ఆకాశయానంలో అగ్రగాములు
“విమాన పైలట్‌నైన నేను విమానయానాన్ని గూర్చిన 1999, ఏప్రిల్ 8 ‘తేజరిల్లు!’ సంచిక చదివి ఆనందించాను. అయితే నాదొక ప్రశ్న. దాన్లో అల్‌బర్టో సాంటోస్-డ్యూమోంట్ ప్రస్తావన అసలు లేదు ఎందుకని? తొలిసారి ఆకాశయానం చేసినవారిలో ఆయన ఒకడు.”—సి. బి., అమెరికా.
ఏప్రిల్ 8, తేజరిల్లు! సంచికలో “ఆకాశయానం—ఎలా ప్రారంభమైంది? ఎంత సురక్షితమైనది?” అనే ముఖచిత్ర శీర్షికలు ఆకాశయాన చరిత్రను గూర్చి క్లుప్తంగా చర్చించాయి. అమెరికన్‌లైన విల్‌బర్ రైట్, ఒర్వెల్ రైట్‌లు సాధించిన విషయాలపైనే చాలామట్టుకు దృష్టి కేంద్రీకరించబడినా, ఈ శతాబ్దారంభంలో తేలికైన ఎగిరే మెషీన్లతో ప్రయోగాలు చేసింది ఈ ఇద్దరు సహోదరులు మాత్రమే కాదు. ఆకాశయానంలో అగ్రగాములైన మరికొందరిని గురించి చూద్దాము.
• అల్‌బర్టో సాంటోస్-డ్యూమోంట్ 1873, జూలై 20న బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో పుట్టాడు. ఆయన టీనేజర్‌గా ఉన్నప్పుడు ఆయన కుటుంబం పారిస్‌కి తరలిపోయింది. అక్కడ సాంటోస్-డ్యూమోంట్ భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, యంత్రశాస్త్రం, విద్యుత్తుశాస్త్రం రంగాల్లో విద్యనభ్యసించాడు. ఆయన లక్ష్యం ఎగరటమే, 1898 నుండి 1905 మధ్యకాలంలో ఆయన 11 వాయునౌకలను నిర్మించి ఎగిరేలా చేశాడు.
1906 అక్టోబరులో సాంటోస్-డ్యూమోంట్ తేలికైన విమానంలో ఎగరాలన్న తన కలల్ని ఎట్టకేలకు నిజం చేసుకున్నాడు. ఒక రకమైన గుల్లారి సహాయంతో ఎగిరే కొన్ని ఇతర తొలి విమానాలకు భిన్నంగా 14-bis అనే పేరుగల సాంటోస్-డ్యూమోంట్ విమానం మాత్రం అంతర్నిర్మితమైన సాధనాలతో ఊపును తెచ్చుకొని గాల్లోకి ఎగిరింది. 14-bisలో సాంటోస్-డ్యూమోంట్ ఎగిరిన 60 మీటర్ల దూరం, తేలికైన విమానాలు ఎగిరే విషయంలో యూరప్‌లోని మొట్టమొదటి విజయంగా పరిగణించబడుతుంది.
అటుతర్వాతి సంవత్సరాల్లో విమానం వినాశన ఉపకరణంగా ఉపయోగించబడటం సాంటోస్-డ్యూమోంట్‌ను విషాదభరితుణ్ణి చేసింది. విమానాల్ని యుద్ధాల్లో ఉపయోగించటం విషయమై ఆయన పడే చింత మూలంగానే ఆయన 1932లో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పబడుతుంది. ఏదేమైనా, ఏరోనాటిక్స్ చరిత్రలో సాంటోస్-డ్యూమోంట్‌కు స్థిరమైన స్థానం ఉంది.
• గుస్టావ్ వైట్‌హెడ్ 1874, జనవరి 1న జర్మనీలోని లాయ్‌టర్‌షావుజన్‌లో పుట్టాడు. ఆకాశయానంలో అత్యంతాసక్తుడు కావటం మూలంగా ఆయన తోటి విద్యార్థులు ఆయన్ను ఫ్లయర్ అని పిలిచేవారు. తన 13వ ఏటికల్లా గుస్టావ్ అనాథ అయ్యాడు. అటు తర్వాతి సంవత్సరాల్లో ఆయన ఒక చోటి నుండి మరోచోటికి వెళ్లాల్సి వచ్చినప్పటికీ ఎగరాలన్న తన ప్రగాఢవాంఛను ఆయన ఎప్పుడూ కోల్పోలేదు. కొంతకాలంపాటు యౌవనుడైన గుస్టావ్ ప్రఖ్యాత జర్మను వైమానికుడైన ఒట్టో లిల్యన్థల్ వద్ద విద్యాభ్యాసం చేశాడు. తర్వాత 1894లో ఆయన అమెరికాలో స్థిరపడ్డాడు.
1999, ఏప్రిల్ 8, తేజరిల్లు! సంచికలో వివరించినట్లుగా, 1901లో వైట్‌హెడ్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా దీర్ఘకాలిక కంట్రోల్డ్ ఫ్లయిట్‌ను సాధించాడని కొందరు చెబుతారు. అయితే దాన్ని ధృవీకరించడానికి ఫోటోలు లేవు. ఆశ్చర్యకరమైన రీతిలో, విమానయాన రంగంలో జరిగిన తొలి ప్రయత్నాల ప్రాముఖ్యతను వార్తాపత్రికలు ఏమాత్రం గుర్తించలేదు, చివరికి రైట్ సోదరులు గాల్లోకి ఎగిరినప్పుడు కూడా. నిజానికి ఎయిర్ ఎంథూసియాస్ట్ అనే పత్రిక ప్రకారం “1910 దాకా ఈ ‘క్రొత్త సాంకేతికత’లో ప్రజల ఆసక్తి నిజానికి ఊపందుకోలేదు, ఆ తర్వాతే, మానవులు గాల్లో ఎగరటం సాధ్యమన్న విషయాన్ని ప్రజలు అంగీకరించటం ప్రారంభించారు.”
• శామ్యుల్ పీర్‌పాంట్ లాంగ్లే వాషింగ్‌టన్ డి.సి. లోని స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూట్‌లో సెక్రటరీ, ఈయన ఖగోళశాస్త్రజ్ఞుడు, భౌతికశాస్త్రజ్ఞుడు. 1896లో ఆయన ఆవిరితో నడిచే విమానాన్ని నిర్మించాడు, అది మనుషుల్లేకుండా ఎగిరింది. అది ఇంధనం అయిపోయేంత వరకు మైలులో మూడు వంతుల దూరం వెళ్లి ఆగిపోయింది.
ఆవిరితో నడిచే యంత్రాలు చాలా బరువుగా ఉంటాయన్నది నిజమే, అవి ఎగిరేందుకు ఏమాత్రం అనుకూలంగా ఉండవన్నది కూడా నిజమే. అందుకని లాంగ్లే అసిస్టెంటు అయిన చార్లెస్ ఎమ్. మ్యాన్లీ ఇంకా అనుకూలంగా ఉండే 57 కిలోగ్రాముల బరువున్న 53-హార్స్‌పవర్‌గల ఇంజిన్‌ని రూపొందించాడు. దాని ఫలితంగా ఎంతో ప్రభావవంతమైన విమానం తయారైంది, లాంగ్లే దీన్ని ఏరోడ్రోమ్ అని పిలిచాడు. 1903, అక్టోబరు 7న మ్యాన్లీ కంట్రోల్‌ల ముందు కూర్చున్నాడు, విమానానికి ఒక పెద్ద బల్లకట్టు మీదినుండి ఒక రకమైన గుల్లారితో ఊపు అందించబడింది. అప్పుడది పోటోమాక్ నదిలో కూలిపోయింది. రెండు నెలల తర్వాత చేసిన మరో ప్రయత్నంలో కూడా అలాగే జరిగింది. నైరాశ్యంతో లాంగ్లే తన ప్రాజెక్టును వదులుకున్నాడు.
అయితే, లాంగ్లే వైఫల్యాలను చవిచూసినప్పటికీ ఆయన వైమానిక రంగంలో ప్రాముఖ్యమైన పురోగతుల్నే సాధించాడు. ఆయన చనిపోయిన ఎనిమిది సంవత్సరాలకు 1914లో ఏరోడ్రోమ్‌కు అనేక మార్పులు చేయబడ్డాయి, దాన్ని న్యూయార్క్‌లోని హామండ్స్‌పోర్ట్‌లో గ్లెన్ హెచ్. కర్టిస్ విజయవంతంగా గాల్లోకి తీసుకెళ్లాడు.
ఇరవైయవ శతాబ్దారంభంలో, వైమానిక రంగంలో తొలి పురోభివృద్ధుల్ని సాధించిన అనేక మందిలో వీరు కొందరు మాత్రమే. నేడు వివిధ సైజుల్లోని లక్షలాది విమానాలు ఆకాశంలో విహరిస్తున్నాయి. వాటన్నింటికీ మూలకర్తలు వాటి విజయాలకు మూల కారకులు ఆకాశయానంలో అగ్రగాములే.
[20వ పేజీలోని చిత్రాలు]
అల్‌బర్టో సాంటోస్-డ్యూమోంట్, 14-bis అనే ఆయన విమానం
[క్రెడిట్ లైను]
Culver Pictures
North Wind Picture Archives
[21వ పేజీలోని చిత్రాలు]
గుస్టావ్ వైట్‌హెడ్, ఆయన నిర్మించిన తేలికైన ఎగిరే యంత్రపు నమూనా
[క్రెడిట్ లైను]
Flughistorische Forschungsgemeinschaft Gustav Weisskopf
[21వ పేజీలోని చిత్రాలు]
శామ్యుల్ పి. లాంగ్లే, ఆయన “ఏరోడ్రోమ్”
[క్రెడిట్ లైను]
Dictionary of American Portraits/Dover
U.S. National Archives photo