4. బాధలు పడడానికే దేవుడు మనల్ని సృష్టించాడా?
దానికి జవాబు ఎందుకు తెలుసుకోవాలి?
దానికి జవాబు తెలుసుకుంటే జీవితం మీద మనకున్న అభిప్రాయం మారుతుంది.
ఒకసారి ఆలోచించండి
ప్రపంచాన్ని ఇంత అందంగా సృష్టించిన దేవుడు, బాధలు పడడానికే మనల్ని సృష్టించాడనుకోవడం న్యాయమేనా?
మతమంటే ఆసక్తి లేనివాళ్లు ఈ బాధల్ని కారణంగా తీసుకుని దేవుని ఉద్దేశాల్ని, ఆఖరికి ఆయన ఉనికిని ప్రశ్నిస్తారు. వీటిలో ఏదోక కారణం వల్ల బాధలు వస్తున్నాయని వాళ్లు చెప్తారు: (1) బాధల్ని ఆపే శక్తి దేవునికి లేదు, (2) అలా ఆపాలనే కోరిక ఆయనకు లేదు, (3) అసలు దేవుడే లేడు.
బాధలకు కారణాలు నిజంగా అవేనా?
ఎక్కువ తెలుసుకోండి
jw.org వెబ్‌సైట్‌లో బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎందుకు నమ్మవచ్చు? అనే వీడియో చూడండి.
బైబిలు ఏం చెప్తుందంటే . . .
బాధలు పడడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు.
మనం జీవితాన్ని ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు.
“సంతోషంగా ఉండడం, తమ జీవితకాలంలో మంచి చేయడం కన్నా మనుషులకు మేలైనది ఏదీ లేదు, అంతేకాదు, ప్రతీ వ్యక్తి తింటూ తాగుతూ తన కష్టమంతటిని బట్టి సుఖపడాలి. ఇది దేవుడు ఇచ్చిన బహుమతి.”—ప్రసంగి 3:12, 13.
బాధలు లేకుండా జీవించడానికి కావాల్సిన ప్రతీదాన్ని దేవుడు మొదటి మానవ జంటకు ఇచ్చాడు.
వాళ్లు లేదా వాళ్ల పిల్లలు బాధలు పడాలన్నది ఆయన ఉద్దేశం కానేకాదు.
దేవుడు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి, దాన్ని లోబర్చుకోండి.”—ఆదికాండం 1:28.
మొదటి మానవ జంట దేవుని మాట వినకూడదని నిర్ణయించుకున్నారు.
అలా వాళ్లు తమకు, తమ పిల్లలందరికీ ఎన్నో బాధలు తెచ్చారు.
“ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదేవిధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.”—రోమీయులు 5:12.a
తన నిర్దేశం లేకుండా సొంతగా జీవించే సామర్థ్యంతో దేవుడు మనల్ని సృష్టించలేదు.
మనం నీళ్ల కింద జీవించడం ఎంత అసాధ్యమో, మనల్ని మనం పరిపాలించుకోవడం కూడా అంతే అసాధ్యం.
“తన అడుగును నిర్దేశించుకునే అధికారం కూడా అతనికి [మనిషికి] లేదు.”—యిర్మీయా 10:23.
మనం బాధలు పడాలన్నది దేవుని కోరిక కాదు.
మనం సాధ్యమైనంత వరకు సమస్యలు లేకుండా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు.
“నువ్వు నా ఆజ్ఞల్ని శ్రద్ధగా వింటే ఎంత బావుంటుంది! అప్పుడు నీ శాంతి నదిలా, నీ నీతి సముద్ర తరంగాల్లా ఉంటుంది.”—యెషయా 48:18.
a బైబిల్లో “పాపం” అనే పదం చెడు పనుల్ని మాత్రమే కాదుగానీ మనుషులందరికీ వారసత్వంగా వచ్చిన ఒక స్థితిని కూడా సూచిస్తుంది.