కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lv పేజీ 239-పేజీ 242 పేరా 2
  • క్రైస్తవ స్త్రీలు తలపై ఎప్పుడు ముసుగు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ స్త్రీలు తలపై ఎప్పుడు ముసుగు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి?
  • ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ప్రశ్నాభాగం
    మన రాజ్య పరిచర్య—2013
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • సంఘంలో శిరస్సత్వ ఏర్పాటును అర్థం చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
lv పేజీ 239-పేజీ 242 పేరా 2

అనుబంధం

క్రైస్తవ స్త్రీలు తలపై ఎప్పుడు ముసుగు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి?

బైబిలు ప్రకారం, క్రైస్తవ స్త్రీ తలపై ఎప్పుడు ముసుగు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి? దీని గురించి దైవ ప్రేరణతో అపొస్తలుడైన పౌలు ఏమి రాశాడో చూద్దాం. దేవుణ్ణి మహిమపర్చేలా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన నిర్దేశాన్ని ఆయనిచ్చాడు. 1 కొరింథీయులు 11:3-16 వచనాల్లో ఆయన మూడు ముఖ్యమైన విషయాలు చెప్పాడు: (1) స్త్రీ ఏమేమి చేస్తున్నప్పుడు ముసుగు వేసుకోవాలి? (2) ఏయే సందర్భాల్లో ముసుగు వేసుకోవాలి? (3) ఎందుకు అలా చేయాలి?

తన భర్త ఉన్నప్పుడు ఒక క్రైస్తవ స్త్రీ బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు తలకు ముసుగు వేసుకుంటుంది

ఏమేమి చేస్తున్నప్పుడు? పౌలు రెండు పనులను పేర్కొన్నాడు: ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు. (4, 5 వచనాలు) ప్రార్థన అంటే పూజ్యభావంతో యెహోవాతో మాట్లాడడం అని మనకు తెలుసు. అదే ప్రవచించడమైతే నేడు క్రైస్తవ పరిచారకులు బైబిలు ఆధారంగా బోధించడాన్ని సూచిస్తుంది. స్త్రీ ప్రార్థించినప్పుడెల్లా లేదా బైబిలు సత్యాన్ని బోధించినప్పుడెల్లా తలపై ముసుగు వేసుకోవాలని పౌలు చెబుతున్నాడా? లేదు. ఆమె ముసుగు వేసుకోవాలా వద్దా అనేది సందర్భాన్ని బట్టి మారుతుంది.

ఏయే సందర్భాలు? పౌలు మాటల్నిబట్టి చూస్తే ఇంట్లో, సంఘంలో ఎదురయ్యే కొన్ని సందర్భాలు మనకు తెలుస్తాయి. ఆయనిలా చెప్పాడు: “స్త్రీకి శిరస్సు పురుషుడు . . . ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును.” (3, 5 వచనాలు) ఇంట్లో, భర్తను యెహోవా ఆమెకు శిరస్సుగా నియమించాడు. తన భర్త అధికారాన్ని గౌరవించకుండా, యెహోవా ఆయనకు అప్పగించిన బాధ్యతల్ని ఆమె నిర్వహిస్తే ఆయనను అవమానపర్చినట్లే. ఉదాహరణకు, ఆమె తన భర్త సమక్షంలో బైబిలు అధ్యయనం నిర్వహించాల్సివస్తే, తలపై ముసుగు వేసుకోవడం ద్వారా ఆయన అధికారాన్ని గౌరవిస్తుంది. ఆయన కుటుంబ శిరస్సు కాబట్టి, ఆయన బాప్తిస్మం తీసుకున్నా, తీసుకోకపోయినా ఆమె ముసుగు వేసుకోవాలి.a బాప్తిస్మం తీసుకున్న మైనర్‌ కొడుకు సమక్షంలో ప్రార్థించాల్సివచ్చినా లేదా బోధించాల్సివచ్చినా ఆమె ముసుగు వేసుకోవాలి. వాళ్ళ అబ్బాయి కుటుంబ శిరస్సు అని కాదుగానీ, క్రైస్తవ సంఘంలో బాప్తిస్మం తీసుకున్న సహోదరునిగా అతనిపట్ల గౌరవం చూపించడానికే ఆమె ముసుగు వేసుకోవాలి.

సంఘంలో ఎలావుండాలో పేర్కొంటూ పౌలు ఇలా చెప్పాడు: “ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలిసికొనవలెను.” (16వ వచనం) క్రైస్తవ సంఘంలో బాప్తిస్మం తీసుకున్న పురుషులకు అధికారమివ్వబడింది. (1 తిమోతి 2:11-14; హెబ్రీయులు 13:17) దేవుడు పురుషులకు మాత్రమే మందను కాసే బాధ్యతను అప్పగించాడు, వారే పెద్దలుగా, పరిచర్య సేవకులుగా నియమించబడతారు. (అపొస్తలుల కార్యములు 20:28) కానీ కొన్నిసార్లు ఒక క్రైస్తవ స్త్రీ, సాధారణంగా బాప్తిస్మం తీసుకున్న అర్హతగల సహోదరులు నిర్వహించే బాధ్యతల్ని ఆమె నిర్వహించాల్సిరావచ్చు. ఉదాహరణకు, బాప్తిస్మం తీసుకున్న అర్హతగల సహోదరుడు లేనప్పుడు క్షేత్రసేవా కూటాన్ని నిర్వహించాల్సిరావచ్చు. లేదా ముందుగానే ఏర్పాటుచేసుకున్న బైబిలు అధ్యయనాన్ని బాప్తిస్మం తీసుకున్న ఒక సహోదరుని సమక్షంలో నిర్వహించాల్సిరావచ్చు.b ఈ పనులు నిజానికి క్రైస్తవ సంఘ బోధనా పనిలో భాగమే కాబట్టి, సాధారణంగా పురుషునికి నియమించబడిన పనిని తాను చేస్తున్నానని గుర్తుంచుకోవడానికి ఆమె ముసుగు వేసుకోవాలి.

అయితే, సహోదరీలు తలపై ముసుగు వేసుకోవాల్సిన అవసరంలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, (1) క్రైస్తవ కూటాల్లో వ్యాఖ్యానించేటప్పుడు, (2) తన భర్తతో లేదా బాప్తిస్మం తీసుకున్న మరో సహోదరునితో కలిసి ఇంటింటి పరిచర్యలో పాల్గొన్నప్పుడు, (3) తన భర్తలేని సమయంలో బాప్తిస్మం తీసుకోని తన పిల్లలతో అధ్యయనం చేస్తున్నప్పుడు లేదా ప్రార్థించినప్పుడు ఆమె ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు దీని విషయంలో కొన్ని సందేహాలు రావచ్చు, అప్పుడు ఏమిచేయాలో పాలుపోకపోతే ఆమె పరిశోధన చేయవచ్చు.c అయితే, ఆ విషయంలో సరైన నిర్ణయానికి రాలేకపోతే, ముందు పేజీలోని చిత్రంలో చూపించినట్లుగా ఆమె తన మనస్సాక్షిని బట్టి తలపై ముసుగు వేసుకోవచ్చు.

ఎందుకు వేసుకోవాలి? క్రైస్తవ స్త్రీలు తలపై ముసుగు వేసుకోవడానికిగల రెండు కారణాలు 10వ వచనంలో కనిపిస్తాయి. అక్కడిలా ఉంది: “దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను.” ముందుగా, “అధికార సూచన” అనే మాటను గమనించండి. సంఘంలో బాప్తిస్మం తీసుకున్న సహోదరులకు యెహోవా అప్పగించిన అధికారాన్ని ఒప్పుకుంటున్నానని చూపించడానికి ఆమె తలపై ముసుగు వేసుకోవాలి. అలా చేసినప్పుడు ఆమె యెహోవా దేవునిపట్ల ప్రేమ, యథార్థత కనబరుస్తుంది. రెండవ కారణం మనకు “దేవదూతలనుబట్టి” అనే మాటలో కనిపిస్తుంది. ఒక స్త్రీ తలపై ముసుగు వేసుకోవడం అంతటి శక్తిగల దేవదూతలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

అటు పరలోకంలో, ఇటు భూమిపై యెహోవా సంస్థలో ప్రతీ ఒక్కరూ దేవుని అధికారాన్ని ఒప్పుకుంటున్నారా లేదా అనే విషయాన్ని దేవదూతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ విషయంలో అపరిపూర్ణ మానవుల మాదిరి నుండి వారు కూడా ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే వారు కూడా యెహోవా ఏర్పాట్లకు లోబడాలి. గతంలో చాలామంది దేవదూతలు ఈ విషయంలో తప్పిపోయారు. (యూదా 6) సంఘంలో బాప్తిస్మం తీసుకున్న సహోదరునికంటే తనకు ఎక్కువ అనుభవం, ఎక్కువ జ్ఞానం, ఎక్కువ తెలివి ఉన్నా ఒక క్రైస్తవ స్త్రీ ఇష్టపూర్వకంగా ఆయన అధికారానికి లోబడినప్పుడు దేవదూతలు దాన్ని గమనించవచ్చు. అదే ఆ స్త్రీ అభిషిక్తురాలైతే ఆమె క్రీస్తుతోడి వారసుల్లో ఒకరౌతుంది. ఆమె పరలోకంలో దేవదూతల స్థానంకన్నా ఉన్నత స్థానంలో క్రీస్తుతోపాటు పరిపాలిస్తుంది. అయినా ఆమె ముసుగు వేసుకుని అధికారాన్ని గౌరవించినప్పుడు దేవదూతల కోసం ఎంత చక్కని మాదిరిని ఉంచుతుందో కదా! లక్షలాదిమంది నమ్మకమైన దేవదూతలు గమనిస్తుండగా, దేవుని ఏర్పాట్లకు నమ్మకంగా లోబడుతూ, వినయ విధేయతల్ని ప్రదర్శించే గొప్ప అవకాశం సహోదరీలందరికీ ఉంది!

a భర్త ఏదైనా అనారోగ్యం వల్ల మాట్లాడలేని పరిస్థితుల్లో లేదా అలాంటి అసాధారణ పరిస్థితుల్లో ఉంటే తప్ప, క్రైస్తవ స్త్రీ విశ్వాసియైన తన భర్త సమక్షంలో బిగ్గరగా ప్రార్థించదు.

b ముందుగానే ఏర్పాటుచేసుకున్న బైబిలు అధ్యయనాన్ని తన భర్తకాని, బాప్తిస్మం పొందని ప్రచారకుని సమక్షంలో నిర్వహిస్తుంటే ఆమె ముసుగు వేసుకోవాల్సిన అవసరంలేదు.

c ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, దయచేసి కావలికోట నవంబరు 15, 2009 చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి