కీటకాలు ఎగరడంలో ఉన్న మర్మం వెల్లడైంది
కీటకాలు తమ బరువైన శరీరాలతోనూ, బలహీనమైన రెక్కలతోనూ ఎలా గాలిలో ప్రయాణించగలవని ఎంతోకాలంగా విజ్ఞాన శాస్త్రవేత్తలు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ చిన్న ప్రాణులు విహంగ గమనశీలక సూత్రాలను ఉపేక్షిస్తున్నట్టు కనబడుతుంది. అసాధ్యమైందిగా కన్పిస్తున్న ఈ సాహసకృత్యాన్ని కీటకాలు ఎలా చేస్తాయో ఇంగ్లాండు నందలి కేమ్బ్రిడ్జ్ యూనివర్శిటీ పరిశోధకులు ఇప్పుడు కనుగొన్నారు.
కీటకాలు ఎగరడాన్ని గురించి అధ్యయనం చేయడానికి, విజ్ఞాన శాస్త్రవేత్తలు హాక్మాత్ అనే చిమ్మెట చుట్టూ దారాన్ని చుట్టి, దాన్ని గాలిగొట్టంలో ఉంచారు. వాళ్లు ఆ గొట్టం ద్వారా శుభ్రమైన పొగను పిచికారీ చేసి, చిమ్మెట దాని రెక్కల్ని రెపరెపలాడిస్తుండగా ఆ పొగ కదిలే విధానాన్ని గమనించారు. తర్వాత, దాని రెక్కల్ని 100 రెట్లు అతి నెమ్మదిగా కదిలేలా చేసిన 10 రెట్లు పెద్దదైన ఓ యాంత్రిక నమూనాను వాళ్లు నిర్మించి, వెంటనే గ్రహించదగిన సూక్ష్మ ప్రభావాల్ని గమనించారు. చిమ్మెట దాని రెక్కను క్రిందకు ఆడించడం మొదలుపెట్టినప్పుడు, ఆ రెక్క మొదలులో చక్రవాతం లేక సుడిగాలి సృష్టించబడినట్లు వాళ్లు కనుగొన్నారు. తత్ఫలితంగా రెక్క పై భాగాన ఏర్పడ్డ అధోఃపీడనం ఆ కీటకాన్ని పైకి ఆకర్షిస్తూ ఊర్ధ్వపీడనాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ చక్రవాతం గనుక ఆగిపోతే, చిమ్మెట పైకి ఎగరలేదు, భూమ్మీదకు పడిపోతుంది. బదులుగా, రెక్క యొక్క వాడిమొన వెంబడి నుండి రెక్కకొన వరకూ సుడిగాలి ప్రయాణిస్తుంది. ఆ విధంగా, చిమ్మెట బరువులో ఒకటిన్నర రెట్లు బరువుకు సమానమైన ఊర్ధ్వఃపీడనాన్ని రెక్కను క్రిందకు ఆడించడం ద్వారా ఉత్పన్నంచేసి, ఆ కీటకం సులభంగా ఎగరగలుగుతుంది.
వైమానిక డెల్టా రెక్కలు (ఆ రెక్క Δ అనే గ్రీకు అక్షరాన్ని పోలి ఉంటుంది గనుక అలా పిలువబడింది) తమ రెక్కలమధ్య సుడిగుండాలను ఉత్పన్నంచేసి, ఊర్ధ్వపీడనాన్ని సృష్టించడాన్ని గురించి వైమానిక ఇంజనీర్లు అప్పటికే ఎరుగుదురు. కానీ తమ రెక్కల్ని పైకి క్రిందకు ఆడించే కీటకాలకు, చక్రవాతాలు ఊర్ధ్వపీడనాన్ని ఎలా అందిస్తున్నాయో వాళ్లు ఇప్పుడు తెల్సుకున్నారు. ప్రొఫెల్లర్ల, హెలీకాప్టర్ల నమూనాల్లో ఈ దృగ్గోచర విషయాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని వాళ్లు అధ్యయనం చేయాలనుకుంటున్నారు.