వలసవెళ్లడానికి ముందు తగులుబడి చూసుకోండి!
దక్షిణ ఆఫ్రికాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
మీరు వేరే దేశానికి వలసవెళ్లాలని అనుకుంటున్నారా? మీరు తగులుబడి చూసుకున్నారా? మా ఉద్దేశం కేవలం ఆర్థిక తగులుబడి మాత్రమే కాదు? ఎంతైనా, అనేకమంది వేరే దేశానికి వలసవెళ్లాలని అనుకునేది ఆర్థిక భద్రత కోసమే. మా ఉద్దేశం దాగివున్న తగులుబడి అని, అంటే తరలివెళ్లిన తర్వాత మాత్రమే స్పష్టమయ్యే తగులుబడి గురించి మాట్లాడుతున్నాము. సాధారణంగా అప్పటికల్లా మీ అడుగులను వెనక్కి తీసుకోవడానికి చాలా ఆలస్యమైపోయి ఉంటుంది. ఈ క్రింది విషయాలు మిమ్మల్ని గాబరాపెట్టడానికి కాదు. వాటిని పరిగణలోనికి తీసుకోవడం మంచిది:
“క్రొత్త భాష నేర్చుకోవడానికి నమ్రత, ప్రయత్నం అవసరం. చిన్న పిల్లలు కూడా తాము మాట్లాడుతున్నది అర్థంచేసుకోలేకపోవడం వలన వారు తమను వింత మనుషులుగా చూడడం చాలా దుర్భరంగా ఉన్నట్లు వయోజనులు కనుగొంటారు. ఘోరమైన పొరబాట్లు చేస్తూవుండడం, ఆ పొరబాట్లని చూసి ఇతరులు ఎప్పుడూ నవ్వుతూవుండడం ఒకరి నమ్రతకు గొప్ప పరీక్షగా ఉంటుంది. స్థానిక భాషరాని విదేశీయులకు జీవితం భరింపరానిరీతిలో ఒంటరితనంగా ఉన్నట్లుంటుంది.”—రోజ్మేరీ, జపాన్‌లోని ఒక మిషనరీ.
బహుశ మీకు ఆ భాష కావలసిన మేరకు వచ్చని మీరు భావించవచ్చు. కానీ మీ కుటుంబమంతటికీ ఆ భాష బాగా వచ్చనీ, వారు తరలివెళ్లేందుకు సంతోషంగా ఉన్నారనీ మీరు నిశ్చయపర్చుకున్నారా?
కుటుంబంలో కొంతమంది సభ్యులు విముఖతతో ఉన్నప్పటికీ వారి ఇష్టానికి వ్యతిరేకంగా వలసవెళ్లేందుకు వారిని ఒప్పిస్తే దాని ప్రభావం కుటుంబంపై ఎలా ఉంటుంది? “[మెక్సికోలోని] కొంతమంది స్త్రీలు వలసవెళ్లే విషయమై నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి పాత్రా వహించలేదు, అసలు వెళ్లడానికే ఇష్టపడలేదు, వలసవెళ్లిన తర్వాత అమెరికాలోనే ఉండిపోవాలని కోరుకోనూలేదు” అని సైకాలజీ ఆఫ్ వుమన్ క్వార్టర్లీ అనే పత్రిక అంటుంది. అటువంటి పరిస్థితుల్లో బలవంతంగా తీసుకువెళ్లడం కుటుంబ ఐక్యతను పాడుచేయగలదు. కానీ కుటుంబాన్ని పోషించే వ్యక్తి మాత్రమే వలసవెళ్తే, అప్పుడేమిటి?
ఆఫ్రికాలో జనసంఖ్య, వలస, నగరీకరణ (ఆంగ్లం) అనే పుస్తకంలో, దక్షిణాఫ్రికాలోని ఒక చిన్న గ్రామీణప్రాంతంలో 50 శాతానికిపైగా “పురుషులు అసలు ఇంటిదగ్గరే ఉండడంలేదని” అంచనా వేయబడింది. ఈ గైర్హాజరు కుటుంబంలోని సంతృప్తినీ, స్థిరత్వాన్నీ దోచివేయగలదు. వివాహజత అనైతికతకు పాల్పడే సాధ్యతను కూడా ఇది కలుగజేస్తుంది. కుటుంబం వలసవెళ్లాలని నిర్ణయించుకున్నా లేక వెళ్లవద్దని నిర్ణయించుకున్నా కలిసి ఉండగల్గితే ఎంత బాగుంటుంది! కుటుంబ ఐక్యత అనేది డబ్బుతో కొనలేనిది.
ఇంకా, విద్వేషం అనే భారమైన బరువును మోయడాన్ని ఎదుర్కోవాలి. “‘వర్ణబేధం’ అనేదాన్ని నేను ఇంగ్లాండ్‌కి వచ్చేంతవరకు గుర్తించలేకపోయాను” అని ఒక ప్రవాస భారతీయురాలు గుర్తు తెచ్చుకుంటుంది. “ఆ [గ్రహింపు] చాలా ఘోరంగా ఉండింది. అదొక విభ్రాంతికరమైన విషయం. నేనింటికి తిరిగి వెళ్లిపోవాలనీ, వీటికి దూరంగా వెళ్లిపోవాలనీ కోరుకున్నాను.”—ది అన్-మెల్టింగ్ పాట్.
అందుకని వలసవెళ్లడానికి ముందు మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘ప్రత్యామ్నాయాలేమిటి? మేము ఇంటిదగ్గరే సర్దుబాట్లు చేసుకోలేమా? వేరే దేశానికి తరలివెళ్లడం నిజంగా అంత ప్రయోజనకరమా?’ కావచ్చు లేదా కాకపోవచ్చు. కానీ మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు యేసు ఇచ్చిన ఈ మంచి సలహాను పరిగణనలోనికి తీసుకోండి: “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?”—లూకా 14:28.