మా పాఠకుల నుండి
మూత్రపిండాలు “మీ మూత్రపిండాలు—జీవాన్ని పోషించే ఫిల్టర్” (సెప్టెంబరు 8, 1997) అనే శీర్షికనుబట్టి నేనెంతగా ప్రభావితం చెందానో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నాకు మూత్రపిండాల సమస్య ఉందని మా డాక్టరు చెప్పాడు. ఆ శీర్షిక మూలంగా ఈ వ్యాధిని అనుభవిస్తున్నది నేనొక్కదాన్నే కాదని భావిస్తున్నాను.
వీ, ఎమ్., అమెరికా
నాకు మూత్రపిండ వ్యాధి ఉన్నందున నేను నాలుగు నెలలు ఆసుపత్రిలో ఉన్నాను. మీ శీర్షికను చదవడం, నా శరీరం గురించి నాకెంత తక్కువ తెలుసనే విషయాన్ని గుర్తించేందుకు సహాయపడింది. ఇప్పుడు నా పరిస్థితిని గురించి నేను ఇతరులకు మరింత శ్రేష్ఠంగా వివరించగలను.
ఎస్. హెచ్., జపాన్
తనకు మూత్రపిండ క్యాన్సర్ ఉందని నా భార్యకు తెలిసినప్పుడు ఈ శీర్షిక వచ్చింది. ఆ డయగ్నోసిస్ మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసినప్పటికీ, మూత్రపిండం యొక్క వేర్వేరు పనులను గురించి సర్జన్ మాకు వివరించినప్పుడు మేము వాటిని స్పష్టంగా అర్థం చేసుకోగలిగాము. నా భార్యకు నెఫ్రెక్టమీ శస్త్ర చికిత్స చేశారు, ఆమె ఇప్పుడు ఆ చికిత్స నుండి కోలుకుంటోంది.
జీ. ఎస్., ఇండియా
ద్వేషం “ఎందుకింత ద్వేషం? ఎందుకింత కొద్దిపాటి ప్రేమ?” (అక్టోబరు 8, 1997) అనే శీర్షికల పరంపర మీరు ఇంతవరకు ప్రచురించిన ముఖచిత్ర కథనాల్లోని అతి శ్రేష్ఠమైన వాటిలో ఒకటి. అపరిచయస్థులపైనా, ఇతర సంస్కృతులకు చెందిన వారిపైనా ప్రజలకు ఎందుకు అపనమ్మకం ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఆ శీర్షికలు నాకు సహాయం చేశాయి.
జే. ఎమ్., అమెరికా
వినికిడి శక్తి అనే బహుమానం “మీ వినికిడి శక్తి—కాపాడుకోవాల్సిన ఓ బహుమానం” (అక్టోబరు 8, 1997) అనే శీర్షిక పట్ల నా మెప్పుదలను వ్యక్తం చేయాలని అనుకుంటున్నాను. ఆ శీర్షిక చదవక ముందు, చెవి యొక్క వివిధ భాగాలు చేసే పనులను గురించీ, మనమెలా వింటామనే విషయాలను గురించీ నాకు బాగానే తెలుసని అనుకున్నాను. అయితే, నాకు ఎంత తక్కువ సమాచారం తెలుసనే విషయాన్ని నేను గుర్తించలేదు. 26వ పేజీలో ఉన్న బొమ్మ చాలా అద్భుతంగా ఉంది! చెవి యొక్క ఆ బొమ్మను వేసేందుకు ఎంతగా ఆలోచించవలసి వచ్చి ఉంటుందో ఎంత కృషి చేయవలసి వచ్చి ఉంటుందో ఆలోచించి నేను ఆశ్చర్యపోయాను. అయితే ఆ అసలు అవయవాన్ని సృష్టించేందుకు ఇంకా ఎంత ప్రతిభ అవసరమై ఉంటుందో ఆలోచించి నేను ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోతున్నాను!
ఏ. ఎస్., అమెరికా
నేనూ నా స్నేహితురాలూ కూడా మెడికల్ స్పెషలిస్టులం, మా అనేక సంవత్సరాల లౌకిక అధ్యయనంలో, చెవిని గురించి అంత సింపుల్గానూ అంత ఖచ్చితంగానూ వివరించిన ఒక్క శీర్షికను కూడా మేము ఇంతవరకూ ఎన్నడూ చదవలేదని యథార్థంగా భావిస్తున్నాము. ఈ శీర్షిక, “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి” అని చెబుతున్న కీర్తన 139:14 నందలి మాటలతో ఏకీభవించేలా చేస్తుంది.
ఎమ్. బి. మరియు జెడ్. బి., వెనిజ్యులా
త్రాగి వాహనం నడిపిన డ్రైవరు మూలంగా నేను ప్రమాదానికి గురయ్యాను. ఒక నెలపాటు కోమాలో ఉన్న తర్వాత, నేను స్పృహలోకి వచ్చే సరికి లోకమంతా నిశ్శబ్దమైపోయింది. 18 సంవత్సరాల తర్వాత కూడా నేను దాదాపూ చెవిటివాడ్నే, అయితే చెవి మెషిన్ సహాయంతో నేను కొంత మేరకు వినగలుగుతున్నాను. సమయానుకూలమైన ఈ శీర్షిక చక్కగా వినగల వాళ్లు, వినే విషయంలో సమస్యను కలిగున్న వాళ్లపట్ల సానుభూతిని కలిగి ఉండేందుకు నిజంగా సహాయం చేస్తుంది.
కే. సీ., అమెరికా
లోకసంబంధులు కారు “బైబిలు ఉద్దేశం: ‘లోకసంబంధులు కారు’—దాని భావమేమిటి?” (అక్టోబరు 8, 1997) అనే శీర్షిక నాకెంతగానో నచ్చింది. దాన్ని చదివిన తర్వాత, “లోకస్థులు” అనే పదాన్ని క్రైస్తవేతరులను సూచించేందుకు ఉపయోగించడాన్ని ఆపివేయాలని నిర్ణయించుకున్నాను. ఎంతైనా, 30 సంవత్సరాల క్రితం, నేను కూడా ఒక క్రైస్తవురాలిని కాను. నాకు బైబిలును మొదటిసారి పరిచయం చేసిన వ్యక్తి అహంభావ దృక్పథాన్ని చూపించి ఉంటే, నేను మళ్లీ ఒక సాక్షితో ఎన్నడూ మాట్లాడేందుకు ఇష్టపడి ఉండే దాన్ని కాదు!
బి. జీ., అమెరికా
సమస్యలులేని పరదైసు నాకు తొమ్మిదేండ్లు, “సమస్యలులేని పరదైసు—త్వరలో వాస్తవమౌతుంది” (నవంబరు 8, 1997) అనే శీర్షిక విషయమై మీకు వందనాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ శీర్షిక నిజంగా నన్ను ప్రభావితం చేసింది, ఎందుకంటే మా నాన్న ఊర్లో లేరు, రాత్రి ఎవరైనా మా ఇంట్లోకి జొరబడతారేమో అని అమ్మా నేను కనీసం ఒక్క కిటికీ కూడా తెరిచి ఉంచేందుకు భయపడ్డాం. నేరాలనూ, దౌర్జన్యాన్నీ నిర్మూలిస్తానని యెహోవా చేసిన వాగ్దానం గురించి చదివినప్పుడు నాకు మనస్శాంతి లభించింది.
డి. ఎమ్., అమెరికా