ధరలు పెరిగిపోతుంటే బ్రతికేదెలా?
ఆశతో ఉండండి
మీ ప్రాంతంలో రేట్లు ఎడాపెడా పెరిగిపోతున్నాయా? చాలీచాలని జీతంతో మీరు, మీ కుటుంబం అవస్థలు పడుతున్నారా? ఇప్పుడే ఇలా ఉంటే, రేపు అన్న రోజు ఇంకెలా ఉంటుందో అనే భయం మీకు రావచ్చు. ఇలాంటి పరిస్థితులున్నా మీరైతే ఆశను వదులుకోకండి.
ఎందుకు ఆశతో ఉండాలి?
ఆశతో జీవించేవాళ్లు కేవలం మంచిరోజులు వస్తాయని ఎదురుచూస్తూ కూర్చోరు. బదులుగా, కష్టపడి పనిచేస్తారు అలాగే వాళ్ల పరిస్థితిని బాగుచేసుకోవడానికి చేయగలిగినదంతా చేస్తారు. ఒక అధ్యయనం ప్రకారం ఆశతో జీవించేవాళ్లు ఎంత పెద్ద కష్టం వచ్చినా . . .
బెదిరిపోకుండా ముందడుగు వేస్తారు
పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేసుకుంటారు
తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల వాళ్ల జీవితం, ఆరోగ్యం బాగుంటాయి
మీరేం చేయవచ్చు?
ఈరోజుల్లో బైబిలు మీకు ఎలా సహాయం చేయగలదో తెలుసుకోండి. పెరిగిపోతున్న ధరలతో నెట్టుకురావడానికి మీకు ఉపయోగపడే ఎన్నో సలహాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని పాటిస్తే మీకే మంచి జరుగుతుంది. అప్పుడు మీ జీవితం తెగిన గాలిపటంలా ఉండదు; దాని దారం మీ చేతిలో ఉంటుంది కాబట్టి, దాన్ని మీరు ఎటంటే అటు తిప్పుకోగలుగుతారు. అలాగే భవిష్యత్తులో వచ్చే సవాళ్లతో ధైర్యంగా సవారీ చేయగలుగుతారు.
భవిష్యత్తు గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి. బైబిలు ఇచ్చే సలహాలు ఎంత బాగా పనికొస్తాయో అర్థం చేసుకున్నప్పుడు, భవిష్యత్తు గురించి అది చెప్పే విషయాలు కూడా తెలుసుకోవాలి అనుకుంటారు. ఉదాహరణకు, బైబిల్లో దేవుడు “మీకు మంచి భవిష్యత్తు, నిరీక్షణ ఉండేలా” చేస్తానని మాటిస్తున్నాడు. అలా మాటివ్వడమే కాదు, దాన్ని నమ్మడానికి బలమైన కారణం కూడా ఇస్తున్నాడు. (యిర్మీయా 29:11) అదే దేవుని రాజ్యం.
దేవుని రాజ్యం అంటే ఏంటి? అదేం చేస్తుంది?
దేవుని రాజ్యం ఒక ప్రభుత్వం. అది పరలోకం నుండి భూమంతటినీ పరిపాలిస్తుంది. (దానియేలు 2:44; మత్తయి 6:10) అప్పుడు కష్టాలు, కన్నీళ్లు ఉండవు, ఎవ్వరూ పేదరికంలో మగ్గిపోరు, అందరికీ అన్నీ కావాల్సినంత దొరుకుతాయి, ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటారు. అప్పుడు పరిస్థితి ఎంత బాగుంటుందో ఈ కింది మాటలు చదివితే తెలుస్తుంది.
ఎన్నో లక్షలమంది దేవుడు చెప్తున్న మాటలు నిజమౌతాయని నమ్ముతున్నారు. ఎందుకంటే దేవుడు ‘అబద్ధమాడలేడు’ అని వాళ్లకు తెలుసు. (తీతు 1:2) బైబిల్లో దేవుడు చెప్తున్న విషయాల గురించి మీరు కూడా తెలుసుకోవచ్చు కదా. అలా తెలుసుకుంటే, డబ్బు సమస్యలు ఉన్నా జీవితాన్ని ధైర్యంగా నెట్టుకురాగలుగుతారు, మంచి భవిష్యత్తు వస్తుందనే ఆశతో జీవించగలుగుతారు.