ప్రపంచ విశేషాలు | మధ్య ప్రాచ్య దేశాలు
మధ్య ప్రాచ్య దేశాల విశేషాలు
మధ్య ప్రాచ్య దేశాలు అతి పురాతన నాగరికతలకు పుట్టిల్లు. ఒకప్పటి ప్రజలకు సంబంధించిన ఎన్నో పురాతత్వ ఆధారాలు ఇక్కడ దొరుకుతున్నాయి.
కనానీయుల ద్రాక్షారసం తయారీ
పురావస్తు శాస్త్రజ్ఞులు 2013లో ఇజ్రాయిల్ ప్రాంతంలో ద్రాక్షారసాన్ని నిల్వ చేసే ఒక పెద్ద గదిని కనుగొన్నారు. అది దాదాపు 3,700 సంవత్సరాలు క్రితం నాటి కనానీయులదని తెలిసింది. ఆ గదిలో 40 పెద్దపెద్ద కూజాలు దొరికాయి. ఆ కూజాల్లో మొత్తం 3000 వైన్ బాటిళ్ల ద్రాక్షారసం పడుతుంది. ఆ కూజాల్లో దొరికిన పదార్థాన్ని పరిశీలించిన ఒక శాస్త్రజ్ఞుడు, ద్రాక్షారసం తయారీలో కనానీయులు చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్లని చెప్పాడు. అన్ని కూజాల్లోనూ ద్రాక్షారసం తయారీకి ఒకే పద్ధతిని ఉపయోగించారని కూడా చెప్పాడు.
మీకు తెలుసా? పురాతన ఇజ్రాయిల్‌లో ‘శ్రేష్ఠమైన ద్రాక్షారసము’ తయారు చేసేవాళ్లని, వాటిని పెద్ద కూజాల్లో నిల్వ చేసేవాళ్లని బైబిల్లో ఉంది.—పరమగీతము 7:9; యిర్మీయా 13:12.
పెరుగుతున్న జనాభా
ఈజిప్టులో 2010తో పోలిస్తే 2012లో 5,60,000 మంది పిల్లలు ఎక్కువగా పుట్టారని గార్డియన్ వార్తాపత్రిక నివేదిక చెప్పింది. “ఈజిప్టు చరిత్రలో ఇంత ఎక్కువ సంఖ్యలో పిల్లలు పుట్టడం ఇదే మొదటిసారి” అని ఈజిప్ట్‌కు చెందిన బసీరా అనే ప్రజాభిప్రాయాలను పరిశీలించే సంస్థలో పనిచేసే మ్యాగెడ్ ఒస్మాన్ చెప్పాడు. జనాభా ఇలానే పెరిగితే ముందుముందు ఈజిప్టులో నీళ్లు, ఆహారం, ఇతర కనీస అవసరాల కొరత వస్తుందని నిపుణులు చెప్తున్నారు.
మీకు తెలుసా? సరిపడినంత జనాభాతో ఈ భూమిని నింపి, వాళ్లందరికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చి, వాళ్లు భూమ్మీద సంతృప్తిగా జీవించేలా చేయాలనేది దేవుని ఉద్దేశమని బైబిల్లో ఉంది.—ఆదికాండము 1:28; కీర్తన 72:16.
దాచిన నాణాలు కనిపెట్టారు
ఇజ్రాయిల్‌లో ఒక హైవే దగ్గర, “నాలుగవ సంవత్సరం” అని చెక్కి ఉన్న 100 కంటే ఎక్కువ కంచు నాణాలు కనుగొన్నారు. అవి యూదులు రోమీయులపై తిరుగుబాటు చేసిన నాలుగవ సంవత్సరం (క్రీ.శ. 69- క్రీ.శ.70) నాటివి. ఆ తిరుగుబాటు వల్ల యెరూషలేము రోమీయుల చేతిలో నాశనమైంది. “రోమా సైన్యం వస్తుండగా చూసి, యెరూషలేము నాశనం దగ్గరపడిందని భయపడిన వాళ్లెవరో తర్వాత తీసుకోవడానికి వీలుగా వాటిని ఇక్కడ దాచి ఉంటారు” అని పురాతత్వ అధికారి పాబ్లో బెట్సెర్ అంటున్నాడు.
మీకు తెలుసా? యెరూషలేమును రోమీయులు ముట్టడిస్తారని క్రీ.శ. 33లో యేసు ముందే చెప్పాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి కొండ ప్రాంతాలకు పారిపొమ్మని క్రైస్తవులకు ఆయన చెప్పాడు.—లూకా 21:20-24. (g15-E 09)