అధ్యాయం పంతొమ్మిది
దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి
1. (ఎ) యేసు శిష్యులు ఏ సువార్త ప్రకటించారు, అయితే కొందరు యూదులు ఎలా ప్రతిస్పందించారు? (బి) మనం ఏ ప్రశ్నలు అడగవచ్చు?
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమంతటికి భవిష్యత్ రాజుగా అభిషేకించబడ్డాడు. మతసంబంధ శత్రువుల ప్రేరణతో యేసు హత్యచేయబడ్డాడు, కాని యెహోవా ఆయనను మృతులలోనుండి లేపాడు. యేసు ద్వారా నిత్యజీవం సాధ్యం చేయబడింది. అయితే ఈ సువార్తను యేసు శిష్యులు బహిరంగంగా ప్రకటించినప్పుడు, హింస చెలరేగింది. వారిలో కొందరు చెరసాలలో వేయబడ్డారు, కొరడాలతో కొట్టించబడ్డారు, యేసు గురించి మాట్లాడవద్దని ఆజ్ఞాపించబడ్డారు. (అపొస్తలుల కార్యములు 4:1-3, 17; 5:17, 18, 40) వారేమి చేశారు? మీరేమి చేసుండేవారు? మీరు ధైర్యంగా సాక్ష్యమిస్తూ ఉండేవారా?
2. (ఎ) మన కాలంలో ఎలాంటి అద్భుతమైన వార్త ప్రకటించబడాలి? (బి) సువార్త ప్రకటించే బాధ్యత ఎవరిది?
2 దేవుని రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు, ‘తన శత్రువులమధ్య’ పరిపాలించేందుకు 1914 లో పరలోకంలో సింహాసనాసీనుడయ్యాడు. (కీర్తన 110: 2) ఆ తర్వాత, సాతాను అతని దయ్యాలు భూమిపైకి పడద్రోయబడ్డారు. (ప్రకటన 12:1-5, 7-12) దానితో ప్రస్తుత దుష్ట విధానపు అంత్యదినాలు ఆరంభమయ్యాయి. ఈ కాలం పూర్తవగానే దేవుడు సాతాను విధానమంతటిని నిర్మూలం చేస్తాడు. (దానియేలు 2:44; మత్తయి 24:21) రక్షించబడినవారికి పరదైసుగా మారే భూమిపై నిత్యం జీవించే ఉత్తరాపేక్ష ఉంటుంది. మీరు ఇప్పటికే ఈ సువార్తను స్వీకరించివుంటే, దానిని ఇతరులతో పంచుకోవాలని మీరు కోరుకుంటారు. (మత్తయి 24:14) కాని ఎలాంటి ప్రతిస్పందనను మీరు ఎదురుచూడవచ్చు?
3. (ఎ) రాజ్య సందేశానికి ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారు? (బి) మనమే ప్రశ్న ఎదుర్కోవాలి?
3 మీరు రాజ్య సువార్త ప్రకటించినప్పుడు కొందరు దానిని స్వీకరించవచ్చు, కాని చాలామంది ఉదాసీనంగా ఉంటారు. (మత్తయి 24:37-39) కొందరు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. మీ స్వంత బంధువుల నుండి వ్యతిరేకత రావచ్చని యేసు హెచ్చరించాడు. (లూకా 21:16-19) మీరు పనిచేసే స్థలంలో లేదా పాఠశాలలో కూడా వ్యతిరేకత ఎదురుకావచ్చు. భూమ్మీద కొన్ని ప్రాంతాల్లో యెహోవాసాక్షులు ప్రభుత్వ నిషేధం క్రింద ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ “విశ్వాసమందు నిలుకడగా” ఉంటారా?—1 కొరింథీయులు 16:13.
మన స్వంత శక్తిపై ఆధారపడకుండా ఉండడం
4. మనం దేవుని నమ్మకమైన సేవకులమని నిరూపించుకోవడానికి ఒక ప్రాథమిక అవసరత ఏమిటి? (బి) క్రైస్తవ కూటాలు ఎందుకంత ప్రాముఖ్యం?
4 యెహోవాకు నమ్మకమైన సేవకులుగా ఉండాలంటే దానికి ఆయన చేసిన ఏర్పాట్లపై ఆధారపడడం అవసరం. వాటిలో ఒకటి సంఘ కూటాలు. వాటిని నిర్లక్ష్యం చేయకూడదని లేఖనాలు మనకు ఉద్బోధిస్తున్నాయి. (హెబ్రీయులు 10:23-25) యెహోవాకు నమ్మకమైన సాక్షులుగా కొనసాగుతున్నవారు, తోటి ఆరాధకులతో క్రమంగా కూటాలకు హాజరవడానికి కృషి చేస్తారు. ఈ కూటాల్లో లేఖనాలను గురించిన మన పరిజ్ఞానం పెరుగుతుంది. మనకు బాగా తెలిసిన సత్యాలపట్ల అవగాహన పెరుగుతుంది, వాటిని ఉపయోగించగల మార్గాల గురించి మనకు బాగా తెలిసివుంటుంది. మనం ఐక్యారాధనలో మన క్రైస్తవ సహోదరులకు సన్నిహితమై, దేవుని చిత్తం చేయడానికి బలపరచబడతాము. యెహోవా ఆత్మ సంఘం ద్వారా నడిపింపునిస్తుంది, ఆ ఆత్మ ద్వారా యేసు మన మధ్య ఉంటాడు.—మత్తయి 18:20; ప్రకటన 3: 6.
5. యెహోవాసాక్షులు నిషేధం క్రింద ఉన్నప్పుడు, కూటాలు ఎలా నిర్వహించబడతాయి?
5 మీరు కూటాలన్నింటికి క్రమంగా హాజరవుతారా, అక్కడ చర్చించబడగా విన్నవాటిని వ్యక్తిగతంగా అన్వయించుకుంటారా? కొన్నిసార్లు, యెహోవాసాక్షులు నిషేధం క్రింద ఉన్నప్పుడు కూటాలను చిన్న గుంపులుగా, గృహాల్లో నిర్వహించవలసి ఉంటుంది. కూటాలు నిర్వహించబడే స్థలాలు, సమయాలు మారుతుండవచ్చు, అవి మనకు ఎల్లప్పుడు అనుకూలంగా ఉండకపోవచ్చు, కొన్ని కూటాలు రాత్రిపూట ఆలస్యంగా నిర్వహించబడవచ్చు. వ్యక్తిగత అసౌకర్యము లేదా ప్రమాదము ఎదురైనప్పటికి నమ్మకస్థులైన సహోదర సహోదరీలు ప్రతి కూటానికి హాజరుకావడానికి మనఃపూర్వకంగా కృషి చేస్తారు.
6. మనం యెహోవాపై ఆధారపడివున్నామని ఎలా చూపించవచ్చు, ధైర్యంగా ప్రకటించేందుకు అది మనకెలా సహాయం చేస్తుంది?
6 మనకు దేవుని సహాయం అవసరమని గ్రహించి, ఆయనకు క్రమంగా హృదయపూర్వక ప్రార్థన చేయడం ద్వారా మనం యెహోవాపై ఆధారపడడాన్ని అలవర్చుకోవచ్చు. మీరలా చేస్తున్నారా? యేసు తన భూపరిచర్యలో పదేపదే ప్రార్థించాడు. (లూకా 3:21; 6:12, 13; 22:39-44) తాను వ్రేలాడదీయబడే ముందు రాత్రి ఆయన తన శిష్యులకు ఇలా ఉద్బోధించాడు: “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థనచేయుడి.” (మార్కు 14:38) రాజ్య సందేశానికి ఉదాసీనత ఎదురైనప్పుడు, మనం మన పరిచర్యలో వెనకబడే శోధనకు గురికావచ్చు. ప్రజలు మనలను ఎగతాళి చేసినా లేక హింసించినా, సమస్యలు తప్పించుకోవడానికి ప్రకటించకుండా ఉండేలా శోధించబడవచ్చు. కాని మనం ధైర్యంగా ప్రకటించడానికి సహాయం చేయమని దేవుని ఆత్మ కోసం మనఃపూర్వకంగా ప్రార్థిస్తే, మనం ఆ శోధనలకు లొంగిపోకుండా కాపాడబడతాము.—లూకా 11:13; ఎఫెసీయులు 6:18-20.
ధైర్యంగా సాక్ష్యమివ్వడం గురించిన నివేదిక
7. (ఎ) అపొస్తలుల కార్యాల్లోని నివేదిక మనకు ఎందుకు ప్రత్యేకంగా ఆసక్తికరమైనది? (బి) దానిలోని సమాచారం మనకెలా ప్రయోజనకరమైనదో నొక్కిచెబుతూ, ఈ పేరా చివర ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
7 అపొస్తలుల కార్యముల పుస్తకంలోని నివేదిక మనందరికి ప్రత్యేకంగా ఆసక్తికరమైనది. మనలాంటి భావాలుగల అపొస్తలులు, ఇతర తొలి శిష్యులు అడ్డంకులను అధిగమించి, యెహోవాకు నమ్మకమైన, ధైర్యంగల సాక్షులుగా ఎలా నిరూపించుకున్నారో అది మనకు తెలియజేస్తుంది. ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలు, సూచించబడిన లేఖనాల సహాయంతో ఆ నివేదికలోని కొంతభాగాన్ని మనం పరిశీలిద్దాము. మనమలా పరిశీలిస్తుండగా, మీరు చదివిన దానినుండి వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనం పొందవచ్చో ఆలోచించండి.
అపొస్తలులు విద్యాధికులా? పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండే స్వభావంగల వ్యక్తులా? (యోహాను 18:17, 25-27; 20:19; అపొస్తలుల కార్యములు 4:13)
దేవుని స్వంత కుమారుణ్ణే నిందించిన యూదామత న్యాయస్థానం ఎదుట ధైర్యంగా మాట్లాడేందుకు పేతురుకు ఏది సహాయం చేసింది? (మత్తయి 10:19, 20; అపొస్తలుల కార్యములు 4: 8)
యూదుల మహాసభ ఎదుటకు తీసుకురాబడడానికి ముందు వారాల్లో అపొస్తలులు ఏమి చేస్తూవచ్చారు? (అపొస్తలుల కార్యములు 1:14; 2:1, 42)
యేసు నామమున ప్రకటించవద్దని పాలకులు అపొస్తలులకు ఆజ్ఞాపించినప్పుడు, పేతురు యోహానులు ఏమని సమాధానమిచ్చారు? (అపొస్తలుల కార్యములు 4:19, 20)
అపొస్తలులు విడుదలైన తర్వాత, మళ్ళీ సహాయం కోసం ఎవరివైపు చూశారు? హింస ఆగిపోవాలని వారు ప్రార్థించారా లేక దేనికోసం ప్రార్థించారు? (అపొస్తలుల కార్యములు 4:24-31)
వ్యతిరేకులు ప్రకటనా పనిని ఆపేందుకు ప్రయత్నించినప్పుడు, యెహోవా ఏ విధంగా సహాయం అందించాడు? (అపొస్తలుల కార్యములు 5:17-20)
తామెందుకు విడుదల చేయబడ్డామో గ్రహించామని అపొస్తలులు ఎలా చూపించారు? (అపొస్తలుల కార్యములు 5:21, 41, 42)
హింస కారణంగా అనేకమంది శిష్యులు చెదరిపోయినా, వారేమి చేయడం ఆపలేదు? (అపొస్తలుల కార్యములు 8:3, 4; 11:19-21)
8. తొలి శిష్యుల పరిచర్యకు ఎలాంటి ఉత్తేజకరమైన ఫలితాలు లభించాయి, ఆ పరిచర్యలో మనమెలా ఇమిడివున్నాము?
8 సువార్త ప్రకటించే పని వ్యర్థం కాలేదు. సా.శ. 33 పెంతెకొస్తునాడు దాదాపు 3,000 మంది శిష్యులు బాప్తిస్మం పొందారు. “పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.” (అపొస్తలుల కార్యములు 2:41; 4: 4; 5:14) కొంతకాలానికి, దేవుని ప్రజలను తీవ్రంగా హింసించిన తార్సువాడైన సౌలు కూడా క్రైస్తవుడిగా మారి సత్యం గురించి ధైర్యంగా సాక్ష్యమివ్వడం ఆరంభించాడు. ఆయన అపొస్తలుడైన పౌలుగా పేరుగాంచాడు. (గలతీయులు 1:22-24) మొదటి శతాబ్దంలో ఆరంభమైన ఆ పని ఆగిపోలేదు. అది ఈ అంత్యదినాల్లో ఊపందుకొని భూవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఆ పనిలో భాగం వహించే ఆధిక్యత మనకుంది, మనమలా చేస్తుండగా, మనకంటే ముందు విశ్వసనీయులైన సాక్షులుగా సేవచేసినవారు ఉంచిన మాదిరినుండి మనం నేర్చుకోవచ్చు.
9. (ఎ) సాక్ష్యమివ్వడానికి పౌలు ఎలాంటి అవకాశాలను ఉపయోగించుకున్నాడు? (బి) మీరు రాజ్య సందేశాన్ని ఏయే విధాలుగా ఇతరులకు అందజేస్తారు?
9 యేసుక్రీస్తు గురించిన సత్యం నేర్చుకున్నప్పడు, పౌలు ఏమి చేశాడు? ‘వెంటనే . . . యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటిస్తూవచ్చాడు.’ (అపొస్తలుల కార్యములు 9:20) దేవుడు తనపట్ల చూపించిన కృపకు ఆయన కృతజ్ఞత చూపించాడు, తనకు లభించిన సువార్త అందరికి అవసరమని ఆయన గ్రహించాడు. పౌలు యూదుడు కాబట్టి, ఆ కాలంనాటి అలవాటు ప్రకారం ఆయన సాక్ష్యమిచ్చేందుకు సమాజమందిరాలకు వెళ్ళాడు. ఆయన ఇంటింటికి వెళ్లి ప్రకటించాడు, సంతవీధిలో ప్రజలతో తర్కించాడు. అలాగే సువార్త ప్రకటించడానికి క్రొత్త ప్రాంతాలకు వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు.—అపొస్తలుల కార్యములు 17:17; 20:20; రోమీయులు 15:23, 24.
10. (ఎ) పౌలు ధైర్యస్థుడే అయినా, తాను సాక్ష్యమిచ్చే విధానంలో వివేచన ఎలా చూపించాడు? (బి) మనం మన బంధువులకు, తోటి ఉద్యోగస్థులకు లేదా తోటి విద్యార్థులకు సాక్ష్యమిచ్చేటప్పుడు పౌలు లక్షణాలను ఎలా ప్రతిబింబించవచ్చు?
10 పౌలు ధైర్యస్థుడే కాక వివేచనగలవాడు కూడా, మనం అలాగే ఉండాలి. యూదులతో మాట్లాడినప్పుడు ఆయన వారి పితరులకు దేవుడు చేసిన వాగ్దానాల ఆధారంగా అభ్యర్థిస్తూ మాట్లాడాడు. గ్రీసు దేశస్థులతో మాట్లాడినప్పుడు వారికి తెలిసిన సంగతుల ఆధారంగా మాట్లాడాడు. కొన్నిసార్లు, సత్యం నేర్చుకున్న తన స్వంత అనుభవం ఉపయోగించి సాక్ష్యమిచ్చాడు. ఆయనిలా చెప్పాడు: “నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.”—1 కొరింథీయులు 9:20-23; అపొస్తలుల కార్యములు 22:3-21.
11. (ఎ) వ్యతిరేకులను పదేపదే ఎదుర్కోకుండా ఉండేందుకు పౌలు ఏమి చేశాడు? (బి) పౌలు మాదిరిని మనం జ్ఞానవంతంగా ఎప్పుడు అనుకరించవచ్చు, ఎలా? (సి) ధైర్యంగా ప్రకటించేందుకు శక్తి ఎక్కడ నుండి వస్తుంది?
11 వ్యతిరేకత ఎదురవడం వల్ల కొంతకాలం మరో ప్రాంతంలో ప్రకటించడం మంచిదని తోచినప్పుడు పౌలు, వ్యతిరేకులను పదేపదే ఎదుర్కొనే బదులు వేరే ప్రాంతాలకు వెళ్ళాడు. (అపొస్తలుల కార్యములు 14:5-7; 18:5-7; రోమీయులు 12:18) కాని ఆయన సువార్త విషయంలో ఎన్నడు సిగ్గుపడలేదు. (రోమీయులు 1:16) వ్యతిరేకుల అవమానకరమైన, దౌర్జన్యపూరితమైన విధానం తనకు బాధ కలిగించినా, పౌలు ప్రకటిస్తూ ఉండడానికి ‘మన దేవునియందు ధైర్యము తెచ్చుకొన్నాడు.’ ఆయనిలా చెప్పాడు: “నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము . . . ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను.” (1 థెస్సలొనీకయులు 2: 2; 2 తిమోతి 4:17) మనకాలం కోసం ప్రవచించబడిన పనిని నెరవేర్చడానికి అవసరమైన శక్తిని, క్రైస్తవ సంఘ శిరస్సయిన యేసుక్రీస్తు నిరంతరం అందజేస్తూనే ఉంటాడు.—మార్కు 13:10.
12. క్రైస్తవ ధైర్యానికి నిదర్శనమేమిటి, దానికి ఆధారమేమిటి?
12 యేసుక్రీస్తు, మొదటి శతాబ్దంలోని దేవుని నమ్మకమైన సేవకులు చేసినట్లు మనం కూడా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే ఎదుటివారిని పట్టించుకోకుండా లేదా సువార్త ఇష్టపడనివారిపై సందేశాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించడమని కాదు దానర్థం. అయితే ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత మాత్రాన మనం ప్రకటించకుండా ఉండము లేదా వ్యతిరేకత ఉందని మౌనంగా ఉండము. యేసులాగే, ఈ యావత్ భూమికి దేవుని రాజ్యమే సరైన ప్రభుత్వమని మనం సూచిస్తాము. విశ్వ సర్వాధిపతియైన యెహోవాకు మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాము కాబట్టి, మనం ప్రకటించే సందేశం మన నుండి వచ్చినది కాక ఆయన నుండి వచ్చినది కాబట్టి మనం దృఢనమ్మకంతో మాట్లాడతాం. యెహోవాను స్తుతించడానికి, ఆయనపట్ల మనకున్న ప్రేమే మనకు బలమైన ప్రేరణగా ఉండాలి.—ఫిలిప్పీయులు 1:27, 28; 1 థెస్సలొనీకయులు 2:13.
పునఃసమీక్షా చర్చ
• సాధ్యమైన వారందరితో రాజ్య సందేశాన్ని పంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం, అయితే ఎలాంటి ప్రతిస్పందనలు మనం ఎదురుచూడవచ్చు?
• యెహోవాను సేవించడానికి మనం మన స్వశక్తిపై ఆధారపడమని ఎలా చూపించవచ్చు?
• అపొస్తలుల కార్యముల పుస్తకము నుండి మనమెలాంటి విలువైన పాఠాలను నేర్చుకుంటాము?
[173వ పేజీలోని చిత్రాలు]
గతంలో చేసినట్లే, నేడు కూడా యెహోవా సేవకులు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తారు