మీరు మరో భాషను నేర్చుకోగలరు!
“దానంత చక్కని అనుభూతి మరొకటి లేదు” అని మైక్ అంటున్నాడు. ఫెల్ప్స్ కూడా ఇలా అంటున్నాడు, “అది నా జీవితంలో నేను తీసుకున్న ఒక చక్కని నిర్ణయం.” వారిద్దరూ వేరే భాషను నేర్చుకోవడమనే సవాలును స్వీకరించడం గురించే మాట్లాడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా, అనేకమంది వివిధ కారణాలనుబట్టి క్రొత్త భాషలను నేర్చుకుంటున్నారు, కొందరు వ్యక్తిగత కారణాలనుబట్టి, ఇంకొందరు ఆర్థిక కారణాలనుబట్టి, మరికొందరు మతసంబంధ కారణాలనుబట్టి క్రొత్త భాషలను నేర్చుకుంటున్నారు. తేజరిల్లు! విదేశీ భాషను నేర్చుకుంటున్న అనేకమందిని ఇంటర్వ్యూ చేసింది. వారిని అడిగిన ప్రశ్నల్లో ఇవి కొన్ని, వయోజనులుగా ఒక క్రొత్త భాష నేర్చుకోవడం మీకెలా అనిపిస్తుంది, క్రొత్త భాష నేర్చుకోవడానికి ఒక వ్యక్తికి ఏమి సహాయం చేయగలదు? ఈ క్రింది సమాచారం వారి వ్యాఖ్యానాలమీద ఆధారపడివుంది. ప్రత్యేకంగా మీరు క్రొత్త భాష నేర్చుకుంటున్నట్లయితే లేక నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే ఈ అంశాలు ప్రోత్సాహకరంగానే కాక, అవగాహనతో కూడుకున్నవిగా కూడావున్నట్లు మీకు అనిపించవచ్చు. ఉదాహరణకు, మరో భాషమీద పట్టుసాధించడానికి ఆవశ్యకమని ఇంటర్వ్యూ చేయబడినవారు భావించిన కొన్ని ప్రాముఖ్య గుణాలను పరిశీలించండి.
ఓర్పు, వినయం, పరిస్థితికి తగినట్లు మలచుకోవడం
చిన్నపిల్లలు తరచూ వినడం ద్వారానే రెండు లేక అంతకన్నా ఎక్కువ భాషలను ఏకకాలంలో సునాయాసంగా నేర్చుకోగలుగుతారు, క్రొత్త భాష నేర్చుకోవడం సాధారణంగా వయోజనులకు ఎంతో కష్టమనిపిస్తుంది. దానికిగల ఒక కారణం, క్రొత్త భాష నేర్చుకోవడానికి చాలాకాలం పడుతుంది కాబట్టి వారు ఓర్పు కనబరచాలి. వారికి తీరిక ఉండదు కాబట్టి వారు తరచూ ఇతర పనులను వాయిదావేయాల్సిరావచ్చు.
“వినయం ఎంతో అవసరం, మీకు ఏదైనా ఒక భాష పరిచయంలేనప్పుడు మీరు పిల్లల్లాగే మాట్లాడడానికి, కొన్ని విధాలుగా పిల్లల్లాగే వ్యవహరించబడడానికి సిద్ధంగా ఉండాలి” అని జార్జ్ అంటున్నాడు. హవ్ టు లెర్న్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “మీరు నిజంగా ప్రగతి సాధించాలనుకుంటే కొంతవరకు అహాన్ని తగ్గించుకోవాలి, మీ గౌరవానికి భంగం వాటిల్లుతుందని బాధపడకూడదు.” ఎక్కడ తప్పులు చేస్తామో అని భయపడొద్దు. “మీరు ఎన్నడూ తప్పులు చేయకపోతే, మీరు క్రొత్త భాషలో అంతగా మాట్లాడడంలేదని దాని భావం” అని బెన్ అంటున్నాడు.
ఇతరులు మీ తప్పులకు నవ్వితే కలవరపడొద్దు, బదులుగా, వారితో కలిసి నవ్వండి! వాస్తవానికి, మీరు మాట్లాడిన విషయాల గురించిన మనోరంజకమైన కథలు పంచుకునే అవకాశం మీకు ఒక రోజు రావచ్చు. ప్రశ్నలు అడగడానికి భయపడొద్దు. ఒక విషయం ఫలానా రీతిలో ఎందుకు చెప్పాలో అర్థం చేసుకుంటే దానిని గుర్తుపెట్టుకోగలుగుతారు.
సాధారణంగా, ఒక క్రొత్త భాషను నేర్చుకోవాలంటే ఒక క్రొత్త సంస్కృతిని నేర్చుకోవాల్సివస్తుంది కాబట్టి, మనం పరిస్థితికి తగ్గట్టు మారడానికి, విశాల హృదయంతో ఉండడానికి అది సహాయం చేస్తుంది. జూలీ ఇలా చెబుతోంది: “మరో భాషను నేర్చుకున్న తర్వాత విషయాలను అనేక దృక్కోణాల్లో చూడవచ్చని, పనులను అనేక విధాలుగా చేయవచ్చని గుర్తించగలిగాను, ఒక దృక్కోణం లేక ఒక విధానం ఇతర దృక్కోణాలు లేక విధానాల కన్నా గొప్పేమీ కాదు, కేవలం అవి భిన్నమైనవి.” జే ఇలా సిఫారసు చేస్తున్నాడు, “ఆ భాష మాట్లాడుతున్నవారిని స్నేహితులుగా చేసుకోండి, వారి సహవాసాన్ని ఆస్వాదించండి.” అలాంటి స్నేహితులు మర్యాదగా మాట్లాడే మంచి సహచరులో కాదో క్రైస్తవులు నిర్ధారించుకుంటారు. (1 కొరింథీయులు 15:33; ఎఫెసీయులు 5:3, 4) జే ఇంకా ఇలా చెబుతున్నాడు, “వారిపట్ల, వారి ఆహారం, వారి సంగీతం మొదలైనవాటిపట్ల మీకు ఆసక్తి ఉందని వారు గమనిస్తే సహజంగానే వారు మీవైపు ఆకర్షితులౌతారు.”
మీరు క్రొత్త భాషను నేర్చుకోవడానికి, అంతకన్నా ప్రాముఖ్యంగా దానిని మాట్లాడడానికి ఎంత ఎక్కువ సమయం వెచ్చిస్తారో అంత వేగంగా ప్రగతి సాధిస్తారు. “కోడి ఎలాగైతే ఒక్కొక్క గింజను ఏరుకొని తింటుందో అలాగే మనం కొద్దికొద్దిగా భాషా నైపుణ్యాలను సంపాదిస్తాం. మనం చాలా కొద్దిగా నేర్చుకుంటుండవచ్చు, అయితే అవే మన నైపుణ్యాలను పెంచుతాయి” అని జార్జ్ చెబుతున్నాడు. మిషనరీగా అనేక భాషలు నేర్చుకున్న బిల్ ఇలా అంటున్నాడు, “నేను వెళ్లిన ప్రతీ చోటుకు నాతోపాటు పదాల పట్టికలను తీసుకెళ్లేవాణ్ణి, కొద్ది నిమిషాల సమయం దొరికితే వాటిని చదివేవాణ్ణి.” భాష నేర్చుకోవడానికి అడపాదడపా అధిక సమయం వెచ్చించడం కన్నా క్రమంగా కొంతసేపు వెచ్చించడం ఎంతో మేలని చాలామంది గ్రహించారు.
ఒక క్రొత్త భాషను నేర్చుకునేందుకు ప్రజలకు సహాయం చేయడానికి పుస్తకాలు, రికార్డింగ్‌లు, ఫ్లాష్ కార్డ్‌లు మొదలైన అనేక సహాయకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సహాయకాలు అందుబాటులో ఉన్నా, క్రొత్త భాషను క్రమబద్ధమైన తరగతి వాతావరణంలోనే చక్కగా నేర్చుకోవచ్చని చాలామంది గ్రహిస్తారు. మీకు సరిపోయే ఏ పద్ధతినైనా ఉపయోగించండి. అయితే వ్యక్తిగత కృషి, పట్టుదల లేకుండా క్రొత్త భాషను నేర్చుకోవడం సాధ్యంకాదని గుర్తుంచుకోండి. క్రొత్త భాషను సులభంగా, మరింత ఉల్లాసవంతంగా నేర్చుకోవడానికి మార్గాలైతే ఉన్నాయి. ఆ భాషతో, సంస్కృతితో మీకున్న పరిచయాన్ని పెంచుకోవడం వాటిలో ఒకటి.
“క్రొత్త భాషకు సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలమీద పట్టుసాధించి, భాష నేర్చుకోవడం ప్రారంభించిన వ్యక్తికి ఉండాల్సిన కొంత పదసంపదైనా సంపాదించుకున్న తర్వాత, ఆ భాష మాట్లాడే దేశంలో నివసించడం మంచిది” అని జార్జ్ అన్నాడు. బార్బ్ దానితో అంగీకరిస్తున్నాడు, “ఆ దేశాన్ని సందర్శించడంవల్ల ఆ భాష మాధుర్యాన్ని మీరు గ్రహించగలుగుతారు.” అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, ఆ వాతావరణంలో ఇమిడిపోవడం క్రొత్త భాషలో ఆలోచించడానికి దోహదపడుతుంది. నిజమే, వేరే దేశానికి వెళ్లే స్తోమత చాలామందికి ఉండకపోవచ్చు. అయితే ఆ భాషలో, సంస్కృతిలో మరింత ఇమిడివుండేందుకు స్థానికంగా అవకాశాలు ఉండొచ్చు. ఉదాహరణకు, మీరు నేర్చుకుంటున్న భాషలో నైతికంగా ఆమోదకరమైన, మంచి ప్రచురణలు లేక రేడియో, టీవీ కార్యక్రమాల కోసం వెదకండి. ఆ భాష చక్కగా మాట్లాడేవారిని వెదికి వారితో మాట్లాడండి. “ఏదేమైనా, ప్రగతి సాధించడానికి అభ్యసించడంకన్నా ప్రాముఖ్యమైన సూత్రం మరొకటి లేదు” అని హవ్ టు లెర్న్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ అనే పుస్తకం చెబుతోంది.a
అంతగా ప్రగతిలేని దశ
మీరు క్రొత్త భాష నేర్చుకుంటున్నప్పుడు అంతగా ప్రగతి సాధించడంలేదని, ఒకే స్థాయిలో ఎలాంటి ప్రగతీ సాధించకుండా సంఘర్షిస్తున్నట్లు మీకు కొన్నిసార్లు అనిపించవచ్చు. అలాంటప్పుడు మీరేమి చేయవచ్చు? మొదటిగా, ఆరంభంలో మీరు ఏ కారణాలనుబట్టి ఆ భాష నేర్చుకోవాలనుకున్నారో ఆలోచించండి. ఇతరులు బైబిలు నేర్చుకునేందుకు సహాయం చేయడానికి చాలామంది యెహోవాసాక్షులు ఒక క్రొత్త భాష నేర్చుకున్నారు. ఆరంభంలో మీకున్న లక్ష్యాలు, ఉద్దేశాల గురించి ఆలోచిస్తే భాష నేర్చుకోవాలనే మీ పట్టుదల బలపడుతుంది.
రెండవదిగా, సముచితమైన లక్ష్యాలను పెట్టుకోండి. “స్థానిక వ్యక్తి మాట్లాడినట్లు మీరు ఎన్నడూ మాట్లాడలేకపోవచ్చు. అలాంటి లక్ష్యాలను పెట్టుకోకండి. ఇతరులు మీరు చెప్పే విషయాలను అర్థం చేసుకోగలిగితే చాలు” అని హవ్ టు లెర్న్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ అనే పుస్తకం పేర్కొంటోంది. కాబట్టి, మీరు మీ మాతృభాషలో మాట్లాడగలిగినట్లు అనర్గళంగా మాట్లాడలేకపోతున్నామని బాధపడే బదులు మీరు ఇప్పటికే నేర్చుకున్న పదాలను ఉపయోగించి స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నించండి.
మూడవదిగా, మీ ప్రగతిని కొలిచేందుకు మీరు చేరుకున్న మైలురాళ్ల కోసం చూడండి. భాష నేర్చుకోవడం గడ్డి పెరగడాన్ని చూడడం లాంటిది, అది ఎదుగుతుండడాన్ని మీరు చూడలేరు, అయితే రోజులు గడిచేకొద్దీ అది ఏపుగా పెరుగుతుంది. అలాగే మీరు మొదట్లో ఆరంభించినప్పటి నుండి సాధించిన ప్రగతి గురించి ఆలోచిస్తే మీరు సాధించిన ప్రగతి మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇతరులతో పోల్చుకొని మీ ప్రగతిని అంచనా వేసుకోకండి. అనుసరించాల్సిన మంచి సూత్రం బైబిల్లోని గలతీయులు 6:4 లో ఉంది. అదిలా చెబుతోంది: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.”
నాల్గవదిగా, మీరు క్రొత్త భాష నేర్చుకోవడాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా దృష్టించండి. ఈ విషయాన్ని ఆలోచించండి, మూడు నాలుగు ఏళ్ల బాలుడు ఎంత సమర్థంగా మాట్లాడగలడు? ఆ బాలుడు సంక్లిష్టమైన పదాలను, వ్యాకరణాన్ని ఉపయోగిస్తాడా? ఉపయోగించడు కదా! అయినా, ఆ పిల్లవాడు మామూలుగా సంభాషించగలడు. నిజానికి, భాష నేర్చుకోవడానికి ఒక బాలునికి కూడా ఎన్నో ఏళ్లు పడుతుంది.
ఐదవదిగా, క్రొత్త భాషలో సాధ్యమైనంత ఎక్కువగా మాట్లాడండి. “నేను క్రమంగా ఆ భాషలో మాట్లాడనప్పుడు దానిలో అంతగా ప్రగతి సాధించనట్లు నాకు అనిపించింది” అని బెన్ అంటున్నాడు. కాబట్టి ఆ భాషలో మాట్లాడండి. ఆ భాషలో మాట్లాడుతూనే ఉండండి! బాలునికి ఉన్నంత పదసంపదే మీకూ ఉన్నట్లయితే ఆ భాషలో మాట్లాడడానికి ప్రయత్నించడం సహజంగానే మీకు విసుగుపుట్టవచ్చు. “నేను చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం, చెప్పాలనుకున్నప్పుడు చెప్పలేకపోవడం నాకెంతో కష్టంగా అనిపిస్తుంది” అని మిలావీ వాపోతుంది. అయితే అలాంటి విసుగే పట్టుదల కనబరచేందుకు మిమ్మల్ని ప్రోత్సహించగలదు. “కథలను, హాస్యోక్తులను అర్థం చేసుకోలేని స్థితిలో ఉండడం నాకస్సలు ఇష్టంలేదు, ఆ స్థితి నుండి బయటపడడానికి మరింత కష్టపడేందుకు అలాంటి భావాలు నన్ను ప్రోత్సహించాయని నేను అనుకుంటున్నాను” అని మైక్ గుర్తుచేసుకుంటున్నాడు.
ఇతరులు సహాయం చేయగల విధం
ఆ భాషలో ఇప్పటికే మాట్లాడుతున్నవారు దానిని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి సహాయం చేయడానికి ఏమి చేయవచ్చు? మునుపు ప్రస్తావించబడిన బిల్ ఇలా సలహా ఇస్తున్నాడు, “నెమ్మదిగానే అయినా సరిగ్గా మాట్లాడండి, మరీ చిన్నపిల్లలతో మాట్లాడినట్లు మాట్లాడకండి.” జూలీ ఇలా అంటోంది, “ఓర్పు వహించండి, భాష నేర్చుకుంటున్న వ్యక్తి తన మాటలను పూర్తిచేయనివ్వండి.” టోనీ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “సాధారణంగా రెండు భాషలూ మాట్లాడగల ప్రజలు నాతో నా మాతృభాషలోనే మాట్లాడేవారు. అయితే క్రొత్త భాషలో నేను సాధిస్తున్న ప్రగతిని అది కుంటుపరచింది.” అందుకే, క్రొత్త భాష నేర్చుకుంటున్నవారు కొన్ని సమయాల్లో తమతో క్రొత్త భాషలోనే మాట్లాడి, తాము మెరుగుపరచుకోవాల్సిన నిర్దిష్ట అంశాలను పేర్కొనమని తమ స్నేహితులను కోరారు. తమ ప్రయత్నాలను యథార్థంగా మెచ్చుకునేవారిని కూడా క్రొత్త భాష నేర్చుకుంటున్నవారు ఇష్టపడతారు. జార్జ్ చెప్పినట్లు, “నా స్నేహితుల ప్రేమ, ప్రోత్సాహమే లేనట్లయితే నేను క్రొత్త భాష నేర్చుకోగలిగేవాణ్ణే కాదు.”
మరో భాష నేర్చుకోవడంవల్ల ప్రయోజనం ఉందా? “ఉంది” అని మునుపు ప్రస్తావించబడిన బిల్ అంటున్నాడు, ఆయన చాలా భాషల్లో మాట్లాడగలడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “క్రొత్త భాష నేర్చుకోవడం జీవితంలో నా దృక్కోణాన్ని విశాలపరిచి, విషయాలను వేరే దృక్కోణాల్లో చూడడానికి నాకు సహాయం చేసింది. ప్రత్యేకంగా, ఆ భాషలో మాట్లాడే ప్రజలతో బైబిలు అధ్యయనం చేయగలిగి, వారు దానిలోని సత్యాలను అంగీకరించి ఆధ్యాత్మిక ప్రగతి సాధించడాన్ని చూడడం ఆ భాష నేర్చుకోవడానికి నేను పడిన ప్రయాసను మరచిపోయేలా చేస్తుంది. వాస్తవానికి, 12 భాషల్లో మాట్లాడే భాషావేత్త ఒకసారి నాతో ఇలా అన్నాడు: ‘మిమ్మల్ని చూస్తుంటే నాకు అసూయ పుడుతుంది. నేనేమో సరదాకి భాషలు నేర్చుకుంటాను, మీరు ప్రజలకు నిజంగా సహాయం చేయడానికి భాషలు నేర్చుకుంటున్నారు.’” (g 3/07)
[అధస్సూచి]
a తేజరిల్లు! (ఆంగ్లం) జనవరి 8, 2000 సంచిక, 12-13 పేజీలు చూడండి.
[13వ పేజీలోని బ్లర్బ్]
ఇతరులకు సహాయం చేయాలనే కోరిక ఒక భాష నేర్చుకోవడానికి బలమైన ప్రేరణగా పనిచేస్తుంది