సువార్తను పంచుకోవడానికి వారు ఉపయోగించే మార్గాలు
“సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని క్రైస్తవులకు ఆదేశించబడింది, కానీ దానర్థం ఇతరులను ఒత్తిడి చేయడమో బలవంతంగా మతమార్పిడి చేయడమో కాదు. యేసు ఇచ్చిన ఆదేశం ‘దీనులకు సువర్తమానము ప్రకటించడం,’ ‘నలిగిన హృదయముగలవారిని దృఢపరచడం,’ ‘దుఃఖాక్రాంతులందరిని ఓదార్చడం.’ (మత్తయి 28:19; యెషయా 61:1, 2; లూకా 4:18, 19) బైబిలు నుండి సువార్తను ప్రకటించడం ద్వారా అలా చేయడానికి యెహోవాసాక్షులు ప్రయత్నిస్తారు. ప్రాచీనకాలంలో యెహెజ్కేలు ప్రవక్తలాగే నేడు యెహోవాసాక్షులు కూడా ‘జరుగుతున్న హేయకృత్యముల గురించి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారిని’ వెతకడానికి ప్రయత్నిస్తారు.—యెహెజ్కేలు 9:4.
ప్రస్తుత దిన పరిస్థితుల కారణంగా చింతిస్తున్నవారిని వెతకడానికి వారుపయోగించే బాగా వ్యాప్తి చెందిన మార్గం, ఇంటింటికీ వెళ్ళడం. వారు ఆ విధంగా ప్రజలను కలవడానికి సానుకూల ప్రయత్నం చేస్తారు, యేసు “దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము” చేసినట్లే వారు కూడా చేస్తారు. ఆయన తొలి శిష్యులు కూడా అలాగే చేశారు. (లూకా 8:1; 9:1-6; 10:1-9) నేడు సాధ్యమైన ప్రతీ ప్రాంతంలోను ప్రతీ ఇంటికి సంవత్సరంలో పలుమార్లు వెళ్ళడానికి యెహోవాసాక్షులు కృషి చేస్తారు, ఆసక్తికరమైనదైనా ఆలోచించవలసినదైనా ఒక స్థానిక ఘటన గురించి లేదా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏదైనా ఒక అంశం గురించి గృహస్థుడితో కొన్ని నిమిషాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. పరిశీలించడానికి ఒకటి లేదా రెండు లేఖనాలను చూపిస్తారు, గృహస్థుడు ఆసక్తి కనబరచినట్లయితే ఆ సాక్షి మళ్ళీ వచ్చి ఆ విషయం గురించి ఇంకా చర్చించడానికి అనుకూల సమయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. బైబిళ్ళు, బైబిలును వివరించే ప్రచురణలు లభ్యమవుతాయి, గృహస్థుడు ఇష్టపడితే గృహ బైబిలు అధ్యయనం ఉచితంగా నిర్వహించబడుతుంది. సహాయకరమైన ఇలాంటి బైబిలు అధ్యయనాలను ఒక్కొక్క వ్యక్తితోనూ కుటుంబాలతోనూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది నిర్వహిస్తున్నారు.
“రాజ్యసువార్త”ను తెలిపే మరొక మార్గం, స్థానిక రాజ్య మందిరాల్లో కూటాలు జరపడం. సాక్షులు అక్కడ వారం వారం కూటాలను నిర్వహిస్తారు. ఒక కూటం బహిరంగ ప్రసంగం, అది ప్రస్తుత కాలాల్లో అవసరమైన ఒక విషయంపై ఉంటుంది, దాని తర్వాత బైబిలుకు సంబంధించిన ఏదైనా ఒక అంశంపైన లేదా ప్రవచనం పైన ఒక అధ్యయనం ఉంటుంది, దానికి కావలికోట పత్రికను ఆధారంగా ఉపయోగిస్తారు. మరొక కూటం, సాక్షులు మంచి సువార్త ప్రచారకులు కావడానికి శిక్షణనిచ్చే పాఠశాల. దాని తర్వాత, స్థానిక క్షేత్రంలో జరిగే సాక్ష్యపు పని గురించి చర్చించే భాగం ఉంటుంది. వీటితోపాటు సాక్షులు వారానికి ఒకసారి చిన్న చిన్న గుంపులుగా బైబిలు అధ్యయనాల కోసం ఇండ్లలో కూడుకుంటారు.
ఈ కూటాలన్నిటికీ ప్రజలు హాజరుకావచ్చు. అక్కడ డబ్బు సేకరించే పద్ధతి లేనే లేదు. ఈ కూటాలు అందరికీ ప్రయోజనకరమైనవే. బైబిలు ఇలా చెబుతోంది: “ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం. సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్నదినం సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహపరచుకొంటూ ఉందాం.” వ్యక్తిగత అధ్యయనం, పరిశోధన అవసరం, కానీ ఇతరులతో కూడడం ప్రోత్సాహకరంగా ఉంటుంది: “ఇనుప కత్తులను పదును చేసేందుకు ఇనుప ముక్కలను మనుష్యులు వాడుతారు. అదే విధంగా మనుష్యులు ఒకరి నుండి ఒకరు నేర్చుకొని ఒకరిని ఒకరు పదును చేస్తారు.”—హెబ్రీయులు 10:24, 25; సామెతలు 27:17, ఈజీ-టు-రీడ్ వర్షన్.
సాక్షులు తమ దైనందిన జీవితాల్లో ఇతరులను కలుసుకున్నప్పుడు కూడా వారితో సువార్త గురించి మాట్లాడడానికి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అలా మాట్లాడేది పొరుగింటివారితో కావచ్చు లేదా బస్సులోనో విమానంలోనో తోటి ప్రయాణికుడితో కావచ్చు, ఒక స్నేహితుడితో లేదా బంధువుతో సుదీర్ఘ చర్చ కావచ్చు లేదా మధ్యాహ్న విరామంలో తోటి పనివారితో జరిపే చర్చ కావచ్చు. యేసు భూమిమీద ఉన్నప్పుడు ఎక్కువగా—సముద్రతీరంలో నడుస్తూ, కొండమీద కూర్చుండి, ఒకరి ఇంట్లో భోజనం చేసేటప్పుడు, వివాహానికి హాజరైనప్పుడు, గలిలయ సముద్రంలో చేపలుపట్టే పడవలో ప్రయాణిస్తూ సాక్ష్యమిచ్చాడు. ఆయన సమాజ మందిరాల్లోనూ యెరూషలేములోని మందిరం దగ్గరా బోధించాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యం గురించి మాట్లాడడానికి అవకాశాల కోసం వెతికాడు. ఈ విషయంలో కూడా యెహోవాసాక్షులు ఆయన అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తారు.—1 పేతురు 2:21.
మాదిరి ద్వారా ప్రకటించడం
మీకు సువార్త చెప్పే వ్యక్తి తాను బోధించే బోధలను స్వయంగా పాటించకపోయినట్లయితే, సువార్తను చెప్పే ఈ మార్గాల్లో ఏది కూడా మీకు ప్రయోజనకరంగా ఉండదు. చెప్పడం ఒకటి చేయడం మరొకటి అయితే అది వేషధారణ అవుతుంది, మతసంబంధ వేషధారణ లక్షలాదిమందిని బైబిలునుండి దూరం చేసింది. దానికి బైబిలు నిందార్హం కాదు. శాస్త్రుల దగ్గరా పరిసయ్యుల దగ్గరా హీబ్రూ లేఖనాలు ఉండేవి అయినా యేసు వారిని వేషధారులారా అని బహిరంగంగా నిందించాడు. వారు మోషే ధర్మశాస్త్రాన్ని చదవడం గురించి మాట్లాడిన తర్వాత ఆయన తన శిష్యులతో ఇంకా ఇలా అన్నాడు: “వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.” (మత్తయి 23:3) ఒక క్రైస్తవుడు చక్కగా జీవిస్తూ మంచి మాదిరిగా ఉండడం, గంటలకొలది ప్రసంగాలిచ్చేదానికంటే ఎక్కువ విశ్వాసం కలిగిస్తుంది. అవిశ్వాసులైన భర్తలున్న క్రైస్తవ భార్యలకు ఇది సూచించబడింది: “వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.”—1 పేతురు 3:1, 2.
ఆ కారణంగా యెహోవాసాక్షులు, ఇతరులకు చెప్పే క్రైస్తవ ప్రవర్తన విషయంలో మాదిరిగా ఉండడం ద్వారా కూడా సువార్తను చెప్పడానికి ప్రయత్నిస్తారు. ‘ఇతరులు వారికి ఏమి చేయాలని కోరుకుంటారో అలాగే వారు ఇతరులకు చేయడానికి’ ప్రయత్నిస్తారు. (మత్తయి 7:12) వారు అలా కేవలం తమ తోటి సాక్షులతో, స్నేహితులతో లేదా బంధువులతోనే కాదు గానీ అందరితోనూ అలాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. అపరిపూర్ణులవడం మూలంగా వారు ఎల్లప్పుడూ నూటికి నూరు శాతం సఫలులు కాలేరు. కానీ ప్రజలందరికీ మంచి చేయాలనేది వారి హృదయపూర్వక కాంక్ష, అది కేవలం వారికి రాజ్య సువార్త చెప్పడం మాత్రమే కాదుగానీ వీలైనప్పుడల్లా వారికి సహాయం కూడా చేస్తారు.—యాకోబు 2:14-17.
[19వ పేజీలోని చిత్రం]
హవాయి
[19వ పేజీలోని చిత్రం]
వెనిజులా
[19వ పేజీలోని చిత్రం]
యుగోస్లావియా
[20వ పేజీలోని చిత్రాలు]
రాజ్య మందిరాలు, నిర్మాణంలో ఆచరణాత్మకమైనవి, బైబిలు చర్చించబడే స్థలాలు
[21వ పేజీలోని చిత్రాలు]
తమ కుటుంబ జీవితంలో ఇతరులను కలుసుకున్నప్పుడు, సాక్షులు తాము చెబుతున్నవి చేయడానికి యథార్థంగా ప్రయత్నిస్తారు