కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jd అధ్యా. 1 పేజీలు 5-13
  • నాటి, నేటి ప్రజలకు యెహోవా ఇచ్చిన సందేశాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నాటి, నేటి ప్రజలకు యెహోవా ఇచ్చిన సందేశాలు
  • యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆ 12 చిన్న పుస్తకాలు అంత ప్రాముఖ్యమైనవి కావా?
  • అవి ఏ రకంగా ప్రవచన పుస్తకాలు?
  • ప్రయోజనం పొందడమెలా?
  • యెహోవాను తెలుసుకొని ఆయనను సేవించండి
    యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
  • తన మహా దినం కోసం మనం సిద్ధపడడానికి దేవుడు సహాయం చేస్తాడు
    యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
  • శక్తిమంతమైన సందేశాల్ని ప్రకటించిన ప్రవక్తలు
    యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
  • యెహోవా మహా దినమే ఆ పుస్తకాల ముఖ్యాంశం
    యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
మరిన్ని
యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
jd అధ్యా. 1 పేజీలు 5-13

1వ అధ్యాయం

నాటి, నేటి ప్రజలకు యెహోవా ఇచ్చిన సందేశాలు

1, 2. గుప్తనిధుల కోసం కొంతమంది ఎలా అన్వేషించారు? కానీ జీవితాన్ని సంతోషమయం చేసుకోవడానికి ఏమి కావాలి?

ఎన్నో ఏళ్లుగా, గుప్తనిధుల జాడ కనిపెట్టాలని చాలామంది కలలుగన్నారు. ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించిన అన్వేషకులు, పురావస్తు శాస్త్రజ్ఞులు, మరితరుల గురించి మీరు ఎప్పుడైనా చదివారా? గుప్తనిధుల వేటకు వెళ్లాలన్న ఆలోచన మీకు వచ్చి ఉండకపోవచ్చు కానీ అలాంటి నిధి మీ కంటబడితే? మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది, మీ సంతోషం రెట్టింపౌతుంది, జీవితం విజయ శిఖరాలను అధిరోహిస్తుంది, అవునా?

2 అయితే చాలామంది లక్ష్యం అది కాదు. డబ్బు, ఆయురారోగ్యాలు, పచ్చని కాపురం ఇలాంటి వాటిలోనే వాళ్లు సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. ఇవన్నీ భూమిలో తవ్వితే దొరికేవి కావు, వాటికి దారి చూపించే మ్యాపులంటూ ఏవీ లేవు. వాటిని సాధించాలంటే కృషి అవసరం. అందుకే లక్ష్యాల్ని ఎలా సాధించాలో, సంతోషాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలో, జీవితంలోని అన్ని రంగాల్లో ఎలా రాణించాలో తెలిపే చక్కని సలహాలను చాలామంది మనస్ఫూర్తిగా స్వాగతిస్తారు.

3, 4. జీవితానికి మార్గనిర్దేశం ఇచ్చే సలహాలు ఎందులో ఉన్నాయి?

3 ఎంతోమంది జీవితాల్లో సంతోషాన్ని నింపిన చక్కని సలహాలు, నిర్దేశాలు నిజానికి మీ చేరువలోనే ఉన్నాయి. జీవిత పయనానికి సంబంధించి బైబిలు భేషైన సలహాలు ఇస్తోంది, ఇది నిజమని చాలామంది గ్రహించారు. ఇంగ్లండ్‌ రచయిత ఛార్లెస్‌ డికెన్స్‌ బైబిలు గురించి ఇలా రాశాడు: “ప్రపంచంలో ఇప్పటివరకు దీన్ని మించిన గ్రంథం లేదు, ఉండబోదు . . . ఎందుకంటే, ఏ వ్యక్తి జీవితాన్నైనా . . . నిర్దేశించగల అతి శ్రేష్ఠమైన పాఠాలు ఇందులో ఉన్నాయి.”

4 బైబిలు దేవుడు రాయించిన గ్రంథమని నమ్మేవాళ్లు ఆ మాటలకు ఆశ్చర్యపోరు. 2 తిమోతి 3:16, 17⁠లోని ఈ హామీతో బహుశా మీరూ ఏకీభవిస్తారు: “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” ఇంకో మాటలో చెప్పాలంటే, అస్తవ్యస్తంగా తయారైన నేటి లోకంలో మార్గనిర్దేశం ఇచ్చే సమాచారం బైబిల్లో ఉంది. ఆ నిర్దేశం ప్రకారం అడుగులు వేసే వాళ్లు జీవితంలో బాగా రాణిస్తారు, వాళ్ల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

12వ పేజీలోని చిత్రం

5-7. మంచి సలహాల కోసం మీరు బైబిల్లోని ఏ పుస్తకాల్ని సంప్రదిస్తారు?

5 మీకు ఏదైనా సలహా అవసరమైతే బైబిల్లోని ఏ భాగాలు మీ మదిలో మెదులుతాయి? కొంతమందికి కొండమీది ప్రసంగం గుర్తుకొస్తుంది. అందులో, రోజువారీ జీవితానికి సంబంధించిన వివిధ అంశాలపై ఉపయోగకరమైన సలహాలు ఉన్నాయి. ఇంకొందరికైతే అపొస్తలుడైన పౌలు రాసిన పత్రికలు జ్ఞాపకం వస్తాయి. కీర్తనలు, సామెతల గ్రంథాలు జ్ఞానపు భాండాగారాలు. వీటిలో ప్రతీ ఒక్కరికి పనికొచ్చే ఉపదేశాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే మీ పరిస్థితికి, మీ సమస్యకు తగిన సలహాలు బైబిల్లోని ఏ పుస్తకంలోనైనా దొరుకుతాయి. యెహోషువ నుండి ఎస్తేరు వరకున్న పుస్తకాల్లో ఉన్నది చరిత్రే, అయినాసరే అవి కూడా మీకు సహాయం చేయగలవు. ఆనందంగా దేవుని సేవ చేయాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ వాటిలో హెచ్చరికా పాఠాలు ఉన్నాయి. (1 కొరింథీయులు 10:11) జీవితంలో ప్రతీ అడుగు ఎలా వేయాలో, సంతోషాన్ని, సంతృప్తిని ఎలా పొందాలో చూపించే మంచి సలహాలు వాటిలో ఉన్నాయి. ఒకసారి ఈ సత్యాన్ని గుర్తుచేసుకోండి: “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.”—రోమీయులు 15:4; యెహోషువ 1:8; 1 దినవృత్తాంతములు 28:8, 9.

6 అయితే బైబిల్లో, చాలామంది అంతగా పట్టించుకోని ఓ భాగం ఉంది. వెదకాలే గానీ అందులో కూడా సలహాల నిధులు దొరుకుతాయి. హోషేయ నుండి మలాకీ వరకున్న 12 పుస్తకాలే ఆ భాగం. ఇవి కాస్త పెద్ద పుస్తకాలైన యెహెజ్కేలు, దానియేలు తర్వాత ఉంటాయి. (సాధారణంగా ఆ 12 పుస్తకాలు ఈ వరుసలో ఉంటాయి: హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ.) బైబిలును దేవుడు రాయించాడని మనకు తెలుసు. ఉపదేశించడానికి, జీవితాన్ని నిర్దేశించడానికి అది ఉపయోగపడుతుంది. మరి ఆ 12 పుస్తకాల సంగతేంటి?

7 అవి కూడా తప్పకుండా ఉపయోగపడతాయి! నిజానికి, ఈ గజిబిజి లోకంలో మనకు దారి చూపించే విలువైన సమాచారం ఈ పుస్తకాల్లో ఉంది. ఈ 12 పుస్తకాలు చిన్నవని చాలామంది వాటిని పట్టించుకోరు. మరి నిజంగానే అవి అంత ప్రాముఖ్యమైనవి కావా?

ఆ 12 చిన్న పుస్తకాలు అంత ప్రాముఖ్యమైనవి కావా?

8. (ఎ) పూర్వం దేవుడు ముఖ్యంగా ఎవరి ద్వారా నిర్దేశాలు ఇచ్చాడు? (బి) ఆ 12 పుస్తకాల్ని మనం ఎందుకు చిన్నచూపు చూడకూడదు?

8 అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు పత్రిక రాస్తూ ఇలా మొదలుపెట్టాడు: “పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను.” (హెబ్రీయులు 1:1, 2) దేవుడు తన సందేశాలను తెలపడానికి మానవ ప్రవక్తలను ఉపయోగించుకున్నాడు. అందుకే ఆ ప్రవక్తలను, వాళ్లు రాసిన వాటిని మనం చిన్నచూపు చూడకూడదు. చూడ్డానికి ఈ పుస్తకాలు చాలా చిన్నవే గానీ వాటిలోని సమాచారం చాలా గొప్పది. వాటిలోని సందేశాలు కూడా శక్తిమంతమైనవే.

9. బైబిల్లోని ఓ పుస్తకం చిన్నదైనంత మాత్రాన దాని విలువ తగ్గిపోదని ఎందుకు చెప్పవచ్చు?

9 బైబిల్లోని ఓ పుస్తకం చిన్నదైనంత మాత్రాన దాని విలువ తగ్గిపోదు. రూతు పుస్తకం దాని ముందూవెనకా ఉన్న పుస్తకాల కన్నా చాలా చిన్నదే, అయినా మనసును కదిలించే విషయాలు అందులో ఉన్నాయి! ఆ చిన్న పుస్తకం సత్యారాధనపట్ల మక్కువ ఉండాలని నొక్కిచెబుతోంది, దేవుడు స్త్రీలకు ఎంత విలువిస్తాడో చూపిస్తోంది, యేసు వంశానికి సంబంధించి కీలకమైన వివరాలను కూడా ఇస్తోంది. (రూతు 4:17-22) బైబిలు చివర్లో ఉన్న యూదా పత్రిక మరో ఉదాహరణ. ఇది ఎంత చిన్నదంటే, కొన్ని ముద్రణల్లో అది పట్టుమని ఒక పేజీ కూడా ఉండదు. అయినా అందులో వెలకట్టలేని సమాచారం, నిర్దేశం ఉన్నాయి. దుష్ట దూతలతో దేవుడు వ్యవహరించిన తీరు, సంఘాన్ని చెడగొట్టే భక్తిహీనుల గురించిన హెచ్చరికలు, విశ్వాసం నిలబెట్టుకోవడానికి గట్టి పోరాటం సలపమన్న ప్రోత్సాహం వంటివి అందులో ఉన్నాయి. అలాగే, ఆ 12 మంది ప్రవక్తలు రాసిన పుస్తకాలు చిన్నవే అయినా వాటిలోని విషయాలు కూడా చాలా విలువైనవని నమ్మవచ్చు.

అవి ఏ రకంగా ప్రవచన పుస్తకాలు?

10, 11. (ఎ) “ప్రవక్త” అనే మాట విన్నప్పుడు ప్రజలు ఏమి అనుకుంటారు? (బి) బైబిలు ప్రకారం ప్రవక్తలంటే ఎవరు? వాళ్లు ఏమి చేసేవాళ్లు?

10 “ప్రవక్తలు,” “ప్రవచనాలు” అనే పదాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. భవిష్యత్తులో జరగబోయే వాటి వివరాలే ప్రవచనం అని, దాన్ని మర్మమైన పదజాలంతో చెప్పే వ్యక్తే ప్రవక్త అని చాలామంది అనుకుంటారు. అందుకే ఈ 12 పుస్తకాల్లో ఉన్నవన్నీ ప్రవచనాలేనని కొందరు అభిప్రాయపడతారు.

11 నిజమే, ఈ 12 పుస్తకాలను చదువుతున్నప్పుడు వాటిలో ఎక్కువగా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలే ఉన్నాయని అనిపిస్తుంది, వాటిలో చాలావరకు యెహోవా మహా దినపు రాకడ గురించే ఉంది. అదంతా “ప్రవక్త” అనే పదానికున్న ప్రాథమిక అర్థానికి సరిగ్గా సరిపోతుంది. బైబిలు ప్రకారం “ప్రవక్తలు” అంటే దేవునికి సన్నిహితంగా ఉన్నవాళ్లు, జరగబోయేదాన్ని చెప్పడానికి దేవుడు ఎక్కువగా ఉపయోగించుకున్నవాళ్లు. హనోకు మొదలుకొని, ఎంతోమంది దేవుని ప్రవక్తలు భవిష్యత్తు గురించి ప్రవచించారు.—1 సమూయేలు 3:1, 11-14; 1 రాజులు 17:1; యిర్మీయా 23:18; అపొస్తలుల కార్యములు 3:18; యూదా 14, 15.

12. ప్రవక్తల పని ప్రవచించడం ఒక్కటే కాదని ఎలా చెప్పవచ్చు?

12 అయితే, యెహోవా ప్రవక్తల పని ప్రవచించడం ఒక్కటే కాదు. దేవుడు ప్రజలకు తన చిత్తాన్ని తెలియజేయడానికి కూడా ప్రవక్తలను ఉపయోగించుకునేవాడు. ఉదాహరణకు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల గురించి ఆలోచించండి. వాళ్ల పేర్లు విన్నప్పుడు, వాళ్లు భవిష్యత్తు గురించి ప్రవచించారని మనకు అనిపించకపోవచ్చు, కానీ కీర్తన 105:9-15 వచనాలు వాళ్లను ‘ప్రవక్తలు’ అంటున్నాయి. దేవుడు భవిష్యత్తు గురించి చెప్పడానికి కొన్నిసార్లు వాళ్లను ఉపయోగించుకున్నాడు. యాకోబు తన కుమారులను దీవించిన సందర్భంలో అదే జరిగింది. యెహోవా సంకల్పంలో తమ కుటుంబ సభ్యులకు ఉన్న పాత్ర గురించి వాళ్లకు తెలియజేసి ఆ పితరులు ప్రవక్తలయ్యారు. (ఆదికాండము 20:7; 49:1-28) ప్రవక్త చేసే పనుల్లో ఇంకా ఏమేమి ఉంటాయో అర్థంచేసుకోవాలంటే, మోషే తరఫున ప్రవక్తగా ఉన్న అహరోను ఏమి చేశాడో తెలుసుకోవాలి. ఆయన మోషేకు “నోరుగా” ఉపయోగపడుతూ లేదా మోషేకు బదులుగా మాట్లాడుతూ ప్రవక్తగా పనిచేశాడు.—నిర్గమకాండము 4:16; 7:1, 2; లూకా 1:17, 76.

13, 14. (ఎ) ప్రవక్తల పని భవిష్యత్తు గురించి చెప్పడం ఒక్కటే కాదనేందుకు ఉదాహరణలు ఇవ్వండి. (బి) ఆ విషయం తెలుసుకుంటే మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

13 సమూయేలు, నాతాను ప్రవక్తల గురించి కూడా ఆలోచించండి. (2 సమూయేలు 12:25; అపొస్తలుల కార్యములు 3:24; 13:20) యెహోవా వాళ్లిద్దర్నీ భవిష్యత్తు చెప్పడానికే కాక, వేరే రీతుల్లో కూడా ప్రవక్తలుగా ఉపయోగించుకున్నాడు. విగ్రహారాధనను మానేసి సత్యారాధన వైపు తిరగమని సమూయేలు ఓ ప్రవక్తగా ఇశ్రాయేలీయులకు ఉద్బోధించాడు. ఆయన సౌలు రాజుకు దేవుని తీర్పును ప్రకటించాడు. యెహోవా దృష్టిలో బలులకన్నా విధేయత గొప్పదని ఆ తీర్పు సందేశం మనకు నేర్పిస్తోంది. అంటే, దేవునికి నచ్చినట్టు జీవించేందుకు ఏమి చేయాలో చెప్పడం కూడా ప్రవక్త చేసే పనే అన్నమాట. (1 సమూయేలు 7:3, 4; 15:22) దేవాలయాన్ని సొలొమోను నిర్మిస్తాడని, ఆయన రాజ్యం సుస్థిరంగా ఉంటుందని నాతాను ప్రవక్త ప్రవచించాడు. (2 సమూయేలు 7:2, 11-16) బత్షెబ, ఊరియాల విషయంలో దావీదు చేసిన పాపాల్ని బయటపెట్టినప్పుడు కూడా నాతాను ఒక ప్రవక్తగా పనిచేశాడు. ఒక పేదవాడు అల్లారుముద్దుగా పెంచుకునే ఒక్కగానొక్క గొర్రెపిల్లను కాజేసిన ఒక ధనవంతుని ఉపమానం చెప్పి నాతాను ప్రవక్త దావీదు రాజు చేసిన వ్యభిచారాన్ని బట్టబయలు చేసిన వైనాన్ని ఎవరు మర్చిపోగలరు? దేవుని మందిరంలో సత్యారాధన ఏర్పాట్లకు సంబంధించిన కొన్ని పనులు కూడా నాతాను చేశాడు.—2 సమూయేలు 12:1-7; 2 దినవృత్తాంతములు 29:25.

14 ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ 12 పుస్తకాల్లోని సందేశాలు కేవలం భవిష్యత్తుకు సంబంధించినవి మాత్రమే కాదు. జీవన విధానానికి సంబంధించి నాటి, నేటి ప్రజల కోసం దేవుడు ఏర్పర్చిన ప్రమాణాలపై అద్భుతమైన అవగాహనను ఈ పుస్తకాలు కల్పిస్తాయి. అంతేకాదు, మరెన్నో విషయాల మీద దేవుని అభిప్రాయాల్ని అవి తెలియజేస్తాయి. నిజానికి, వాటిలోనే కాదు బైబిల్లోని మిగతా పుస్తకాల్లో కూడా మన జీవితానికి ఉపయోగపడే చక్కని సలహాలు ఉన్నాయి, అవి ఉత్తమ జీవన విధానాన్ని ప్రజలకు చూపిస్తాయి. ‘ఈ లోకంలో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకడానికి’ కావాల్సిన విలువైన సలహాలు ఈ ప్రేరేపిత పుస్తకాల్లో ఉన్నాయి.—తీతు 2:12, 13.

ప్రయోజనం పొందడమెలా?

15, 16. (ఎ) ఆ 12 మంది ప్రవక్తల పుస్తకాల్లో ఎలాంటి సూచనార్థక విషయాలు కనిపిస్తాయి? (బి) ఆ పుస్తకాలు ఎలాంటి పోలికల గురించి తెలియజేస్తాయి?

15 దేవుని ప్రేరేపిత వాక్యం చదివి మనం ఎన్నో రకాలుగా ప్రయోజనం పొందవచ్చు. బైబిల్లోని కొన్ని పుస్తకాలు, ఎప్పుడేమి జరిగిందో చెబుతున్నాయి. కొన్ని పుస్తకాలు పద్య రూపంలో ఉన్నాయి. అయినా, దేనికదే సాటి. మిగతా పుస్తకాల్లో సూచనార్థక విషయాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ 12 పుస్తకాలు ఈ కోవలోకి వస్తాయి. ఉదాహరణకు, యోనా పుస్తకంలోని సంఘటనలను ప్రస్తావిస్తూ యేసు ఈ మాటలు అన్నాడు: “వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచకక్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచకక్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. నీనెవెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.”—మత్తయి 12:39-41.

16 యెహోవా యోనాతో వ్యవహరించిన తీరు గురించి, నీనెవెలో ఈ ప్రవక్త ప్రకటించిన హెచ్చరికా సందేశం గురించి, దానికి ప్రజల నుండి వచ్చిన స్పందన గురించి యోనా పుస్తకంలో ఉంది. అలాగని అది కేవలం ఓ చరిత్ర పుస్తకమని యేసు అనుకోలేదు. యోనా జీవితంలోని ఒక సంఘటనకూ, తాను చనిపోయి మూడవ రోజు పునరుత్థానం అవ్వడానికీ మధ్య పోలిక ఉందని యేసు గ్రహించాడు. అంతేకాదు తన పరిచర్యకు, పనులకు చాలామంది యూదులు స్పందించిన తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో తెలపడానికి యేసు నీనెవె ప్రజల స్పందనను ప్రస్తావించాడు. (మత్తయి 16:4) వీటన్నిటిని బట్టి చూస్తే, దేవుడు తన ప్రజలతో నాడు వ్యవహరించిన తీరుకూ, నేడు వ్యవహరిస్తున్న తీరుకూ మధ్య ఉన్న పోలికలేంటో ఈ 12 పుస్తకాలు తెలియజేస్తాయని అర్థమౌతోంది. వాటిని అధ్యయనం చేయడం అద్భుతంగా ఉంటుంది, వాటినుండి మేటి పాఠాలెన్నో నేర్చుకోవచ్చు.a

17. ఈ పుస్తకం ఉద్దేశం ఏమిటి?

17 అయితే, యోనా పుస్తకంలోని లేదా మిగతా 11 పుస్తకాల్లోని సూచనార్థక విషయాల అర్థాన్ని తెలియజేయడానికో, ఒక్కో వచనాన్ని కూలంకషంగా చర్చించడానికో ఈ పుస్తకాన్ని రూపొందించలేదు. కానీ, వాటిలోని సమాచారం మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో వివరించడానికే ఇది రూపొందించబడింది. మీరిలా ప్రశ్నించుకోండి: “ఈ 12 పుస్తకాల్లో నాకు ఉపయోగపడే ఏ సలహాను లేదా ఉపదేశాన్ని యెహోవా ఇస్తున్నాడు? ‘ఈ లోకంలో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకడానికి’ ఈ పుస్తకాలు నాకు ఎలా సహాయం చేస్తాయి? ‘యెహోవా దినం వస్తోంది, అది సమీపమైంది’ కాబట్టి క్రైస్తవ ప్రవర్తన, నైతిక విలువలు, కుటుంబ జీవితం, ఈ అపాయకరమైన కాలంలో ప్రజల వైఖరులు వంటివాటి గురించి ఆ పుస్తకాలు నాకు ఏమి చెబుతున్నాయి?” (తీతు 2:12, 13; యోవేలు 2:1; 2 తిమోతి 3:1) ఈ ప్రశ్నలకు సరైన జవాబులు ఇందులో దొరుకుతాయి. అంతేకాదు ఎన్నో అమూల్యమైన వచనాలు, బైబిలు నుండి ఇతరులకు సలహా ఇస్తున్నప్పుడు మీరు ఇంతవరకూ వాడని వచనాలు మీ కంటబడతాయి. అలా, మీ విలువైన బైబిలు వృత్తాంతాల భాండాగారంలోకి కొత్తవి వచ్చి చేరతాయి.—లూకా 24:45.

18. ఈ పుస్తకాన్ని ఎలా పొందుపర్చారు? దాన్నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

18 ఈ పుస్తకంలో నాలుగు భాగాలు ఉన్నాయి. ఒక్కో భాగాన్ని మొదలుపెట్టే ముందు అందులో ఏముందో ఒకసారి చూడండి. మిగతా 13 అధ్యాయాల్లో రెండేసి బాక్సులు ఉన్నాయి. మీరు నేర్చుకున్నవి గుర్తుంచుకోవడానికి అవి సహాయం చేస్తాయి. మీరు చదివిన దాన్ని మననం చేసుకోవడానికి, వాటి విలువ గురించి, ఉపయోగం గురించి ఆలోచించడానికి ఆ బాక్సుల్లోని ప్రశ్నలు దోహదపడతాయి. మొదటి బాక్సు అధ్యాయం మధ్యలో ఉంటుంది. మీరు చదువుకుంటూ ఆ బాక్సు దగ్గరకు రాగానే అందులోని ప్రశ్నలను పరిశీలించండి. అలా చేస్తే, మీరు అప్పటివరకు అధ్యయనం చేసిన విషయాలు మీ మనసులో లోతుగా నాటుకుంటాయి. (మత్తయి 13:8, 9, 23; 15:10; లూకా 2:19; 8:15) మొదటి బాక్సు తర్వాతి పేరాల్లో చదివిన విషయాల గురించి ఆలోచించడానికి, మీ జ్ఞాపకాల్లో వాటిని పదిలంగా ఉంచుకోవడానికి రెండవ బాక్సులోని ప్రశ్నలు దోహదపడతాయి. అందుకే ఈ బాక్సులను పరిశీలించడానికి సమయం కేటాయించండి. మీరు పరిశీలిస్తున్న సమాచారంలో మీకు ప్రయోజనం చేకూర్చే విషయాల్ని తెలుసుకోవడానికి అవి చక్కగా ఉపకరిస్తాయి.

19. ఆ 12 పుస్తకాలకు సంబంధించి మీరు ఏమి పరిశీలించుకోవాలి?

19 ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసేముందు మీ మనసులను సిద్ధం చేసుకోండి. అందుకోసం 12 మంది ప్రవక్తల పుస్తకాల్లోని సమాచారం మీకు ఎంతవరకు తెలుసో పరిశీలించుకోండి. దేవుడు ఆ సందేశాలను ఎవరి ద్వారా ఇచ్చాడు? వాళ్లు ఎలాంటివాళ్లు? వాళ్లు ఏ కాలంలో జీవించారు? వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో సేవచేశారు? (20, 21 పేజీల్లోని కాలరేఖ మీకు బాగా ఉపయోగపడుతుంది; ఆయా అధ్యాయాలను పరిశీలిస్తున్నప్పుడు దాన్ని చూస్తుండండి.) ఆ సందేశాలను నాడు ఏ ఉద్దేశంతో ఇచ్చారు? నాటి ప్రజలకు అవి ఎలా ఉపయోగపడ్డాయి? మీరు పరిశీలిస్తున్న అంశాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఆ విషయాలు ఎలా సహాయం చేస్తాయి? ఈ ముఖ్యమైన ప్రశ్నలకు తర్వాతి అధ్యాయంలో జవాబులు ఉన్నాయి.

a ఉదాహరణకు, హగ్గయి పుస్తకంలోని విషయాల గురించి తెలుసుకోవడానికి కావలికోట జనవరి 1, 1997, 6-22 పేజీలు, జెకర్యా పుస్తకంలోని విషయాల గురించి తెలుసుకోవడానికి కావలికోట జనవరి 1, 1996, 8-22 పేజీలు చూడండి.

మనకు ప్రయోజనాలు

  • హోషేయ నుండి మలాకీ వరకున్న 12 ప్రవచన పుస్తకాల గురించి ఏ తప్పుడు అభిప్రాయాలకు మనం తావివ్వకూడదు?—రోమీయులు 15:4.

  • ఆ 12 ప్రవచన పుస్తకాలను పరిశీలిస్తే ప్రయోజనం ఉంటుందని ఎందుకు చెప్పవచ్చు?—2 తిమోతి 3:16, 17.

  • ఈ పుస్తకాలు మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?—1 థెస్సలొనీకయులు 2:13.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి