కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • be అధ్యాయం 44 పేజీ 236-పేజీ 239 పేరా 5
  • ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించడం
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నలు వేయడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​-సమర్థవంతంగా ప్రశ్నలు అడగడం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • గొప్ప బోధకుడ్ని అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ప్రశ్నలు అడిగేందుకు యెహోవాను మీరు అనుమతిస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
be అధ్యాయం 44 పేజీ 236-పేజీ 239 పేరా 5

44

ప్రశ్నలను సమర్థవంతంగా ఉపయోగించడం

మీరు ఏమి చెయ్యాలి?

కోరుకున్న ఫలితాన్ని సాధించే విధంగా ప్రశ్నలను ఉపయోగించండి. మీ లక్ష్యం అవతలి వ్యక్తి నుండి జవాబును రాబట్టడమే కావచ్చు; లేదా వారి మనస్సులోనే ప్రతిస్పందనను రేకెత్తించడమే కావచ్చు. ప్రశ్నల ప్రయోగంలో మీరు సాధించే విజయం, మీరు ఏమి అడుగుతారు ఎలా అడుగుతారు అన్నదానిపై సూటిగా ఆధారపడివుంటుంది.

ఎందుకు ప్రాముఖ్యం?

సమర్థవంతమైన ప్రశ్నలు, శ్రోతలు చర్చలో చేరేందుకు తోడ్పడతాయి. చక్కగా ఎంపిక చేసుకున్న ప్రశ్నలకు వచ్చే జవాబులు బోధకుడికి కూడా విలువైన సమాచారాన్ని అందించే అవకాశముంది.

ప్రశ్నలు ప్రతిస్పందనను కోరతాయి—అది నోటితోనైనా కావచ్చు లేదా కేవలం మనస్సులోనైనా కావచ్చు—కాబట్టి అవి మీ శ్రోతలు చర్చలో చేరేందుకు సహాయం చేస్తాయి. ప్రశ్నలు సంభాషణలను ప్రారంభించడంలో మీకు సహాయం చేస్తాయి, ఉత్తేజకరమైన ఆలోచనల ఆదానప్రదానం జరుగుతుంది. ఒక ప్రసంగీకుడిగా, బోధకుడిగా మీరు ఇతరుల్లో ఆసక్తిని రేకెత్తించేందుకు, ఒకానొక విషయంపై వారు మనస్సులో తర్కించుకునేందుకు, లేదా మీరు చెప్పేదాన్ని మరింత నొక్కిచెప్పేందుకు ప్రశ్నలను ఉపయోగించవచ్చు. మీరు ప్రశ్నలు చక్కగా ప్రయోగించినప్పుడు అవతలి వారు కేవలం కూర్చొని వినేవారిగా కాక క్రియాత్మకంగా ఆలోచించేవారిగా ఉండేందుకు మీరు వారిని ప్రోత్సహిస్తారు. మనస్సులో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, ఆ తర్వాత దాన్ని సాధించేందుకు తోడ్పడే విధంగా ప్రశ్నలు అడగండి.

సంభాషణను పురికొల్పేందుకు. మీరు క్షేత్ర పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు, ప్రజలు ఏమైనా వ్యక్తం చేయాలని ఇష్టపడితే వ్యక్తం చేయమని వారిని ఆహ్వానించేందుకు మీరు సిద్ధంగా ఉండండి.

“[ఏదైనా విషయాన్ని చెప్పి . . .] అని మీరెప్పుడైనా ఆలోచించారా?” అనే చిన్న ప్రశ్న అడగడం ద్వారా చాలామంది సాక్షులు ఆసక్తికరమైన చర్చలను ప్రారంభిస్తారు. చాలామంది ప్రజల మనస్సుల్లో నిజంగానే మెదులుతున్న ఒక ప్రశ్నను ఎంపిక చేసి సంధించినప్పుడు వారు క్షేత్ర పరిచర్యలో ఎంతో ఆనందిస్తారనడంలో సందేహంలేదు. అవతలి వ్యక్తికి ప్రశ్న క్రొత్తగా ఉన్నా అది జిజ్ఞాసను రేకెత్తించవచ్చు. “. . . గురించి మీరేమనుకుంటున్నారు?,” “. . . విషయంలో మీరెలా భావిస్తున్నారు?,” “. . . అని మీరు నమ్ముతారా?” వంటి ప్రశ్నలు ఉపయోగిస్తూ మీరు వైవిధ్యభరితమైన అంశాలను ప్రవేశపెట్టవచ్చు.

యెషయా ప్రవచనాన్ని పైకి చదువుతున్న ఐతియొపీయ రాజాస్థాన అధికారిని సువార్తికుడైన ఫిలిప్పు సమీపించి, ఒక చిన్న ప్రశ్న అడిగాడు: “నీవు చదువునది గ్రహించుచున్నావా?” (అపొ. 8:30) ఈ ప్రశ్న, ఫిలిప్పు యేసుక్రీస్తును గురించిన సత్యాలను వివరించడానికి మార్గాన్ని తెరిచింది. అలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా ఆధునిక కాలంలో కొందరు సాక్షులు, బైబిలు సత్యపు స్పష్టమైన అవగాహన కోసం నిజంగా పరితపిస్తున్న ప్రజలను కనుగొన్నారు.

వారి సొంత అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశమిస్తే, ఆ తర్వాత మీరు చెప్పేది వినడానికి చాలామంది మరింత మొగ్గుచూపుతారు. ఒక ప్రశ్న అడిగిన తర్వాత శ్రద్ధగా వినండి. ఆ వ్యక్తి జవాబుపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడానికి బదులుగా ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. ఆ వ్యక్తి వ్యాఖ్యానాలను మీరు నిజాయితీగా మెచ్చుకోగలిగితే మెచ్చుకోండి. ఒక సందర్భంలో, ఒక శాస్త్రి ‘వివేకముగా ఉత్తరమిచ్చిన’ తర్వాత యేసు, “నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లే[వు]” అని ఆయనను మెచ్చుకున్నాడు. (మార్కు 12:34) అవతలి వ్యక్తి అభిప్రాయంతో మీరు ఏకీభవించకపోయినా ఆయన తనను తాను వ్యక్తం చేసుకున్నందుకు మీరాయనకు కృతజ్ఞతలు చెప్పవచ్చు. ఆయన చెప్పిన దాన్ని బట్టి, ఇకపై ఆయనతో బైబిలు సత్యాన్ని పంచుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన ఒకానొక వైఖరిని మీరు గ్రహించవచ్చు.

ప్రముఖమైన తలంపులు ప్రవేశపెట్టడానికి. ఒక సమూహంతో మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక వ్యక్తితో సంభాషిస్తున్నప్పుడు ప్రముఖ తలంపులకు నడిపించే ప్రశ్నలు ఉపయోగించడానికి ప్రయత్నించండి. మీ ప్రేక్షకులకు నిజంగా ఆసక్తివున్న విషయాల గురించే అయివుండేలా నిశ్చయపరచుకోండి. వెంటనే జవాబు సుస్పష్టంగా స్ఫురించని, జిజ్ఞాసను రేకెత్తించే ప్రశ్నలు కూడా మీరు వేయవచ్చు. ఒక ప్రశ్న వేసిన తర్వాత మీరు కాస్సేపు ఆగినట్లైతే, ఎదుటివారు మీరింకా ఏమి చెప్పబోతున్నారోనని మరింత ఆసక్తితో వింటారు.

ప్రవక్తయైన మీకా ఒక సందర్భంలో అనేక ప్రశ్నలు సంధించాడు. దేవుడు తనను ఆరాధించేవారి నుండి ఏమి ఆశిస్తున్నాడు అని ప్రశ్నించిన తర్వాత, మీకా మరి నాలుగు ప్రశ్నలు వేశాడు, ప్రతి ప్రశ్నలోనూ జవాబు కూడా దాగివుంది. ఆ ప్రశ్నలన్నీ ఒక అంతర్దృష్టిగల జవాబుకు పఠితలను సిద్ధంచేయడానికి దోహదం చేశాయి, చివర్లో ఆ ప్రశ్నలకు జవాబు చెప్పి మీకా తన చర్చలోని ఈ భాగాన్ని ముగించాడు. (మీకా 6:6-8) మీరు బోధించేటప్పుడు కూడా అలాగే చేయగలరా? ప్రయత్నించండి.

ఒక విషయంపై తర్కించడానికి. ఇతరులు ఒక వాదనలోని తర్కాన్ని గ్రహించడానికి ప్రశ్నలు ప్రయోగించవచ్చు. ఇశ్రాయేలుకు ఒక గంభీరమైన ప్రకటనను చేస్తున్నప్పుడు యెహోవా అలాగే చేశాడు, అది మలాకీ 1:2-10 వచనాల్లో ఉంది. మొదట, “నేను మీయెడల ప్రేమ చూపియున్నాను” అన్నాడు యెహోవా. వారు ఆ ప్రేమకు ప్రతిస్పందించడంలో విఫలమయ్యారు, అందుకే ఆయన “ఏశావు యాకోబునకు అన్న కాడా?” అని అడిగాడు. తర్వాత, ఎదోమీయుల దుష్టత్వం మూలంగా తాను ఆ జనాంగాన్ని ప్రేమించలేదన్న దానికి సాక్ష్యంగా నాశనకరమైన వారి స్థితిని రుజువుగా సూచించాడు. దాని తర్వాత, ఇశ్రాయేలు తన ప్రేమకు సరిగా ప్రతిస్పందించడంలో విఫలమైందని నొక్కిచెప్పడానికి ఉపమానాలు ఇస్తూ అక్కడక్కడ ప్రశ్నలు వేస్తూ ముందుకు సాగాడు. ఆ ప్రశ్నల్లో కొన్నింటిని విశ్వాసఘాతకులైన యాజకులే అడుగుతున్నట్లుగా యెహోవా అడిగాడు. ఇతర ప్రశ్నలు యెహోవా యాజకులను అడిగినవి. ఈ మాటలు మనలో భావోద్వేగాలను ప్రేరేపిస్తూ మన శ్రద్ధను ఆకట్టుకుంటాయి; ఇక్కడ ఉన్న తర్కం తిరుగులేనిది; సందేశం మరపురానిది.

కొందరు ప్రసంగీకులు అదే రీతిలో ప్రశ్నలను సమర్థవంతంగా ప్రయోగిస్తారు. నోటితో జవాబు చెప్పాల్సిరాకపోయినా ప్రేక్షకులు, నిజంగానే సంభాషణలో పాల్గొంటున్నట్లుగా మనస్సులో ప్రతిస్పందిస్తూ చర్చలో నిమగ్నమవుతారు.

మనం బైబిలు అధ్యయనాలను నిర్వహించే పద్ధతి, విద్యార్థి పాల్గొనే విధంగా ఉంటుంది. నిజమే, విద్యార్థి సొంతమాటల్లో జవాబు చెబుతూ పాల్గొంటేనే అత్యంత ప్రయోజనం ఉంటుంది. ప్రేమపూర్వకంగా మీరు చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ విద్యార్థితో తర్కించండి. కీలకమైన అంశాల విషయంలోనైతే తన జవాబులకు ఆధారంగా బైబిలును ఉపయోగించమని ప్రోత్సహించండి. మీరిలా కూడా ప్రశ్నించవచ్చు: “మనం చర్చిస్తున్న దానికీ మనం ఇంతకు ముందు అధ్యయనం చేసిన విషయానికీ ఏమి సంబంధం ఉంది? అది ఎందుకు ప్రాముఖ్యం? అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేయాలి?” మీ సొంత నమ్మకాలను వ్యక్తం చేయడానికి, లేదా మీరే విస్తృత వివరణ ఇవ్వడానికి బదులుగా ఇలాంటి పద్ధతిని ఉపయోగించడం మరింత సమర్థవంతంగా ఉంటుంది. ఈ విధంగా విద్యార్థి దేవుణ్ణి ఆరాధించడానికి తనలోని “సాధకముచేయబడిన జ్ఞానేంద్రియము[లను]” ఉపయోగించడానికి ఆయన/ఆమెకు మీరు సహాయం చేస్తారు.—హెబ్రీ. 5:14.

మీ విద్యార్థి ఒక అంశాన్ని గ్రహించలేకపోతున్నట్లైతే, మీరు ఓపికపట్టండి. మీరు చెబుతున్న విషయాలను తాను ఎన్నో సంవత్సరాలుగా నమ్ముతూ వస్తున్న విషయాలతో పోల్చుకోవడానికి ఆయన ప్రయత్నిస్తుండవచ్చు. విషయాన్ని మరో కోణంలోంచి చర్చించడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే కొన్నిసార్లు చాలా మౌలికమైన తర్కం అవసరమవుతుంది. లేఖనాలను విరివిగా ఉపయోగించండి. ఉపమానాలు ఉపయోగించండి. వీటితోపాటు, కనబడుతున్న సాక్ష్యాధారాలపై ఆయన తర్కించుకునేలా పురికొల్పే సరళమైన ప్రశ్నలు వేయండి.

అంతర్గత భావాలను వెలికితీయడానికి. ప్రజలు ప్రశ్నలకు జవాబులిచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఆ జవాబులు వారు నిజంగా ఎలా భావిస్తున్నారో తెలియజేయవు. మీరు ఎలాంటి జవాబులు వినాలని ఇష్టపడుతున్నారో వారు అలాంటి జవాబులనే ఇవ్వవచ్చు. అందుకే మీకు వివేకం అవసరం. (సామె. 20:5) యేసు అడిగినట్లు, ‘ఈ మాట నమ్ముతున్నారా?’ అని మీరు అడగవచ్చు.—యోహా. 11:26.

యేసు శిష్యులనేకులు ఆయన చెప్పినదానికి అభ్యంతరపడి ఆయనను వదిలి వెళ్ళినప్పుడు, తన అపొస్తలులు ఎలా భావిస్తున్నారో వ్యక్తం చేయమని ఆయన వారిని ప్రోత్సహించాడు. “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” అని యేసు అడిగాడు. అందరి భావాలను తన మాటల్లో వ్యక్తం చేస్తూ పేతురు, “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నా[ము]” అని చెప్పాడు. (యోహా. 6:67-69) మరో సందర్భంలో యేసు, “మనుష్యుకుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నా[రు]” అని తన శిష్యులను అడిగాడు. ఆ తర్వాత ఆయన వారి హృదయాల్లో ఏముందో వ్యక్తం చేసేలా ప్రోత్సహిస్తూ ఒక ప్రశ్న వేశాడు. “మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా[రు]” అని ఆయన అడిగాడు. అందుకు పేతురు “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు[వు]” అని చెప్పాడు. (ఇటాలిక్కులు మావి.)—మత్త. 16:13-16.

బైబిలు అధ్యయనాన్ని చేస్తున్నప్పుడు మీరు కొన్ని విషయాల్లో అదే పద్ధతిని అవలంబించడం ప్రయోజనకరంగా ఉన్నట్లు గ్రహిస్తుండవచ్చు. మీరిలా అడగవచ్చు: “మీ తోటి విద్యార్థులు (లేదా సహోద్యోగులు) ఈ విషయాన్ని ఎలా దృష్టిస్తారు?” ఆ తర్వాత ఇలా అడగవచ్చు: “దాని గురించి మీరెలా భావిస్తున్నారు?” ఒక వ్యక్తి నిజమైన భావాలను తెలుసుకున్నప్పుడు ఒక బోధకుడిగా మీరు ఆయనకు అత్యంత మేలు చేకూర్చే సహాయాన్ని చేయగలుగుతారు.

నొక్కిచెప్పేందుకు. తలంపులను నొక్కిచెప్పేందుకు కూడా ప్రశ్నలను ఉపయోగించవచ్చు. రోమీయులు 8:31, 32 లో నమోదు చేయబడినట్లుగా అపొస్తలుడైన పౌలు ఆ పద్ధతిని ఉపయోగించాడు: “దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” రెండు ప్రశ్నలూ వాటి ముందున్న ఉపవాక్యాలకు అదనపు మద్దతునిస్తున్నాయని గమనించండి.

బబులోను రాజుకు విరుద్ధంగా యెహోవా తీర్పును నమోదు చేసిన తర్వాత ప్రవక్తయైన యెషయా, తన గట్టి నమ్మకాన్ని ఇలా వ్యక్తం చేశాడు: “సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించియున్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే, దాని త్రిప్పగలవాడెవడు?” (యెష. 14:27) వాటిలోని సారాంశమే వాటిలో వ్యక్తం చేయబడిన అంశానికి విరుద్ధంగా మాట్లాడే అవకాశం లేదని సూచిస్తుంది. అలాంటి ప్రశ్నలకు ప్రతిస్పందన అవసరం లేదు.

తప్పుడు ఆలోచనలను బట్టబయలు చేయడానికి. జాగ్రత్తగా ఆలోచించి అడిగిన ప్రశ్నలు తప్పుడు ఆలోచనలను బట్టబయలు చేయడానికి శక్తివంతంగా ఉపకరిస్తాయి. ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి ముందు యేసు పరిసయ్యులనూ ధర్మశాస్త్రములో ప్రవీణులైన మరి కొందరినీ ఇలా అడిగాడు: “విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా?” స్వస్థపరిచిన తరువాత ఆయన మరో ప్రశ్న సంధించాడు: “మీలో ఎవని గాడిదయైనను ఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతిదినమున దానిని పైకి తీయడా?” (లూకా 14:1-6) వాటికి ప్రతిస్పందన వస్తుందని ఎవరూ ఎదురు చూడలేదు, ఎవరూ ప్రతిస్పందించనూ లేదు. ఆ ప్రశ్నలు వారి తప్పు ఆలోచనలను బట్టబయలు చేశాయి.

కొన్నిసార్లు నిజ క్రైస్తవులు కూడా తప్పుడు ఆలోచనలో పడిపోగలరు. మొదటి శతాబ్దంలోని కొందరు కొరింథీయులు తమ సమస్యలను తమలో తాము పరిష్కరించుకోవలసి ఉండగా, వాటి విషయంలో వారు అవిశ్వాసుల ఎదుటనే తమ సహోదరులతో వ్యాజ్యెమాడుతున్నారు. అపొస్తలుడైన పౌలు ఈ విషయంలో ఎలా వ్యవహరించాడు? ఆయన వారి ఆలోచనను సరిదిద్దడానికి సూటైన ప్రశ్నల పరంపరను సంధించాడు.—1 కొరిం. 6:1-8.

మీరు అభ్యసిస్తే, సమర్థవంతంగా ప్రశ్నలను ప్రయోగించడం నేర్చుకోగలుగుతారు. అయితే, ప్రత్యేకించి మీకన్నా పెద్దవారితో, మీకు వ్యక్తిగతంగా తెలియనివారితో, అధికారంలో ఉన్నవారితో మాట్లాడేటప్పుడు గౌరవపూర్వకంగా ఉండాలని గుర్తుంచుకోండి. బైబిలు సత్యాన్ని ఆకర్షణీయమైన విధంగా అందించడానికి ప్రశ్నలు ప్రయోగించండి.

ఎలా చెయ్యాలి?

  • సంభాషణను పురికొల్పడానికి అవతలి వ్యక్తికి నిజంగా ప్రాముఖ్యమైన విషయాల గురించిన ప్రశ్నలు ఉపయోగించండి.

  • ఒక ప్రాముఖ్యమైన తలంపును పేర్కొనడానికి ముందు, అవతలివారు దాన్ని వినాలనుకునేలా చేసే ఒక ప్రశ్నను వేయడానికి ప్రయత్నించండి.

  • మీరు చేసిన వ్యాఖ్యానాలకు ఆధారాన్ని, అందిస్తున్న సత్యాల్లోని తర్కాన్ని, అవి వారి జీవితాలపై చూపించగల మంచి ప్రభావాలను గ్రహించేలా ప్రజలకు సహాయం చేసేందుకు ప్రశ్నలు ఉపయోగించండి.

  • విద్యార్థి వాస్తవాలను కేవలం అప్పజెప్పడానికి మాత్రమే కాక తాను నేర్చుకొంటున్నవాటి విషయంలో ఎలా భావిస్తున్నాడో వ్యక్తం చేసేలా ప్రోత్సహించేందుకు కూడా ప్రశ్నలు ఉపయోగించండి.

అభ్యాసాలు: (1)మీరు సాక్ష్యమిచ్చే ప్రాంతాన్ని మనస్సులో ఉంచుకొని, ప్రజలతో అర్థవంతమైన సంభాషణలు ప్రారంభించేందుకు మార్గాన్ని తెరిచేందుకు ఉపయోగించగల అనేక ప్రశ్నలను తయారుచేయండి. (2) రోమీయులు 3వ అధ్యాయాన్నిచదవండి, ప్రత్యేకంగా యూదులు మరియు అన్యులు దేవుని ఎదుట కలిగివున్న స్థానాన్ని గురించి తర్కించడంలో పౌలు ఉపయోగించిన ప్రశ్నలు గమనించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి