జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషియని ఏ మనుష్యుడైనను నిస్సంకోచముగా పిలువబడగలడా? ఒక మనుష్యుని గొప్పతనమును మీరెట్లు కొలుతురు? అతని సైనిక మేధాసంపత్తి మీదనా? అతని శారీరక బలమును బట్టియా? అతని మానసిక ప్రజ్ఞ ప్రకారమా?
చరిత్రకారుడైన హెచ్. జి. వెల్స్ ఒకవ్యక్తియొక్క గొప్పతనమును, ‘వృద్ధియగుటకు తాను విడిచిపెట్టు దానిద్వారా, మరియు ఒకడు వెళ్లిపోయిననూ ఇంకను బలముగా కొనసాగు సరిక్రొత్త ఆలోచనాక్రమము చొప్పుననే ఇతరులుకూడా ఆలోచించునట్లు అతడు చేశాడాయను దానినిబట్టి’ కొలువవచ్చును అని చెప్పెను. వెల్స్, తాను క్రైస్తవుడనని చెప్పుకొనకపోయినను, “ఈ పరీక్షలో యేసు మొదట నిలుచును” అని ఒప్పుకొనెను.
అలెగ్జాండర్ ది గ్రేట్, షార్లిమాన్ (తన జీవితకాలములో సహితము “ది గ్రేట్” అని పిలువబడెను), నెపోలియన్ బొనెపార్ట్ శక్తివంతమైన పరిపాలకులై యుండిరి. తమ తిరుగులేని అధికారముతో, వారి ఆధీనమందున్న వారిపై వారు గొప్ప ప్రభావము చూపిరి. అయినను, నెపోలియన్ ఇలా చెప్పెనని వ్రాయబడినది: “యేసుక్రీస్తు దృశ్యముగా వారిమధ్య లేకుండానే తన ప్రజలపై ప్రభావమును చూపి, వారిని తన ఆధీనములో ఉంచుకొనెను.
తన అతిశక్తివంతమైన బోధలద్వారా, వాటి కనుగుణ్యముగా ఆయన జీవించుట ద్వారా, యేసు దాదాపు 2,000 సంవత్సరముల పాటు ప్రజల జీవితములపై గట్టి ప్రభావము చూపెను. సరియైన రీతిలో ఒక రచయిత వ్యక్తపరచినట్లుగా: “ఇంతవరకు కవాతుచేసిన సైన్యములన్నియు, నిర్మింపబడిన పెద్ద నౌకాబలములన్నియు, ఇంతవరకు సమావేశమైన పార్లమెంటులన్నియు, పరిపాలించిన రాజులందరు కలసి, ఈ భూమిమీది మనుష్యునిపై అంతటి శక్తివంతమైన ప్రభావమును చూపలేదు.”
చారిత్రాత్మకమైన వ్యక్తి
అయినను, ఆశ్చర్యకరముగా, కొందరైతే అసలు యేసు ఎన్నడును జీవించియుండలేదని,—నిజానికి ఆయన కొంతమంది మొదటి శతాబ్దపు మనుష్యులద్వారా సృష్టించబడెనని అందురు. అలా సందేహించువారికి జవాబిచ్చుచు, గౌరవనీయ చరిత్రాకారుడైన విల్ డ్యూరంట్ ఇలా వాదించెను: “ఒకే తరములోని కొద్దిమంది సామాన్యులైన మనుష్యులే ఎంతో శక్తివంతమైన మరియు ఆమోదయోగ్యమైన వ్యక్తిత్వమును, ఎంతో ఉన్నతమైన నైతిక సూత్రావళిని ఎంతో ప్రేరకమైన మానవ సహోదరత్వ దృష్టిని కనిపెట్టిరనుట, సువార్తలలో వ్రాయబడిన దేనికంటెను విశ్వసింపలేనంత అద్భుతమైయుండును.”
మీరే ఇలా ప్రశ్నించుకొనండి: ఎన్నడు జీవించని వ్యక్తి మానవచరిత్రపై ఇంత గణనీయముగా ప్రభావము చూపగలడా? ది హిస్టోరియన్స్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అను రెఫరెన్సు గ్రంథము ఇలా అభిప్రాయపడినది: “ఖచ్ఛితముగా లౌకిక దృష్టినుండి చూసినప్పటికిని, [యేసుయొక్క] కార్యక్రమముల చారిత్రాత్మకమైన ఫలితము, చరిత్రలో మరేయితర వ్యక్తి చర్యలకంటెను ఎంతో చైతన్యవంతమై యుండెను. లోకములోని ముఖ్య నాగరికతలు గుర్తించి అనుసరిస్తున్న ఒక క్రొత్త శకము, ఆయన జన్మముతోనే ప్రారంభమాయెను.”
అవును, దీనినిగూర్చి ఆలోచించుము. ఈనాటి క్యాలండర్లు సహితము యేసు జన్మించెనని తలంచుచున్న సంవత్సరము మీదనే ఆధారపడియున్నవి. “ఆ సంవత్సరమునకు ముందున్న తేదీలు క్రీ.పూ., లేక క్రీస్తు పూర్వమని, ఆ సంవత్సరము తర్వాతి తేదీలు క్రీ.శ., లేక క్రీస్తు శకము (ప్రభువునందలి సంవత్సరము)” అని పిలువబడుచున్నవని ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా వివరించుచున్నది.
అయినప్పటికిని, విమర్శకులు యేసునుగూర్చి మనకు నిజముగా తెలిసినదంతయు బైబిలునందు మాత్రమే కనుగొనగలమని సూచింతురు. ఆయననుగూర్చి తెలియజేయు ఇతర సమకాలీన వ్రాతలేవియు ఉనికిలో లేవని వారందురు. హెచ్. జి. వెల్స్ సహితము ఇట్లు వ్రాసెను: “ప్రాచీన రోము చరిత్రాకారులు యేసును పూర్తిగా వదిలివేసిరి; తన కాలమందలి చరిత్ర వ్రాతలమీద ఆయన ఎటువంటి ముద్ర వేయలేదు.” అయితే ఇది వాస్తవమైయున్నదా?
తొలి లౌకిక చరిత్రకారులు యేసుక్రీస్తునుగూర్చి చాలాతక్కువ వ్రాసినను, అటువంటి వ్రాతలు ఉనికిలో కలవు. గౌరవనీయమైన తొలి శతాబ్దపు రోమా చరిత్రకారుడైన, కొర్నేలియస్ టాసిటస్, ఇలా వ్రాసెను: “తిబెరి పరిపాలనలో రోమాసామ్రాజ్య రాజప్రతినిధియైన పొంతి పిలాతు మరణశిక్ష విధించిన క్రీస్తునుండి [క్రైస్తవుడు] అను నామము వచ్చినది.” సూటొనెయస్, ప్లిని ది యంగర్ మరియు ఆ కాలమందలి ఇతర రోమా రచయితలు కూడ క్రీస్తునుగూర్చి ప్రస్తావించిరి. దానికితోడు, మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడైన, ఫ్లేవియస్ జోసిఫస్ యాకోబునుగూర్చి వ్రాయుచూ, “క్రీస్తు అని పిలువబడిన, యేసు సహోదరునిగా” ఈయనను గుర్తించెను.
ది న్యూ ఎన్‌సైక్లొపీడియా బ్రిటానిక ఈ విధముగా ముగించెను: “ప్రాచీన కాలములలో క్రైస్తవత్వమును వ్యతిరేకించిన వారు సహితము క్రీస్తు చరిత్రను ఎన్నడు సందేహించలేదని, అది 18వ శతాబ్దపు ముగింపులో, 19వ శతాబ్దకాలములో మరియు 20వ శతాబ్దారంభములో తగినంత ఆధారము లేకుండగనే మొదటిసారి వివాదమునకు వచ్చినదని, ఈ వివిధ వృత్తాంతములు నిరూపించుచున్నవి.”
అయితే, ప్రాముఖ్యముగా యేసునుగూర్చి తెలిసిన ఆవశ్యకమైనదంతయు, ఆయన తొలి-శతాబ్దపు అనుచరులు వ్రాసిరి. వారి నివేదికలు సువార్తలలో భద్రపరచబడియున్నవి—అవే మత్తయి, మార్కు, లూకా, యోహానులు వ్రాసిన బైబిలు పుస్తకములు. యేసు గుర్తింపునుగూర్చి ఈ వృత్తాంతములు ఏమిచెప్పుచున్నవి?
నిజానికి, ఆయన ఎవరైయుండెను?
యేసుయొక్క తొలి-శతాబ్దపు సహచరులు ఆ ప్రశ్ననుగూర్చి బహుగా తలంచిరి. తుపాను చెలరేగిన సముద్రమును అద్భుతరీతిగా యేసు తన గద్దింపుతో నిమ్మళింపజేయుట వారు చూసినప్పుడు, వారు ఆశ్చర్యముతో, “ఈయన ఎవరో?” అని ఆలోచించిరి. ఆ తర్వాత, ఒక సందర్భములో, యేసు తన అపొస్తలులను ఇట్లు అడిగెను: “మీరు నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు?”—మార్కు 4:41; మత్తయి 16:15.
ఆ ప్రశ్న మిమ్ములను అడిగితే, మీరెట్లు సమాధానమిత్తురు? నిజానికి, యేసు దేవుడై యుండెనా? ఆయన దేవుడై యుండెనని ఈనాడు అనేకులు అనుచున్నారు. అయితే, ఆయన సహవాసులు ఆయన దేవుడైయుండెనని ఎన్నడును నమ్మలేదు. యేసు అడిగిన ప్రశ్నకు అపొస్తలుడైన పేతురు సమాధానమిదియే: “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు.”—మత్తయి 16:16.
యేసు ఎన్నడును తాను దేవుడనని చెప్పుకొనలేదు, బదులుగా తాను వాగ్దానము చేయబడిన మెస్సీయ అని, లేక క్రీస్తునని అంగీకరించెను. ఆయన తాను దేవుడని కాదుగాని, “దేవుని కుమారుడనని” కూడ చెప్పెను. (యోహాను 4:25, 26; 10:36) అయినను, బైబిలు యేసుకూడ ఇతర మనుష్యులవలెనే యుండెనని చెప్పుటలేదు. ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తియైయుండెను, ఎందుకనగా దేవుడు ఆయనను ఇతరమైన వాటన్నింటికంటే ముందుగా సృష్టించెను. (కొలొస్సయులు 1:15) మన భౌతిక విశ్వము సహితము సృష్టింపబడక ముందు, లెక్కింపజాలని కోటానుకోట్ల సంవత్సరముల పూర్వమే యేసు పరలోకములో ఆత్మీయ వ్యక్తిగా జీవించుచు, తన తండ్రియు, దివ్య సృష్టికర్తయైన యెహోవా దేవునితో సన్నిహిత సహచర్యమును అనుభవించెను.—సామెతలు 8:22, 27-31.
ఆ పిమ్మట, దాదాపు రెండువేల సంవత్సరముల పూర్వము, దేవుడు తన కుమారుని ప్రాణమును ఒక స్త్రీ గర్భమునకు మార్చెను, అలా సాధారణ రీతిలో స్త్రీద్వారా జన్మించినవాడైన యేసు, దేవుని మానవ కుమారుడయ్యెను. (గలతీయులు 4:4) యేసు, గర్భమందు పెరుగుచున్నప్పుడును, బాలునిగా ఆయన ఎదుగుచున్నప్పుడును, ఆయన తనకు భూసంబంధమైన తలిదండ్రులుగా దేవుడు ఎవరిని ఎంపికచేసికొనెనో వారిపై ఆధారపడియుండెను. చివరకు యేసు పెరిగిపెద్దవాడైనప్పుడు, పరలోకములో పూర్వము తాను దేవునితో కలిగియున్న సహచర్యమును పూర్తిగా గుర్తుతెచ్చుకొనునట్లు అనుగ్రహింపబడెను.—యోహాను 8:23; 17:5.
ఆయనను మహామనిషిగా చేసినదేమిటి
ఆయన బహుజాగ్రత్తగా తన పరలోకపుతండ్రిని అనుకరించినందున, యేసు జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప వ్యక్తియాయెను. నమ్మకమైన కుమారునిగా, యేసు తన తండ్రినిపోలి ఎంత ఖచ్ఛితముగా నడుచుకొనెనంటే, ఆయన తన అనుచరులతో ఇట్లు చెప్పగలిగెను: “నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు.” (యోహాను 14:9, 10) ఈ భూమిపై ప్రతి పరిస్థితియందు, సర్వశక్తిగల దేవుడగు, తన తండ్రి ఎట్లు చేసెనో ఆయన అట్లే చేసెను. “నా అంతట నేనే యేమియుచేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నానని,” యేసు వివరించెను. (యోహాను 8:28) కాబట్టి మనము యేసుక్రీస్తు జీవితమునుగూర్చి చదువునప్పుడు, దేవుడు ఎలావున్నాడో స్పష్టముగా అర్థముచేసికొన గలుగుచున్నాము.
ఆ విధముగా, “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు” అని అపొస్తలుడైన యోహాను అంగీకరించినను, ఆయన ఇంకను “దేవుడు ప్రేమాస్వరూపి” అని వ్రాయగలిగెను. (యోహాను 1:18; 1 యోహాను 4:8) యోహాను ఇట్లు ఎందుకు వ్రాయగలిగెనంటే, తండ్రికి సంపూర్ణ ప్రతిబింబమైయుండిన, యేసునందు తాను చూసిన ప్రేమద్వారా ఆయన దేవుని ప్రేమను ఎరిగియుండెను. యేసు కనికరము, దయ, వినయముగలిగి సమీపించగలవాడై యుండెను. అన్ని రకముల ప్రజలు అనగా స్త్రీలు, పురుషులు, పిల్లలు, ధనికులు, దరిద్రులు, అధికారులు, చివరకు ఘోరపాపులు—బలహీనులు మరియు అణగద్రొక్కబడిన వారు ఆయనయొద్ద ఓదార్పునొందిరి. కేవలము దుష్టహృదయము గలవారు మాత్రమే ఆయనను ఇష్టపడలేదు.
నిజముగా, యేసు తన అనుచరులకు కేవలము ఒకరినొకరు ప్రేమించవలెనని మాత్రమే బోధించలేదు, కానీ దానిని తానుగాచేసి ఆయన వారికి చూపించెను. “నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును [తప్పనిసరిగా] ఒకరినొకరు ప్రేమింపవలెను” అని ఆయన చెప్పెను. (యోహాను 13:34) “క్రీస్తు ప్రేమను” తెలిసికొనుట, “సమస్త జ్ఞానమును మించినదైయుండును” అని ఆయన అపొస్తలులలో ఒకరు వివరించిరి. (ఎఫెసీయులు 3:19) అవును, క్రీస్తు ప్రదర్శించిన ప్రేమ, విద్యాజ్ఞానమును మించినదై, దానికి స్పందించాలని ఇతరులను “ఉపదేశిస్తున్నది.” (2 కొరింథీయులు 5:14) ఆ విధముగా, ప్రేమ విషయములో యేసుయొక్క సర్వాతిశయమైన మాదిరియే ప్రత్యేకముగా, ఆయనను జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషిని చేసినది. ఆయన ప్రేమ శతాబ్దములుగా లక్షలాది ప్రజల హృదయములను స్పర్శించి, వారి మేలుకొరకు వారి జీవితములపై ప్రభావము చూపినది.
అయితే, కొందరు ఇలా అభ్యంతరము చెప్పవచ్చును: ‘క్రీస్తు పేరిట జరిగింపబడిన నేరములన్నింటిని, అనగా మతయుద్ధములు, అక్రమ మతవిచారణ, మరియు క్రైస్తవులమని చెప్పుకొనెడివారే యుద్ధరంగమందు లక్షలసంఖ్యలో ఒకరినొకరు చంపుకొనిన వాటిని గమనించండి.’ అయితే నిజమేమంటే, ఈ ప్రజలు తాము యేసు అనుచరులమను మాటను అబద్ధము చేయుచున్నారు. ఆయన బోధలు, ఆయన జీవిత విధానము వారి చర్యలను ఖండించుచున్నవి. హిందూ మతస్థుడైన, మోహన్‌దాస్ గాంధి సహితము, ఇట్లు చెప్పుటకు మనస్కరించాడు: ‘నేను క్రీస్తును ప్రేమిస్తాను, అయితే క్రైస్తవులను ఈసడించుకుంటాను ఎందుకంటే వారు క్రీస్తు జీవించినట్లుగా జీవించరు.’
ఆయననుగూర్చి నేర్చుకొనుటద్వారా కలుగు ప్రయోజనము
నిశ్చయముగా యేసుక్రీస్తుయొక్క జీవితము మరియు పరిచర్యను గూర్చిన పఠనముకంటే ఈనాడు ఎక్కువ ప్రాముఖ్యమైనది ఏదియులేదు. “యేసువైపు చూడుడి,” అని అపొస్తలుడైన పౌలు ఉద్బోధించెను. మరియు దేవుడు స్వయంగా తన కుమారునిగూర్చి ఇట్లు ఆజ్ఞాపించెను: “ఈయన మాట వినుడి.” జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అను ఈ పుస్తకము మీరలా చేయుటకే మీకు సహాయము చేయును.—హెబ్రీయులు 12:2, 3; మత్తయి 17:5.
ఆయనచేసిన ప్రసంగములు, చెప్పిన దృష్టాంతములు, చేసిన అద్భుతములతో సహా నాలుగు సువార్తలలో వ్రాయబడిన యేసు భూజీవితములోని ప్రతి సంఘటనను వివరించే ప్రయత్నము జరిగినది. సాధ్యమైనంత మేరకు, ప్రతి సంఘటన అది జరిగిన క్రమముచొప్పున వివరింపబడినది. ఆయా అధ్యాయములపై ఆధారపడియున్న బైబిలు వచనములు ప్రతి అధ్యాయము చివర ఇవ్వబడినవి. మీరు ఈ లేఖనములను చదివి పునఃసమీక్ష కొరకు ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానమివ్వవలెనని ప్రోత్సహింపబడుచున్నారు.
చికాగో విశ్వవిద్యాలయములోని ఒక విద్వాంసుడు ఇటీవల ఇలాచెప్పెను: “గత రెండువేల సంవత్సరములకంటే ఇటీవలి ఇరవై సంవత్సరములలోనే యేసునుగూర్చి ఎక్కువగా వ్రాయబడినది.” అయినను సువార్త వృత్తాంతములను స్వయంగా పరిశీలించవలసిన అగత్యత కలదు, ఏలయనగా ది ఎన్‌సైక్లొపీడియా బ్రిటానికి ఇట్లనినది: “ఆధునిక విద్యార్థి యేసునుగూర్చి, సువార్తలనుగూర్చి పరస్పర విరుద్ధముగల సిద్ధాంతములతో ఎంతగా ఆక్రమింపబడియున్నాడంటే, ఈ మూల విషయములను పఠించుటకు అతడు నిర్లక్ష్యము చేస్తున్నాడు.”
దురభిమానము లేకుండ, సువార్త వృత్తాంతములను సమగ్రముగా విచారించిన మీదట, రోమీయుడైన కైసరు ఔగుస్తు పరిపాలనలో, మన కొరకు తన ప్రాణము నర్పించుటకు నజరేయుడగు యేసు అవతరించినప్పుడు, మానవచరిత్ర అంతటిలోకెల్లా మహాగొప్ప సంఘటనలు జరిగెనని మీరంగీకరింతురని మేము భావిస్తున్నాము.