15
హుందాగా కనబడే తీరు
మీరు కనబడే తీరు మీ గురించి చాలా చెబుతుంది. యెహోవా హృదయాన్ని చూస్తాడు, కానీ మనుష్యులు సాధారణంగా “పైరూపమును” బట్టి కొన్ని నిర్ణయాలకు వస్తుంటారు. (1 సమూ. 16:7) మీరు శుభ్రంగా ఉండి, చక్కగా తల దువ్వుకొని ఉంటే ఇతరులు మీకు ఆత్మగౌరవం ఉందన్న నిర్ణయానికి రావచ్చు, అప్పుడు మీరు చెప్పేది వినడానికి వాళ్ళు మరింత మొగ్గుచూపుతారు. మీ వస్త్రధారణా కేశాలంకరణా సముచితమైన విధంగా ఉంటే మీరు ప్రాతినిధ్యం వహించే సంస్థ గురించీ సద్భావం కలుగుతుంది, మీరు ఆరాధించే దేవుని గురించీ మీ శ్రోతలకు సదభిప్రాయం కలుగుతుంది.
అన్వయించుకోవలసిన మార్గదర్శక సూత్రాలు. కనబడే విధానానికి సంబంధించి బైబిలు ఎక్కువ నియమాలనేమీ పెట్టడంలేదు. కానీ మనం సరైన నిర్ణయాలు తీసుకునేందుకు మనకు సహాయపడగల సమతుల్యతగల సూత్రాలను అది అందజేస్తోంది. మనం ‘ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కోసం చేస్తాం’ అన్న వాస్తవమే ఆ సూత్రాలన్నింటిలో ప్రధానమైనది. (1 కొరిం. 10:31) కనబడే తీరుకు సంబంధించి ఏ సూత్రాలు వర్తిస్తాయి?
మొదటిగా, మన శరీరమూ బట్టలూ రెండూ శుభ్రంగా ఉండాలని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. పరిశుభ్రతకు సంబంధించి తాను కోరే విషయాలను తాను ప్రాచీన ఇశ్రాయేలుకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో యెహోవా తెలియజేశాడు. ఉదాహరణకు, యాజకులు యాజక విధిని నిర్వహించేటప్పుడు, నియమిత సమయాల్లో స్నానం చేయడమూ తమ బట్టలు ఉతుక్కోవడమూ చేయవలసి ఉండేది. (లేవీ. 16:4,24,26,28) క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేరు, కానీ దానిలో ఉన్న సూత్రాలు ఇప్పటికీ విలువైనవే. (యోహా. 13:10; ప్రక. 19:8) ప్రత్యేకించి మనం ఆరాధనా స్థలానికి వెళ్తున్నప్పుడు లేదా క్షేత్ర పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు మన శరీరము, శ్వాస, మన వస్త్రాలు శుభ్రంగా ఉండాలి, తద్వారా ఇతరులకు మన మూలంగా ఇబ్బంది కలగదు. సంఘంలో ప్రసంగించేవారు గానీ ప్రదర్శనల్లో పాల్గొనేవారే గానీ ఈ విషయంలో మంచి మాదిరిని ఉంచాలి. మనం కనబడే తీరుపై శ్రద్ధ చూపడం యెహోవా మీదా ఆయన సంస్థ మీదా మనకున్న గౌరవాన్ని వ్యక్తం చేస్తుంది.
రెండవదిగా, అణకువనూ స్వస్థబుద్ధినీ అలవరుచుకొమ్మని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది. “అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను” అని అపొస్తలుడైన పౌలు క్రైస్తవ స్త్రీలకు ఉద్బోధించాడు. (1 తిమో. 2:9,10) పురుషుల వస్త్రధారణలోను కేశాలంకరణలోను కూడా అణకువా స్వస్థబుద్ధీ ప్రతిబింబించడం ప్రాముఖ్యమే.
అణకువగల వ్యక్తి, అనవసరంగా ఇతరులను కలతపెట్టకుండా తనవైపుకు అనవసరమైన శ్రద్ధను రాబట్టుకోకుండా ఉండేందుకు జాగ్రత్తపడతాడు. స్వస్థబుద్ధి మూలంగా వివేచన లేదా సరైన నిర్ణయానికి రాగల సామర్థ్యం కలుగుతుంది. ఈ లక్షణాలను చూపించే వ్యక్తికి, దైవిక ప్రమాణాల మీదున్న గౌరవం మూలంగా సమతుల్యత ఉంటుంది. ఈ లక్షణాలను చూపించడమంటే, ఆకర్షణీయమైన వస్త్రధారణను పూర్తిగా త్రోసిపుచ్చడమని కాదు, వస్త్రధారణ కేశాలంకరణల పద్ధతులలో వివేకాన్ని చూపించడానికీ గొప్ప ఆడంబరానికి పోకుండా జాగ్రత్తపడడానికీ అది మనకు సహాయపడుతుంది. (1 యోహా. 2:16) మనం ఆరాధనా స్థలంలో ఉన్నా క్షేత్ర పరిచర్యలో పాల్గొంటున్నా ఇతర కార్యకలాపాల్లో పాల్గొంటున్నా ఈ సూత్రాలను అన్వయించుకోవాలనుకుంటాం. మనం మామూలుగా వేసుకునే బట్టలు కూడా అణకువనూ స్వస్థబుద్ధినీ ప్రతిబింబించాలి. స్కూల్లోగానీ మన ఉద్యోగంలోగానీ అనియత సాక్ష్యమిచ్చే అవకాశాలు మనకుంటాయి. కూటాలకూ సమావేశాలకూ వెళ్తున్నప్పుడు ధరించేటువంటి ప్రత్యేక వస్త్రాలను ధరించకపోయినప్పటికీ మన వస్త్రాలు నీటుగా శుభ్రంగా అణకువను ప్రతిబింబించేవిగా ఉండాలి.
నిజమే, మనమందరం ఒకేలాంటి యూనిఫారాలను ధరించం. అలా ఉండాలని ఆశించబడడం లేదు కూడా. ప్రజల అభిరుచులు భిన్నంగా ఉంటాయి, అది అనుచితమేమీ కాదు. కానీ బైబిలు మార్గదర్శక సూత్రాలను ఎల్లప్పుడూ అన్వయించుకోవాలి.
కేశాలంకారాల కన్నా పై వస్త్రాల కన్నా మరింత ప్రాముఖ్యమైనది, “హృదయపు అంతరంగ స్వభావము”కు సంబంధించిన అలంకారమని అపొస్తలుడైన పేతురు సూచించాడు. (1 పేతు. 3:3,4) మన హృదయాల నిండా ప్రేమ, సంతోషం, సమాధానం, దయ, బలమైన ఆధారము గల విశ్వాసం ఉన్నప్పుడు మనకవి దేవుణ్ణి నిజంగా ఘనపరిచే ఆధ్యాత్మిక వస్త్రాలుగా మారతాయి.
మూడవదిగా, మనం కనబడే తీరు సక్రమంగా ఉందా అన్నది ఆలోచించుకోమని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది. పవిత్ర గ్రంథము, క్యాతలిక్ అనువాదము, 1 తిమోతి 2:9 లో, “సక్రమముగా దుస్తులు ధరింపవలెనని” చెబుతోంది. ఆ వచనంలో, అపొస్తలుడైన పౌలు, స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నప్పటికీ అదే సూత్రం పురుషులకు కూడా వర్తిస్తుంది. సక్రమంగా అమర్చబడినది ఏదైనా శుభ్రంగా క్రమబద్ధంగా ఉంటుంది. మనకు బాగా డబ్బున్నా లేకపోయినా మనం శుభ్రంగా ఉండవచ్చు.
మనల్ని చూసినప్పుడు ఇతరులు మొదట గమనించే విషయాల్లో ఒకటి జుట్టు. అది శుభ్రంగా సక్రమంగా ఉండాలి. ప్రజల కేశాలంకరణ, స్థానిక ఆచారాన్ని బట్టీ వంశ పారంపర్యాన్ని బట్టీ ఉంటుంది. అపొస్తలుడైన పౌలు ఈ రెండు విషయాలను పరిగణలోకి తీసుకుంటూ కేశాలంకరణకు సంబంధించి ఇచ్చిన ఉపదేశం 1 కొరింథీయులు 11:14,15 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అయితే, ఒక పురుషుడి కేశాలంకరణ గానీ ఒక స్త్రీ కేశాలంకరణ గానీ వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తిగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నట్లయితే, అది బైబిలు సూత్రాలకు విరుద్ధమైనది.—ద్వితీ. 22:5.
పురుషుల విషయానికి వస్తే శుభ్రంగా కనిపించడంలో నీటుగా షేవ్ చేసుకోవడం కూడా చేరివుండవచ్చు. మీసాలు హుందాతనానికి సూచనగా దృష్టించబడే ప్రాంతాల్లో మీసాలను పెంచుకునేవారు వాటిని నీటుగా కత్తిరించుకోవాలి.
నాలుగవదిగా, మనం కనబడే తీరు లోకం మీదా దాని పద్ధతుల మీదా ప్రేమను ప్రతిబింబించకూడదు. “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి” అని అపొస్తలుడైన యోహాను హెచ్చరించాడు. (1 యోహా. 2:15-17) పాపభరితమైన అనేక కోరికలు ఈ లోకపు లక్షణాలు. వాటిలో పాపభరితమైన శరీర కోరికనూ ఒకరు తమ సిరిసంపదలను డాబుగా ప్రదర్శించడాన్నీ యోహాను పేర్కొంటున్నాడు. లేఖనాలు తిరుగుబాటు స్ఫూర్తినీ అధికారానికి అవిధేయత చూపించడాన్నీ కూడా మన దృష్టికి తీసుకొస్తున్నాయి. (సామె. 17:11; ఎఫె. 2:2) ఈ కోరికలూ దృక్పథాలూ తరచూ ప్రజల వస్త్రధారణ కేశాలంకరణ విధానాల్లో ప్రతిబింబిస్తాయి. దాని ఫలితంగా వాళ్ళ బాహ్యరూపం అణకువలేనితనాన్ని సూచించవచ్చు, లైంగిక భావోద్రేకాలను రెచ్చగొట్టేదిగా ఉండవచ్చు, కొట్టొచ్చినట్లు కనిపించేలా ఉండవచ్చు, అశుభ్రంగా అశ్రద్ధగా ఉండవచ్చు లేదా నిర్లక్ష్యంగా ఉండవచ్చు. యెహోవా సేవకులుగా మనం అలాంటి క్రైస్తవ విరుద్ధమైన విధానాలను ప్రతిబింబించే పద్ధతులకు పోకుండా జాగ్రత్తపడతాము.
ఈ లోకాన్ని అనుకరించే బదులు, మీ వస్త్రధారణపైనా కేశాలంకరణపైనా ప్రభావం చూపేందుకు క్రైస్తవ సంఘంలోని ఆధ్యాత్మిక పరిణతి గల స్త్రీ పురుషుల మాదిరిని అనుమతించడం ఎంత మేలు! ఒకనాటికి బహిరంగ ప్రసంగీకులుగా అవ్వాలని ఆశించే యువకులు ఇప్పటికే బహిరంగ ప్రసంగమివ్వడానికి యోగ్యులుగా ఉన్నవారి వస్త్రధారణను గమనించవచ్చు. బహిరంగ పరిచర్యలో అనేక సంవత్సరాలుగా విశ్వాసంగా పాల్గొన్న వ్యక్తులు ఉంచిన మాదిరి నుండి అందరూ నేర్చుకోవచ్చు.—1 తిమో. 4:11,12; 1 పేతు. 5:2,3.
ఐదవదిగా, సముచితమైనది ఏదో నిర్ణయించుకునేటప్పుడు “క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు” అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా మనస్సులో ఉంచుకోవాలి. (రోమా. 15:3) యేసుకు ముఖ్యంగా ఉన్న చింత, దేవుని చిత్తాన్ని చేయాలన్నదే. అంతేగాక ఆయన తన స్వప్రయోజనాల కన్నా ఇతరులకు సహాయపడడానికే ప్రాముఖ్యతనిచ్చాడు. కొన్ని వస్త్రధారణ కేశాలంకరణల పద్ధతులు, మనకూ మనం సేవ చేసే ప్రాంతంలోనివారికీ మధ్య ఒక అడ్డుగోడగా వస్తే ఏమి చేయాలి? క్రీస్తు చూపిన వినయస్ఫూర్తిని అనుకరించడం జ్ఞానయుక్తంగా నిర్ణయం తీసుకునేందుకు మనకు సహాయపడగలదు. దానికి అపొస్తలుడైన పౌలు చెప్పిన సూత్రం: ‘ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయకయున్నాము.’ (2 కొరిం. 6:3) ఆ కారణంగా, మనం ఎవరికైతే సాక్ష్యమివ్వాలనుకుంటున్నామో వారి మనస్సు తలుపులను మూసివేసేటటువంటి కేశాలంకరణ పద్ధతులనూ అలంకార వస్తువులనూ విడిచిపెట్టవచ్చు.
భంగిమ. హుందాగా కనబడడంలో సరైన భంగిమ కూడా ఉంది. నిజమే, మనమందరం నిలబడే తీరూ కదలికలూ ఒకేవిధంగా ఉండవు, ఏదైనా ఒక నిర్దిష్ట మాదిరిని అనుకరించాలని ప్రయత్నించము కూడా. అయినప్పటికీ బైబిలు ప్రమాణం ప్రకారం నిటారుగా నిలబడడం, వ్యక్తిగత హుందాతనాన్నీ ఆశావాదాన్నీ తెలియజేస్తుంది. (లేవీ. 26:13; లూకా 21:28) అయినప్పటికీ అనేక సంవత్సరాలుగా వంగి పనిచేయడం వల్ల గానీ వయస్సు మీద పడుతున్నందువల్ల గానీ శరీరం బలహీనంగా ఉండడం వల్ల గానీ ఒక సహోదరుడు గానీ సహోదరి గానీ నిటారుగా నిలబడలేకపోవచ్చు, లేదా ఆసరా కోసం దేని మీదైనా ఆనుకోవలసిన అవసరం రావచ్చు. కానీ నిటారుగా నిలబడగలవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు తమకు ఉదాసీన వైఖరి గానీ క్షమాపణ కోరుతున్న వైఖరి గానీ ఉన్నట్లు ఎదుటి వాళ్ళకు అనిపించకుండా ఉండేందుకు, సహేతుకమైనంత నిటారుగా నిలబడాలని సిఫారసు చేయబడుతోంది. అదేవిధంగా ప్రసంగీకుడు అప్పుడప్పుడు తన చేతులను పోడియమ్ మీద ఆనించడం తప్పేమీ కాకపోయినప్పటికీ ఆయన దాన్నస్సలు ఆనుకోకుండా ఉంటే ప్రేక్షకులకు సాధారణంగా మరింత సదభిప్రాయం కలుగుతుంది.
శుభ్రమైన వస్తువులు. మనం కనబడే తీరు శుభ్రంగా సక్రమంగా ఉండడమే కాక పరిచర్యలో మనం ఉపయోగించే వస్తువులు కూడా శుభ్రంగా నీటుగా ఉండాలి.
మీ బైబిలు విషయమే తీసుకోండి. బైబిలు పాతబడగానే మరో క్రొత్త బైబిలును తీసుకోవడం మనకందరికీ సాధ్యం కాదు. అయితే మన దగ్గరున్న బైబిలు ఎంత పాతదైనా ఫర్వాలేదు, కానీ మనం దానిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నామని అది రుజువునివ్వాలి.
నిశ్చయంగా, ప్రకటనా పనిలో ఉపయోగించే వస్తువులను మనం తీసుకువెళ్ళే పెట్టెలో లేదా బ్యాగ్‌లో అనేక రకాలుగా సర్దిపెట్టుకోవచ్చు, కానీ అవి శుభ్రంగా ఉండాలి. ఒక ప్రచారకుడు గృహస్థుడికి బైబిలు నుండి ఒక లేఖనాన్ని చదివి వినిపించడానికి సిద్ధపడుతున్నప్పుడైనా, ఒక సహోదరుడు సంఘంలో ప్రసంగిస్తున్నప్పుడైనా బైబిలు నుండి కొన్ని కాగితాలు పడిపోవడం మీరెప్పుడైనా చూశారా? అప్పుడు మీ శ్రద్ధ అటు మళ్ళింది, కాదంటారా? బైబిలులో పెట్టుకున్న కాగితాలు శ్రద్ధను మళ్ళిస్తున్నట్లయితే మీరు వాటిని మరోచోట ఉంచడం, మీ వస్తువులు సక్రమంగా ఉండడానికి దోహదపడుతుంది. బైబిలును గానీ ఇతర మత సంబంధ ప్రచురణలను గానీ నేల మీద ఉంచడం, కొన్ని సంస్కృతుల్లో ఎంతో అగౌరవంగా దృష్టించబడుతుందని కూడా గ్రహించండి.
హుందాగా కనబడే తీరు మనకు ప్రాముఖ్యమైనదై ఉండాలి. అది ఇతరులు మనలను ఎలా దృష్టిస్తారన్నదానిపై కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే, “అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించ”వలెనని మనం కోరుకోవడమే, మనం కనబడే తీరు మీద శ్రద్ధ చూపించడానికి అన్నింటికంటే ముఖ్యమైన కారణం.—తీతు 2:9,10.