కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lr అధ్యా. 24 పేజీలు 127-131
  • ఎప్పుడూ దొంగతనం చేయకండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎప్పుడూ దొంగతనం చేయకండి!
  • గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ఇది నిజంగా దొంగతనమేనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దొంగతనం—ఎందుకు చేయకూడదు?
    తేజరిల్లు!—1995
  • యూదా యేసును అప్పగించాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
lr అధ్యా. 24 పేజీలు 127-131

24వ అధ్యాయం

ఎప్పుడూ దొంగతనం చేయకండి!

ఎవరైనా ఎప్పుడైనా మీ దగ్గరున్నది ఏదైనా దొంగతనం చేశారా?— అప్పుడు మీకు ఎలా అనిపించింది?— దొంగతనం ఎవరు చేసినా వాళ్లు దొంగలే. దొంగలను ఎవ్వరూ ఇష్టపడరు. ఎవరైనా ఎలా దొంగలు అవుతారు? ఎవరైనా పుట్టుకతోనే దొంగలు అవుతారా?—

అందరూ పాపంలోనే పుడతారని దీనికి ముందు అధ్యాయంలో నేర్చుకున్నాం. కాబట్టి మనందరం అపరిపూర్ణులమే. కానీ ఎవ్వరూ పుట్టుకతో దొంగలు కారు. మంచి కుటుంబంలో పుట్టినవాళ్లు కూడా దొంగలు అవ్వవచ్చు. వాళ్ల అమ్మానాన్నలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు నిజాయితీగానే ఉండవచ్చు. కానీ ఒక వ్యక్తి డబ్బు మీద, డబ్బుతో కొనగలిగిన వాటిమీద ఆశతో దొంగగా మారవచ్చు.

మొట్టమొదటి దొంగ ఎవరో మీకు తెలుసా?— ఒకసారి దాని గురించి ఆలోచిద్దాం. పరలోకంలో ఉన్నప్పుడే మన గొప్ప బోధకునికి అతను తెలుసు. ఆ దొంగ ఒక దేవదూత. కానీ దేవుడు దేవదూతలందర్నీ పరిపూర్ణులుగా చేశాడు కదా, మరి ఆ దేవదూత దొంగ ఎలా అయ్యాడు?— మనం 8వ అధ్యాయంలో నేర్చుకున్నట్లు, అతను తనది కానిదాన్ని కావాలనుకున్నాడు. అదేమిటో మీకు గుర్తుందా?—

దేవుడు మొదటి పురుషుడిని, స్త్రీని చేసిన తర్వాత, వాళ్లు తనను ఆరాధించాలని ఆ దేవదూత కోరుకున్నాడు. కానీ వాళ్ల ఆరాధనను పొందే హక్కు అతనికి లేదు. వాళ్ల ఆరాధన దేవునికే చెందాలి. కానీ అతను దాన్ని దొంగిలించాడు! ఆదాము, హవ్వ తనను ఆరాధించేలా చేయడం ద్వారా ఆ దేవదూత ఒక దొంగగా మారాడు. అతను అపవాదియైన సాతాను అయ్యాడు.

ఒక వ్యక్తి దొంగ ఎలా అవుతాడు?— తనది కానిదాన్ని కావాలని కోరుకోవడం వల్ల దొంగ అవుతాడు. మరీ ఎక్కువగా అలా కోరుకున్నప్పుడు మంచివాళ్లు కూడా చెడ్డ పనులు చేస్తారు. అలా దొంగలుగా తయారైన కొంతమంది, తమ తీరు మార్చుకుని మళ్లీ మంచిపనులు చేయడానికి ఎప్పటికీ ప్రయత్నించరు. యేసు అపొస్తలులలో ఒకతను అలా ఉండేవాడు. అతని పేరు ఇస్కరియోతు యూదా.

యూదాకు చిన్నప్పటి నుండి దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పించారు కాబట్టి దొంగతనం చేయడం తప్పని అతనికి తెలుసు. ఒకసారి దేవుడు పరలోకం నుండి తన ప్రజలతో మాట్లాడుతూ, ‘దొంగతనం చేయకూడదు’ అని చెప్పిన విషయం కూడా అతనికి తెలుసు. (నిర్గమకాండము 20:15) యూదా పెద్దయ్యాక మన గొప్ప బోధకుణ్ణి కలిశాడు, ఆ తర్వాత ఆయనకు శిష్యుడయ్యాడు. యేసు అతనిని తన 12 మంది అపొస్తలుల్లో ఒకనిగా కూడా ఎంచుకున్నాడు.

యేసు, ఆయన అపొస్తలులు ఎక్కడికైనా కలిసి వెళ్లేవాళ్లు. కలిసి భోంచేసేవాళ్లు. వాళ్లందరి డబ్బు ఒక పెట్టెలో ఉంచేవాళ్లు. యేసు ఆ పెట్టెను చూసుకునే పని యూదాకు అప్పగించాడు. అయితే ఆ డబ్బు యూదాది కాదు. కానీ కొంతకాలం తర్వాత యూదా ఏంచేశాడో తెలుసా?—

[129వ పేజీలోని చిత్రం]

యూదా ఎందుకు దొంగతనం చేశాడు?

యూదా ఆ పెట్టెలో నుండి డబ్బు తీసుకోకూడని సమయాల్లో కూడా తీసుకోవడం మొదలుపెట్టాడు. ఎవ్వరూ చూడనప్పుడు అలా తీసుకునేవాడు, ఆ పెట్టెలోకి ఎక్కువ డబ్బులు వచ్చే మార్గాల కోసం వెతికేవాడు. అతను ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు. అతనికున్న ఈ చెడు కోరికవల్ల, మన గొప్ప బోధకుడు చంపబడడానికి కొన్ని రోజుల ముందు అతను ఏంచేశాడో చూద్దాం.

యేసు స్నేహితుడైన లాజరు వాళ్ల అక్క పేరు మరియ. ఒకసారి, ఆమె స్వచ్ఛమైన నూనె తీసుకొచ్చి యేసు పాదాలమీద పోసింది. కానీ యూదా తప్పుపట్టాడు. ఎందుకో తెలుసా?— ఎందుకంటే, ఆ నూనె అమ్మి ఆ వచ్చిన డబ్బును పేదవాళ్లకు ఇవ్వాల్సిందని అన్నాడు. కానీ నిజానికి, ఆ పెట్టెలో ఎక్కువ డబ్బులు పోగైతే తను దొంగతనం చేయవచ్చనే ఉద్దేశంతో అతను అలా అన్నాడు.—యోహాను 12:1-6.

మరియ చేసింది మంచి పని కాబట్టి ఆమెను ఏమీ అనవద్దని యేసు యూదాతో అన్నాడు. యేసు అలా అనడం యూదాకు నచ్చలేదు, అందుకే ఆయన యేసు శత్రువులైన ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్లాడు. వాళ్లు యేసును బంధించాలనుకున్నారు, అయితే ప్రజలకు కనిపించకుండా రాత్రిపూట అలా చేయాలనుకున్నారు.

యూదా ఆ యాజకులతో, ‘మీరు నాకు డబ్బులిస్తే యేసును ఎలా బంధించవచ్చో చెప్తాను. మీరు నాకు ఎంత ఇస్తారు?’ అని అడిగాడు.

దానికి యాజకులు, ‘ముప్ఫయి వెండి నాణాలు ఇస్తాం’ అన్నారు.—మత్తయి 26:14-16.

యూదా ఆ డబ్బులు తీసుకున్నాడు. అలా తీసుకోవడమంటే గొప్ప బోధకుణ్ణి వాళ్లకు అమ్మేసినట్లే! ఎవరైనా అంత చెడ్డ పని చేస్తారా?— దొంగల్లా మారి, డబ్బు దొంగతనం చేసేవాళ్లు చివరకు ఇలాంటి పనులే చేస్తారు. వాళ్లకు వేరేవాళ్ల మీదకన్నా, దేవుని మీదకన్నా డబ్బుమీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది.

బహుశా మీరు, ‘యెహోవా దేవుని కన్నా దేన్నీ నేను ఎక్కువగా ప్రేమించను’ అనవచ్చు. మీరు అలా ఆలోచించడం మంచిదే. యేసు యూదాను అపొస్తలుడిగా ఎంచుకున్నప్పుడు యూదా కూడా అలాగే ఆలోచించి ఉండవచ్చు. దొంగల్లా మారిన వేరేవాళ్లు కూడా అలాగే ఆలోచించివుంటారు. వాళ్లలో కొంతమంది గురించి తెలుసుకుందాం.

[130వ పేజీలోని చిత్రాలు]

ఆకాను, దావీదు ఏ చెడ్డ పని చేయాలని ఆలోచిస్తున్నారు?

వాళ్లలో ఒకరు దేవుని సేవకుడైన ఆకాను, అతను మన గొప్ప బోధకుడు పుట్టడానికి చాలాకాలం ముందు జీవించాడు. ఆకాను ఒక చక్కని అంగీ, ఒక బంగారు కమ్మీ, కొన్ని వెండి నాణేలు చూశాడు. అవి అతనివి కావు. అవి దేవుని ప్రజల శత్రువుల దగ్గరనుండి తీసుకోబడ్డాయి కాబట్టి అవి యెహోవావని బైబిలు చెప్తోంది. కానీ ఆకానుకు అవి ఎంత నచ్చాయంటే చివరకు అతను వాటిని దొంగిలించడానికి కూడా వెనకాడలేదు.—యెహోషువ 6:19; 7:11, 20-22.

మరో ఉదాహరణ చూద్దాం. చాలాకాలం క్రితం, ఇశ్రాయేలు ప్రజలమీద రాజుగా ఉండడానికి యెహోవా దావీదును ఎంచుకున్నాడు. ఒకరోజు, దావీదు బత్షెబ అనే అందమైన స్త్రీని చూశాడు. ఆయన బత్షెబను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమెను తన భార్యగా ఇంటికి తెచ్చుకోవడం గురించి ఆలోచిస్తూవున్నాడు. అయితే, ఆమె ఊరియా భార్య. అప్పుడు దావీదు ఏమి చేయాల్సింది?—

దావీదు బత్షెబ గురించి ఆలోచించడం ఆపేయాల్సింది. కానీ ఆయన అలా ఆపలేదు. అందుకే, దావీదు ఆమెను ఇంటికి తెచ్చుకున్నాడు. తర్వాత ఊరియాను చంపించేశాడు. దావీదు ఇలాంటి చెడ్డ పనులు ఎందుకు చేశాడు?— ఎందుకంటే, ఆయన వేరొకరి భార్య తనకు కావాలని కోరుకున్నాడు.—2 సమూయేలు 11:2-27.

[130వ పేజీలోని చిత్రం]

అబ్షాలోము చేసింది దొంగతనమని ఎందుకు చెప్పవచ్చు?

దావీదు తను తప్పు చేసినందుకు ఎంతో బాధపడ్డాడు కాబట్టి యెహోవా ఆయనను నాశనం చేయకుండా విడిచిపెట్టాడు. కానీ దావీదుకు ఆ తర్వాత చాలా కష్టాలు వచ్చాయి. దావీదు కుమారుడైన అబ్షాలోము, తన తండ్రికి బదులు తను రాజు అవ్వాలనుకున్నాడు. ప్రజలు దావీదును చూడడానికి వచ్చినప్పుడు, అబ్షాలోము వాళ్ల భుజాల చుట్టూ చేతులు వేసి వాళ్లను ముద్దు పెట్టుకునేవాడు. ‘అబ్షాలోము ఇశ్రాయేలీయులను తనవైపు త్రిప్పుకున్నాడు’ అంటే వాళ్ల హృదయాలను దొంగిలించాడు అని బైబిలు చెప్తోంది. దావీదుకు బదులు తను రాజు కావాలని ప్రజలు కోరుకునేలా చేశాడు.—2 సమూయేలు 15:1-12.

ఆకాను, దావీదు, అబ్షాలోము కోరుకున్నట్లు మీరు కూడా ఏదైనా కావాలని చాలా కోరుకున్నారా?— అది వేరేవాళ్లదైతే, అడగకుండా దాన్ని తీసుకోవడం దొంగతనం అవుతుంది. మొదటి దొంగైన సాతాను ఏమి కోరుకున్నాడో మీకు గుర్తుందా?— ప్రజలు దేవుణ్ణి ఆరాధించే బదులు తనను ఆరాధించాలని అతను కోరుకున్నాడు. కాబట్టి సాతాను, ఆదాముహవ్వలు తన మాట వినేలా చేసుకున్నప్పుడు అతను దొంగతనమే చేశాడు.

ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక వస్తువుంటే అది ఎవరు వాడుకోవచ్చో చెప్పే హక్కు వాళ్లకు ఉంటుంది. ఉదాహరణకు, మీరు వేరే పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వాళ్లింటికి వెళ్లారనుకుందాం. అక్కడ ఏదైనా తీసుకుని మీ ఇంటికి తెచ్చేసుకోవచ్చా?— వాళ్ల అమ్మానాన్నలు తీసుకోమని చెప్తే తెచ్చుకోవచ్చు. వాళ్లను అడగకుండా ఏదైనా మీ ఇంటికి తెచ్చుకోవడం దొంగతనం అవుతుంది.

దొంగతనం చేయాలని మీకు ఎందుకు అనిపించవచ్చు?— మీది కానిదాన్ని మీరు కావాలని కోరుకుంటే అలా అనిపించవచ్చు. మీరు దొంగతనం చేయడం వేరేవాళ్లు చూడకపోయినా, ఎవరు చూస్తారు?— యెహోవా దేవుడు చూస్తాడు. దొంగతనం చేయడాన్ని దేవుడు అసహ్యించుకుంటాడని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి, మీకు దేవుని మీద, పొరుగువాళ్ల మీద ప్రేమ ఉంటే ఎప్పుడూ దొంగతనం చేయరు.

దొంగతనం చేయడం తప్పు అని బైబిలు స్పష్టంగా చెప్తోంది. దాని గురించి తెలుసుకోవడానికి, మార్కు 10:17-19; రోమీయులు 13:9; ఎఫెసీయులు 4:27, 28 వచనాలు దయచేసి చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి