యుద్ధ వీరుడు క్రీస్తు సైనికుడు కావడం
ల్వీ లోయో చెప్పినది
రెండవ ప్రపంచయుద్ధ కాలంలో, 1944, ఆగస్ట్ 16న, దక్షిణ ఫ్రాన్స్ తీరప్రాంతంలో దిగిన మిత్రపక్ష సైనికదళాలతోపాటు నేనూ ఉన్నాను. మధ్యధరా సముద్ర తీరంలో ఒక వారం పోరాడిన తర్వాత, నా యుద్ధ ట్యాంకుల దళాలు మార్సీలస్ ఓడరేవును ప్రవేశించి, నోట్రాడామ్ డ లా గార్డ్‌లో ఉన్న బాసిలకా చర్చి దగ్గర్లో ఉన్న కొండవరకూ పోరాడుతూ వెళ్ళాం. జర్మన్ దుర్గాలను స్వాధీనం చేసుకోవాలన్నదే మాకివ్వబడిన ఆదేశం.
పోరాటం చాలా తీవ్రంగా సాగింది. నా గ్రూపులోని ఒక ట్యాంక్ ఢీకొనబడింది, అందులో ఉన్న నా సహచరుల్లో ముగ్గురు చంపబడ్డారు. ఒక మందుపాతర పేలి, నా ట్యాంకు చెయిన్‌లలో ఒకటి తెగిపోయింది, అలా ట్యాంక్ పాడైపోయింది. అయినా ఆ ప్రాంతాన్ని వదలకూడదన్న దృఢ నిశ్చయంతో, మేము తర్వాతి అనేక గంటలు పోరాడాం.
పోరాటపు ఊపు కాస్త తగ్గిన సమయాన్ని అదనుగా చేసుకుని, ఒక మెషీన్ గన్‌ను ఒక చేత పట్టుకుని, మరో చేతిలో, ఫ్రెంచ్ ఫ్లాగ్‌ను పట్టుకుని, ఫ్రీ ఫ్రెంచ్ ఉద్యమ సభ్యుడొకరితోపాటు ముందుకు నడిచాను. నాకు నిస్సత్తువగా ఉంది, గన్ పౌడర్‌తో నా ఒళ్ళంతా నల్లగైపోయింది. అయినా అలాగే నడిచి వెళ్ళి, ఫ్రెంచ్ పతాకాన్ని బాసిలికా చర్చి ప్రవేశ ద్వారం దగ్గర మట్టిలో నాటాను.
విముక్తి
తర్వాతి వారాల్లో, వెనక్కి తిరిగిపోతున్న జర్మన్ సైన్యాలను వెంటాడుతూ, ఉత్తరదిశగా వెళ్ళాం. కొందరు దాక్కుని కాల్పులు జరుపుతుండడం వల్లా, రోడ్డు వెంబడి తలంత ఎత్తు వరకూ కేబుల్లు బిగించబడి ఉన్నాయి గనుకా, మేము మా ట్యాంకుల తలుపులను మూసిపెట్టి ముందుకు సాగవలసివచ్చింది.
అక్టోబర్‌లో, మా సైనిక గుంపు ఈశాన్య ఫ్రాన్స్‌లోని వోస్గ్‌స్ మౌంటెన్‌లోని చిన్న పట్టణమైన రామాన్‌షాన్ చేరుకుంది. నేను నా ట్యాంక్ మీద నిలబడి పరిసరాలను గమనించినప్పుడు, ఆ పట్టణమంతా నిర్మానుష్యంగా ఉన్నట్లుగా కనిపించింది. అకస్మాత్తుగా, ఒక కిటికీలో నుండి విడవబడిన ఒక రాకెట్ మా ట్యాంక్‌లో ప్రవేశించి, ప్రేలిన వెంటనే నా మనుష్యుల్లో ముగ్గురు చనిపోయారు. మరో సైనికుడూ, నేనూ తీవ్రంగా గాయపడ్డాం. ట్యాంకేమో కదలకుండా అయిపోయింది. నా కాలులో 17 రాకెట్‌ముక్కలు జొచ్చినప్పటికీ, మరో ట్యాంక్ మమ్మల్ని వెనుక నుండి లాగుతున్నప్పుడు నేను మా ట్యాంక్ కంట్రోల్‌ను చేతిలోకి తీసుకున్నాను.
ఈ సంఘటన జరిగిన వెంటనే, ప్రశంసా సందేశం నాకు అందింది. కొన్ని రోజుల తర్వాత, ఫ్రెంచ్ ఫస్ట్ ఆర్మీ కమాండర్ అయిన డ లాట్రా డ టాసీన్యీ, నేను మార్సీలస్ దగ్గర సాధించిన కార్యాన్నిబట్టి నన్ను సన్మానిస్తూ నాకు పతకాన్నిచ్చి, “మనం త్వరలోనే మళ్ళీ కలుసుకుంటాం” అని అన్నారు.
ఆ తర్వాత ఎంతో కాలం గడవక ముందే, నన్ను జనరల్ పర్సనల్ అధికారిగా నియమించారు. కొంత కాలానికి, నేను ఆయనతోపాటు బెర్లిన్‌కు వెళ్ళాను. అక్కడ 1945, మే 8న, జర్మన్ లొంగిపోయినప్పుడు ఫ్రాన్స్‌కు ఆయన ప్రాతినిధ్యం వహించారు. తర్వాతి నాలుగు సంవత్సరాలు, నేను ఆయన వెంటే ఉండి ఆయన ఆజ్ఞలకు శిరసావహిస్తూ పనిచేశాను.
అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ముఖ్య సంఘటనల్లో నేనెందుకు అంతగా పాల్గొనడం జరిగింది?
మతంలోను యుద్ధంలోనూ తర్ఫీదు పొందాను
నేను మతనిష్ఠగల క్యాథలిక్‌గా, నా దేవుడికి, నా దేశానికి సేవ చేయాలనే కోరికతో పెరిగాను. 1939, ఆగస్ట్ 29న, రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ రంగప్రవేశం చేయడానికి కేవలం కొన్ని రోజుల ముందు, సాయుధ మోటారు వాహనాలతోకూడిన సైనికదళంతోచేరి యుద్ధం చేస్తానని సంతకం చేశాను. నాకు అప్పట్లో కేవలం 18 ఏండ్లు. పారిస్‌లోని, ఏకాల్ మీలీటర్ అనే మిలిటరీ అకాడమీలో ఐదు నెలల తర్ఫీదు పొందిన తర్వాత, నన్ను ఫ్రాన్స్ యొక్క తూర్పుభాగంలోని యుద్ధభూమిలోకి నాన్‌కమిషన్డ్ యువ ఆఫీసర్‌గా పంపారు.
బూటకపు యుద్ధం అని పిలువబడింది ఈ కాల వ్యవధిని గురించే. ఎందుకంటే ఈ కాలవ్యవధిలో మేము చేసిందల్లా, జర్మన్ సైన్యాలు వేరే ప్రాంతంలో పోరాడుతుండగా, వాళ్ళు మాపై దండెత్తడానికి వస్తారని, వాళ్ళతో పోరాడవచ్చని కాచుకు కూర్చోవడమే. 1940 జూన్‌లో జర్మన్‌లు చివరికి దండెత్తివచ్చినప్పుడు, నన్ను ఖైదీగా చేశారు. నేను రెండు నెలల తర్వాత తప్పించుకుని, చివరికి ఉత్తర ఆఫ్రికాలో ఉన్న ఫ్రెంచ్ సైనిక దళాల్లో చేరగలిగాను.
డెసర్ట్ ఫాక్స్ అని పిలువబడే జనరల్ ఎర్వీన్ రామల్ నాయకత్వంలో జర్మన్ సైన్యాలకు వ్యతిరేకంగా టూనిసియాలో జరిగిన కాంపైన్‌లో, నా శరీరంలో 70 కన్నా ఎక్కువ శాతం కాలింది, నేను తొమ్మిది రోజులు కోమాలో ఉన్నాను. వాయవ్య అల్జీరియాలో—ఫ్రెంచ్ ఫోరిన్ లీజియన్ హెడ్‌క్వార్టర్స్ ఉన్నది ఇక్కడే—సీడీబెలబస్‌లో ఉన్న ఆసుపత్రిలో మూడు నెలలు ఉన్నాను. ఉత్తర ఆఫ్రికాలో ఉన్నప్పుడు, సిలువ రూపంలో ఉండే సైనిక బ్యాడ్జ్ అయిన క్రా డ గర్‌ను పొందాను.
క్యాథలిక్ ప్రముఖులు మా “క్రైస్తవ” కర్తవ్యాలను చేయమని మాకు ఉద్బోధించేవారు. నేను వాళ్ళ ఉద్బోధలకు అనుగుణ్యంగా ఉంటూ, నా ప్రాణాలను ఫ్రాన్స్ కోసం అర్పించడానికి సిద్ధంగా ఉండేవాడ్ని. నేనలా సిద్ధపడగలిగినప్పుడల్లా, యుద్ధానికి ముందు క్రీస్తు బలి సూచనయైన రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకునేవాడ్ని. పోరాటం హోరాహోరీగా జరుగుతున్నప్పుడు, నేను దేవుడికీ కన్య మరియకూ ప్రార్థించేవాడ్ని.
నేను నా శత్రు సైనికులకు గౌరవమిచ్చేవాడ్ని. వాళ్ళలో అనేకులు కూడా తమను తాము సమర్పించుకున్న రోమన్ క్యాథలిక్కులే. కొందరు ధరించిన బెల్టుల బకిల్‌ల మీద గాట్ మిట్ ఆన్స్ (దేవుడు మాతో ఉన్నాడు) అని వ్రాసి ఉండేది. ఒకే మతానికి చెంది ఉండి, వ్యతిరేక పక్షాల్లో యుద్ధం చేస్తున్న సైనికుల ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడనుకోవడం వింతగా అనిపించదా?
యుద్ధానంతర మార్పులు
యుద్ధం ముగిసిన తర్వాత, 1947, ఏప్రిల్ 10న, వెన్‌డెలోని మూయాన్ ఆన్ పారే అనే ఊళ్ళోని అమ్మాయిని పెండ్లి చేసుకున్నాను. జనరల్ డ లాట్రా డ టాసీన్యీ వాళ్ళ ఊరూ నేను పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఊరూ ఒకటే. మా పెళ్ళికి ఆ జనరల్ సాక్షిగా నిలబడ్డారు. 1952 జనవరిలో, ఆయన మరణించినప్పుడు, నేను ఆయన అంత్యక్రియల సమయాన ఆయన గౌరవానికి ప్రతీకగా ఒక జెండాను తీసుకువెళ్ళాను.
తర్వాత, 1952 సంవత్సరాంతంలో ఒక రోజు ఆదివారం ఉదయం, నేనూ నా శ్రీమతీ, మా పాపతోపాటు చర్చికి వెళ్ళడానికి సిద్ధమౌతుండగా, ఇద్దరు యెహోవాసాక్షులు వచ్చి మా కాలింగ్ బెల్లు కొట్టారు. బైబిలు గురించి వాళ్ళు చెప్పిన విషయాలు మాలో జిజ్ఞాసను రేకెత్తించాయి. నేనూ నా శ్రీమతీ చాలా మతనిష్ఠ గలవారమైనప్పటికీ, బైబిలు చదవడాన్ని చర్చివాళ్ళు మమ్మల్ని నిరుత్సాహపరచినందువల్ల, మాకు బైబిలు జ్ఞానమేమాత్రం లేకుండాపోయింది. మాకు బైబిలు పఠనాన్ని ప్రతిపాదించిన సాక్షి పేరు లేయాపాల్ జాంటా. అప్పట్లో ఆయన ఫ్రాన్స్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచ్ ఆఫీస్ పైవిచారణకర్త. చిన్నప్పటి నుండి నాకు జవాబు దొరకని ప్రశ్నలకు మా బైబిలు పఠనం నుండి చివరికి జవాబులను కనుగొనగలిగాను.
ఉదాహరణకు, పరలోకప్రార్థన విషయమై నాకు ఎల్లప్పుడు జిజ్ఞాసగా ఉండేది. ఎందుకంటే, నేను ఒక క్యాథలిక్‌గా, మంచివాళ్ళందరూ పరలోకానికి వెళ్తారని నమ్మేవాడ్ని గనుక, “నీ చిత్తము భూమి మీద నెరవేరును గాక” అని దేవుడికి ఎందుకు ప్రార్థిస్తున్నామన్నది అర్థం చేసుకోలేకపోయాను. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 6:9, 10, డూయే వర్షన్) నేను ఏయే ప్రీస్ట్‌లతో ఈ విషయాన్ని గురించి మాట్లాడానో వాళ్ళందరూ, దీనిని గురించిన నా ప్రశ్నను తప్పించుకోవడమో, లేక ప్రతి ఒక్కరూ రోమన్ క్యాథలిక్ అయిన తర్వాత దీనికి జవాబు లభిస్తుందని చెప్పడమో చేసేవారు. కానీ ఆ జవాబు నాకు సంతృప్తినివ్వలేదు.
ప్రీస్ట్‌లు త్రిత్వాన్ని గురించిన నా ప్రశ్నలకు కూడా సంతృప్తికరమైన జవాబులను ఇవ్వలేకపోయారు. ఈ క్యాథలిక్ బోధ చెప్పేదేమంటే, చర్చ్ మతసిద్ధాంతం ప్రకారం, ‘తండ్రీ దేవుడే, కుమారుడూ దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. అయినా ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు.’ కనుక, యేసు దేవుడి కుమారుడనీ, సర్వశక్తిమంతుడైన దేవుడు కాడనీ బైబిలు స్పష్టంగా చెబుతుందని మేము తెలుసుకున్నప్పుడు, నాకూ శ్రీమతికీ కలిగిన ఆనందానికి అవధులులేవు.—మార్కు 12:30, 32; లూకా 22:42; యోహాను 14:28; అపొస్తలుల కార్యములు 2:32; 1 కొరింథీయులు 11:3.
మా కనులు మొదటిసారిగా తెరవబడిన ప్రతీతి కలిగింది మా ఇద్దరికి. ఏ త్యాగమైన చెయ్యదగినంతటి అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్న ప్రతీతి. (మత్తయి 13:46) మేము ఈ నిక్షేపంపై పట్టుసాధించాలని మేము నిర్ణయించుకోవలసిన అవసరముందని మేము గ్రహించాం. త్వరలోనే, “యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను” అని చెప్పిన అపొస్తలుడైన పౌలుకున్నటువంటి దృక్కోణాన్నే అలవరచుకున్నాం. అలా మేము దేవుడికి సేవ చేసేందుకు మా జీవితంలో కావలసిన సవరింపులు చేసుకున్నాం.—ఫిలిప్పీయులు 3:8.
నేను గట్టి నిర్ణయం తీసుకోవడం
1953 ఏప్రిల్‌లో, మేము సాక్షులతో బైబిలు పఠించనారంభించి కేవలం కొన్ని నెలలు గడిచాక, ఇండోచైనాలో యుద్ధం చేయడానికి బయలుదేరిన ఫ్రెంచ్ సైనిక దళాల్లో చేరమన్న ఆజ్ఞ నాకు అందింది. ఆ సమయంలో, పారిస్‌లోని సెనెట్‌లోని కమాండింగ్ ఆఫీసర్‌తో కలిసి పనిచేస్తున్నాను. అప్పటికి, నేను తటస్థతను గురించిన బైబిలు సూత్రాన్ని అర్థం చేసుకున్నాను గనుక, నేను నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉందని గ్రహించాను. (యోహాను 17:16) ఇక మీదట యుద్ధంలో పాల్గొనకూడదన్న నా కోరికను తెలియజేస్తూ, ఇండోచైనాలో పోరాడమనే ఆజ్ఞకు విధేయత చూపడానికి నిరాకరిస్తున్నాని నా పై అధికారులకు తెలిపాను.—యెషయా 2:4.
“నీకు [పేరుకు] కళంకం ఏర్పడుతుందనీ, అన్ని తలుపులు నీ ముందు మూయబడతాయనీ నువ్వు గ్రహిస్తున్నావా?” అని నా పై అధికారులు అడిగారు. ఇంకా చెప్పాలంటే, అప్పటి నుండి, ప్రస్తుతం యుద్ధంలో పాల్గోవాలనుకోనివారి లిస్ట్‌లో నన్ను చేర్చారు. అప్పటి నుండి నన్ను మళ్ళీ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లకు పిలవలేదు గనుక, అది నాకు రక్షణగా ఉంది. కానీ మా కుటుంబ సభ్యులూ, స్నేహితులూ, అనేకులు సమాజంలో తాము ఆధిక్యత గల స్థానంగా ఎంచుకుంటున్నవాటిని నేను ఎలా త్రోసిపుచ్చుతున్నానో అర్థం చేసుకోలేకపోయారు.
నాకున్న మంచి మిలిటరీ రికార్డ్ కారణంగా, అధికారులు నాకు ప్రత్యేక ఆదరాన్ని కనబర్చారు. నా నమ్మకాలు ఎలా ఉన్నా నాకు గౌరవమిచ్చారు. తర్వాతి రెండు సంవత్సరాల్లో, నాకు హెల్త్ లీవ్ పొడిగించబడింది. నేను అప్పటి వరకూ నిర్వహిస్తూ వచ్చిన పనులను వేటినీ పునరారంభించవలసిన అవసరం లేదు. అంతలో, నేనూ నా శ్రీమతీ యెహోవాసాక్షుల స్థానిక సంఘంలో జరిగే కూటాలకు హాజరుకానారంభించాం. మేము క్రొత్తగా కనుగొన్న నమ్మకాలను ఇతరులతో పంచుకోవడం కూడా మొదలుపెట్టాం.
చివరికి—క్రీస్తు సైనికుడు!
చివరికి, 1955 తొలి భాగంలో, నేను సైనిక బాధ్యతల నుండి విముక్తుడనయ్యాను. పదిహేను రోజుల తర్వాత, మార్చ్ 12న నేనూ నా శ్రీమతీ వర్సెయిల్స్‌లో జరిగిన సమావేశంలో నీటి బాప్తిస్మం ద్వారా యెహోవా దేవుడికి చేసుకున్న మా సమర్పణను తెలియజేసుకున్నాం. వృత్తి సంబంధమైన నా పరిస్థితి మారింది. నేను నా కుటుంబ అవసరాలను తీర్చడానికి వేరే పని వెదుక్కోవలసి వచ్చింది. తర్వాతి నాలుగు సంవత్సరాలు నేను పారిస్‌లో ఆల్స్‌లో (సెంట్రల్ మార్కెట్) పోర్టర్‌గా చేశాను. అలాంటి సర్దుబాట్లు చేసుకోవడం అంత సులభం కానప్పటికీ, యెహోవా నా ప్రయత్నాలను ఆశీర్వదించాడు.
అనేక సంవత్సరాలుగా, నేనూ నా శ్రీమతీ బైబిలు సందేశాన్ని అంగీకరించేందుకు అనేకులకు సహాయం చేయగల్గాం. అనేక మిలిటరీ మరియు సివిల్ అధికారులకు తటస్థత విషయమైన క్రైస్తవ దృక్కోణాన్ని వివరించే అవకాశం నాకు లభించింది. యెహోవాసాక్షులను గురించిన అనేక దురభిప్రాయాలను అధిగమించడానికి నా మునుపటి సైనిక కరియర్ తరచూ చాలా తోడ్పడింది. క్రీస్తు తొలి అనుచరులు కూడా ఇలాంటి దృక్పథాన్నే చూపించారని చూపిస్తూ, దేశాలు చేసే యుద్ధాల విషయంలో మన క్రైస్తవ తటస్థ దృక్పథాన్ని గురించి వివరించే అవకాశాన్ని అది నాకిచ్చింది. ఉదాహరణకు, ప్రొఫెసర్ సీ. జే. కాడూ ద ఎర్లీ చర్చ్ అన్డ్ ద వాల్డ్ అనే తన పుస్తకంలో ఈ విధంగా వ్రాశారు: “కనీసం మార్కస్ ఆరీల్యాస్ పరిపాలన [సా.శ. 161-180] వరకు, ఏ క్రైస్తవుడు కూడా తన బాప్తిస్మం తర్వాత సైనికుడు అయ్యేవాడు కాదు.”
నేను ఎదుర్కున్న అతి పెద్ద శ్రమల్లో ఒకటి, 1977లో నా భార్య మరణం. ఆమె ఒక సంవత్సరమంతా అనారోగ్యంగా ఉన్న తర్వాత మరణించింది. ఆమె తన మరణ సమయం వరకూ కూడా తన విశ్వాసాన్ని ధైర్యంగా వ్యక్తీకరించింది. పునరుత్థానమనే అద్భుతమైన నిరీక్షణ నాకు ఆదరణనిస్తోంది. (యోహాను 5:28, 29) యెహోవాసాక్షుల్లో పూర్తికాల పరిచారకులను పయినీర్లు అంటారు. నేను పూర్తికాల పయినీరింగ్ చేయడం నా దుఃఖాన్ని అధిగమించడానికి నాకు అదనపు సహాయం చేసింది. నేను లౌకిక పని నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, 1982లో ఈ పని మొదలుపెట్టాను. తర్వాతా, 1988లో, పయినీర్లకు తర్ఫీదునిచ్చే స్కూల్లో ఒక నిర్దేశకుడుగా సేవ చేయడంలో నేనెంత సంతోషించానో!
నా భార్య చనిపోయినప్పటి నుండి, అప్పుడప్పుడు కట్టలు తెంచుకుని వచ్చే దుఃఖంతో నేను పోరాడవలసి వస్తుంది. కానీ సన్నిహితులైన, ఆధ్యాత్మికంగా బలంగా ఉండే స్నేహితులు నేను కోలుకోవడానికి సహాయపడ్డారు. తనమీద నమ్మకముంచేవారందరినీ చూసుకునే యెహోవా బలాన్నీ, ప్రేమపూర్వక దయనూ అలాంటి అనేక శ్రమల్లో కూడా ఎల్లప్పుడూ అనుభవించగల్గుతున్నాను. (కీర్తన 18:2) మనకు ఎదురయ్యే శ్రమలు, మన ఆధ్యాత్మిక యుద్ధంలో మనం ముందుకు సాగేందుకు మనకు తర్ఫీదునిస్తాయని కూడా నేను భావిస్తున్నాను. (1 పేతురు 1:6, 7) నేను, ఒక సంఘ పెద్దగా, దుఃఖంలో ఉన్నవారికి సహాయం చేయగలుగుతున్నాను.—1 థెస్సలొనీకయులు 5:14.
నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, నేను సైనికుడనవ్వాలని కలలు కనేవాడ్ని. ఒక రకంగా, నేను ఇప్పటికీ సైనికుడుగానే ఉన్నాను. నేను ఒక సైన్యాన్ని వదిలి మరో సైన్యాన్ని చేరి, ‘క్రీస్తుయేసు సైనికుడ’నయ్యాను. (2 తిమోతి 2:3) ఇప్పుడు నా ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, చివరికి విజయానికీ, మన దేవుడైన యెహోవా ఘనతకూ, మహిమకూ నడిపించే “మంచి పోరాటము”లో క్రీస్తు సైనికుడిగా పోరాటాన్ని కొనసాగించేందుకు నా శాయశక్తులా శ్రమిస్తున్నాను.—1 తిమోతి 1:18.
ఈ శీర్షికను ప్రచురించేందుకు సిద్ధం చేసేసరికి, 1998 మార్చ్ 1న ల్వీ లోయో చనిపోయారు.
[13వ పేజీలోని చిత్రం]
జనరల్ డ లాట్రా డ టాసీన్యీ మా వివాహానికి హాజరయ్యారు
[15వ పేజీలోని చిత్రం]
1976లో ల్వీ లోయో, ఆయన భార్య రైన్