం ఏంటి? (అధస్సూచి కూడా చూడండి.) (బి) యేసు ఏ విధంగా వెళ్లాడో “అదేవిధంగా” వచ్చాడని ఎందుకు చెప్పవచ్చు?
14 ఈ అధ్యాయం మొదట్లో చూసినట్టు, యేసు నెమ్మదిగా నేల మీద నుండి లేచి, ఆకాశంలోకి వెళ్లి కనిపించకుండా పోయాడు. పదకొండుమంది అపొస్తలులు మాత్రం అక్కడే నిలబడి, ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. అంతలో ఇద్దరు దేవదూతలు కనిపించి, అపొస్తలుల్ని దయతో ఇలా సరిదిద్దారు: “గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు? మీ దగ్గర నుండి ఆకాశంలోకి ఎత్తబడిన ఈ యేసు ఏ విధంగా ఆకాశంలోకి వెళ్లడం మీరు చూశారో అదేవిధంగా వస్తాడు.” (అపొ. 1:11) ఇప్పుడు కొంతమంది మత బోధకులు చెప్తున్నట్టు, దేవదూతల మాటలకు యేసు ఏ శరీరంతో పరలోకానికి వెళ్లాడో అదే శరీరంతో తిరిగి వస్తాడని అర్థమా? కాదు. అలాగని ఎలా చెప్పవచ్చు?
15 యేసు అదే శరీరంతో వస్తాడని దేవదూతలు చెప్పలేదు గానీ, “అదేవిధంగా” వస్తాడు అని చెప్పారు.b ఇంతకీ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్లాడు? దేవదూతలు ఈ మాటలు చెప్పే సమయానికి, యేసు అప్పటికే కనిపించకుండా పోయాడు. కొంతమంది మాత్రమే, అంటే అపొస్తలులు మాత్రమే, యేసు ఈ భూమ్మీది నుండి పరలోకంలో తన తండ్రి దగ్గరికి వెళ్లిపోయాడని అర్థం చేసుకున్నారు. యేసు తిరిగి రావడం కూడా అదేవిధంగా ఉంటుంది. నిజంగానే అలా జరిగింది! మనకాలంలో ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్నవాళ్లు మాత్రమే, దేవుని రాజ్యానికి రాజుగా యేసు పరిపాలించడం మొదలుపెట్టాడని అర్థం చేసుకున్నారు. (లూకా 17:20) యేసు రాజయ్యాడు అనడానికి గల రుజువుల్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, వేరేవాళ్లు కూడా దాన్ని అర్థం చేసుకుని ఇప్పుడే దేవుణ్ణి సేవించేలా మనం సహాయం చేయాలి.
“నువ్వు ఎవర్ని ఎంచుకున్నావో . . . మాకు చూపించు” (అపొ. 1:13-26)
16-18. (ఎ) అపొస్తలుల కార్యాలు 1:13, 14 వచనాల్లో, కూటాల గురించి మనం ఏం నేర్చుకుంటాం? (బి) యేసు తల్లి అయిన మరియ ఎలాంటి ఆదర్శం ఉంచింది? (సి) మనం కూటాలకు వెళ్లడం ఎందుకు ప్రాముఖ్యం?
16 తర్వాత అపొస్తలులు “చాలా సంతోషంగా యెరూషలేముకు తిరిగెళ్లారు.” (లూకా 24:52) క్రీస్తు ఇచ్చిన నిర్దేశాన్ని, ఉపదేశాన్ని వాళ్లు ఎలా పాటిస్తారు? అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 13, 14 వచనాల్లో, వాళ్లు ఒక “మేడగదిలో” కలుసుకున్నారని మనం చూస్తాం. ఆ వచనాల్లో, కూటాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఉన్నాయి. అప్పట్లో పాలస్తీనాలోని ఇళ్ల పైన సాధారణంగా ఒక మేడగది ఉండేది. ఇంటి బయట ఉండే మెట్లు ఎక్కి ఆ గదిలోకి వెళ్లవచ్చు. శిష్యులు కలుసుకున్నది, అపొస్తలుల కార్యాలు 12:12 లో ఉన్న మార్కు తల్లి అయిన మరియ ఇంటిపైన అయ్యుంటుందా? ఏమో చెప్పలేం. ఏదేమైనా గానీ, అది శిష్యులు కలుసుకోవడానికి వీలుగా ఉన్న ఒక మామూలు గది అయ్యుంటుంది. ఇంతకీ అక్కడ ఎవరెవరు కలుసుకున్నారు? ఎందుకు కలుసుకున్నారు?
17 అక్కడ కలుసుకున్న వాళ్లలో అపొస్తలులే కాదు, వేరే పురుషులు, కొందరు “స్త్రీలు” కూడా ఉన్నారు. ఆ స్త్రీలలో ఒకరు, యేసు తల్లి అయిన మరియ. బైబిల్లో ఆమె పేరు చివరిసారిగా ఇక్కడే కనిపిస్తుంది. ఒకసారి మరియ గురించి ఆలోచించండి. అందరూ తనను ప్రత్యేకంగా చూడాలని ఆమె కోరుకోలేదు గానీ, వినయంగా తన తోటి సహోదర సహోదరీలతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడికి వచ్చింది. ఇంకో మంచి విషయం ఏంటంటే, మరియకు ఉన్న నలుగురు కొడుకులు కూడా ఇప్పుడు ఆమెతోపాటు ఉన్నారు. యేసు బ్రతికి ఉన్నప్పుడు వాళ్లు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. (మత్త. 13:55; యోహా. 7:5) కానీ యేసు చనిపోయి లేచిన తర్వాత, వాళ్లు ఆయన మీద విశ్వాసం ఉంచారు.—1 కొరిం. 15:7.
18 శిష్యులు అక్కడ ఎందుకు కలుసుకున్నారో కూడా ఒకసారి ఆలోచించండి: “వీళ్లందరూ . . . ఏక మనసుతో పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.” (అపొ. 1:14) అలా కలుసుకోవడం అప్పుడే కాదు ఇప్పుడు కూడా మన ఆరాధనలో ముఖ్యమైన భాగం. మనం ఒకరినొకరం ప్రోత్సహించుకోవడానికి, ఉపదేశం పొందడానికి, సలహాలు వినడానికి, అన్నిటికన్నా ముఖ్యంగా మన పరలోక తండ్రి అయిన యెహోవాను ఆరాధించడానికి కలుసుకుంటాం. కూటాల్లో పాడే స్తుతిగీతాలు, చేసే ప్రార్థనలు మనకు చాలా అవసరం, అంతేకాదు అవి యెహోవాకు చాలా ఇష్టం. కాబట్టి ఈ పవిత్రమైన, ప్రోత్సాహకరమైన కూటాల్ని ఎప్పుడూ మానకుండా ఉందాం!—హెబ్రీ. 10:24, 25.
19-21. (ఎ) ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి పేతురు ముందుకు రావడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (బి) యూదా స్థానంలో వేరే వ్యక్తిని ఎందుకు ఎంచుకోవాలి? ఆ వ్యక్తిని శిష్యులు ఎంచుకున్న విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
19 దేవుని ప్రజల్ని నడిపించే ఏర్పాటుకు సంబంధించి, ఆ శిష్యులు ఇప్పుడు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాని గురించి మాట్లాడడానికి అపొస్తలుడైన పేతురు ముందుకొచ్చాడు. (15-26 వచనాలు) కొన్ని వారాల క్రితం యేసు ఎవరో తెలీదని మూడుసార్లు అబద్ధమాడి వెనకడుగు వేసిన పేతురు, ఇప్పుడిలా ధైర్యంగా ముందుకు రావడం మనకు ఎంతో ఓదార్పునిస్తుంది. (మార్కు 14:72) మనందరం తప్పులు చేస్తుంటాం. కానీ యెహోవా ‘మంచివాడు,’ నిజంగా పశ్చాత్తాపపడే వాళ్లను ‘క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు’ అని పేతురు అనుభవం మనకు గుర్తుచేస్తుంది.—కీర్త. 86:5.
20 యేసుకు నమ్మకద్రోహం చేసిన యూదా స్థానంలో, ఇంకొకతను అపొస్తలుడు అవ్వాలని పేతురు అర్థం చేసుకున్నాడు. మరి ఆ కొత్త అపొస్తలుడిగా ఎవరు అవుతారు? అతను యేసు పరిచర్య అంతటిలో ఆయన్ని అనుసరించినవాడై ఉండాలి, అలాగే యేసు పునరుత్థానాన్ని చూసినవాడై ఉండాలి. (అపొ. 1:21, 22) ఎందుకంటే, అంతకుముందు యేసు ఇలా మాటిచ్చాడు: “నన్ను అనుసరించిన మీరు 12 సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు.” (మత్త. 19:28) యేసు పరిచర్య అంతటిలో ఆయన్ని అనుసరించిన 12 మంది అపొస్తలులు, భవిష్యత్తులో కొత్త యెరూషలేముకు “12 పునాదిరాళ్లు” అవ్వాలన్నది యెహోవా ఉద్దేశం అని తెలుస్తుంది. (ప్రక. 21:2, 14) అందుకే, “అతని స్థానాన్ని వేరే వ్యక్తి తీసుకోవాలి” అనే ప్రవచనం యూదా గురించే చెప్తుందని అర్థం చేసుకునేలా, పేతురుకు యెహోవా సహాయం చేశాడు.—కీర్త. 109:8.
21 ఆ కొత్త అపొస్తలుడిని వాళ్లు ఎలా ఎంచుకున్నారు? చీట్లు వేయడం ద్వారా. బైబిలు కాలాల్లో సాధారణంగా ఆ పద్ధతినే ఉపయోగించేవాళ్లు. (సామె. 16:33) బైబిల్లో చీట్లు వేయడాన్ని మనం చివరిసారిగా ఇక్కడే చూస్తాం. శిష్యుల మీద పవిత్రశక్తి కుమ్మరించబడిన తర్వాత, బహుశా చీట్లు వేయడం ఆగిపోయి ఉంటుంది. ఇంతకీ వాళ్లు చీట్లు ఎందుకు వేశారో గమనించండి. అపొస్తలులు ఇలా ప్రార్థించారు: “యెహోవా, నీకు అందరి హృదయాలు తెలుసు. ఈ ఇద్దరిలో నువ్వు ఎవర్ని ఎంచుకున్నావో దయచేసి మాకు చూపించు.” (అపొ. 1:23, 24) ఆ కొత్త అపొస్తలుడిని యెహోవాయే ఎంచుకోవాలని వాళ్లు కోరుకున్నారు. యెహోవా మత్తీయను ఎంచుకున్నాడు. ప్రకటించడానికి యేసు పంపించిన 70 మంది శిష్యుల్లో ఆయన కూడా ఉండి ఉంటాడు. అలా, మత్తీయ “పన్నెండుమంది” అపొస్తలుల్లో ఒకడయ్యాడు.c—అపొ. 6:2.
22, 23. సంఘంలో నాయకత్వం వహిస్తున్నవాళ్లకు మనం ఎందుకు విధేయత చూపిస్తూ, లోబడి ఉండాలి?
22 దేవుని ప్రజల్ని నడిపించడానికి ఒక క్రమపద్ధతి గల ఏర్పాటు ఉండడం చాలా ముఖ్యమని ఇది చూపిస్తుంది. ఈ రోజుల్లో కూడా, సంఘంలో పర్యవేక్షకులుగా సేవ చేయడానికి బాధ్యతగల సహోదరుల్ని ఎంచుకుంటున్నారు. పెద్దలు వాళ్లను ఎంచుకునే ముందు, పర్యవేక్షకులకు ఉండాల్సిన లేఖన అర్హతల్ని జాగ్రత్తగా పరిశీలించి, పవిత్రశక్తి నిర్దేశం కోసం ప్రార్థిస్తారు. అందుకే సంఘం వాళ్లను పవిత్రశక్తి నియమించిన వ్యక్తులుగా చూస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే, నాయకత్వం వహిస్తున్నవాళ్లకు విధేయత చూపిస్తూ, లోబడి ఉండాలి. అలా చేస్తే సంఘంలో ప్రేమను, ఐక్యతను పెంచిన వాళ్లమౌతాం.—హెబ్రీ. 13:17.
పవిత్రశక్తి నియమించిన వాళ్లకు మనం ఎప్పుడూ విధేయత చూపిస్తూ, లోబడి ఉంటాం
23 తిరిగి బ్రతికిన యేసును చాలాసార్లు చూసిన తర్వాత, శిష్యులకు కొండంత ధైర్యం వచ్చింది. దేవుని ప్రజల్ని నడిపించే విషయంలో జరిగిన మార్పులు కూడా వాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముందుముందు జరగబోయే వాటికి శిష్యులు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. దాని గురించి తర్వాతి అధ్యాయంలో చూస్తాం.
a లూకా తన సువార్తలో ఈయన్ని “అత్యంత గౌరవనీయుడివైన థెయొఫిలా” అని అన్నాడు. దీన్నిబట్టి, థెయొఫిల బహుశా ఒక ఉన్నత అధికారి అయ్యుంటాడని, అప్పటికింకా ఆయన యేసు శిష్యుడు అవ్వలేదని కొంతమంది అంటారు. (లూకా 1:3) అపొస్తలుల కార్యాలు పుస్తకంలో లూకా ఆయన్ని కేవలం “ఓ థెయొఫిలా” అని అన్నాడు. దీనిగురించి కొంతమంది పండితులు ఇలా అంటారు: ‘సువార్త పుస్తకాన్ని చదివిన తర్వాత, థెయొఫిల యేసు మీద విశ్వాసం ఉంచి ఉంటాడు. అందుకే లూకా ఈసారి, “అత్యంత గౌరవనీయుడివైన” అనే మాట ఉపయోగించకుండా, ఒక తోటి విశ్వాసితో మాట్లాడినట్టు మాట్లాడాడు.’
b ఇక్కడ బైబిల్లో, విధం లేదా రీతి అని అర్థం వచ్చే ట్రోపోస్ అనే గ్రీకు పదాన్ని ఉపయోగించారు గానీ, రూపం అని అర్థం వచ్చే మార్ఫే అనే పదాన్ని ఉపయోగించలేదు.
c తర్వాతి రోజుల్లో పౌలు, ‘అన్యజనులకు అపొస్తలుడిగా’ నియమించబడ్డాడు. అయితే, ఆయన పన్నెండుమందిలో ఒకడిగా ఎప్పుడూ లెక్కించబడలేదు. (రోమా. 11:13; 1 కొరిం. 15:4-8) యేసు పరిచర్య అంతటిలో పౌలు ఆయన్ని అనుసరించలేదు కాబట్టి, ఆ పన్నెండుమందిలో ఒకడిగా ఉండే ప్రత్యేక అవకాశం ఆయనకు దక్కలేదు.