53
ప్రేక్షకులు ప్రోత్సహించబడి, బలపరచబడడం
దేవుని సేవకులు సమస్యలు ఎదుర్కొన్నా వారు క్రైస్తవ సంఘంలో ప్రోత్సాహాన్ని పొందగలగాలి. అది జరగాలంటే, ప్రాముఖ్యంగా పెద్దలు తమ ప్రసంగాలు తమ సలహాలు ప్రోత్సాహకరంగా ఉండేలా నిశ్చయపరచుకోవాలి. పెద్దలు “గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను . . . ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను” ఉండాలి.—యెష. 32:2.
మీరొక పెద్ద అయితే మీ ప్రసంగాలు సేదదీర్పును, ఓదార్పును ఇస్తాయా? అవి, యెహోవాకు విశ్వసనీయంగా సేవచేయాలని కృషిచేస్తున్నవారిలో పునరుత్తేజాన్ని కలిగిస్తాయా? ప్రజల్లో ఉదాసీనత ఉన్నా సరే, వారి నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్నా సరే దేవుని చిత్తాన్ని చేయడానికి పట్టుదలతో ముందుకు సాగిపోయేందుకు కావలసిన బలాన్ని అవి అందిస్తాయా? మీ ప్రేక్షకుల్లో ఎవరైనా క్రుంగుదలకు గురైతే, తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్ళతో సతమతమవుతుంటే, లేదా చికిత్సేలేని ఒక పెద్ద వ్యాధితో పోరాడుతుంటే అప్పుడెలా? మీరు ‘మీ నోటి మాటలతో మీ సహోదరులను బలపరచవచ్చు.’—యోబు 16:5.
మీ సహోదరులు యెహోవా నుండి, ఆయన చేసిన ఏర్పాట్ల నుండి నిరీక్షణనూ బలాన్నీ పొందేందుకు ఒక ప్రసంగీకుడిగా వారికి సహాయపడే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.—రోమా. 15:13; ఎఫె. 6:10.
యెహోవా ఏమి చేశాడో వారికి గుర్తుచేయండి. మీ ప్రేక్షకుల్లో ధైర్యాన్ని నింపేందుకు ఒక ప్రముఖమైన మార్గం, యెహోవా గతంలో తన ప్రజలకు ఎలా సహాయం చేశాడో చూపించడమే.—రోమా. 15:4.
శత్రు జనాంగాలు ఆక్రమించుకొని ఉన్న వాగ్దాన దేశంలోకి ఇశ్రాయేలు ప్రవేశించడానికి ముందు యెహోషువను “ధైర్యపరచి” ‘దృఢపరచాలని’ యెహోవా మోషేకు చెప్పాడు. మోషే ఆయనను ఎలా దృఢపరిచాడు? యెహోషువ వింటుండగా మోషే పూర్తి జనాంగంతో, వారు ఐగుప్తు విడిచిపెట్టినప్పుడు యెహోవా వారి కోసం ఏమేం చేశాడో గుర్తుచేస్తూ మాట్లాడాడు. (ద్వితీ. 3:28; 7:18) అమోరీయులపై యెహోవా ప్రసాదించిన విజయాలను కూడా మోషే పేర్కొన్నాడు. ఆ తర్వాత మోషే యెహోషువకు ఇలా ఉద్బోధించాడు: “నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము.” (ద్వితీ. 31:1-8) మీ సహోదరులను ప్రోత్సహించాలనుకున్నప్పుడు, యెహోవా వారిపట్ల ఇప్పటికే ఏమేమి చేశాడో గుర్తుచేసుకోవడం ద్వారా బలం పొందేందుకు మీరు వారికి సహాయం చేస్తారా?
కొన్ని సందర్భాల్లో కొందరు తమ సమస్యల మూలంగా ఎంతగా సతమతమవుతున్నట్లు భావిస్తారంటే తామసలు రాజ్యాశీర్వాదాలు ఎప్పుడైనా అనుభవించగలమా లేదా అని ఆలోచిస్తుంటారు. యెహోవా వాగ్దానాలు ఎంత ఆధారపడదగినవో వారికి గుర్తుచేయండి.—యెహో. 23:14.
కొన్ని దేశాల్లో సువార్త ప్రకటనను నిషేధిస్తున్నట్లు మన సహోదరులకు ప్రభుత్వ శాసనాలు జారీచేయబడ్డాయి. అలాంటి సందర్భాల్లో, ప్రేమపూర్వకమైన పెద్దలు యేసుక్రీస్తు అపొస్తలుల అనుభవాల నుండి బలాన్ని పొందేందుకు తోటి విశ్వాసులకు సహాయం చేయవచ్చు. (అపొ. 4:1–5:42) ఎస్తేరు పుస్తకంలో నమోదుచేయబడినట్లుగా యెహోవా పరిస్థితులను ఎలా మార్చాడో వివరించడం సహోదరుల హృదయాల్లో తప్పకుండా ధైర్యాన్ని నింపుతుంది.
కొన్ని సందర్భాల్లో కొందరు సంఘ కూటాలకు హాజరవుతారు, కానీ ఎలాంటి పురోభివృద్ధినీ సాధించరు. గత జీవితంలో చేసిన పాపపు పనుల మూలంగా దేవుడు తమను ఎన్నడూ క్షమించడని వారు భావిస్తుండవచ్చు. మీరు అలాంటి వారికి యెహోవా మనష్షే రాజుతో ఎలా వ్యవహరించాడో వివరించవచ్చు. (2 దిన. 33:1-16) లేదా ప్రాచీన కొరింథులో తమ జీవిత విధానాన్ని మార్చుకొని, క్రైస్తవులుగా మారి, దేవునిచే నీతిమంతులుగా తీర్చబడిన ప్రజల గురించి చెప్పవచ్చు.—1 కొరిం. 6:9-11.
తాము అనుభవిస్తున్న సమస్యలు తాము దేవుని అనుగ్రహాన్ని కోల్పోయామనడానికి సూచనలు అని కొందరు భావిస్తున్నారా? యోబు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడో, యెహోవా పట్ల యథార్థతను కాపాడుకున్నందుకు ఆయనెలా సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడో మీరు వారికి గుర్తుచేయవచ్చు. (యోబు 1:1-22; 10:1; 42:12, 13; కీర్త. 34:19) యోబు వద్దకు వచ్చిన బూటకపు ఆదరణకర్తలు యోబు ఏదో పాపం చేసివుండవచ్చని తప్పుగా వాదించారు. (యోబు 4:7, 8; 8:5, 6) పౌలు బర్నబాలు అలా చేయకుండా, శిష్యులను బలపరుస్తూ “విశ్వాసములో నిలుకడగా ఉండవలెనని” ‘వారిని హెచ్చరిస్తూ [“ప్రోత్సహిస్తూ,” NW]’ “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని” అన్నారు. (అపొ. 14:21, 22) అదే విధంగా నేడు కూడా, శ్రమల్లో సహనం చూపించడం క్రైస్తవులందరికీ ఆవశ్యకమనీ అది దేవుని దృష్టికి మిగుల విలువగలదనీ చూపించడం ద్వారా మీరు పరీక్షలు అనుభవిస్తున్న వారిని ప్రోత్సహించగలుగుతారు.—సామె. 27:11; మత్త. 24:13; రోమా. 5:3, 4; 2 తిమో. 3:12.
తమ సొంత జీవితాల్లోనే యెహోవా నెరవేర్చిన వాగ్దానాల గురించి ఆలోచించమని మీ శ్రోతలను ప్రోత్సహించండి. కాస్త పురికొల్పుతో, వ్యక్తిగతంగా తమ విషయంలో యెహోవా తన వాగ్దానాలకు అనుగుణంగా అప్పటికే ఎలాంటి చర్యలు తీసుకున్నాడో వారు గ్రహించవచ్చు. కీర్తన 32:8 లో మనమిలా చదువుతాము: “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.” యెహోవా తమను ఎలా నడిపించాడో లేదా ఎలా బలపరిచాడో గుర్తుచేసుకోవడానికి వారికి సహాయం చేయడం ద్వారా మీరు, యెహోవా తమ పట్ల శ్రద్ధ వహిస్తున్నాడనీ, ప్రస్తుతం తాము ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నా యెహోవా నిజంగా సహాయం చేస్తాడనీ వారు తమ స్వీయానుభవంతో గ్రహించేలా దోహదపడతారు.—యెష. 41:9, 10, 13; 1 పేతు. 5:7.
దేవుడు ప్రస్తుతం చేస్తున్న వాటి విషయమై ఆనందాన్ని వ్యక్తపరచండి. మీ సహోదరులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు యెహోవా ఇప్పుడు చేస్తున్నవాటిపై వారి అవధానాన్ని ఆకర్షింపజేయండి. అవి మీకు ఆనందాన్ని కలిగిస్తున్నాయని తెలిపేలా వాటి గురించి మాట్లాడితే మీ శ్రోతల హృదయాల్లో కూడా అవి అలాంటి భావాలనే రేకెత్తిస్తాయి.
జీవితంలోని ఒత్తిళ్ళను తాళుకునేందుకు యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడో పరిశీలించండి. జీవించడానికి శ్రేష్ఠమైన విధానాన్ని ఆయన చూపిస్తున్నాడు. (యెష. 30:21) నేరం, అన్యాయం, బీదరికం, అనారోగ్యం, మరణం వంటివాటికి కారణాలేమిటో ఆయన వివరిస్తున్నాడు, అంతేకాక వీటన్నింటినీ తానెలా అంతమొందిస్తాడో కూడా మనకు చెబుతున్నాడు. ఆయన మన చుట్టూ ప్రేమపూర్వకమైన సహోదరత్వాన్ని ఉంచాడు. మనకు అమూల్యమైన ప్రార్థనాధిక్యతను ఇచ్చాడు. తన సాక్షులుగా ఉండే ఆధిక్యతను ఆయన మనకు అప్పజెప్పాడు. క్రీస్తు ఇప్పటికే పరలోకంలో సింహాసనాసీనుడయ్యాడనీ, పాత విధానపు అంత్యదినాలు చాలా శీఘ్రంగా ముగింపుకు వస్తున్నాయనీ గ్రహించేలా ఆయన మనకు కనువిప్పు కలుగజేశాడు.—ప్రక. 12:1-12.
ఈ ఆశీర్వాదాలతోపాటు సంఘ కూటాలు, సమావేశాలు కూడా మనకు ఉన్నాయి. ఈ ఏర్పాట్ల పట్ల నిజమైన కృతజ్ఞతాభావం వ్యక్తమయ్యే విధానంలో మీరు మాట్లాడినప్పుడు, సహోదరులతో సమావేశమవడాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న ఇతరుల కృత నిశ్చయాన్ని మీరు బలపరిచినవారవుతారు.—హెబ్రీ. 10:23-25.
క్షేత్రసేవలో యెహోవా మన కృషిని ఆశీర్వదిస్తున్నాడని రుజువుపరిచే నివేదికలు కూడా మన బలానికి దోహదపడుతుంటాయి. మొదటి శతాబ్దంలో పౌలు బర్నబాలు యెరూషలేము వైపు వెళ్తుండగా, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి “సహోదరుల కందరికిని మహా సంతోషము కలుగజేసిరి.” (అపొ. 15:3) మీరు కూడా సహోదరులతో నిర్మాణాత్మకమైన అనుభవాలను పంచుకుంటూ వారికి ఆనందాన్ని కలుగజేయవచ్చు.
ఎవరైనా చేస్తున్న పని ఎంత విలువైనదో గ్రహించేలా వారికి సహాయపడడం వల్ల వారికి ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. క్రైస్తవ పరిచర్యలో పాల్గొంటున్నందుకు వారిని మెచ్చుకోండి. వృద్ధాప్యం మూలంగా, అస్వస్థత మూలంగా చాలా పరిమితమైన పరిచర్యే చేస్తున్నా విశ్వసనీయంగా సహనాన్ని కనబరుస్తున్న వారిని మెచ్చుకోండి. తన నామము పట్ల వారు చూపిన ప్రేమను యెహోవా మరచిపోడని వారికి గుర్తుచేయండి. (హెబ్రీ. 6:10) శోధనల్లో నిరూపించబడిన విశ్వాసం చాలా అమూల్యమైన ధనం. (1 పేతు. 1:6, 7) దీని గురించి మన సహోదరులకు గుర్తుచేయాల్సిన అవసరం ఉంది.
మన ఎదుట ఉన్న నిరీక్షణ గురించి భావయుక్తంగా మాట్లాడండి. రాబోయే విషయాల గురించిన ప్రేరేపిత వాగ్దానాలు దేవుణ్ణి ప్రేమించే వారందరి ప్రోత్సాహానికీ పెద్ద కారణం. మీ ప్రేక్షకుల్లో అత్యధికులు బహుశ ఈ విషయాలను ముందే వినివుంటారు. కానీ మీరు ఆ వాగ్దానాల గురించి మాట్లాడేటప్పుడు మీ మాటల్లో వ్యక్తమయ్యే కృతజ్ఞత ఆ వాగ్దానాలు అపురూపమైనవిగా ధ్వనింపజేస్తుంది, వాటి నెరవేర్పు గురించిన నమ్మకాన్ని దృఢపరుస్తుంది, హృదయాలు కృతజ్ఞతతో పొంగిపొర్లేందుకు కారణమవుతుంది. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మీరు నేర్చుకున్న వాటిని అన్వయించుకోవడం ద్వారా మీరలా మాట్లాడగలరు.
తన ప్రజల ప్రోత్సాహానికీ బలానికీ యెహోవాయే ప్రాథమిక మూలం. అయితే అలాంటి ఆశీర్వాదాలను అందించేందుకు మీరు కూడా ఆయనతో సహకరించవచ్చు. మీరు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు అలాంటి ఆశీర్వాదాలను అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.