కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • we పేజీలు 20-25
  • ఇతరులు ఎలా సహాయం చేయవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇతరులు ఎలా సహాయం చేయవచ్చు?
  • మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏమి చేయాలి . . .
  • ఏమి చేయకూడదు . . .
  • “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుని” నుండి ఓదార్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • “ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • బాధను తట్టుకోవడం ఎలా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • దుఃఖంతో నేనెలా జీవించగలను?
    మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే
మరిన్ని
మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే
we పేజీలు 20-25

ఇతరులు ఎలా సహాయం చేయవచ్చు?

“నేను చేయగలిగింది ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి” అని మనలో చాలామందిమి, కొద్దికాలం నుండి వియోగం అనుభవిస్తున్న స్నేహితునితోనో బంధువుతోనో అంటాం. నిజంగా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మనమలా అంటాం. సహాయం చేయడానికి మనం ఏదైనా చేస్తాం. అయితే వియోగం అనుభవిస్తున్నవారు మనల్ని పిలిచి,“దయచేసి నాకీ పనిచేసి పెట్టండి,” అని మనల్ని అడుగుతారా? సాధారణంగా ఎవరూ అలా అడగరు. దుఃఖిస్తున్నవారికి సహాయం చేసి, వారిని మనం నిజంగా ఓదార్చాలంటే మనమే చొరవ తీసుకోవాలి.

ఒక బైబిలు సామెత ఇలా చెబుతోంది: “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలోనుంచబడిన బంగారుపండ్లవంటిది.” (సామెతలు 15:23; 25:11) ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయం తెలుసుకోవడంలో విజ్ఞత ఉంది. వియోగం అనుభవిస్తున్న కొందరు సహాయకరంగా ఉంటాయని తెలుసుకున్న లేఖన సలహాలు కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి.

ఏమి చేయాలి . . .

వినండి: ‘వినుటకు వేగిరపడువారిగా’ ఉండమని యాకోబు 1:19 చెబుతోంది. వియోగం అనుభవిస్తున్నవారి బాధను పంచుకోవడానికి మీరు చేయగల అత్యంత సహాయకరమైన వాటిలో ఒకటి, వినడం. బాధపడుతున్న కొంతమంది, చనిపోయిన తమ ప్రియమైన వారి గురించి అంటే జరిగిన దుర్ఘటన గురించి లేదా మరణానికి దారితీసిన జబ్బు గురించి, లేదా మరణించినప్పటి నుండి వారు పడుతున్న బాధ గురించి మాట్లాడాలనుకోవచ్చు. కాబట్టి, “మీరు జరిగినదాని గురించి చెప్పాలనుకుంటున్నారా?” అని అడగండి. వారినే నిర్ణయించుకోనివ్వండి. ఒక యౌవనస్థుడు తన తండ్రి మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా చెప్పాడు: “ఏమి జరిగిందని ఇతరులు నన్ను అడిగి, ఆ తర్వాత నేను జరిగింది చెప్పినప్పుడు వారు శ్రద్ధగా వినడం నాకు నిజంగా సహాయం చేసింది.” మీరు సమాధానాలు లేదా పరిష్కారాలు అందించాల్సి ఉంటుందని భావించకుండా సహనంతో, సానుభూతితో వినండి. వాళ్లు చెప్పాలనుకున్నవన్నీ చెప్పనివ్వండి.

ధైర్యం చెప్పండి: మీకు సాధ్యమైనదంతా మీరు చేశారంటూ (లేదా మీకు తెలిసిన వాస్తవమైన, సానుకూలమైన విషయాలు చెబుతూ) వాళ్లకు ధైర్యం చెప్పండి. వాళ్లకు కలుగుతున్న భావాలు అంటే దుఃఖం, కోపం, అపరాధభావం, లేదా మరితర భావోద్వేగాలు అసాధారణమైనవేమీ కావని వారికి ధైర్యం చెప్పండి. అలాంటి దుఃఖకర పరిస్థితినే అనుభవించి దాని నుండి తేరుకున్న ఇతరులెవరైనా మీకు తెలిసుంటే వారి గురించి చెప్పండి. అలాంటి ‘ఇంపైన మాటలు యెముకలకు ఆరోగ్యకరమైనవి’ అని సామెతలు 16:24 చెబుతోంది.—1 థెస్సలొనీకయులు 5:11, 14.

అందుబాటులో ఉండండి: అనేకమంది స్నేహితులు, బంధువులు ఉన్న మొదటి కొన్ని రోజులపాటు మాత్రమే కాదు కానీ, నెలల తర్వాత అంటే ఇతరులందరూ మామూలుగా తిరిగి తమ పనుల్లోకి వెళ్లిపోయిన తర్వాత కూడా మీరు అందుబాటులో ఉండండి. ఈ విధంగా మీరు, “దుర్దశలో” స్నేహితుడ్ని ఆదుకొనే “నిజమైన స్నేహితుడు” అని నిరూపించుకుంటారు. (సామెతలు 17:17) “మేము సాయంకాల సమయాల్లో ఒంటరిగా ఎక్కువ సమయం గడపకుండా ఉండేలా మా స్నేహితులంతా సాయంకాలాల్లో మా కోసం వేర్వేరు కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు,” అంటూ కారు ప్రమాదంలో బిడ్డను కోల్పోయిన టెరెస్యా వివరిస్తోంది. “అది మాలోని వెలితిని పూడ్చడానికి సహాయం చేసింది.” ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు, పెళ్ళి రోజు లేదా చనిపోయిన రోజు వంటి వార్షిక తేదీలు బ్రతికున్న వారికి చాలా వ్యధను కలిగిస్తాయి. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, అవసరమైతే సానుభూతితో మద్దతు ఇవ్వడానికి మీరు అందుబాటులో ఉండేలా ఆయా తేదీలను మీ క్యాలెండరులో ఎందుకు వ్రాసి పెట్టుకోకూడదు?

ఒక జంట ఒకతనికి ఇంటి పనుల్లో సహాయం చేసి పెడుతున్నారు

నిజమైన అవసరం ఉందని మీరు గమనించినప్పుడు, అడిగే వరకూ ఆగకండి—తగిన చొరవ తీసుకోండి

తగినవిధంగా చొరవ తీసుకోండి: మీరు వెళ్లి చేయాల్సిన పనులేమైనా ఉన్నాయా? పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవలసిన అవసరమేమైనా ఉందా? చూడడానికి వచ్చిన స్నేహితులు, బంధువులు ఉండడానికి స్థలం ఏమైనా అవసరమా? ఈ మధ్యనే తమ ప్రియమైనవారిని పోగొట్టుకొన్న వ్యక్తులు తరచూ ఎంతగా దిగ్భ్రమ చెందుతారంటే, ఏమి చేయాలో తమకే తెలియని స్థితిలో ఉంటారు, ఇక ఇతరులు తమకు ఎలా సహాయం చేయవచ్చో ఏం చెబుతారు? కాబట్టి, ఏదైనా నిజంగా అవసరమున్నట్లు మీరు గ్రహిస్తే అడిగే వరకూ వేచి ఉండకండి; మీరే చొరవ తీసుకోండి. (1 కొరింథీయులు 10:24; 1 యోహాను 3:17, 18 పోల్చండి.) భర్త చనిపోయిన ఒక స్త్రీ ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “‘నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చెప్పండి,’ అని చాలామంది అడిగారు. కానీ ఒక స్నేహితురాలు మాత్రం ఏమీ అడగలేదు. ఆమె నేరుగా పడకగదిలోకి వెళ్లి, ఆయన చనిపోయినప్పుడు మురికైన పక్క బట్టలు తీసి ఉతికేసింది. మరొక స్త్రీ ఒక బకెట్టు, నీళ్లు, సబ్బు తీసుకొని నా భర్త వాంతి చేసిన తివాచీని శుభ్రంచేసింది. కొన్ని వారాల తర్వాత, ఒక సంఘ పెద్ద పని దుస్తులు ధరించుకుని తన పనిముట్లతో వచ్చి, ‘రిపేరు చేయవలసినది ఏదోకటి ఉంటుందని నాకు తెలుసు, అదేమిటో చెప్పండి’ అని అడిగాడు. ఒక పక్కకు వ్రేలాడుతున్న తలుపును, ఒక ఎలక్ట్రిక్‌ పరికరాన్ని బాగుచేసినందుకు ఆయనపట్ల నాకెంతో అభిమానం ఏర్పడింది.”—యాకోబు 1:27 పోల్చండి.

ఆతిథ్యమిచ్చేవారిగా ఉండండి: “ఆతిథ్యము చేయ మరవకుడి,” అని బైబిలు మనకు జ్ఞాపకం చేస్తోంది. (హెబ్రీయులు 13:1) ప్రాముఖ్యంగా, దుఃఖిస్తున్నవారికి ఆతిథ్యమివ్వాలని మనం గుర్తుంచుకోవాలి. “ఎప్పుడైనా రండి” అని ఆహ్వానించే బదులు, ఒక తారీఖును, సమయాన్ని ఖచ్చితంగా చెప్పండి. వారొకవేళ రామంటే ఆ విషయాన్ని అంతటితో విడిచిపెట్టకండి. వారిని సున్నితంగా ప్రోత్సహించడం అవసరం కావచ్చు. బహుశా ఇతరుల ఎదుట తమ దుఃఖాన్ని ఆపుకోలేమనే భయంతో వారు మీ ఆహ్వానాన్ని త్రోసిపుచ్చుతున్నారేమో. లేదా అలాంటి సమయంలో విందు ఆరగించడాన్ని, సహవసించడాన్ని వారు ఒక అపరాధంగా భావిస్తుండవచ్చు. బైబిలులో ఉదహరించబడిన ఆతిథ్య గుణంగల లూదియను జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఇంటికి ఆహ్వానించబడిన తర్వాత లూకా ఇలా చెబుతున్నాడు, “నా యింటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.”—అపొస్తలుల కార్యములు 16:15.

సహనం వహించండి, అర్థం చేసుకోండి: ప్రియమైనవారిని పోగొట్టుకున్నవారు మొదట్లో చెప్పేదాన్నిబట్టి విపరీతంగా ఆశ్చర్యపోవద్దు. వారికి కోపం వస్తుండవచ్చని, అపరాధం చేశామనే భావాలు వారిలో ఉండవచ్చని గుర్తుంచుకోండి. వారు భావోద్రేకంగా మీపై విరుచుకుపడితే, మీరు కూడా అంతే చిరాకుతో ప్రతిస్పందించకుండా ఉండడానికి మీకు అంతర్దృష్టి, సహనం సహాయం చేస్తాయి. “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి,” అని బైబిలు సిఫారసు చేస్తోంది.—కొలొస్సయులు 3:12, 13.

ఉత్తరం వ్రాయండి: సంతాపాన్ని తెలియజేసే ఉత్తరానికి లేదా సానుభూతి ప్రకటించే కార్డుకు ఉండే విలువ తరచూ నిర్లక్ష్యం చేయబడుతోంది. వాటివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? క్యాన్సరు వల్ల తన తల్లిని కోల్పోయిన సిండే ఆ ప్రశ్నకిలా సమాధానం చెబుతోంది: “ఒక స్నేహితురాలు నాకొక చక్కని ఉత్తరం వ్రాసింది. అది నాకు నిజంగా సహాయం చేసింది, ఎందుకంటే నేను దాన్ని పదే పదే చదువుకోగలిగాను.” ప్రోత్సాహమిచ్చే అలాంటి ఉత్తరంలో లేదా కార్డులో “కొద్దిమాటలే” వ్రాసినా అందులో మీ హృదయం ప్రతిబింబించాలి. (హెబ్రీయులు 13:22) మీకు వారిపై శ్రద్ధవుందనీ, చనిపోయిన ఆ వ్యక్తి మీకు ప్రత్యేకంగా గుర్తున్నాడనీ, లేదా చనిపోయిన వ్యక్తి మీ జీవితాన్నెలా ప్రభావితం చేశాడో మీరు ఆ ఉత్తరంలో వ్రాయవచ్చు.

వారితో కలిసి ప్రార్థించండి: ప్రియమైనవారిని కోల్పోయిన వారి కోసం, వారితో కలిసి చేసే ప్రార్థనల విలువను తక్కువగా అంచనా వేయకండి. బైబిలిలా చెబుతోంది: “నీతిమంతుని విజ్ఞాపన . . . బహు బలముగలదై యుండును.” (యాకోబు 5:16) ఉదాహరణకు, వారి తరఫున మీరు ప్రార్థించడాన్ని వారు వింటే, వారిలోని ప్రతికూలమైన అపరాధభావాలు తొలగిపోతాయి.—యాకోబు 5:13-15 పోల్చండి.

ఏమి చేయకూడదు . . .

ఆసుపత్రిలో ప్రియమైనవారిని కోల్పోయి ఏడుస్తున్నవాళ్లను స్నేహితులు ప్రోత్సహిస్తున్నారు

మీరు ఆసుపత్రికి వెళ్ళి ప్రియమైనవారిని పోగొట్టుకున్నవాళ్ళను సందర్శించడమే వాళ్ళను ప్రోత్సహించవచ్చు

ఏమి మాట్లాడాలో ఏమి చేయాలో తెలియదని దూరంగా ఉండొద్దు: ‘ఇప్పుడు వాళ్లు ఒంటరిగా ఉండడమే మంచిది,’ అని మనకు అనిపించవచ్చు. కానీ వాస్తవమేమిటంటే, పొరపాటుగా మాట్లాడతామనో ఏదైనా పొరపాటు చేస్తామనో భయపడుతూ మనమే దూరంగా ఉంటుండవచ్చు. అయితే స్నేహితులు, బంధువులు, లేదా తోటి విశ్వాసులు వియోగం అనుభవిస్తున్న వారిని పట్టించుకోకపోతే వారి బాధ ఎక్కువై, వారు మరింత ఒంటరితనాన్ని అనుభవిస్తారు. సానుభూతితో మాట్లాడే మాటలు, చేసే క్రియలు సాధారణమైనవిగా ఉంటాయని గుర్తుంచుకోండి. (ఎఫెసీయులు 4:32) కేవలం మీరు వారి దగ్గర ఉండడం కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. (అపొస్తలుల కార్యములు 28:15 పోల్చండి.) టెరెస్యా తన కుమార్తె చనిపోయిన రోజును గుర్తుచేసుకుంటూ ఇలా చెబుతోంది: “కేవలం ఒక్క గంటలోపే, ఆసుపత్రిలోని వేచివుండేగది మా స్నేహితులతో నిండిపోయింది; పెద్దలందరూ వారి భార్యలతోపాటు అక్కడకు వచ్చారు. ఆ స్త్రీలల్లో కొందరు చేస్తున్న పనులు వదిలిపెట్టి ఉన్న పళంగా వచ్చేశారు. వారిలో చాలామంది ఏమి మాట్లాడాలో తమకు తోచడంలేదని అన్నారు, కానీ అది ప్రాముఖ్యం కాదు ఎందుకంటే వాళ్లక్కడున్నారు, అంతే చాలు.”

ఏడవడం ఆపమని వాళ్లను బలవంతపెట్టకండి: ‘చాలు, చాలు, ఇక ఏడవకండి’ అని చెప్పాలని మనకు అనిపించవచ్చు. కానీ వాళ్లనలా ఏడవనివ్వడమే మంచిది. కేథరీన్‌ తన భర్త మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇలా అంటోంది: “ప్రియమైనవారిని పోగొట్టుకున్నవాళ్ళు తమ మనస్సులోని బాధను తొలగించుకోవడానికి వారిని ఏడవనివ్వడం ప్రాముఖ్యమని నేను భావిస్తున్నాను.” ఇతరుల భావాలను మీరు శాసించాలని చూడకండి. వాళ్ళ భావాలను కాపాడాలనే ఉద్దేశంతో మీ భావాలను దాచుకోవాలని తలంచకండి. బదులుగా, “ఏడ్చువారితో ఏడువుడి,” అని బైబిలు సిఫారసు చేస్తోంది.—రోమీయులు 12:16.

చనిపోయినవారికి సంబంధించిన బట్టలు, ఇతర వ్యక్తిగత వస్తువులు ఇచ్చేయడానికి లేదా పారేయడానికి వాళ్ళు ఇంకా సిద్ధంగా లేనప్పుడే, అలా చేయమని మీరు వాళ్ళకు తొందరపడి సలహా ఇవ్వకండి: చనిపోయిన వారిని గుర్తుకుతెచ్చే వస్తువులు ఏదో రకంగా వాళ్ళ దుఃఖాన్ని అధికం చేస్తాయని అనుకుంటూ వాటిని ఇచ్చేయడం లేదా పారేయడం వాళ్ళకే మంచిదని మనం భావించవచ్చు. అయితే, ‘కనిపించకపోతే గుర్తుకురాదు’ అనే మాట ఇక్కడ అన్వయించకపోవచ్చు. ప్రియమైనవారిని పోగొట్టుకొన్న వ్యక్తి వారిని నెమ్మదిగా మరచిపోవాలి. పితరుడైన యాకోబు తన యౌవన కుమారుడైన యోసేపు దుష్టమృగంచేత చంపబడ్డాడని నమ్మించబడినప్పుడు ఆయన స్పందించిన విధానం గురించి బైబిలులో వర్ణించబడినదాన్ని గుర్తుచేసుకోండి. రక్తపు మరకలున్న యోసేపు నిలువుటంగీని యాకోబు చూసినప్పుడు, ఆయన “అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లక” పోయెను.—ఆదికాండము 37:31-35.

‘మీరు మరో బిడ్డను కనవచ్చు’ అని అనకండి: బిడ్డను పోగొట్టుకున్న ఒక తల్లి, “మీరు మరో బిడ్డను కనవచ్చు అని ప్రజలు చెప్పినప్పుడు నాకు చాలా కోపమొచ్చింది,” అని గుర్తుచేసుకుంటోంది. వాళ్ళు సదుద్దేశంతోనే అలా అని ఉండవచ్చు, కానీ దుఃఖిస్తున్న తల్లికి, కోల్పోయిన బిడ్డకు బదులు మరొక బిడ్డను పొందవచ్చనే మాట ‘కత్తిపోటులా’ ఉండగలదు. (సామెతలు 12:18) ఒక బిడ్డ లోటును మరో బిడ్డ ఎప్పటికీ తీర్చలేదు. ఎందుకు? ఎందుకంటే ప్రతీ బిడ్డ ప్రత్యేకమైనదే.

చనిపోయినవారి గురించి ప్రస్తావించడం పూర్తిగా మానివేయవద్దు: “చాలామంది మా అబ్బాయి జిమ్మీ పేరెత్తరు, అతని గురించే మాట్లాడరు. ఇతరులు అలా చేసినప్పుడు నేను నిజంగా బాధపడ్డాను” అని ఒక తల్లి జ్ఞాపకం చేసుకుంటోంది. చనిపోయినవారి పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా విషయం మార్చకండి. తన ప్రియమైన వ్యక్తి గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాడేమో దుఃఖిస్తున్న వ్యక్తిని అడగండి. (యోబు 1:18, 19 మరియు 10:1 పోల్చండి.) ప్రియమైనవారిని పోగొట్టుకున్న కొంతమంది, చనిపోయినవారిని తాము ఇష్టపడడానికి కారణమైన ప్రత్యేక లక్షణాల గురించి స్నేహితులు చెప్పడాన్ని వినాలని కోరుకుంటారు.—అపొస్తలుల కార్యములు 9:36-39 పోల్చండి.

‘జరిగిందేదో మంచికే జరిగింది’ అని తొందరపడి అనకండి: మరణం గురించి ఏదో మంచి చెబుదామని ప్రయత్నించడం దుఃఖిస్తూ ‘ధైర్యము చెడినవారిని’ అన్ని సందర్భాల్లో ‘ధైర్యపరచదు.’ (1 థెస్సలొనీకయులు 5:14) తన తల్లి మరణాన్ని గుర్తుచేసుకొంటూ ఒక యౌవనస్థురాలు ఇలా చెప్పింది: “‘ఆమెకిప్పుడు బాధ తప్పింది,’ లేదా ‘కనీసం ఇప్పుడైనా ఆమెకు ప్రశాంతత లభించింది,’ అని ఇతరులు అంటారు. కానీ అలాంటి మాటలు వినడం నాకిష్టం లేదు.” అలాంటి మాటలు, బాధపడకూడదని లేదా జరిగిన నష్టం ఏమంత పెద్దది కాదని చెప్తున్నట్లు బంధువులకు అనిపించవచ్చు. నిజానికి వాళ్లు, తమకు ప్రియమైనవారి వియోగంతో ఎంతో దుఃఖిస్తుండవచ్చు.

‘మీరెలా భావిస్తున్నారో నాకు తెలుసు’ అని చెప్పకపోవడం మంచిది: వాళ్ళెలా భావిస్తున్నారో మీకు నిజంగా తెలుసా? ఉదాహరణకు, బిడ్డ చనిపోతే కలిగే బాధను మీరు స్వయంగా అనుభవించనప్పుడు, అలాంటి స్థితిలోవున్న తల్లిదండ్రుల బాధను మీరు నిజంగా అర్థంచేసుకోగలరా? ఒకవేళ మీరు అర్థంచేసుకున్నా, ఖచ్చితంగా మీరు భావించినట్లే అందరూ భావించక పోవచ్చని గ్రహించండి. (విలాపవాక్యములు 1:12 పోల్చండి.) అయితే, ఒకవేళ సముచితమనిపిస్తే, మీ ప్రియమైనవారిని కోల్పోయిన బాధనుండి మీరెలా కోలుకున్నారో చెప్పడంవల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. తన కుమార్తెను పోగొట్టుకున్న ఒక తల్లి తాను మామూలు స్థితికి తిరిగిరావడం గురించి చెప్పినప్పుడు, కుమార్తెను కోల్పోయిన మరో తల్లి, అది విని ఎంతో ఓదార్పు పొందింది. ఆమె ఇలా చెప్పింది: “‘మీరెలా భావిస్తున్నారో నాకు తెలుసు’ అని ఆమె మొదలు పెట్టలేదు. బదులుగా ఆమె తన విషయంలో ఏం జరిగిందో అది మాత్రమే వివరించి, నాకు నేనుగా అర్థం చేసుకోవడానికి సహాయం చేసింది.”

ప్రియమైనవారిని పోగొట్టుకొన్న వారికి సహాయం చేయడానికి దయ, వివేచన, ఎక్కువ ప్రేమ అవసరం. ప్రియమైనవారిని పోగొట్టుకొన్న వారే మీ దగ్గరకు వచ్చేవరకూ వేచి ఉండవద్దు. “నన్ను ఏమైనా చేయమంటారా . . .” అని మాటవరసకు అడిగినట్లు అడగకండి. ఆ “ఏమైనా” మీరే స్వయంగా తెలుసుకొని చేయడానికి చొరవ తీసుకోండి.

ఇంకా కొన్ని ప్రశ్నలున్నాయి: బైబిల్లో చెప్పబడిన పునరుత్థాన నిరీక్షణ విషయమేమిటి? అది మీకూ, మరణించిన మీ ప్రియమైనవారికీ ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది? ఆ నిరీక్షణ నమ్మదగినదే అని మనమెలా నిశ్చయతతో ఉండవచ్చు?

ధ్యానించడానికి ప్రశ్నలు

  • ప్రియమైనవారిని పోగొట్టుకున్న వ్యక్తి చెప్పేది వినడం ద్వారా వారి బాధను పంచుకోవడం ఎందుకు సహాయకరంగా ఉంటుంది?

  • దుఃఖిస్తున్నవారిని ఓదార్చడానికి మనం చేయగల కొన్ని పనులేవి?

  • దుఃఖిస్తున్నవారితో ఏమి అనకూడదు, ఏమి చేయకూడదు?

మరణ విషాదాన్ని ఎదుర్కోవడానికి పిల్లలకు సహాయం చేయడం

ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు, ఆ విషాదాన్ని తట్టుకొనేందుకు పిల్లలకు ఏమి చెప్పాలి ఏమి చేయాలి అనేది తరచూ వారి తల్లిదండ్రులకు, ఇతర బంధువులకు, స్నేహితులకు తెలియదు. కానీ మరణ విషాదాన్ని తట్టుకునేందుకు పెద్దవాళ్ళే పిల్లలకు సహాయం చేయాలి. మరణమంటే ఏమిటో పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయం చేసే విషయంలో సాధారణంగా అడిగే కొన్ని ప్రశ్నలను పరిశీలించండి.

మరణం గురించి పిల్లలకు ఎలా వివరించాలి? సులభమైన పదాలతో విషయాలను వివరించడం ప్రాముఖ్యం. ఆ వివరణ వాస్తవికంగా కూడా ఉండాలి. “చనిపోయారు,” “మరణం” వంటి అసలు పదాలను ఉపయోగించడానికి సంకోచించకండి. ఉదాహరణకు, మీరు బహుశా బిడ్డతోపాటు కూర్చొని, ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని ఇలా చెప్పండి: “చాలా బాధ కలిగించే విషయం జరిగింది. మనలో చాలామందికి రాని జబ్బు నాన్నగారికి వచ్చి, [లేదా మీకు తెలిసిన నిజమేదైనా ఉంటే ఆ విషయం చెప్పి] చాలా బాధపడి ఆయన చనిపోయారు. ఆయన చనిపోయారంటే అది ఎవరి తప్పూ కాదు. మనం ఆయనను ప్రేమించాము, ఆయన మనల్ని ప్రేమించాడు, కాబట్టి ఆయన మనకెప్పుడూ గుర్తొస్తుంటాడు.” అయితే ఆ బిడ్డ లేదా బ్రతికున్న తల్లి లేదా తండ్రి అప్పుడప్పుడు జబ్బుపడినంత మాత్రాన చనిపోరని కూడా చెప్పడం సహాయకరంగా ఉంటుంది.

వాళ్లను ప్రశ్నలు అడగనివ్వండి. ‘చనిపోవడమంటే ఏమిటి?’ అని వాళ్లు అడగవచ్చు. దానికి మీరిలా చెప్పవచ్చు: “‘చనిపోవడం’ అంటే శరీరం పనిచేయడం మానేసిందని అర్థం. అది మామూలుగా చేస్తుండే ఏ పనుల్నీ చేయలేదు, అంటే మాట్లాడలేదు, చూడలేదు, వినలేదు, స్పర్శించలేదు.” పునరుత్థానం గురించిన బైబిలు వాగ్దానాన్ని విశ్వసించే తల్లి లేదా తండ్రి, అలా చనిపోయిన వారిని యెహోవా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడనీ, భవిష్యత్‌ భూ పరదైసులో ఆయనను తిరిగి జీవింపజేయగలడనీ వివరించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. (లూకా 23:43; యోహాను 5:28, 29)—“చనిపోయిన వారికిగల నిశ్చయమైన నిరీక్షణ” అనే భాగాన్ని చూడండి.

మీరు చెప్ప కూడనిది ఏదైనా ఉందా? చనిపోయినవారు ఎక్కడికో ప్రయాణమై వెళ్లారని చెప్పడం సహాయకరంగా ఉండదు. ప్రాముఖ్యంగా తల్లి లేదా తండ్రి చనిపోయినప్పుడు, వియోగ భయం పిల్లలకు ఎక్కువ చింత కలిగిస్తుంది. చనిపోయినవారు ప్రయాణమై వెళ్లారని చెప్పడం, వారిలో వదిలిపెట్టబడ్డామనే బాధను మరింత అధికం చేస్తుంది, వాళ్ళిలా అడగవచ్చు: ‘అమ్మమ్మ వెళ్లిపోయిందా, నాకు టాటా కూడా చెప్పలేదు!’ చనిపోయిన వ్యక్తి నిద్రపోతున్నాడని వారికి చెప్పే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు దాన్ని అక్షరార్థంగా తీసుకునే అవకాశముంది. నిద్ర మరణంతో సమానమని పిల్లలు భావించినట్లయితే వాళ్ళు రాత్రి నిద్రపోవడానికి భయపడవచ్చు.

అంత్యక్రియలకు పిల్లలు హాజరుకావాలా? పిల్లల భావాలను తల్లిదండ్రులు పరిగణలోకి తీసుకోవాలి. వాళ్లు రావడానికి నిరాకరిస్తే, బలవంతం చేయవద్దు లేదా రానందుకు వాళ్లు దోషులమని భావించేలా చేయకండి. వాళ్లు రావాలనుకుంటే, అక్కడ సమాధిపెట్టె ఉంటుందా, అది మూయబడి ఉంటుందా లేదా తెరవబడి ఉంటుందా అనే వాటితో సహా అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా వివరించండి. అక్కడ చాలామంది దుఃఖంతో ఏడుస్తూ ఉంటారని కూడా వివరించండి. వాళ్లను ప్రశ్నలు అడగనీయండి. ఒకవేళ వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చని కూడా వారికి చెప్పండి.

మరణానికి పిల్లలెలా స్పందిస్తారు? తమ ప్రియమైనవారు చనిపోవడానికి తామే బాధ్యులమని పిల్లలు తరచూ భావిస్తుంటారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మీద వాళ్ళు ఎప్పుడో ఒకసారి కోపం తెచ్చుకొని ఉండవచ్చు, దానితో తాము కోపంతో అన్న మాటలు, మనసులో అనుకున్నవి చనిపోవడానికి కారణమయ్యాయని వాళ్ళు అనుకోవచ్చు. అలాంటప్పుడు మీరిలా ఓదార్చాలి: ‘మీ మాటలు, మీరు మనస్సులో అనుకున్నవి మనుష్యులను జబ్బుపడేలా చేయవు, అవి వాళ్ళు చనిపోయేలా చేయవు.’ చిన్న పిల్లలకు అలా పదేపదే ధైర్యం చెప్పడం అవసరం.

పిల్లల ఎదుట ఏడవకూడదా? పిల్లల ఎదుట ఏడవడం సాధారణం మరియు ఆరోగ్యవంతం కూడా. అంతేకాకుండా, మీ భావాలను పిల్లలకు తెలియకుండా పూర్తిగా కప్పిపుచ్చుకోవడం అసాధ్యం; వాళ్లు చాలా తెలివిగా ఉంటారు, ఏదో జరిగిందని సులభంగానే గ్రహిస్తారు. మీరు కపటం లేకుండా నిజంగా ఏడిస్తే, అలా ఏడవడం మరియు మీ భావాలను అలా కొన్నిసార్లు వ్యక్తం చేయడం సహజమేనని వాళ్ళు తెలుసుకుంటారు..

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి