పసిపిల్లలకు అవసరమైనదేమిటి, వాళ్ళు కోరుకునేదేమిటి?
నవజాత శిశువు జన్మించినప్పటి నుండి వాణ్ణి వాత్సల్యపూరితమైన శ్రద్ధతో చూసుకోవడం, సున్నితంగా స్పర్శించడం, దగ్గరకు తీసుకోవడం అవసరం. శిశువు జన్మించిన తరువాత మొదటి 12 గంటలు చాలా ప్రాముఖ్యమైనవని కొందరు వైద్యులు విశ్వసిస్తున్నారు. ప్రసవమైన వెంటనే తల్లీబిడ్డలకు కావలసింది “నిద్రనో ఆహారమో కాదు కానీ, తల్లి తన బిడ్డను సున్నితంగా స్పర్శిస్తూ దగ్గరకు తీసుకోవాలి, వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకోవాలి, ఒకరి స్వరం మరొకరు వినాలి” అని వాళ్ళు చెబుతున్నారు.a
సహజంగానే తల్లిదండ్రులు తమ బిడ్డను దగ్గరకు తీసుకుంటారు, హత్తుకుంటారు, సున్నితంగా స్పర్శిస్తారు, ముద్దాడతారు. తత్ఫలితంగా ఆ బిడ్డ తన తల్లిదండ్రులతో గాఢమైన అనుబంధమేర్పరచుకొని వాళ్ళు తనపై చూపిస్తున్న శ్రద్ధకు ప్రతిస్పందిస్తాడు. ఆ బంధం ఎంత బలమైనదంటే, తల్లిదండ్రులు అలుపెరగక తమ బిడ్డను శ్రద్ధగా చూసుకోవడానికి ఎన్నో త్యాగాలు చేస్తారు.
మరోవైపున, తల్లిదండ్రులతో ప్రేమపూర్వకమైన అనుబంధం లేకపోతే పసిబిడ్డలు అక్షరార్థమైన లేత మొక్కల్లా వాడిపోయి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రసవమైన వెంటనే బిడ్డను తల్లి దగ్గరకు చేర్చడం ఎంతో ప్రాముఖ్యమని కొందరు వైద్యులు విశ్వసిస్తున్నారు. ప్రసవమైన వెంటనే తల్లీబిడ్డలు కనీసం 30 నుండి 60 నిమిషాలపాటు కలిసివుండేలా ఏర్పాటు చేయాలని వాళ్ళు సూచిస్తున్నారు.
ఇలా బంధమేర్పరచుకోవడం ప్రాముఖ్యమని కొందరు అభిప్రాయపడుతున్నప్పటికీ, ప్రసవమైన వెంటనే తల్లీబిడ్డలు కలిసివుండడం కొన్ని ఆస్పత్రులలో కష్టం కావచ్చు లేదా అసాధ్యం కూడా కావచ్చు. నవజాత శిశువు ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదముంది కాబట్టి ప్రసవమైన వెంటనే బిడ్డను తల్లినుండి దూరంగా ఉంచుతారు. అయితే నవజాత శిశువులను తమ తల్లుల దగ్గర ఉండనిస్తే వాళ్ళకు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని కొన్ని రుజువులు సూచిస్తున్నాయి. కాబట్టి ప్రసవమైన వెంటనే తల్లీబిడ్డలు కలిసివుండేందుకు అనుమతించడానికి చాలా ఆస్పత్రులు సుముఖత చూపిస్తున్నాయి.
బంధమేర్పరచుకునే విషయంలో చింత
కొందరు తల్లులు తమ బిడ్డను మొదటిసారి చూసిన వెంటనే వాడితో భావోద్వేగపరంగా బంధమేర్పరచుకోలేకపోతారు. కాబట్టి వాళ్ళు, ‘నా బిడ్డతో బంధమేర్పరచుకోవడం కష్టమవుతుందా?’ అని చింతిస్తారు. నిజమే తల్లులందరూ తమ పిల్లలను మొదటిసారి చూసిన వెంటనే వాళ్ళను ఇష్టపడకపోవచ్చు. అయితే, దాని గురించి చింతించవలసిన అవసరమేమీ లేదు.
తల్లి తన బిడ్డపట్ల ప్రేమను పెంచుకోవడం కొంత ఆలస్యమైనా, అది క్రమంగా పూర్తిగా పెంపొందుతుంది. “ప్రసవం సమయంలో ఎలాంటి పరిస్థితులున్నా అవి మీరు మీ బిడ్డతో బంధమేర్పరచుకోగలుగుతారా లేదా అనే దాన్ని నిర్ధారించలేవు” అని అనుభవంగల ఒక తల్లి చెబుతోంది. మీరు గర్భంతో ఉండి ఈ విషయంలో మీకేమైనా సందేహాలుంటే ముందుగానే ప్రసూతి వైద్యులతో చర్చించడం జ్ఞానయుక్తమైనది. ప్రసవమైన తర్వాత మీరు మీ బిడ్డతో ఎప్పుడు, ఎంతసేపు సమయం గడపాలనుకుంటున్నారో స్పష్టంగా తెలియజేయండి.
“నాతో మాట్లాడండి!”
శిశువులు ప్రత్యేకమైన ప్రేరణలకు ఎక్కువగా స్పందించేందుకు కొన్ని నిర్దిష్టమైన సమయాలు ఉన్నట్లు అనిపిస్తోంది. కొంతకాలం తర్వాత ఆ సమయాలు ముగిసిపోతాయి. ఉదాహరణకు, చిన్నపిల్లల మెదడు ఒక భాషను లేదా ఒకటి కంటే ఎక్కువ భాషలను సులభంగా నేర్చుకుంటుంది. అయితే భాషలు నేర్చుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం, దాదాపు ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి ముగిసిపోతున్నట్లు అనిపిస్తోంది.
ఒక పిల్లవాడు 12 నుండి 14 సంవత్సరాల వయసుకు చేరుకునేసరికి వాడికి ఒక భాష నేర్చుకోవడమనేది చాలా కష్టమైన సవాలుగా తయారయ్యే అవకాశం ఉంది. పిల్లల నాడీవ్యవస్థ నిపుణుడైన పీటర్ హుటెన్లోకర్ అభిప్రాయం ప్రకారం, 12 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లల “మెదడులోని భాషా సంబంధమైన భాగాల్లోవున్న సినాప్సిస్ (నాడీకణముల సంధులు) సంఖ్య మరియు సాంద్రత తగ్గిపోతుంది.” జీవితంలోని మొదటి కొన్ని సంవత్సరాలు భాషా సామర్థ్యాన్ని సంపాదించుకోవడానికి చాలా ప్రాముఖ్యమనడంలో సందేహం లేదు!
పిల్లల గ్రాహ్య అభివృద్ధికి ఎంతో ప్రాముఖ్యమైన మాట్లాడడాన్ని వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? ప్రాథమికంగా, వచ్చీరాని మాటలతో తమ తల్లిదండ్రులకు కబుర్లు చెప్పడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. ప్రత్యేకంగా శిశువులు, ఇతరుల నుండి వచ్చే ప్రేరణకు స్పందిస్తారు. “శిశువు . . . తన తల్లి స్వరాన్ని అనుకరిస్తాడు” అని మస్సాచుస్సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బారీ యారెన్స్ చెబుతున్నాడు. అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే పసిపిల్లలు అన్ని శబ్దాలనూ అనుకరించరు. యారెన్స్ నివేదిస్తున్నట్లుగా, శిశువు “తల్లి మాటలతోపాటు వినిపించే ఉయ్యాల చప్పుళ్ళను అనుకరించడు.”
విభిన్నమైన సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో మాట్లాడడానికి ఒకే విధమైన పద్ధతిని ఉపయోగిస్తారు, కొందరు దానిని “పేరంటీస్” అని పిలుస్తారు. తల్లితండ్రులు ప్రేమపూర్వకంగా మాట్లాడినప్పుడు శిశువు గుండె మరింత వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. పదాలకు, అవి సూచిస్తున్న వస్తువులకు మధ్యనున్న సంబంధాన్ని తొందరగా గ్రహించడంలో అది సహాయం చేస్తుందని విశ్వసించబడుతోంది. శిశువు ఒక్క మాట కూడా పలుకకుండానే “నాతో మాట్లాడండి!” అని కోరుతున్నాడు.
“నావైపు చూడండి!”
శిశువు జన్మించిన తర్వాత మొదటి సంవత్సరంలో, తనను పోషించే వ్యక్తితో అంటే సాధారణంగా తన తల్లితో భావోద్వేగపరంగా అనుబంధం ఏర్పరచుకుంటాడని నిర్ధారించబడింది. అలా తన తల్లితో బంధమేర్పరచుకొన్న శిశువు, తమ తల్లిదండ్రులతో బంధమేర్పరచుకోలేకపోయిన శిశువుల కంటే ఎక్కువగా ఇతరులతో కలవగలుగుతాడు. పిల్లవాడికి మూడు సంవత్సరాలు వచ్చేసరికే తన తల్లితో అలాంటి బంధమేర్పరచుకొని ఉండడం అవసరమని విశ్వసించబడుతోంది.
శిశువు మెదడు బయటి ప్రభావాలకు లోనయ్యే అవకాశాలు ఎంతో ఎక్కువగా ఉన్న ఈ క్లిష్టమైన దశలో వాడు ఒకవేళ నిర్లక్ష్యానికి గురైతే ఏమి జరగవచ్చు? 267 మంది తల్లుల, వారి పిల్లల అభివృద్ధిని 20 సంవత్సరాలకంటే ఎక్కువకాలంపాటు పరిశీలించిన మార్తా ఫార్రెల్ ఎరిక్సన్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది: “పిల్లలను నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా వారి ఉత్సాహాన్ని శక్తిని హరించివేస్తుంది, చివరకు ఇతరులతో మంచి సంబంధాలు కలిగివుండాలనే లేదా లోకాన్ని తెలుసుకోవాలనే కోరిక వాళ్ళలో నశించిపోతుంది.”
భావోద్వేగపరంగా నిర్లక్ష్యం చేయబడితే వచ్చే తీవ్రమైన పరిణామాల గురించి తన అభిప్రాయాన్ని ఉపమాన రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తూ టెక్సాస్ చిల్డ్రెన్స్ హాస్పిటల్కు చెందిన డా. బ్రూస్ పెర్రీ ఇలా చెబుతున్నాడు: “ఆరు నెలల శిశువును తీసుకొని, వాడి శరీరంలోని ఎముకలన్నీ విరగకొట్టడం లేదా వాడిని రెండు నెలలపాటు భావోద్వేగపరంగా నిర్లక్ష్యం చేయడం, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయమని నన్ను అడిగితే, వాడి శరీరంలోని ఎముకలన్నీ విరగకొట్టడమే మెరుగని నేను చెబుతాను.” ఎందుకు? “ఎముకలు మళ్ళీ అత్తుకోగలవు, కానీ రెండు నెలలపాటు శిశువు మెదడు ప్రేరేపించబడకపోతే అది ఇక ఎప్పటికీ కోలుకోలేదు” అని పెర్రీ అభిప్రాయపడుతున్నాడు. అయితే అలాంటి నష్టాన్ని సరిచేయలేమనే అభిప్రాయంతో అందరూ ఏకీభవించరు. అయినప్పటికీ చిన్నపిల్లల మెదడుకు భావోద్వేగపరంగా అభివృద్ధి చెందగలిగే వాతావరణం అవసరమని వైజ్ఞానిక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
“ఒక్కమాటలో చెప్పాలంటే, [పసివాళ్ళు] ప్రేమించడానికి, ప్రేమించబడడానికి సిద్ధంగా ఉంటారు” అని ఇన్ఫెంట్స్ అనే పుస్తకం చెబుతోంది. శిశువు ఏడ్చినప్పుడు వాడు “నావైపు చూడండి!” అని తల్లిదండ్రులను వేడుకొంటున్నాడు. అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ప్రేమపూర్వకంగా ప్రతిస్పందించడం ప్రాముఖ్యం. అలా చేసినప్పుడు, శిశువు తన అవసరాల గురించి తాను ఇతరులకు సూచించగలుగుతున్నానని తెలుసుకుంటాడు. వాడు ఇతరులతో సామాజిక సంబంధాలను ఏర్పరచుకోవడం నేర్చుకుంటున్నాడు.
‘అలా చేస్తే పిల్లలు పాడైపోరా?’
‘పిల్లవాడు ఏడ్చినప్పుడల్లా నేను దగ్గరకు వెళితే వాడు పాడైపోడా?’ అని మీరు అడగవచ్చు. బహుశా అలా జరగవచ్చు. ఈ ప్రశ్న విషయంలో విభిన్న అభిప్రాయాలున్నాయి. పిల్లల మనస్తత్వాలు విభిన్నంగా ఉంటాయి కాబట్టి సాధారణంగా తల్లిదండ్రులే తమ పిల్లలతో ఎలా వ్యవహరిస్తే మంచిదో నిర్ధారించుకోవాలి. అయితే నవజాత శిశువుకు ఆకలి వేస్తే, వాడికి అసౌకర్యంగా లేదా చిరాకుగా అనిపిస్తే వాడి శరీరంలోని ఒత్తిడికి ప్రతిస్పందించే వ్యవస్థ ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను విడుదల చేస్తుందని ఇటీవల జరిగిన పరిశోధన సూచిస్తోంది. వాడు ఏడ్వడం ద్వారా తన బాధను వ్యక్తం చేస్తాడు. తల్లిదండ్రులు దానికి ప్రతిస్పందించి పసిబిడ్డ అవసరాలను తీర్చినప్పుడు, వారు పిల్లవాడి మెదడులో, వాడు తన అవసరాలను తాను తీర్చుకోవడాన్ని నేర్చుకునేందుకు వాడికి సహాయం చేసే కణాల అల్లికలు ఏర్పడేలా చేస్తారు. అంతేకాకుండా డా. మెగన్ గన్నర్ అభిప్రాయం ప్రకారం, వెంటనే శ్రద్ధ తీసుకోబడిన శిశువు కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోనును తక్కువ ఉత్పన్నం చేస్తాడు. ఆ తర్వాత ఒకవేళ వాడికి చిరాకుగా అనిపించినప్పటికీ వాడు ఒత్తిడి ప్రతిస్పందనను తొందరగా ఆపు చేసుకుంటాడు.
“నిజానికి మొదటి 6 నుండి 8 నెలలపాటు తమ అవసరాలకు వెంటనే ప్రతిస్పందన లభించిన పసివాళ్ళు, పట్టించుకోకుండా అలాగే ఏడ్వడానికి వదిలిపెట్టబడిన పసివాళ్ళకంటే తక్కువగా ఏడుస్తారు” అని ఎరిక్సన్ చెబుతున్నాడు. అయితే మీరు ప్రతిస్పందించే విధానం మారుతూ ఉండేలా చూసుకోవడం కూడా ప్రాముఖ్యం. మీరు ప్రతి సందర్భంలోను ఒకేలా ప్రతిస్పందిస్తే అంటే పిల్లవాడు ఏడ్చినప్పుడల్లా వాడికి పాలివ్వడం లేదా వాడిని ఎత్తుకోవడం వంటివి చేస్తే వాడు నిజంగానే పాడైపోతాడు. కొన్నిసార్లు వాడు ఏడిస్తే కేవలం వాడితో మాట్లాడి వాడిని ఊరుకోపెడితే సరిపోతుంది. లేదా వాడి దగ్గరికెళ్ళి వాడి చెవిలో మెల్లగా మాట్లాడడం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో వాడి వీపును లేదా కడుపును చేత్తో ముట్టుకుంటే సరిపోతుండవచ్చు.
“పిల్లల పనే ఏడ్వడం.” అది ప్రాచ్య దేశాలకు చెందిన సామెత. శిశువు తనకు కావలసినదేమిటో వ్యక్తం చేయడానికి ఏడుపే వాడికి ముఖ్యమైన మార్గం. మీకు ఏదో కావాలని అడిగినప్పుడల్లా మీరు నిర్లక్ష్యం చేయబడితే మీకు ఎలా అనిపిస్తుంది? మరి అలాంటప్పుడు తనను సంరక్షించే వ్యక్తి లేకపోతే నిస్సహాయుడిగా ఉండే మీ పసివాడు అవధానం కోసం పరితపించినప్పుడల్లా నిర్లక్ష్యం చేయబడితే వాడికి ఎలా అనిపిస్తుంది? అయితే బిడ్డ ఏడ్చినప్పుడు ఎవరు చూసుకోవాలి?
పసిపిల్లను ఎవరు చూసుకుంటారు?
అమెరికాలో ఇటీవల జరిగిన జనాభా లెక్కల సేకరణ, 54 శాతంమంది పిల్లలపై వాళ్ళు జన్మించినప్పటినుండి మూడవ తరగతికి వచ్చేవరకు తల్లిదండ్రులు కాకుండా ఇతరులు కూడా ఏదోక విధంగా శ్రద్ధ చూపిస్తున్నట్లు వెల్లడి చేసింది. చాలా కుటుంబాల్లో రోజు గడవాలంటే తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేయవలసి ఉంటుంది. అయితే చాలామంది తల్లులు తమ శిశువులను చూసుకోవడానికి కొన్ని వారాలపాటు లేదా నెలలపాటు మెటర్నిటీ లీవ్ తీసుకుంటారు. కానీ ఆ తర్వాత పిల్లవాడిని ఎవరు చూసుకుంటారు?
ఇలాంటి నిర్ణయాలను నియంత్రించడానికి ఖచ్చితమైన నియమాలంటూ లేవు. అయితే శిశువు తన జీవితంలోని ఆ ప్రాముఖ్యమైన దశలో సులభంగా ఇతర ప్రభావాలకు లోనయ్యే స్థితిలో ఉంటాడని గుర్తుంచుకోవడం మంచిది. తల్లిదండ్రులిద్దరూ ఈ విషయం గురించి గంభీరంగా ఆలోచించాలి. ఏమి చేయాలనేది నిర్ణయించుకునేటప్పుడు వాళ్ళు వివిధ అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
“పిల్లలను పెంచడానికి అత్యుత్తమమైన శిశు సంరక్షణా కార్యక్రమాలను ఎంపిక చేసుకున్నప్పటికీ అది తల్లిదండ్రులు తమ పిల్లలతో గడపవలసిన సమయానికి సరితూగదనే విషయం అంతకంతకు స్పష్టమవుతోంది” అని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్కు చెందిన డా. జోసెఫ్ జాంగా చెబుతున్నాడు. బేబీ కేర్ సెంటర్లలో చేర్చబడిన పిల్లలకు తమను చూసుకొనే వ్యక్తితో సంభాషించడానికి కావలసినంత అవకాశం దొరకదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
తమ పిల్లల అవసరాలను గుర్తించిన తల్లులు కొందరు, తమ పిల్లల భావోద్వేగపరమైన అవసరాలను తీర్చేందుకు ఇతరులను నియమించడం కంటే తామే ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి తమ పిల్లలను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక స్త్రీ ఇలా చెప్పింది: “నా పిల్లలను నేను చూసుకోవడం ద్వారా నాకు మరే ఇతర ఉద్యోగమూ ఇవ్వలేని సంతృప్తి లభించిందని నేను నిజాయితీగా చెప్పగలను.” అయితే ఆర్థిక ఒత్తిళ్ళ కారణంగా తల్లులందరూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లలను బేబీ కేర్ సెంటర్లలో చేర్చడం తప్ప మరో మార్గం ఉండదు కాబట్టి వాళ్ళు తమ పిల్లలతో ఉన్నప్పుడైనా వారికి ఎక్కువ అవధానాన్నిచ్చి వారిని ప్రేమించడానికి అదనపు కృషి చేస్తారు. అలాగే ఉద్యోగస్థులైన ఒంటరి తల్లిదండ్రుల్లో చాలామందికి కూడా ఈ విషయంలో మరో మార్గం లేదు, వాళ్ళు తమ పిల్లలను పెంచడానికి అసాధారణమైన కృషి చేయడమే కాక చక్కని ఫలితాలను కూడా సాధిస్తున్నారు.
తల్లిదండ్రులై పిల్లలను పెంచడం ఆనందకరమైన, ఎంతో ఉత్తేజకరమైన పనిగా ఉండగలదు. అయినప్పటికీ అది సవాలుదాయకమైన, కృషి అవసరమైన పని కూడా. దానిని మీరు సమర్థవంతంగా ఎలా నిర్వహించవచ్చు? (g03 12/22)
[అధస్సూచి]
a ఈ ఆర్టికల్ల పరంపర ద్వారా తేజరిల్లు! కొంతమంది పేరుగాంచిన శిశు సంక్షేమ నిపుణుల అభిప్రాయాలను తెలియజేస్తోంది ఎందుకంటే ఇలాంటి పరిశోధనా ఫలితాలు తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే ఇలాంటి అభిప్రాయాలు తరచూ మారుతుంటాయి లేదా సవరించబడుతుంటాయి అని అంగీకరించవలసిందే, దానికి భిన్నంగా తేజరిల్లు! పూర్తిగా సమర్థించే బైబిలు ప్రమాణాలు ఎన్నటికీ మారవు.
[6వ పేజీలోని బాక్సు/చిత్రం]
ప్రతిస్పందనలేని పసివాళ్ళు
ఏడవని, చిరునవ్వులు చిందించని పసిబిడ్డల సంఖ్య పెరిగిపోతోందని జపానులోని కొందరు వైద్యులు చెబుతున్నారు. పిల్లల వైద్యుడైన సటోషి యనగేసవా అలాంటి పిల్లలను ప్రతిస్పందనలేని పసివాళ్ళు అని పిలుస్తున్నాడు. పసిబిడ్డలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేయడాన్ని ఎందుకు మానేస్తారు? పసిపిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సరైన సంబంధం కొరవడినందువల్ల అలాంటి పరిస్థితి ఏర్పడుతుందని కొందరు వైద్యులు విశ్వసిస్తున్నారు. ఆ పరిస్థితి బలవంతపు నిస్సహాయత అని పిలువబడుతోంది. పసివాళ్ళు తమ తల్లిదండ్రులతో సంభాషించడానికి చేసే ప్రయత్నాలను ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేస్తే లేదా వాటిని తప్పుగా అర్థం చేసుకుంటే, ఆ పసివాళ్ళు చివరకు అలాంటి ప్రయత్నాలు చేయడమే మానేస్తారని ఒక సిద్ధాంతం సూచిస్తోంది.
శిశువు చేసే ప్రయత్నాలకు సరైన సమయంలో ప్రతిస్పందించకపోతే, ఆ శిశువు మరొకరి భావాలను లేదా కష్టాలను అర్థం చేసుకునే సామర్థ్యంగలవాడిగా తయారయ్యేందుకు తోడ్పడే మెదడులోని ఒక భాగం ఎదగకపోవచ్చు అని టెక్సాస్ చిల్డ్రెన్స్ హాస్పిటల్లో సైక్యాట్రీ చీఫ్ అయిన డాక్టర్ బ్రూస్ పెర్రీ సూచిస్తున్నాడు. తీవ్రమైన భావోద్వేగ నిర్లక్ష్యానికి గురైన పసివాళ్ళు ఇతరులపట్ల తదనుభూతి చూపే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతారు. కొన్ని సందర్భాల్లో, తమ జీవితంలోని తొలి రోజుల్లో ఇలాంటి అనుభవాలకు గురైన పసివాళ్ళు తర్వాత మత్తుపానీయాలకు, మాదకద్రవ్యాలకు బానిసలవుతారని లేదా దౌర్జన్యపూరిత యౌవనులుగా తయారవుతారని డాక్టర్ పెర్రీ విశ్వసిస్తున్నాడు.
[7వ పేజీలోని చిత్రం]
తల్లీబిడ్డలు కలిసి కబుర్లు చెప్పుకోవడం వారి మధ్య అనుబంధాన్ని పటిష్ఠం చేస్తుంది