చిన్ని ప్రాణులు ఎగరటంలో ఉద్దండులు
ఫాట్! గాల్లో ఎగురుతున్న ఈగని న్యూస్‌పేపరుతో చంపటానికి చేసిన ప్రయత్నమది. కానీ ఈగ తృటిలో తప్పించుకుని, గాలి తరంగాల్లో క్షణంపాటు ఊగిసలాడి, నిటారుగా అయ్యి, పైకప్పు మీద తలక్రిందులుగా వ్రేలాడుతూ, దాన్ని పచ్చడి చేయటానికి మీరు చేసిన నిష్ఫల యత్నాన్ని చూసి వెక్కిరిస్తుంది. ఎగరటంలో ఎంత అద్భుతమైన మెళకువలు కదూ! నిజంగానే, సర్వత్రా కన్పించే ఈ ఈగ ఎగిరే విషయంలో, కీటకాల జాతిలోనే అతి గొప్ప నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది—ఇందుకు ఒక కారణం అద్భుతంగా రూపొందించబడిన, సమతుల్యాన్ని కాపాడే రెండు హాల్టరిస్ అనే అనుబంధ అవయవాలు దానికి ఉండటమే.
చిన్న రెల్లు పోచల్లా ఉండి చివర్న చిన్న గుండ్రని బంతులతో ఈగ నడుము భాగంలో సరిగ్గా వాటి రెక్కల వెనుక రెండు హాల్టరిస్‌లు ఉంటాయి. (తర్వాతి పేజీలోని చిత్రాన్ని చూడండి.) ఈగ రెక్కలు కొట్టుకోవటం ప్రారంభించినప్పుడు హాల్టరిస్‌లు కూడా కొట్టుకోవటం ప్రారంభిస్తాయి—ఒకే వేగంలో, క్షణానికి వందలాదిసార్లు కొట్టుకుంటాయి. నిజానికి హాల్టరిస్‌లు ఎగరటంలో ఈగకు సహాయం చేసే చిన్ని గైరోస్కోపుల్లా పనిచేస్తాయి. ఈగ తన దిశను మార్చుకున్నప్పుడల్లా అవి ఈగ మెదడుకు సంకేతాల్ని పంపిస్తాయి, ఉదాహరణకు ఈ చిన్న ప్రాణిని వేగంగా వీచే గాలి తాకినప్పుడు, లేదా న్యూస్‌పేపరు మడిచిపెట్టి కొట్టినప్పుడు వెంట్రుకవాసిలో తప్పించుకున్నా ఆ గాలి తాకిడిని తట్టుకునేటప్పుడు సంకేతాలు వెంటనే మెదడుకి చేరుకుంటాయి. ఈగ శరీరం కుడి లేదా ఎడమ దిశలకు తిరిగిందనో, పక్కలకు దొర్లిందనో, పల్టీలు కొట్టిందనో అప్పటికప్పుడు హాల్టరిస్‌లు ఈగకు చెబుతాయి, విమానంలోని గైరోస్కోపులు కూడా పైలట్‌కి ఇవే సంకేతాల్ని అందిస్తాయి, కానీ కాస్త తక్కువ కచ్చితత్వంతో. ఈగ ఎగిరే విధానాన్ని వెంటనే సులభంగా మార్చుకుంటుంది.
సాంప్రదాయిక గైరోస్కోపుల్లా కాకుండా హాల్టరిస్‌లు ఎక్కువగా లోలకాల్లా కన్పిస్తాయి. కానీ ఇవి ఈగ నుండి వ్రేలాడవు, అటు నిలువుగా నిల్చోవు కూడా; అవి పార్శ్వ భాగం నుండి పొడుచుకు వచ్చినట్లుంటాయి. ఒక్కసారి కదలిక మొదలైన తర్వాత, హాల్టరిస్‌లు లోలకాల్లా ఒకే దిశలో అటు ఇటు ఊగుతున్నట్లు కనిపిస్తుంది, అదీ గమన సూత్రాలకు పూర్తి అనుగుణ్యంగా! అందుకని ఈగ శరీరం గాల్లో తన స్థానాన్ని మార్చుకున్నప్పుడు బాహ్య ఒత్తిళ్ళు ఊగుతున్న హాల్టరిస్‌లను అడుగు భాగంలో ఒత్తుతాయి. అక్కడి నాడులు ఈ ఒత్తిడిని గ్రహిస్తాయి. మెదడు ఈ నాడీ ప్రచోదనాలను విశ్లేషించి, శరీరం నిలదొక్కుకోవటానికి యాంత్రికంగా రెక్కలకు నిర్దేశనాన్నిస్తుంది—ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోతుంది.
రెండు రెక్కల ఈగల కుటుంబంలో ఉన్న హార్స్‌ఫ్లయ్‌లు, సాధారణ ఈగలు, బ్లోఫ్లయ్‌లు, పండ్ల మీద వాలే ఈగలు, సీసీ ఈగలు, సాండ్ ఫ్లయ్‌లు, క్రేన్ ఫ్లయ్‌లు వంటి 1,00,000 రకాల ఈగల్లో ఉండే హాల్టరిస్‌లు ఈగలకు మాత్రమే పరిమితం. నైపుణ్యంగా పనిచేసే వాటి గైరోస్కోపులు, ఎగిరే ఏ ఇతర కీటక కుటుంబాల్లోని వాటికన్నా ఎక్కువ సామర్థ్యాన్ని వీటికి అందిస్తాయి. నిజానికి, మనం తరచు చీదరించుకునే ఈ ఈగ సృష్టికర్తకున్న వైజ్ఞానిక మేదస్సుకు నిదర్శనం.
[22వ పేజీలోని చిత్రం]
దిశ మార్పు
[22వ పేజీలోని చిత్రం]
దొర్లటం
[22వ పేజీలోని చిత్రం]
పల్టీలు కొట్టటం
[23వ పేజీలోని చిత్రం]
సోల్జర్ ఫ్లయ్ (పెద్దదిగా చేయబడింది) హాల్టరిస్‌లు సూచించబడ్డాయి
[క్రెడిట్ లైను]
© Kjell B. Sandved/Visuals Unlimited
[23వ పేజీలోని చిత్రాలు]
సాధారణ ఈగ
క్రేన్ ఫ్లయ్
[క్రెడిట్ లైను]
Animals/Jim Harter/Dover Publications, Inc.
[23వ పేజీలోని చిత్రసౌజన్యం]
Century Dictionary