17వ అధ్యాయం
‘పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి’
‘మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలిచివుండండి.’ —యూదా 20, 21.
1, 2. (ఎ) మీరు ఏ నిర్మాణ పనిలో ఉన్నారు? (బి) మీరు ఆ పనిని బాగా చేయడం ఎందుకు ప్రాముఖ్యం?
మీరు చాలా కష్టపడి ఒక ఇల్లు కడుతున్నారు. కొంచెం పని అయ్యింది, ఇంకా చాలా ఉంది. పని కష్టంగా అనిపించినా అందులో ఏదో సంతృప్తి ఉంది. అందుకే ఆ పనిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దాన్ని నిర్లక్ష్యం చేయాలని లేదా ఆపుజేయాలని మీకు అనిపించదు. ఎందుకంటే ఆ పని ఎంత బాగుంటే మీ జీవితం, మీ భవిష్యత్తు కూడా అంతే బాగుంటాయి. అలా ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే ఆ ఇల్లు మీరే.
2 మనల్ని మనం కట్టుకోవడం ఎంత ప్రాముఖ్యమో శిష్యుడైన యాకోబు చెప్పాడు. ‘దేవుని ప్రేమలో నిలిచివుండండి’ అని క్రైస్తవులను ప్రోత్సహించిన ఆ వాక్యంలోనే మనం దానికోసం ఏమి చేయాలో చెప్పాడు: ‘మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకోండి.’ (యూదా 20, 21) దేవుని ప్రేమలో నిలిచివుండేలా మిమ్మల్ని మీరు ఏయే విధాలుగా కట్టుకొని, మీ విశ్వాసాన్ని బలపర్చుకోవచ్చు? దానికి తోడ్పడే మూడు అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
యెహోవా ఏర్పరచిన సహేతుకమైన నియమాలపట్ల విశ్వాసాన్ని బలపర్చుకోండి
3-5. (ఎ) యెహోవా నియమాలు ఎలాంటివని మిమ్మల్ని నమ్మించి తప్పుదారి పట్టించాలని సాతాను ప్రయత్నిస్తాడు? (బి) దేవుడు మనకు నియమాలను ఎందుకు ఇచ్చాడు? (సి) ఆ విషయం గుర్తుంచుకుంటే మనమాయన నియమాలను ఎలా దృష్టిస్తాం? ఉదాహరణతో చెప్పండి.
3 అన్నింటికన్నా ముందు దేవుని నియమాలపట్ల మన విశ్వాసాన్ని బలపర్చుకోవాలి. ప్రవర్తనకు సంబంధించి యెహోవా సహేతుకంగా ఏర్పరచిన అనేక నియమాల గురించి ఈ పుస్తకంలో తెలుసుకున్నారు. ఆ సూత్రాల గురించి మీరేమనుకుంటున్నారు? యెహోవా నియమాలు, సూత్రాలు, ప్రమాణాలు కఠినమైనవని, అవి మిమ్మల్ని కట్టుదిట్టం చేస్తాయని నమ్మించి తప్పుదారి పట్టించడానికి సాతాను ప్రయత్నిస్తాడు. ఈ కుతంత్రం ఏదెనులో పనిచేసింది కాబట్టి అతడు అప్పటినుండి దానిని ఉపయోగిస్తూనే ఉన్నాడు. (ఆదికాండము 3:1-6) అతని కుతంత్రానికి మీరు కూడా పడిపోతారా? అది మీ వైఖరి మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
4 ఉదాహరణకు, మీరు జూకు వెళ్ళారనుకోండి. ప్రతీ జంతువు దగ్గరికి వెళ్లి చూస్తున్నారు. సింహం ఉన్న చోటికి వెళ్లారు. చుట్టూ కంచెవేసి ఉంది. ఆ కంచెవేసి మనం దాని దగ్గరకు వెళ్లకుండా ఎందుకు కట్టుదిట్టం చేస్తున్నారని మీరనుకుంటారా? అస్సలు అనుకోరు. ఎందుకంటే దానివల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని మీకు తెలుసు. నేడు కూడా ఒక సింహం మనకు హాని చేయాలని పొంచివుంది. “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అని బైబిలు హెచ్చరిస్తోంది.—1 పేతురు 5:8.
5 సాతాను ఒక క్రూర మృగం. మనం సాతాను కోరలకు చిక్కకూడదన్న ఉద్దేశంతోనే యెహోవా ఆ దుష్టుని అనేక “తంత్రముల” నుండి మనల్ని కాపాడే నియమాలు విధించాడు. (ఎఫెసీయులు 6:11) కాబట్టి, మనం దేవుని నియమాల గురించి ఆలోచించినప్పుడెల్లా, వాటిలో మన పరలోకపు తండ్రి ప్రేమను గమనించాలి. అలాచేస్తే, దేవుని నియమాలు మనకు భద్రతనిచ్చేవిగా, మన ఆనందానికి తోడ్పడేవిగా కనిపిస్తాయి. శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు . . . క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.”—యాకోబు 1:25.
6. దేవుడు ఇచ్చిన సహేతుకమైన నియమాల పట్ల, సూత్రాల పట్ల విశ్వాసాన్ని బలపర్చుకునేందుకు ఉత్తమ మార్గమేమిటి? ఒక ఉదాహరణను ఇవ్వండి.
6 శాసనకర్తయైన దేవునిపై, ఆయన నియమాల్లో కనిపించే జ్ఞానంపై మన విశ్వాసం బలపడాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు అనుగుణంగా జీవించడమే ఉత్తమ మార్గం. ఉదాహరణకు, “క్రీస్తు నియమము”లో యేసు ‘ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ’ ఇతరులకు బోధించడం కూడా భాగమే. (గలతీయులు 6:2; మత్తయి 28:19, 20) ఆరాధన కోసం, ప్రోత్సాహకరమైన సహవాసం కోసం క్రమంగా సమకూడాలి అనే ఆజ్ఞను క్రైస్తవులు తప్పకుండా పాటిస్తారు. (హెబ్రీయులు 10:24, 25) ఎడతెగక యెహోవాకు మనఃపూర్వకంగా ప్రార్థించాలనేది కూడా దేవుని ఆజ్ఞల్లో ఒకటి. (మత్తయి 6:5-8; 1 థెస్సలొనీకయులు 5:17) వాటి ప్రకారం చేస్తుండగా, అవెంత ప్రేమపూర్వకమైన నిర్దేశాలో మరింత స్పష్టంగా చూడగలుగుతాం. వాటికి లోబడడంవల్ల, ఈ కల్లోలభరిత లోకంలో మరెక్కడా దొరకని ఆనందాన్ని, సంతృప్తిని పొందుతాం. దేవుని నియమాల ప్రకారం జీవించడం వల్ల వ్యక్తిగతంగా మీకెంత ప్రయోజనం చేకూరిందో ఆలోచించినప్పుడెల్లా వాటిపై మీ విశ్వాసం బలపడుతుంది.
7, 8. సంవత్సరాలు గడిచేకొద్దీ నీతిగా బ్రతకడం కష్టమని అనుకునేవారికి దేవుని వాక్యం ఏ అభయాన్నిస్తోంది?
7 సంవత్సరాలు గడిచేకొద్దీ యెహోవా నియమాల్ని నిష్టగా అనుసరించడం కష్టమని కొందరు అనుకుంటారు. ఏదోక దానిలో తప్పిపోతామేమోనని వారు భయపడుతుంటారు. మీకెప్పుడైనా అలా అనిపిస్తే, ఈ మాటల్ని మీరు గుర్తుచేసుకోండి: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” (యెషయా 48:17, 18) మీరెప్పుడైనా ఓ క్షణమాగి ఈ మాటలెంత ప్రోత్సాహకరంగా ఉన్నాయో ఆలోచించారా?
8 తనకు లోబడడం మనకే ప్రయోజనకరమని యెహోవా మనకు గుర్తుచేస్తున్నాడు. అలా లోబడితే మనకు రెండు ప్రయోజనాలున్నాయని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. (1) నిండుగా, నెమ్మదిగా, నిరంతరం ప్రవహించే నదిలా మన జీవితం క్షేమంగా లేదా ప్రశాంతంగా ఉంటుంది. (2) మన నీతి సముద్ర తరంగాల్లా ఉంటుంది. సముద్రం ఒడ్డున నిలబడి అలలను చూస్తుంటే, ఇవెప్పుడైనా ఆగుతాయా అనిపిస్తుంది. ఎన్ని యుగాలు గడిచినా ఆ అలలు అలాగే ఎగసిపడుతూ ఒడ్డుకు చేరుతూనే ఉంటాయని మీకు తెలుసు. అలాగే మీరు కూడా నీతిక్రియలు చేస్తూనే ఉంటారని యెహోవా చెబుతున్నాడు. మీరు ఆయన పట్ల నమ్మకంగా ఉండేందుకు ప్రయత్నించినంత కాలం ఆయనెన్నడూ మిమ్మల్ని నిరాశపడనివ్వడు. (కీర్తన 55:22 చదవండి.) అలాంటి హామీల గురించి ఆలోచించినప్పుడు యెహోవాపై, ఆయన ఇచ్చిన న్యాయమైన ఆజ్ఞలపై మీ విశ్వాసం బలపడదా?
‘సంపూర్ణులవండి’
9, 10. (ఎ) క్రైస్తవులు ఎందుకు పరిణతి సాధించాలని కోరుకోవాలి? (బి) దేవుని దృక్కోణం నుండి ఆలోచించడం ఎలా ఆనందానికి తోడ్పడుతుంది?
9 మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి తోడ్పడే రెండవ అంశం, “సంపూర్ణులమగుటకు సాగిపోదము” అనే ఈ ప్రేరేపిత మాటల్లో వెల్లడౌతోంది. (హెబ్రీయులు 6:1) సంపూర్ణులవడం అంటే పరిణతి సాధించడం. ప్రతీ క్రైస్తవుడు పరిణతి సాధించాలని కోరుకోవాలి. మనుషులు ఇప్పుడు పరిపూర్ణులవలేరు కానీ పరిణతి సాధించవచ్చు. అంతేకాక, క్రైస్తవులు పరిణతి సాధించేకొద్దీ మరింత ఆనందంగా యెహోవా సేవచేస్తారు. కారణమేమిటి?
10 పరిణతి సాధించిన క్రైస్తవుడు యెహోవా దృక్కోణం నుండి ఆలోచిస్తాడు. (యోహాను 4:23) “శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు” అని పౌలు రాశాడు. (రోమీయులు 8:5) శరీరానుసారులు అంటే శారీరక విషయాల గురించి ఆలోచించేవారు ఆనందాన్ని పొందరు, ఎందుకంటే వారు స్వార్థపూరితంగా, తాత్కాలికమైన వాటి గురించే ఆలోచిస్తూ వస్తుసంపద మీదే దృష్టి నిలుపుతారు. ఆత్మానుసారులు అంటే దేవుని దృక్కోణం నుండి ఆలోచించేవారు ఆనందాన్ని పొందుతారు, ఎందుకంటే వారు ‘సంతోషంగా ఉండే దేవుడైన’ యెహోవాపై దృష్టి నిలుపుతారు. (1 తిమోతి 1:8, NW) యెహోవాతో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆయనను సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ కష్టాలనైనా ఇష్టపూర్వకంగా భరిస్తాడు. ఎందుకు? ఎందుకంటే, కష్టాలు సహిస్తే సాతాను అబద్ధికుడని నిరూపిస్తాం, యథార్థంగా ఉంటూ మన పరలోకపు తండ్రిని సంతోషపెడతాం.—సామెతలు 27:11; యాకోబు 1:2, 3 చదవండి.
11, 12. (ఎ) క్రైస్తవుని “జ్ఞానేంద్రియముల” గురించి పౌలు ఏమి చెప్పాడు? “సాధకము చేయబడిన” అనే మాటల అర్థమేమిటి? (బి) పసిపిల్లలు ఏమి నేర్చుకోవాలి, జిమ్నాస్ట్‌కు ఎలాంటి సాధన అవసరం?
11 సాధన చేస్తేనే పరిణతి సాధించగలుగుతాం. ఈ వచనాన్ని పరిశీలించండి: “వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.” (హెబ్రీయులు 5:14) “సాధకము చేయబడిన” జ్ఞానేంద్రియాలు అని పౌలు రాసినప్పుడు, ఆయన మొదటి శతాబ్దపు గ్రీసు దేశంలోని జిమ్నాసియమ్‌లలో సాధారణంగా ఉపయోగించబడే ఒక పదాన్ని ఉపయోగించాడు, ఆ గ్రీకు పదానికి ‘జిమ్నాస్ట్‌లా శిక్షణ పొందిన’ అని అర్థం. ఆ శిక్షణ ఎలావుంటుందో మీకు తెలుసా?
ఒక జిమ్నాస్ట్ సాధన చేస్తేనే ఇలా చేయగలుగుతాడు
12 పుట్టినప్పుడే పిల్లలు అన్ని పనులూ చేయలేరు. ఉదాహరణకు, పసిపిల్లలకు తమ కాళ్లతో, చేతులతో ఏమిచేయాలో తెలియదు. అందుకే, వాళ్ళు కాళ్లూచేతులు ఆడిస్తూ, కొన్నిసార్లు చేతులతో తమ ముఖంపై కొట్టుకుని ఏడుస్తారు. అయితే రోజులు గడుస్తుండగా వాటినెలా వాడాలో నేర్చుకుంటారు. మొదట పాకుతారు, తర్వాత తప్పటడుగులు వేస్తారు, చివరకు పరుగెడతారు.a కానీ జిమ్నాస్ట్ విషయమేమిటి? ఆ క్రీడాకారుడు గాల్లోకి ఎగిరి, ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పకుండా, నేర్పుగా వంపులు తిరగడాన్ని మీరు చూసినప్పుడు, అతడు ఎంతో సాధన చేయడంవల్లే అలా చేయగలుగుతున్నాడని మీకు అర్థమవుతుంది. ఆ జిమ్నాస్ట్ నైపుణ్యం అలవోకగా వచ్చింది కాదు, అలుపెరగని కృషివల్లే ఆయనకది సాధ్యమైంది. అంతటి సాధన “కొంచెముమట్టుకే ప్రయోజనకరము” అని బైబిలు చెబుతోంది. దానికన్నా దేవుని దృక్కోణం నుండి ఆలోచించే వివేచనా శక్తిని పెంచుకోవడం ఇంకెంత ప్రయోజనకరమో కదా!—1 తిమోతి 4:8.
13. మన జ్ఞానేంద్రియాలకు మనమెలా శిక్షణ ఇవ్వవచ్చు?
13 యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగివుంటూ ఆయనకు నమ్మకంగా సేవచేసేలా వివేచనా శక్తి పెంచుకునేందుకు సహాయం చేసే అనేక విషయాల గురించి ఈ పుస్తకంలో నేర్చుకున్నాం. మీరు ప్రతీరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని సూత్రాల, నియమాల గురించి ఆలోచించి వాటి గురించి ప్రార్థించండి. నిర్ణయం తీసుకునే ప్రతీసారి ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘ఈ విషయంలో బైబిల్లోని ఏ సూత్రం లేదా నియమం వర్తిస్తుంది? నేను వాటినెలా పాటించవచ్చు? నేనేమి చేస్తే పరలోకంలోవున్న నా తండ్రి సంతోషిస్తాడు?’ (సామెతలు 3:5, 6; యాకోబు 1:5 చదవండి.) ఆ విధంగా మీరు తీసుకునే ప్రతీ నిర్ణయం మీ వివేచనా శక్తిని పెంచుతుంది. అలా మీరు మీ జ్ఞానేంద్రియాలకు శిక్షణ ఇస్తే యెహోవా దృక్కోణం నుండి ఆలోచిస్తూ ఎల్లప్పుడూ ఆయనను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవడానికి అది మీకు సహాయం చేస్తుంది.
14. పరిణతి సాధించడానికి మనం వేటిపై ఆసక్తిని పెంచుకోవాలి? అదేసమయంలో ఏమి జరగకుండా చూసుకోవాలి?
14 ఆధ్యాత్మికంగా ఎదుగుతూ పరిణతి సాధించడమనేది ఎప్పటికీ కొనసాగుతుంది. శరీర ఎదుగుదలకు ఆహారం ఎలాగైతే అవసరమో అలాగే, మీ విశ్వాసం బలపడాలంటే బలమైన ఆధ్యాత్మిక ఆహారం ఎంతో అవసరం. అందుకే, ‘వయస్సు వచ్చినవారికి బలమైన ఆహారము’ అవసరమని పౌలు రాశాడు. నేర్చుకున్న విషయాల్ని మీరు సరిగా ఆచరణలో పెట్టడమే జ్ఞానం. అది “ముత్యములకన్న శ్రేష్ఠమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు” అని బైబిలు చెబుతోంది. కాబట్టి, మన తండ్రి మనకందించే విలువైన సత్యాల పట్ల మనం నిజమైన ఆసక్తిని పెంచుకోవాలి. (సామెతలు 8:11; 1 పేతురు 2:1, 2) బైబిలు గురించి బాగా తెలుసుకొని దాన్ని ఉపయోగించే జ్ఞానం ఉన్నంత మాత్రాన గర్వించకూడదు. అహంకారం లేదా మరో బలహీనత మన హృదయంలో మొలకెత్తి, పెరగకుండా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి” అని పౌలు రాశాడు.—2 కొరింథీయులు 13:5.
15. పరిణతి సాధించడానికి ప్రేమ ఎందుకు ప్రాముఖ్యం?
15 ఇంటి నిర్మాణం పూర్తయినా దాని నిర్వహణా పనులు మాత్రం కొనసాగుతాయి. మున్ముందు మరమ్మతులు చేయాల్సివస్తుంది, అవసరమైతే మరో గదిని కట్టాల్సివస్తుంది. అయితే పరిణతి సాధించి దేవునితో దగ్గరి సంబంధం కలిగివుండాలంటే ఏమి చేయాలి? యెహోవాపట్ల, మన తోటివిశ్వాసులపట్ల ప్రేమను పెంచుకుంటూ ఉండాలి. మనకు ప్రేమ లేకపోతే మన జ్ఞానం, మనం చేసేదంతా వ్యర్థమే, కేవలం విసుగు రప్పించే మోతలా ఉంటుంది. (1 కొరింథీయులు 13:1-3) ప్రేమతోనే మనం క్రైస్తవ పరిణతి సాధించి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండగలుగుతాం.
యెహోవా ఇచ్చిన నిరీక్షణపై మీ దృష్టి నిలపండి
16. ప్రజలు ఎలా ఆలోచించేలా సాతాను ప్రేరేపిస్తాడు? యెహోవా మనల్నెలా సంరక్షిస్తాడు?
16 మనల్ని మనం కట్టుకోవడానికి సంబంధించిన మరో అంశాన్ని చూద్దాం. క్రీస్తు నిజ అనుచరునిగా తయారయ్యేందుకు మీరు మీ ఆలోచనా విధానం పాడవకుండా చూసుకోవాలి. ప్రజలు నిరాశా నిస్పృహలకు లోనై, అపనమ్మకం పెంచుకుని, ఆశలు వదులుకునేలా చేయడంలో ఈ లోకాధికారియైన సాతాను దిట్ట. (ఎఫెసీయులు 2:2) అలాంటి ఆలోచనలు కలపను లోపలి నుండి తినేసే చెదల్లా ప్రమాదకరమైనవి. కానీ యెహోవా మనల్ని సంరక్షించేందుకు నిరీక్షణను ఇచ్చాడు.
17. నిరీక్షణకున్న ప్రాముఖ్యతను దేవుని వాక్యమెలా తెలియజేస్తోంది?
17 సాతానుతో, ఈ లోకంతో పోరాడేందుకు అవసరమైన ఆధ్యాత్మిక కవచం గురించి బైబిలు మాట్లాడుతోంది. ఆ కవచంలో శిరస్త్రాణం ఒక ప్రాముఖ్యమైన భాగం, అదేమిటంటే మన “రక్షణ నిరీక్షణ.” (1 థెస్సలొనీకయులు 5:8) శిరస్త్రాణం లేకపోతే యుద్ధంలో ప్రాణాలు దక్కించుకోవడం అసాధ్యమని అప్పట్లో సైనికులకు తెలుసు. లోహంతో తయారు చేయబడి, లోపల మెత్తటి గుడ్డ లేదా తోలు అమర్చబడే శిరస్త్రాణం తలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది. శిరస్త్రాణం తలను కాపాడినట్లే, నిరీక్షణ మీ మనస్సును, మీ ఆలోచనలను కాపాడుతుంది.
18, 19. నిరీక్షణను కాపాడుకునే విషయంలో యేసు ఎలాంటి మాదిరివుంచాడు? మనమాయనను ఎలా అనుకరించవచ్చు?
18 నిరీక్షణతో జీవించే విషయంలో యేసు అత్యుత్తమ మాదిరినుంచాడు. తన జీవితంలోని చివరిరోజు రాత్రి ఆయనెంత బాధ అనుభవించాడో గుర్తుచేసుకోండి. డబ్బుకోసం ఆయన స్నేహితుడే నమ్మకద్రోహం చేశాడు. మరో స్నేహితుడు ఆయనెవరో నాకు తెలియదన్నాడు. ఇతరులు ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. సొంత ప్రజలే ఆయనకు విరోధులై, రోమా సైనికులు ఆయనను హింసించి చంపాలని కేకలు వేశారు. నిజానికి, యేసుకు ఎదురైనన్ని శ్రమలు మనకెప్పుడూ ఎదురుకావేమో! మరి వాటన్నిటినీ ఆయనెలా సహించగలిగాడు? దీనికి హెబ్రీయులు 12:1, 2 ఇలా జవాబిస్తోంది: “ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.” యేసు ఎల్లప్పుడూ ‘తన యెదుట ఉంచబడిన ఆనందాన్ని’ గుర్తుంచుకున్నాడు.
19 యేసు ఎదుట ఉంచబడిన ఆ ఆనందమేమిటి? ఆ శ్రమల్ని సహిస్తే యెహోవా పరిశుద్ధ నామం పవిత్రపరచబడడంలో తన వంతు తాను చేసినట్లు అవుతుందని ఆయనకు తెలుసు. అంతేకాదు, సాతాను అబద్ధికుడని తిరుగులేని రీతిలో నిరూపించగలుగుతానని కూడా తెలుసు. అంతకన్నా మరి ఏ విషయాలు యేసుకు ఆనందాన్నిస్తాయి! అలాగే నమ్మకంగావుంటే యెహోవా తనను ఎంతో ఆశీర్వదిస్తాడని అంటే తాను తిరిగి తన తండ్రి దగ్గరకు వెళ్లి సంతోషంగా గడిపే సమయం వస్తుందని కూడా ఆయనకు తెలుసు. కష్టకాలమంతటిలో యేసు ఆ ఆనందభరితమైన నిరీక్షణను గుర్తుంచుకున్నాడు. మనం కూడా అదే చేయాలి. మన ఎదుట కూడా ఒక ఆనందం ఉంచబడింది. తన నామాన్ని పవిత్రపర్చడంలో మన చేయి కూడా కలిపే గొప్ప అవకాశాన్ని యెహోవా మనందరికీ ఇచ్చాడు. యెహోవాను మన సర్వాధిపతిగా ఒప్పుకోవడమే కాకుండా మనకెలాంటి పరీక్షలు, శ్రమలు ఎదురైనా మన తండ్రి ప్రేమలో నిలిచివుండడం ద్వారా మనం సాతానును అబద్ధికుడని నిరూపించవచ్చు.
20. మీరెలా నిరీక్షణను మనసులో ఉంచుకుని సానుకూలంగా ఆలోచించవచ్చు?
20 యెహోవా తన సేవకులకు ప్రతిఫలమివ్వాలని అనుకోవడమే కాదు, అది ఇవ్వాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. (యెషయా 30:18; మలాకీ 3:10 చదవండి.) ఆయన సంతోషంగా తన సేవకుల సరైన కోరికల్ని తీరుస్తాడు. (కీర్తన 37:4) కాబట్టి మీ ఎదుట ఉంచబడిన నిరీక్షణను ఏ మాత్రం మర్చిపోవద్దు. సాతాను లోకానికి సంబంధించిన ప్రతికూలమైన, నీచమైన వక్ర ఆలోచనలకు తావివ్వకండి. చాపకింద నీరులా ఈ లోకస్థుల స్వభావం మీ మనసులోకి, హృదయంలోకి ప్రవేశిస్తున్నట్లు మీరు పసిగడితే, “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము” కోసం యెహోవాకు తీవ్రంగా ప్రార్థించండి. అప్పుడు దేవుడు అనుగ్రహించు సమాధానం మీ హృదయాలను, తలంపులను కాపాడుతుంది.—ఫిలిప్పీయులు 4:6, 7.
21, 22. (ఎ) “గొప్పసమూహములో” ఉన్నవారికి ఏ గొప్ప నిరీక్షణ ఉంది? (బి) దేవుడు క్రైస్తవుల కోసం సిద్ధం చేసిన జీవితానికి సంబంధించిన ఏ అంశం మీ మనసుకు నచ్చింది? (సి) మీ నిర్ణయమేంటి?
21 నిజంగా దేవుడిచ్చిన నిరీక్షణ ఎంత గొప్పదో కదా! మీరు “మహాశ్రమలను” దాటే “గొప్పసమూహములో” ఒకరైతే, త్వరలో ఎలాంటి జీవితం మీ సొంతం అవబోతుందో ఒక్కసారి ఆలోచించండి. (ప్రకటన 7:9, 14) సాతాను, అతని దయ్యాలు నాశనం అయ్యాక, ఊహకందనంత హాయిగా జీవిస్తారు. మనలో ఎవరం మాత్రం సాతాను దుష్ట ప్రభావాన్ని తప్పించుకోగలిగాం? భవిష్యత్తులో అలాంటి ఒత్తిడేమీ లేకుండా, యేసు, ఆయన సహపరిపాలకులైన 1,44,000 మంది ఆధ్వర్యంలో భూమిని పరదైసుగా మార్చడం ఎంత ఆనందదాయకంగా ఉంటుందో కదా! అన్నిరకాల వ్యాధులు, రోగాలు లేకుండా పోతాయి. చనిపోయిన మన ఆత్మీయులను తిరిగి కలుసుకుంటాం. దేవుడు ఆదాము హవ్వలకు ఇవ్వాలనుకున్న జీవితాన్ని పొంది సంతోషంగా జీవించడం ఎంతో మధురంగా ఉంటుంది. మనం పరిపూర్ణులమయ్యే కొద్దీ, మరింత గొప్ప బహుమానం అందుకునే సమయం దగ్గరపడుతుంది. రోమీయులు 8:20, 21 చెబుతున్నట్లు మనకు “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” లభిస్తుంది.
22 మీరు ఊహించనంత స్వేచ్ఛను యెహోవా మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ స్వేచ్ఛను పొందాలంటే మనం విధేయత చూపించాలి. కాబట్టి ప్రతీదినం యెహోవాకు లోబడేందుకు శాయశక్తులా ప్రయత్నించడం ప్రాముఖ్యం కాదా? కాబట్టి మీరు నిత్యమూ దేవుని ప్రేమలో నిలిచివుండేలా అతి పరిశుద్ధమైన మీ విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ ఉండండి.
a కాళ్లు చేతులు ఎలా కదులుతున్నాయో, వాటినెలా వాడాలో అర్థంచేసుకునే ప్రత్యేక సామర్థ్యం మనలో ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఉదాహరణకు, ఈ సామర్థ్యం వల్లే మనం కళ్లు మూసుకుని కూడా చప్పట్లు కొట్టగలుగుతాం. ఈ సామర్థ్యాన్ని కోల్పోయిన ఒక రోగి నిలబడలేకపోయింది, నడవలేకపోయింది, కనీసం కూర్చోలేకపోయింది.